గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో చివరి అంకం ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ఏర్పాటైన 30 కేంద్రాల్లో డిసెంబర్ 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఓట్ల లెక్కింపు అంటేనే అందరూ అప్రమత్తంగా ఉంటారు. పార్టీలు, అభ్యర్థులు ఈసారి మరింత అప్రమత్తమయ్యాయి. ఇటీవల సంవత్సరాలలో అమల్లోకి వచ్చిన ఎలక్ట్రానికి ఓటింగ్ విధానాన్ని కాదని పాత పద్ధతి బ్యాలెట్ ను తిరిగి తీసుకురాడడం, పోలింగ్ నువ్వా?నానా? అనేలా సాగడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తిగా మారింది. ఒక్క ఓటు తేడాతోనే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదంతో పాటు, మెజార్టీ కూడా తగ్గే అవకాశం ఉన్నందున ప్రతి బ్యాలెట్ పత్రాన్ని క్షుణ్ణంగా లెక్కించి, చెల్లని ఓట్లను గమనించి రెండిటి మధ్య తేడాను సరిపోల్చే ప్రక్రియ సవాల్ గా మారింది. బ్యాలెట్ పత్రాలు కావడంతో ఫలితాల వెల్లడికి బాగా సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.
ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారికి అవగాహన, అనుభవం అవసరం కనుక అలాంటి వారికోసం పార్టీలు, అభ్యర్థులు వెదుకులాడుతున్నారు. ఒక మాటలో చెప్పాలంటే రెప్ప పడకూడదన్నంత సూక్ష్మంగా వ్యవహరించవలసి ఉంటుందని కొందరు అభ్యర్థులు వ్యాఖ్యానించారు.