ఇటీవల కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి స్వాతంత్ర్యం ప్రకటించుకున్న సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్ సామాన్యుడు కాదు. ప్రజాబలం లేకపోయినా అర్ధశతాబ్దంపాటు రాజకీయాలలో రాణించినవాడు. గులాంగా ఉంటూనే ఆజాదీ ప్రదర్శించే నేర్పు ఆయన సొంతం. అందరితో స్నేహంగా ఉండటం, కశ్మీర్ కి చెందిన ముస్లిం కావడం, సంజయ్ ఇందిర, రాజీవ్, సోనియాలకు సన్నిహితుడు కావడం ఆయనకు కలసి వచ్చిన అంశాలు. జమ్మూ-కశ్మీర్ లో సొంతంగా ఎన్నికలలో గెలిచే అవకాశం లేకపోయినా మహారాష్ట్ర నుంచి రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యే అవకాశం గాంధీ కుటుంబం కలిగించింది. అంతే కాదు, అయిదు విడతల రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. అంటే ముప్పయ్ సంవత్సరాలు గాంధీ కుటుంబం సౌజన్యంతో ఎగువ సభ సభ్యుడిగా, రెండు టరమ్ లు దిగువ సభ సభ్యుడిగా ఉంటూ కేంద్రమంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు.
ఆజాద్ ప్రయాణం అవకాశవాద రాజకీయాలకు ఉదాహరణ. తొలుత, 1973లో సంజయ్ బ్రిగేడ్ లో సభ్యుడిగా రాజకీయాలలో అడుగు పెట్టారు. ఇందిరాగాందీకి ఆజాద్ ను సంజయ్ పరిచయం చేశారు. ఆత్యయిక పరిస్థితిలో సంజయ్ తో కలసి నిరంకుశంగా వ్యవహరించారు. అనంతరం ఇందిరాగాంధీ 1977 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఆమె తరఫున వీధిప్రదర్శకులలో అగ్రభాగాన నిలిచారు. ఇందిగాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ నమ్మినబంట్లలో ఒకరుగా మెలిగారు. రాజీవ్ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రదానమంత్రి కావడంలో ముఖ్యభూమిక పోషించారు. పీవీ పదవీ కాలం ముగుస్తున్న దశలో సీతారాం కేసరిని వెనకేసుకొచ్చారు. తర్వాత కేసరిని ఒక గదిలో బంధించి, బలవంతంగా రాజీనామా చేయించి, సోనియాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కార్యవర్గసమావేశం ఎన్నుకోవడంలో చురుకైన పాత్ర పోషించారు. రాహుల్ గాంధీ పట్ల కూడా మొన్నటి దాకా విధేయంగా ఉన్నారు. ఆరో సారి రాజ్యసభకు పంపలేదనే ఆగ్రహం ఉంది. సోనియాగాంధీకి ఎదురు తిరిగి, పార్టీలో పారదర్శకత పెరగాలనీ, ఇరవై నాలుగు గంటలూ పని చేసే నాయకులను ఎన్నుకోవాలనీ లేఖ రాసి సంచలనం సృష్టించిన గ్రూప్ 23 అనే సీనియర్ కాంగ్రెస్ నాయకుల బృందానికి అనధికార నాయకుడుగా వ్యవహరించారు. వాళ్ళతో మాటవరుసకైనా చెప్పకుండా రాహుల్ పైన ధ్వజమెత్తుతూ రాజీనామా చేశారు. రాహుల్ ని నికమ్మాగా, అంటే ఎందుకూ పనికిరాని దద్దమ్మగా అభివర్ణించారు. మన్మోహన్ సింగ్ హయాంలో ఒక ఆర్డినెన్స్ కాపీని ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశంలో బరబరా చించివేయడాన్ని తప్పుపట్టారు. ఆ ఘటన మనస్తాపం కలిగించి ఉంటే అప్పుడే, 2012లోనే, రాజీనామా చేయవలసింది. చేయకపోగా రాహుల్ పట్ల విధేయత ప్రదర్శించారు. రాజ్యసభ సభ్యత్వం స్వీకరించారు. ప్రతిపక్ష నాయకుడి హోదా దర్జాగా అనుభవించారు. అంతకు ముందు కశ్మీర్ ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. 2013లో రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించి సోనియాగాంధీ విశ్రాంతి తీసుకోవడంతో సీనియర్ నాయకులకూ, రాహుల్ సమకాలికులకూ మధ్య విభేదాలు తలెత్తాయి. సీనియర్లకు ఇదివరకటిలాగా గౌరవప్రపత్తులు లేవు. అడిగిన వెంటనే ఇంటర్వ్యూలు లేవు. రాజకీయ సంక్సోభాలు ఏర్పడినప్పుడు మధ్యవర్తిత్వం నెరపవలసిందిగా పురమాయింపులు లేవు. బృహత్తర నిర్ణయాలు తీసుకునే ముందు తనతో సమాలోచనలు లేవు. నాయకత్వం మారింది. పరిస్థితులు మారి పోయాయి అనుకున్నారు. తన హవా తగ్గిందనిపించింది. అందుకే తిరుగుబాటు చేశారు. ఇటీవల రాజ్యసభ పదవీ విరమణ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రదర్శించిన రాజకీయ, నాటకీయ భావోద్వేగంలో ఆజాద్ సమధికోత్సాహంతో భాగస్వామ్యం పంచుకున్నారు. వారిద్దరి మధ్య ఏదో బాంధవ్యం మొదలయిందని అప్పుడే పరిశీలకులు భావించారు. ఇప్పుడు జమ్మూ-కశ్మీర్ లో సొంత కుంపటి పెట్టుకుంటానంటున్నారు. అందుకు అవసరమైన నిధులు మోదీ అందజేస్తారని ఆజాద్ పట్ల ఆగ్రహంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఆ సంక్షుభిత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఆయనే అగ్రనాయకుడు. చాలామంది ఆయన సమర్థకులే. చాలా రాష్ట్రాలలో బలహీనమైనట్టే జమ్మూ-కశ్మీర్ లో సైతం కాంగ్రెస్ కుదేలు కావచ్చు. మోదీ వ్యూహం ప్రకారం జమ్మూలో బీజేపీ, కశ్మీర్ లో ఆజాద్, అబ్దుల్లా కుటుంబం కలిస్తే వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ఇదంతా ఊహాగానమే. ఎన్నికలు సజావుగా జరిగి, ఫలితాలు వచ్చిన తర్వాత చూడాలి ఏమవుతుందో. మోదీ – ఆజాద్ వ్యూహం ఫలిస్తుందో, వికటిస్తుందో అప్పుడు కానీ తేలదు.