- పలు చోట్ల ఉద్రిక్తత
- ఘర్షణలకు దిగిన ప్రధాన పార్టీల కార్యకర్తలు
- ఓట్ల గల్లంతుపై ఆగ్రహం
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 30 సర్కిళ్ల పరిథిలోని 149 డివిజన్లలో పోలింగ్ జరిగింది. నగర వ్యాప్తంగా అక్కడక్కడా ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నగరంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లోనే అధిక శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఆర్ సీ పురం, పటాన్ చెరువు, అంబర్ పేట సర్కిళ్లలో అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా, మలక్ పేట, కార్వాన్ సర్కిళ్లలో అత్యల్ప ఓటింగ్ నమోదయినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 36 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రధాన పార్టీలకు చెందిన కార్యకర్తలు వాగ్వాదాలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలకు కూడా తెగబడ్డారు. మరోవైపు ఓట్లు గల్లంతు కావడంతో పలు ప్రాంతాల్లో ఓటర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్నా ఓట్లు గల్లంతవడంపై విచారం వ్యక్తం చేశారు.
Also Read: ఓటింగ్ పట్ల నగర ఓటరు నిర్లిప్తత
ఓట్ల గల్లంతుపై ఆగ్రహం
కొన్నేళ్లుగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నా తమ ఓట్లు గల్లంతయ్యాయని గ్రేటర్ పరిథిలో పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో ఉంటున్నా ఓట్లను తొలగించడమేంటని ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఉప్పల్ డివిజన్ లో ఉద్రిక్తత
ఉప్పల్ డివిజన్25 వ నెంబర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు
టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం
ముషీరాబాద్ నియోజకవర్గంలో అడిక్ మెట్ డివిజన్ రాంనగర్ మీ సేవ వద్ద టీఆర్ఎస్ నాయకుడు సుధాకర్ గుప్త, బీజేపీ నేత ప్రకాష్ గౌడ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ప్రకాష్ గౌడ్ ఆరోపించారు. బయట వ్యక్తులకు ఈ డివిజన్ లో పనేంటని టీఆర్ఎస్ నేతలను ప్రకాష్ గౌడ్ నిలదీయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: మొద్దుబారిన `వజ్రాయుధం`
షేక్ పేట డివిజన్ లో బీజేపీ నేతపై దాడి
షేక్ పేట డివిజన్ పరిథిలో ఎంఐఎం, బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఎంఐఎం నేతలు రిగ్గింగ్ కు పాల్పడుతున్నారంటూ బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఎంఐఎం నాయకులు బీజేపీ నేతలపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో బీజేపీ నాయకుడిని తీవ్రంగా గాయాలయ్యాయి.
ఓల్డ్ మలక్ పేటలో రీపోలింగ్
సీపీఎం, సీపీఐ పార్టీల గుర్తులు తారుమారు కావడంతో ఓల్డ్ మలక్ పేట డివిజన్ పరిథిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో డిసెంబరు 3న రీపోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ నిర్ణయించింది. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఎన్నికల సంఘం తెలిపింది.
Also Read: జీహెచ్ఎంసీలో మందకొడిగా పోలింగ్