Thursday, November 7, 2024

ఓల్డ్ ఈజ్ గోల్డ్

ఘంటసాల. రమేష్ నాయుడు

నేను ఎక్కువగా బొంబాయి , కలకత్తాల్లో ఉండడంతో ఇక్కడి సినిమా సంగీతం మీద నాకు పెద్ద జ్ఞానం లేదు.

అయితే 1972 లో మద్రాసు వచ్చేశాను.

అప్పటికి ఘంటసాల గారి గళంలో మార్దవం తగ్గిపోయింది.

ఆయన ఎక్కువగా పాడడం లేదు.

అందుకే నేనూ ఆయ‌న‌తో ఎక్కువ‌గా పాడించుకోలేక‌పోయాను.

అయితే గాయకుడుగానూ సంగీత దర్శకుడుగానూ ఆయనేమిటో తెలిపే చిత్రం మాత్రం షావుకారే. షావుకారు సినిమా విడుదలైనప్పుడు చూసే భాగ్యం నాకు దక్కలేదు.

షావుకారు ఎల్పీ ఇప్పుడు విడుద‌లైంది క‌నుక‌ విన్నాను.

షావుకారు వింటున్నప్పుడు మాత్రం ఘంటసాల గారి కంఠం ఆ రోజుల్లో ఎంత మాధుర్యంతో తొణికిసలాడేదో సుస్పష్టంగా వివరించింది.

ఆయన కంఠమూ రికార్డింగూ అంత నిర్ధిష్టంగా ఉన్నాయి.

నేను చిత్రం చూడకపోయినా అక్కడక్కడ దొర్లిన సంభాషణల వల్ల కథ కొంత మేరకు అర్ధం అయ్యింది.

సంగీత దర్శకుడుగా ఘంటసాల నూరు పైసల తెలుగు సంగీతం వినిపించారు.

చక్కని మెలోడీ.

శ్రావ్యత లోపించి జోరు హోరు ఎక్కువైపోయిన ఈ రోజుల్లో పాటల మధ్య షావుకారు పాటలు ఎంత హాయిగా ఉన్నాయో చెప్పడం కష్టం.

ఆరంభంలో వినిపించిన టైటిల్  సంగీతం , హృద్యమంగా ఉంది.

తెలుగువారికి చెందిన జానపద సంగీత ధోరణిలో వాయిద్యాలతో హాయిగా ఉంది.

అందులో ఆయన ఉపయోగించిన సెటప్ ఆఫ్ రిథమ్స్ ఇంత వరకూ నేను ఎవరి సంగీతంలోనూ ఎక్కడా వినలేదు.

ఆ టైటిల్ మ్యూజిక్ కూడా ఒక పాటలాగే వినిపించింది. అనిపించింది. అదీ గొప్ప.

 ప్రేక్షకులను ప్రారంభం కాబోతున్న సినిమా మూడ్ లోకి టైటిల్ మ్యూజిక్ తీసుకెళ్లగలగాలి.

ఇవ్వాళ అది నిర్లక్ష్యం చేయబడుతోంది.

సందేహం లేదు. కథకీ చిత్రానికీ సంబంధించిన‌ టైటిల్  మ్యూజిక్ మనం చాలా అరుదుగా వింటూ ఉంటాం.

షావుకారు సామాజిక చిత్రం గనుక ఆ మూడ్ ని ఆయన ఎంత గొప్పగా సృష్టించారో ఒక్కసారి వింటే అర్దమైపోతుంది.

పాటల్లోని సాహిత్యం కూడా అంత బావుంది.

ఒక్క పాట అదోలా అనిపించినా ఆ పాత్ర  స్వభావానికి తగ్గట్టుగా రాసి స్వరం కట్టి ఉంటారనుకుంటాను.

తక్కిన పాటలన్నీ సంగీతపరంగానూ గానం చేయ్యడంలోనూ బహు శ్రావ్యంగా ఉన్నాయి.

ఇన్ని బావున్న పాటల మధ్య బాగాలేవనిపించిన ఆ ఒకటి రెండు పాటల్నీ దోషాలకిందనో లోపాల కిందనో జమకట్టనవసరం లేదు.

శ్రీ ఘంటసాల పాడిన పలుకరాదటే చిలుకా , ఏమనెనే ప్రారంభంలోని హరికథ చాలా హాయిగా ఉన్నాయి.

