రాజేంద్ర సింగ్ బైస్ ఠాకూర్
గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తెలుగు భాషలో విప్లవాత్మక మార్పు తెచ్చినవాడు గిడుగు. ఆదికవి నన్నయ భాష 60 శాతం సంస్కృత పదాలతో ఉండేది. సాహిత్యం పండితులకు మాత్రమే తెలిసిన గ్రాంధిక తెలుగులోనే ఉండేది. జనం భాష ప్రాంతీయ యాసలతో కూడిన గ్రామ్యం. రెండిటికీ ఎక్కడా పొంతన లేదు. ఈ పరిస్థితి నుండి మార్పు రావడానికి ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కొన్ని మార్పులు కారణ మయ్యాయి.
Also read: “అమ్మ మాట-బంగారు బాట”
పద్దెనిమిదవ శతాబ్దంలో యూరప్ లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. అనేక యంత్రాలు కనుగొన్నారు. మనిషికి సౌకర్యంతో పాటు తీరిక దొరికింది. కాలాక్షేపానికి పుస్తకాలు చదవడం మొదలు పెట్టాడు. అప్పటిదాకా వారి గ్రాంధిక భాషలో రాస్తున్న అక్కడి కవులు సామాన్యుడి కోసం సామాన్యుడి భాషలో రాయడం మొదలు పెట్టారు. దీనికి ఆద్యుడు విలియం వర్డ్స్ వర్త్. అక్కడ సామాన్యుడి భాషకు లభించిన ఆ గౌరవం ఇక్కడి సామాన్యుడి భాషకు కలిగించిన వాడు గిడుగు. దేశంలోని పండితులందరు ఏకమై కాదన్నా పోరాడిన వాడు గిడుగు. ఆయనకు తోడు నిలిచిన వాడు గురజాడ. ఛందోబద్ధ కవిత్వాన్ని కాదని సరళమైన మాత్రా ఛందస్సుతో సామాన్యుడి భాషలో రచనలు చేశాడు. ఆ తరువాత అనేక మంది కవులు, రచయితలు, పాత్రికేయులు దాన్ని అనుసరించే ప్రయత్నం చేశారు. కాని ఒక కొత్త సమస్య వచ్చింది. జనం భాష (గ్రామ్యం) ప్రాంతానికో యాసతో ఉంది. ఒకడి యాస మరొకడికి అర్థం కాదు. అందుకని గ్రాంధికానికి, గ్రామ్యానికి మధ్యే మార్గంగా చదుకున్న సామాన్యుడి భాషను ‘శిష్టవ్యవహారికం’ అన్న పేరుతో అందరూ అలవాటు చేసుకున్నారు. (ఇలాంటి మూడో రకం మరే భాషలోనూ లేదు. ఇది తెలుగుకు మాత్రమే ఉన్న ప్రత్యేకత). అప్పటినుండి వచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కవితలు, వ్యాసాలు, నాటకాలు, కథలు, నవలలు సామాన్యుడికి అందుబాటులోకి వచ్చాయి. చదుకునేవారి సంఖ్య పెరిగింది. సామాన్యుల పిల్లలందరూ కుల వృత్తులు వదిలి పాఠశాలలకు వెళ్ళి చదువుకో గలిగిన పరిస్థితి వచ్చింది. ఈ విప్లవాత్మక పరిణామం గిడుగు వ్యవహారిక భాషా వాదంతో సాహిత్యానికి, సమాజానికి కలిగిన ప్రయోజనం.
Also read: “స్వాతంత్ర్యం”
రాయడానికి సాధనాలు లేని కాలంలో అన్నీ కంఠస్థం చేయడం జరిగేది. చందస్సుతో కూడిన పద్యరూపం దానికి అనుకూలం. (పొరపాటున ఒక అక్షరం కాని, పదం కాని మారితే వెంటనే తెలిసేది). కాలక్రమేణా కలం, కాగితం లాంటి రాసే సాధనాలు, పుస్తక రూపంలో ముద్రణ, కంప్యూటర్లు అందుబాటులోకి వచ్చాయి. గుర్తు పెట్టుకో వలసిన అవసరం లేని పరిస్థితి వచ్చింది. కాలంతో వచ్చిన ఈ మార్పుతో మారని కవులు చందోబద్ధ పద్యరూపాన్నే కొనసాగించడంతో కవిత్వం సామాన్యుడికి దూరంగానే మిగిలి పోయింది. ఇది గిడుగు వ్యవహార భాషా వాదానికి వ్యతిరేకమే.
