డా. ఆరవల్లి జగన్నాథస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు అటు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను, ఇటు అధికార పార్టీ టీఆర్ఎస్ అంచనాలను తారుమారు చేశాయి. గత ఎన్నికల్లో సాధించిన 99 డివిజన్ల కంటే అదనంగా గెలుచుకుంటామే తప్ప ఒక్కటి కూడా తగ్గదనే ధీమాతో ఉన్న ఆ పార్టీ హంగ్ ను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. జీహెచ్ఎంసీ ఫలితాల్లో టీఆర్ఎస్ పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే దాని గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని స్పష్టమవుతోంది. ఎంఐఎంతో జత కట్టక తప్పని పరిస్థితి. `మేం తలచుకుంటే రెండు నెలల్లో కేసీఆర్ ప్రభుత్వాన్నికూలగొట్టగలం` అని తీవ్ర వ్యాఖ్య చేసిన వారితో పొత్తు ఉంటుందా? అనే అనుమానాలు రావచ్చు కానీ అలాంటి మాటలు రాజీకీయాల్లో సహజం అని అంటారు.
ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికి వారే పోటీ చేశామని చెప్పుకుంటున్న టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిస్తే మేయర్ పీఠాన్ని చెరి సగం కాలాన్ని పంచుకోవలసి వస్తుంది. అయితే అది ఎంతవరకు సాధ్యమవుతుంది, రెండు పార్టీలు పరస్పరం చేసుకునే అవగాహన ఎలా ఉంటుందన్న దానిపైనే ప్రస్తుత చర్చ. టీఆర్ఎస్ కనుక అత్యధిక సీట్లు గెలుచుకుని ఉంటే ఎంఐఎంకు షరతులు పెట్టగలిగేదని, ఇప్పడు ఆ పరిస్థితి లేదని అంటున్నారు. అయితే మేయర్ పీఠం తమదేనని టీఆర్ఎస్ ధీమాతో ఉంది. పైగా తమకు ఎక్స్ అఫిషియో సభ్యుల బలం ఉన్నందున మేయర్ గద్దె దక్కడం లాంఛనమే అంటోంది. బీజేపీ, ఎంఐఎం ఏకమైతే తప్ప తమకు అడ్డంకులు ఉండవని టీఆర్ఎస్ అంటోంది. ఆ రెండు పార్టీలు ఏకం కావడం అనే వ్యాఖ్యే జనాన్ని ఆలోచనలో పడేస్తుంది. ఉప్పునిప్పులా ఉండే బీజేపీ, ఎంఐఎం ఏకం కావడం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా అదనంగా సీట్లు వస్తాయనుకున్నామని, అయినా బాధలేదని ఫలితాల ప్రకటన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు అన్నారు. చాలా నియోజకవర్గాలలో అతి తక్కువ మార్జిన్లో ఓడిపోయాయమని చెప్పారు.
Also Read : గ్రేటర్ లో ప్రముఖుల బంధువులకు తప్పని పరాజయం
బీజేపీ సత్తా
మరోవంక ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలిలో నాలుగు స్థానాలు గల ఆ పార్టీ గణనీయంగా బలాన్ని పెంచుకుని రెండో పెద్ద పార్టీగా నిలిచింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ ఈ ఎన్నికల్లో జోరుపెంచింది. పార్టీ కేంద్ర నాయకత్వం కూడా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ, మరో స్థానిక మంత్రి కిషన్ రెడ్డి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తదితరులు ఈ ఎన్నికల మీద బాగా దృష్టి పెట్టారు. సీట్ల సంఖ్యను పెంచుకోవడంతో పాటు టీఆర్ఎస్ గెలుచుకున్న చోట్ల గట్టి పోటీ ఇచ్చిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్ వాగ్ధాటి బాగానే పనిచేసిందని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. టీఆర్ఎస్ వ్యతిరేకతను, కాంగ్రెస్ బలహీనతను సొమ్ము చేసుకోవడంలో విజయవంతమయ్యారు. కాంగ్రెస్ సంప్రదాయక ఓటు తనవైపు మళ్లించుకోగలిగింది. ప్రతి వ్యతిరేక అంశాన్ని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించారు.
Also Read : జీహెచ్ ఎంసీ ఎన్నికలు : విజేతలూ, పరాజితులూ నేర్చుకోవలసిన గుణపాఠాలు
అయితే సీమాంధ్ర ఓట్లు పడిఉంటే బీజేపీ మరికొన్ని స్థానాలు దక్కేవని అంటున్నారు. ఏపీకి అమరావతి రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోకపోవడం వల్లనే హైదరాబాద్ లోని సీమాంధ్రుల ఓట్లు ఆ పార్టీకి పడలేదనే విశ్లేషణలు ఉన్నాయి. మొత్తం మీద రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ ప్రతిపక్షం తానేనని నిరపించే ప్రయత్నంలో సఫలీకృతమైందని అంటున్నారు.
