- విమర్శలతో రెచ్చిపోయిన సీఎం
- పంతం నీదా..నాదా అంటున్న బీజేపీ
- కాంగ్రెస్, టీడీపీల పోటీ నామమాత్రమే
గ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. ప్రతిపక్షాలకు ఊపిరి సలపని రీతిలో కేసీఆర్ వ్యూహాన్ని రచించారు. తాజాగా ఆయన విసిరిన సవాలుకు విపక్షాలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ‘ఇప్పుడు రండిరా మా గల్లీల్లోకి’ అంటూ విసిరిన సవాలు ఫలితం ఎలా ఉంటుందో డిసెంబర్ 4వరకూ తెలీదు. కిందటి నెలలో భారీ వర్షాలకు నగరంలో వచ్చిన వరదలకు నష్టపోయిన కుటుంబాలకు 10వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ మేరకు బాధితులకు సమాచారమూ ఇచ్చింది. ‘మీ సేవ’ కేంద్రాలలో పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. అంతే. ‘మీ సేవ’ కేంద్రాలు కిటకిటలాడిపోయాయి. పది వేలు ఎవరికి చేదు? అంతే రానున్న ప్రమాదాన్ని పసిగట్టిన బీజేపీ కోర్టును ఆశ్రయించింది, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే పదివేల పంపిణీ కార్యక్రమాన్ని ప్రశ్నించింది. ఇది ఓటర్లను ప్రలోభపెట్టడమేనని అభిప్రాయపడింది. ఈలోగా నోటిఫికేషన్ విడుదల కావడం, ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగి ఆ కార్యక్రమానికి ఫుల్‌స్టాప్ పెట్టడం జరిగిపోయాయి. ఇక్కడిదాకా జరిగింది సాధారణ రాజకీయం. అప్పుడు మొదలైంది అసలు కథ.
ఒకే సారి 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన
కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేయడానికి టీఆర్ఎస్ భవన్‌లో సమావేశం ఏర్పాటైంది. ఆ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చల అనంతరం ఒకేసారి 105మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఆ తరువాత చేసిన ప్రసంగంలో విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇలా అనేకంటే.. తొడగొట్టి సవాలు విసిరారు అనడం సమంజసంగా ఉంటుంది. దుబ్బాక ఉప ఎన్నికలో ప్రత్యక్ష ప్రచారానికి రాని కేసీఆర్‌కు అక్కడి ఫలితం కాస్తంత కలవరం కలిగించి ఉంటుంది. ఉప ఎన్నికల్లో ఓటమెరుగని పార్టీ అధినేతను ఇది ఆలోచనలో పడేసింది. 2014 తరవాత ఇదే తొలి ఓటమి కావడం అందరికీ తెలిసిందే. ఆధిక్యం తక్కువే అయినా ఓడిపోవడం ఇబ్బందికరమే.
చంద్రబాబుకు చుక్కలు చూపించిన కేసీఆర్
హైదరాబాద్ కార్పొరేషన్ టీఆర్ఎస్‌కు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత కీలకం. బీజేపీ శ్రేణులలో దుబ్బాక దూకుడు బాగా కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు వెల్లడవుతోంది. ఈ దూకుడును తగ్గించాలనీ, బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదనే దృఢ సంకల్పం కేసీఆర్‌లో ప్రస్ఫుటమవుతోంది. ఈ ప్రచారానికి ఆయన వస్తారా రారా అనేది అప్రస్తుతం. కానీ, ప్రతిపక్షాలకు విసిరిన సవాలు భావోద్వేగాలకు సంబంధించింది. వరద బాధితులకు సహాయం ఇవ్వబోతే అడ్డుకుంటారా.. ఇప్పుడు రాండి గల్లీల్లోకి అంటూ ఆయన చేసిన వ్యాఖ్య గ్రేటర్‌లో కాకపుట్టిస్తోంది. ఇలా ప్రజల భావోద్వేగాలలో ముంచి లబ్ధి పొందడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ రాష్ట్ర విభజన ఉద్యమం ముందు నుంచీ ఆయనలో ఈ వైఖరి ఉంది. చంద్రబాబు హయాంలో డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు కేసీఆర్ అవలంబించిన వ్యూహం చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావానికి కారణమైంది. అదే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం బలపడడానికి కారణమైంది. అక్కడి నుంచి కేసీఆర్ మైండ్ గేమ్ ఆడారు. ఆ గేమ్‌కు ఎవరి వద్దా సమాధానం లేకపోయింది. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఆనాటి మైండ్ గేమ్ ఇప్పుడు అవసరం లేదు.