ఈనాడు మనం తెలుగు అవసరం లేదని, ఇంగ్లీషు, సైన్స్ చాలని అనుకుంటున్నాం. ఇంగ్లీషు మీడియం ద్వారానే ఇంగ్లీషు వస్తుందనే భ్రాంతిలో ఉన్నాం. నిన్నటి తరం ఆరవ తరగతిలో ఏబీసీడీ నేర్చుకొని తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీషులో ప్రవీణులైన విషయం గుర్తించం. ఇంగ్లీషు మీడియం పేరుతో తెలుగును తొక్కేస్తున్నాం. అమ్మను వద్దని సవతి తల్లిని కావలించుకుంటున్నాం. ‘కళ్ళు’, ‘కల్లు’ ఒకటేగా పలికే స్థితిలో ఉన్నాం. తమిళ, కన్నడిగుల లాగే తెలంగాణా వేరు పడిన తరువాత వారు వారి తెలంగాణా మాండలికానికి ప్రాధాన్యత నిస్తునారు. ఆంధ్ర వాళ్ళు మాత్రం ఆంగ్లం మీది మోజు కొనసాగిస్తూ తెలుగును నిర్లక్ష్యం చేసి రెంటికీ చెడిన వారవుతున్నారు.
Also read: “చందమామ”
నాటకం, కవిత్వం, వ్యాసం, నవల, కధ లాంటి సాహిత్య ప్రక్రియల్లో ఛందోబద్ధ కవిత్వం తెలుగు పండితులకే పరిమితమైంది. నాటకం, నవల చదివేంత సమయం, ఓపిక లేవు నేటి తరానికి. హాస్యభరిత కార్టూన్లు, సామాన్యుడి భాషలో ఉండే చిన్న కవితలు, చిన్న కధలు మాత్రం చదువుతున్నారు. అదీ కొంతమందే. మాకు ఇష్టమైంది మా తృప్తి కోసం మేము రాస్తాం అంటే సరే. కాని కవులకు సామాజిక బాధ్యత కూడా ఉంది, వారు రాసింది ఎక్కువమంది చదవాలి అనుకుంటే మాత్రం జనానికి అర్ధమయ్యే భాషలో రాసి వారి sensibilities sharpen చెయ్యవలసిన అవసరం ఉంది. రామాయణ, భారతాలు మనల్ని నాగరీకుల్ని చెయ్యకపోతే మనంకూడా అటవికుల్లాగా ఉండే వాళ్లమే పూర్వాశ్రమంలో వాల్మీకిలాగా.
పేరు, ఊరు, కట్టు, బొట్టు, అహారo లాగే భాష కూడా ఒకరి ఉనికిని (Identity) తెలియజేస్తుంది. అది అతని సంస్కృతిలో భాగం. ఆ భాష అంతరించి పోకుండా నిలవాలంటే దాన్ని సక్రమంగా వాడేవాళ్ళు ఉండాలి. లేకపోతే అది సంస్కృతం లాగా ఒకప్పటి భాషగా మిగిలి పోతుంది. ఆంగ్లం నేర్చుకోడానికి హిందు దిన పత్రిక చదవమనే వాళ్ళు. నేటి తరం తెలుగు నేర్చుకోడానికి వేమన పద్యాలు, ఎంకి పాటలు, పుష్పవిలాపం, చలం నవలలు చదవొచ్చు. జనానికి అర్థమమయ్యే తెలుగు భాషను ఇంట్లో, సాహిత్యంలో నిలుపుకోవడమే మనం గిడుగుకు అర్పించదగిన నివాళి.
Also read: “వ్యవస్థ”
(ఆగస్టు 29, గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి)