డా. ఆరవల్లి జగన్నాథస్వామి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)పోలింగ్ లో ఓటర్లు పాలు పంచుకోకపోవడం సమర్థనీయం కాకపోయినా తప్పంత వారి మీదికే నెట్టడం కూడా సరికాదని విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం పోలింగ్ ముగిసిన వెంటనే ప్రసార, సామాజిక మాధ్యమాల్లో దీనిపై చర్చ మొదలైంది. ఓటు హక్కు వినియోగించుకోవడంలో హైదరాబాద్ ఓటర్లు బధ్దకంగావ్యవహరించారనే వాదనను వారు ఖండించకపోయినా పూర్తిగా సమర్థించనూ లేదు.
తక్కువ వ్యవధిలో ఎన్నికలు
ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేకుండానే కేవలం 14 రోజుల వ్యవధిలో పోలింగ్ ప్ర్రక్రియను పూర్తి చేయాలనుకోవడం తొందరపాటు చర్యగానే విశ్లేషిస్తున్నారు. గత నెల (నవంబర్)17న నోటిఫికేషన్ వెలువడిన వెంటనే దీనిపై వ్యాఖ్యానించిన రాజకీయ విశ్లేషకులు ఇప్పడు వాటిని గుర్తు చేస్తున్నారు.
హడావిడి నోటిఫికేషన్
హడావిడి నోటిఫికేషన్ జారీ వల్ల ఎదురయ్యే కలిగే దుష్సరిమాణం నిన్నటి ఓటింగ్ సరళితో తేలిపోయిందని అంటున్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానం ఉప ఎన్నికలో అధికారపక్షం పరాజయం ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల వేగిరానికి కారణమని ఆనాడే చెప్పామని అంటున్నారు. అక్కడ పోగొట్టుకున్నదానిని ఇక్కడ వెదుక్కోవాలనుకున్నారని వ్యాఖ్యానించారు.
అందరినీ ఒకే గాట కట్టడం సరేనా?
నగరంలో ఉండి కూడా ఓటు హక్కు వినియోగించుకోని వారిని అటుంచితే అందర్నీ ఒకే గాట కట్టడం సరికాదని అంటున్నారు.`సాఫ్ట్ వేర్ ఉద్యోగులనే ఉదాహరణగా తీసుకుంటే. కోవిడ్ నేపథ్యంలో చాలా మంది `ఇంటి నుంచి పని` (వర్క్ ఫ్రమ్ హోమ్) పద్ధతిని అనుసరిస్తూ, పని ఎక్కడి నుంచి చేస్తే ఏం? అనే ఉద్దేశంతో సొంతూళ్లకు వెళ్లి ఉంటారు. మరికొందరికి కోవిడ్ సంక్షోభంతో ఉద్యోగ భద్రత లోపించి ఉండవచ్చు. పోనీ, ఓటు చేయడానికి రావాలనుకున్నా రవాణా సదుపాయం అంతంత మాత్రమే. పరిమితంగా నడిచే రైళ్లు, బస్సుల్లో రిజర్వేషన్ దొరకడం కష్టం` అని విశ్లేషిస్తున్నారు.
బహిష్కరణగానే భావించాలట… ఈ ఎన్నికల నిర్వహణలో ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ స్వార్థమే ఎక్కువగా ఉందన్న ఉద్దేశంతో ఓటర్లు కావాలనే పోలింగ్ ను బహిష్కరించారని భావించవలసి ఉంటుందని ఒక ప్రముఖ విశ్లేషకుడు అన్నారు. జీహెచ్ఎంసీ ప్రస్తుత పాలకవర్గం కాలపరిమితి సుమారు రెండున్నర నెలలు (వచ్చే ఏడాది ఫిబ్రవరి 10) ఉండగా, ఇంత హడావిడిగా ఎన్నికలు నిర్వహించాలనుకోవడం ఏమిటని మొదటే ప్రశ్నించా మని గుర్తు చేశారు. ఎన్నికల సంవత్సరం ప్రవేశించిన తర్వాత అటుఇటుగా నిర్వ హించడం సహజమే అయినా ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని చెప్పామని అంటున్నారు.ఇలా ఏ కోణంలో చూసినా ప్రస్తుత పరిస్థితిలో రాజకీయ పక్షాల ప్రమేయం ఉన్నప్పుడు కేవలం ఓటర్లను తప్పు పట్టడం సరికాదని ఆయన అన్నారు.