అధికార వ్యూహాలు వేరు
అధికారంలో ఉండాలంటే అనుసరించాల్సిన వ్యూహాలు వేరే ఉంటాయి. అదే ఆయన తుచ తప్పకుండా అనుసరిస్తూ వస్తున్నారు. కర్ర కాల్చి వాత పెట్టడం కూడా ఆయనకు తెలిసిన అద్భుతమైన విద్య. ఇప్పుడు అదే ప్రయోగించారు. ప్రధాని నరేంద్ర మోడీని సైతం ఆయన తన ప్రసంగంలో విడిచిపెట్టలేదు. రైల్వే స్టేషన్‌లో చాయ్ అమ్ముకున్న వ్యక్తి నేడు స్టేషన్‌ను అమ్మేస్తున్నారంటూ వ్యాఖ్యానించి తన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. అది నేరుగా బీజేపీని ఉద్దేశించి చేసినదే. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ఫలానా మేలు చేకూర్చాం అని చెప్పుకునేందుకు బీజేపీకి పాయింటే లేదు. అయినా కూడా దుబ్బాకలో బీజేపీ గెలుపు సాధించింది. ఈ పరిణామం టీఆర్ఎస్‌కు ఆందోళన కలిగించింది. అద్వితీయమైన విజయం సాధిస్తామనుకున్నప్పటికీ ఓటమి పాలుకావడంతో కేసీఆర్ అలర్ట్ అయ్యారని చెప్పచ్చు. అందుకే ఆయన నేరుగా రంగంలో దిగారు. విమర్శల బాణాలతో విరుచుకుపడుతున్నారు.
విమర్శల విశ్వరూపం
కేసీఆర్ చూపుతున్న విమర్శల విశ్వరూప సందర్శనం టీఆర్ఎస్‌కు గ్రేటర్‌లో విజయం సాధించిపెడుతుందని ఆ పార్టీ నమ్మకం. అక్టోబర్ వరదలు తమ పార్టీని ఎక్కడ దెబ్బతీస్తాయోనన్న అనుమానం కూడా లేకపోలేదు. బీజేపీకి తన ప్రచార సామర్థ్యంపై విశ్వాసం. కాంగ్రెస్ నాయకత్వ పోరులో చాలా బిజీగా ఉంది. ఎవరికీ ఎవరితోనూ పడదు. ఆ పార్టీలోని నాయకులలో ప్రముఖులు ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్… ఇలా జాబితా పెద్దగానే ఉంది. కాంగ్రెస్‌లో కుమ్ములాటలే తమకు విజయాన్ని తెచ్చిపెడతాయనే ధీమాలో బీజేపీలో ఉంది. టీడీపీ ఎంత వరకూ ప్రభావం చూపుతుందనేది చూడాల్సి ఉంది. గత చరిత్ర పరిశీలిస్తే.. టీడీపీకి వేసే ఓట్లు గెలుపు గుర్రాలకు ప్రమాదకరమే. అదే సమయంలో జనసేన పోటీ కూడా టీఆర్ఎస్ ఓట్లను చీల్చే థ్యేయంతోనే అనేది చెప్పక తప్పదు. మొత్తం మీద కేసీఆర్ సవాలుతో గ్రేటర్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.