ఎంఐఎం
ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్,బీజేపీలు ఫలితాలను బట్టి వరుసగా రెండు పెద్దపార్టీలుగా ఎంఐఎం తరువాత స్థానంలో ఉంది. అంతకు మించి హంగ్ నేపథ్యంలో నిర్ణయాత్మక శక్తిగా నిలిచింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలసి పోటీ చేసిన ఆ పార్టీ ఈసారి ఒంటరిగానే బరిలో దిగింది. రెండు జాతీయ పార్టీలతో సమాన దూరం పాటిస్తున్నట్లు చెప్పింది. ఈ ఎన్నికలలో తమదే నిజమైన గెలుపు అని ఆ పార్గీ వర్గాలు అంటున్నాయి. ఇతర పార్టీల మాదిరిగా అన్ని డివిజన్లకు పోటీ చేయకుండానే మెరుగైన స్థానాలు పొందగలిగాను అంటున్నాయి.
Also Read : ఉత్తమ్ రాజీనామా…కొత్త సారథి రేవంత్?
కాంగ్రెస్-జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఉనికే ప్రశ్నార్థకమైంది. జంట స్థానాల కంటే దాటలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎంఐఎంతో కలసి పోటీ చేసి మేయర్ పీఠం దక్కించుకుని ఒక వెలుగువెలిగిన కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్రంలో చితికిల పడింది. గత ఎన్నికల్లో, ఈ సారీ రెండే రెండు స్థానాలకు పరిమితమైంది. దక్కించుకున్నసీట్లు మారినా అంకె మాత్రం అదే. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ మసకబారి పోతోంది. తెలంగాణలో అధికార పక్షం టీఆర్ఎస్ కు తానే ప్రత్యామ్నాయం అనిచెప్పే కాంగ్రెస్ ప్రతి ఎన్నికలోనూ చతికిలబడిపోతోంది.
అసలే కొంతమంది సీనియర్లు పార్టీని వీడిపోగా మిగిలిన వారి మధ్య విభేదాలు నెలకొంటే, పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికలను అంత సీరియస్ గా తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య తదితరులు హైదరాబాద్ లో రోడ్ షోలు పాల్గొంటే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకలు కానీ, పొరుగు రాష్ట్రం కర్ణాటకకు చెందిన సిద్దరామయ్యలాంటి వారు కానీ ఏమీ పట్టనట్లు ఉండిపోయారని అంటున్నారు. రాష్ట్ర పరిశీలకుడు మణిక్ ఠాకూర్ మాత్రం కాస్త ముందుండి నడిపించారు.
Also Read : కనిపించని అభివృద్ది మంత్రం.. ఫలించని తెరాస యుద్ధ తంత్రం
మరోవంక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన వారుసుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం దాదాపు ఖారరైనట్లేనని, ఈ నెల 9వ అధికార ప్రకటన వెలువడ వచ్చని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే రేవంత్ బీజీపీలో చేరవచ్చనే ప్రచారానికి తాత్కాలికంగా తెరపడినట్లే.
రేవంత్ రెడ్డి పేరు పీసీసీ నేతగా తెరపైకి రావడంపై కూడా చర్చ రేగుతోంది. ఆయన పేరును సీనియర్ నేత వి.హనుమంతరావు తొలి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బహిరంగ వేదికలపైనే ఇద్దరు మాటల దాడులకు దిగారు. మరో నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఎప్పటి నుంచో ఆ పదవిపై ఆశపెట్టుకున్నారు. తనకు ఆ పదవి ఇస్తే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కట్టడి చేస్తానని అనేకసార్లు వ్యాఖ్యానించారు. అలాగే జగ్గారెడ్డికి కూడా ఆ పదవిపై మక్కువ ఉంది.
ఇలాఉంటే….టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్శింహయ్య ఇటీవల మరణించడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికను ఎదుర్కోవడం కొత్త సారధికి సవాల్ లాంటిదే. అక్కడి నుంచి తమ పార్టీ తరపున ఎవరిని నిలబెడుతుందో తెలియదు కానీ నోముల చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ నేత మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు ఆ సీటును ఆశిస్తున్నారని తెలుస్తోంది.
