డా. ఆరవల్లి జగన్నాథస్వామి
హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెఛ్ఎంసీ) ఎన్నికల ప్రచార హోరు సద్దుమణిగింది.ఎవరెన్ని మాటలు చెప్పినా, వరాల మూటలు విసిరినా ఓటరు మాటే ఖాయం కావలసి ఉంది. `ఈ బక్కోడిని ఓడించడానికి జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులురావాల్నా?`అని ప్రశ్నించిన టీఆర్ఎస్ దళపతి చంద్రశేఖరరావు మాటలకు, `చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి`అనే సామెతను ప్రత్యర్థి పార్టీల నేతలు గుర్తు చేసినట్లున్నారు. `మావి జాతీయ పార్టీలు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మాకు ఒకటే`అని అవీ జివాబు ఇచ్చాయి. ఈ ఎన్నికలలో విజయం తమదేనని ప్రత్యేకంగా చెప్పనసరం లేదని, తమను నిలువరించేందుకు జాతీయ స్థాయి నేతలు కదలి రావడంతోనే మానసికంగా తాము గెలిచినట్లయిందని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి.
వరాల సరే..అమలు ఎలా?
రెండు జాతీయ పక్షాలు కాంగ్రెస్, బీజేపీ, అధికార పక్షం టీఆర్ఎస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలను తలపిస్తూ ప్రకటించిన ఎన్నికల ప్రణాళికలోని అంశాలను మళ్లీమళ్లీ ముచ్చటించుకోవలసిన అవసరం లేదు కానీ, ఎవరు గెలిచినా ఆ వాగ్దాలను నెరవేర్చేందుకు ఆర్థిక వనరుల సేకరణ ఎలా? అన్నది అందరిని తొలుస్తున్న ప్రశ్న. `గెలిస్తే తామే నిధులు కేటాయిస్తామన్న`రీతిలో ఆయా పార్టీల డివిజన్ అభ్యర్థులు హామీలు ఇవ్వడం మాధ్యమాల ద్వారా తెలుసుకున్నాం. అసలు జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ ఎంత? పన్నుల రూపంలో వచ్చేది ఎంత? పరిపాలన వ్యయం ఎంత? రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే సహాయం ఎంత? లాంటి అంశాలపై మాధ్యమాల్లో వార్తా కథనాలు,టీవీల్లో విశ్లేషణలు వచ్చాయి. అటు వేలం పాటలకు మించి పోటీ పడి మరీ వరాలు గుప్పించిన నాయకులు,ఇటు ఓటరు దేవుళ్లు వాటి గురించి సమీక్షించుకుంటారనే అనుకోవాలి.
ఫలితాలు తారుమారైతే….
టీఆర్ఎస్ తిరిగి పీఠం ఎక్కితే కొంతవరకు నెట్టుకు వస్తుందనుకోవచ్చు.అందుకు భిన్న ఫలితాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత మేరకు సహకరిస్తుంది? కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గెలిస్తే కొంతమేర ప్రయోజనం ఉంటుందను కోవచ్చని, కాంగ్రెస్ విషయంలో అదెలా సాధ్యమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆయా పార్టీలు `ఉచితాలు` ప్రకటించేసి `తాంబూలాలు ఇచ్చేశాం…`అన్నట్లుగా దాటేశాయి తప్ప వనరుల సేకరణ గురించి ఎక్కడ ప్రస్తావించలేదని, అలాంటప్పడు వాటి అమలుకు వేల కోట్ల రూపాయలు సేకరణ ఎలా? అనేది ప్రశ్న.
బడ్జెట్ కన్నా ఎన్నో రెట్లు
జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ రూ.5600 కోట్లుకాగా, అన్ని ఖర్చులు, అవసరాలకు పోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 3186 కోట్లతోనే అభివృద్ధి పనులు చేపట్టవలసి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితిలో ఎన్నికల హామీల అమలు ఆచరణలోకి రావాలంటే జీహెచ్ఎంసీ బడ్జెట్ కంటే సుమారు 10 నుంచి 20 రెట్లు అవసరమవుతుందని అంచనా.
ఇలా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటా భారీగా తగ్గిపోయిందని కేంద్ర ఆర్థికశాఖ శుక్రవారం చేసిన ప్రకటన మేరకు తెలంగాణ రాష్ట్రం రూ. 1486 కోట్లు నష్టపోయినట్లయింది. ఏపీ రూ. 2,965 కోట్లు కోల్పోయింది. ఆ స్థాయిలో చేదు అనుభవం ఎదురైనప్పుడు స్థానిక సంస్థల పట్ల ప్రభుత్వ ఉదారతను ఎలా ఆశించగలమని కూడా ఆర్థికవేత్తలు అంటున్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయలేకపోగా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రకరకాల పన్నులు విధించిన, విధిస్తున్న ప్రభుత్వాల గురించి వింటున్నాం. `ఓడ మల్లయ్య….” సామెతను గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. ఆ పరిస్థితి పునరావృతం కాదన్న భరోసా ఎంత? ఎక్కడ?