హైదరాబాద్ : ఓటుహక్కు వినియోగించుకోవడంలో బద్ధకం…ఆపైన కరోనా భయం, బెడద.. వరుస సెలవులు, వాతావరణ హెచ్చరిక….ఇవన్నీ హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల పోటీలోని అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్న అంశాలు. అసలే పోలింగ్ నాటి సెలవును ఓటు హక్కు వినియోగానికి ఉపయోగించుకునేవారు తక్కువేనని సర్వేలో తేలింది. ముఖ్యంగా ధనిక, ఎగువ మధ్యతరగతి వారు వారిలో ఎక్కువని అపప్రథ ఉంది. అందుకే కొన్ని డివిజన్లలో అభ్యర్థులు ఆయా తరగతుల వారి కంటే బస్తీ ఓటర్లనే నమ్ముకున్నారు. పోలింగ్ రోజున (మంగళవారం) సెలవు ప్రకటించారు. దానికి ముందురోజు సోమవారం గురునానక్ జయంతి సందర్భంగా ప్రభుత్వ సెలవు. దానికి ముందు ఆదివారం. ఇలా మూడు రోజులు వరుస సెలవులు కావడంతో కొందరు ఓటర్లయినా ఇతరత్రా కార్యక్రమాలు పెట్టుకోకుండా ఉండరని అనుకుంటున్నారు.
దీనికి తోడు కొన్ని డివిజన్లలోని ఓటర్లు ఇతర డివిజిన్లలోని పోలింగ్ కేంద్రాలకు బదిలీ కావడంతో వారిలో వృద్దులు,మహిళలు ఎంత వరకు ఓటు హక్కు వినియోగించుకో గలుగుతారనేది అనుమానమే అంటున్నారు. సోమవారం (పోలింగ్ ముందురోజు)బంగాళాఖాతంలో వాయుగుండం పడి తుపాను రావచ్చని, దాని ప్రభావం ఇక్కడ కూడా ఉండవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.