ఆడలేక మద్దెల
`ఆడలేక మద్దెల ఓడు` అన్న సామెతను గుర్తు చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో తమ పార్టీ ఓటమికి మీడియానే కారణమని ఆరోపించారు. తమ నాయకులు, అభ్యర్థులు శక్తిమేరకు కృషి చేసినప్పటికీ తమలో తమకు గొడవలు ఉన్నాయంటూ మీడియా ప్రచారం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. `తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోయింది.ఇక లేవదు`అని చేసిన ప్రచారమే తమ ఓటమికి కారణమని ఆయన అన్నారు.కానీ ఈ ఎన్నికలను బీజేపీలా తమ పార్టీ జాతీయ నాయకత్వం అంత తీవ్రంగా పరిగణించ లేదనే నిజాన్ని కాబోయే పీసీసీ సారథి గమనించలేక పోతున్నార నిపిస్తోంది. (ఉత్తమ్ రాజీనామాతో రేవంత్ నేతృత్వాన్ని ఈ నెల 9న అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం)
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు స్ఫూర్తితో జోష్ పెంచిన బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాలు 2023 శాసనసభ ఎన్నికల విజయానికి నాంది అని చెప్పకుంటున్న బీజేపీ త్వరలో మరో ఉప ఎన్నికను ఎదుర్కోవలసి ఉంది. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నోముల నర్శింహయ్య హఠాన్మారణంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది.
`నన్నోడి తన్నొడెనా?తన్నోడి నన్నోడెనా? అని ద్రౌపది కురుసభను అడిగిన లాంటి ప్రశ్ననే జీహెచ్ఎంసీ ఎన్నికల టీఆర్ఎస్ గెలుపుపై విశ్లేషకులు సంధిస్తున్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచి ఓడిందా? ఓడి గెలిచిందా?అన్నది చర్చ. అన్ని ఉప ఎన్నికల్లో అప్రతి హతంగా గెలుస్తూ వచ్చిన ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో పరాజయం పాలు కావడం, జీహెచ్ఎంసీ గత ఎన్నికల్లో నూటికి ఒకటి తక్కువ డివిజన్లు గెలుచుకుని ఈసారి 56 కే పరిమితం కావడం లాంటివి ఈ చర్చకు కారణం. అటు బీజేపీ బలం పుంజుకుంటున్నమాట నిజమే అయినా అధికారపక్షంలోని అంతర్గతర అసంతృప్తి కూడా ఈ స్థితికి కారణమంటున్నారు. తమకు కావలసిన వారికి టికెట్లు దక్కకపోవడం కూడా పలువురు ఎమ్మెల్యేల్లో అసంతృప్తి కలిగిందంటారు. పార్టీలో కీలకనేత ,సీఎం కుమార్తె ఎమ్మెల్సీ కవితతో పాటు ముగ్గురు మంత్రులు ఇన్ ఛార్జీలుగా వ్యవహరించిన డివిజన్లలోని అభ్యర్థులే ఓడిపోవడం గమనార్హం. కవిత ఇన్ చార్జిగా ఉన్న గాంధీనగర్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి పర్యవేక్షలోని ఆర్కే పురం, జగదీష్ రెడ్డి నేతృత్వంలోని సరూర్ నగర్, శ్రీనివాస్ గౌడ పర్యవేక్షలోని అడిక్ మెట్ డివిజన్లలో పార్టీ ఓటమి చవిచూసింది. మరో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నియోజకవర్గం పరిధిలోని అమీర్ పేటలో ఆరు డివిజన్లకు గాను మూడింటిని కారు పార్టీ కోల్పోయింది. అలాగే ఉప్పల్ ఎమ్యెల్యే సుభాష్ రెడ్డి భార్య స్వప్న, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు పరాజితులయ్యారు.
అనుకున్నదొక్కటి…..
దుబ్బాక ఉప ఎన్నికలలో దెబ్బతినడంలో అక్కడి నష్టాన్ని ఇక్కడ భర్తీ చేసుకునే ఉద్దేశంలో జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకమండలి గడువు తీరకుండానే ఎన్నికలకు వెళ్లారు. విపక్షాలు గుక్కతిప్పకునే అవకాశం లేనంతగా కేవలం 15 రోజుల వ్యవధిలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాలా ప్రణాళిక రూపొంచారు. అయినా అధికారపక్షానికి లాభించలేదు. ఓటమికి పోలింగ్ తీరు నుంచి అనేక కారణాలు చెబుతున్నప్పటికీ గెలుపు గెలుపే..అన్నట్లు ఓటమి ఓటమే అవుతుంది. పాలకపక్షం తీరుమారకపోతే 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల శృంఘభంగానికి కౌంట్ డౌన్ మొదలైనట్లే‘ అని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
Also Read : విరబూసిన కమలం