నిశ్శబ్దంగా ఉన్నరాత్రి లో నిద్రపోయే ముందు తక్కువ వాల్యూమ్ లో ఆయన పాడిన ఆ రెండు పాటలూ విని చూడండి … ఆ హాయి, మాధుర్యం అర్ధమవుతాయి.

ఇవ్వాళ‌ టెక్నిక్ ఎంతో అభివృద్ది చెందింది. ముఖ్యంగా శబ్దం , ఛాయాగ్రహణాలలో ఎన్నో కొత్త టెక్నిక్ లు వచ్చాయి. అలానే వాయిద్యాలూ వచ్చాయి.

ఎన్నో ఎలక్ట్రానిక్ వాయిద్యాలు వినిపిస్తున్నాయి. రికార్డింగ్ విధానాల్లో మైకులు, మిక్సర్లు అధునాతనమైనవి ఎన్నో వచ్చాయి.

కాని, ఇవాళ, గజ్జెల శబ్దం గజ్జెల శబ్దంగా వినగలుగుతున్నామా? అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది.

గజ్జెలు ఘల్లుమనడం లేదు. భళ్లుమంటున్నాయి.

ఈ లోపం ఎక్కడుందో నేను చెప్పలేనుగానీ … షావుకారు లోని హరికథ జరుగుతుండగా వచ్చే సన్నివేశంలోని సంభాషణలు ఎంత స్పష్టంగా నిర్దిష్టంగా ఉన్నాయి.

పాట పాటగా వినిపిస్తూనే ఉంటుంది. సంభాషణలూ వినిపిస్తూనే ఉంటాయి.

ఎప్పుడో 30 ఏళ్ల  క్రితం ఇంతటి అద్భుతమైన ప్రక్రియని ఆయన సాధించారు.

మరి మనం ఇప్పుడు ఏం సాధించగలుగుతున్నాం ? అంటే సిగ్గుపడాలి.

అలాగే దీపావళీ దీపావళీ అన్న పాటలో టపాసుల శబ్దాలు వినిపించారు.

దాని వల్ల పాటకీ నేపథ్య సంగీతానికీ ఏ విధమైన డిస్ట్రబెన్సూ లేకుండా నడిపించగలిగారు.

ఇవాళ నాయికా నాయికలు కార్లో వెడుతూ పాటలు పాడతారు. కారు తలుపులు తెరుస్తారు. దిగి పరిగెడతారు. కాని కారు శబ్దమూ వినిపించదు … తలుపు తెరిచిన శబ్దమూ వినిపించదు.

కొందరు పాట పాటగానే వినిపించాలనీ శబ్దాలు జోడించరు.

కొందరు జోడించినా వినిపించవు.

రికార్డింగులో ఇన్ని ట్రాక్స్ వచ్చినా కంఠానికీ పాటలోని సాహిత్యానికీ ప్రాముఖ్యత ఇవ్వాలనేది అందరూ ఎరిగిన సత్యమే అయినా  ఆ సూత్రం ఇవాళ ఎలా పాటించబతుతోందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

కానీ ఆ రోజుల్లో వచ్చిన షావుకారు లో ఈ సూత్రాల్ని అంత నిర్ధిష్టంగా ఎలా పాటించగలిగారో వింటే అర్ధమవుతుంది.

అంటే ఆ రోజుల్లో ఉన్న సౌకర్యాలతోనే రికార్డింగు లో ఎంత శ్రద్ద పెట్టేవారో క్వాలిటీ ఇవ్వడానికి ఎంత శ్రమ పడేవారో అర్ధమవుతుంది.

అప్పట్లో మనం ఏం చేసినా జనం ఆదరించారు.

ఆ రోజుల్లో ప్రేక్షకులు ఇవాళంత అడ్వాన్స్ కాదు. అయినా ఆ రోజుల్లోనే మంచి క్వాలిటీ ఇవ్వగలిగాం.

సినిమా టెక్నిక్ పూర్తిగా అవగాహన చేసుకున్న ప్రేక్షకులకి ఇవాళ క్వాలిటీ ఇవ్వలేకపోతున్నాం.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నది ఎంత సత్యం.

ఈ మధ్య  నేను పాలిడార్ కంపెనీ ముఖ్య అధికారిని కలుసుకుని మాట్లాడుతుంటే … మాటల సందర్భంలో ఆయన  అన్నారు.

కంపెనీకి 75 శాతం లాభాలు చేకూర్చిపెడుతోంది పాత చిత్రాల సంగీతమేనట.

అందువల్ల ఆనాటి ఆ మెలోడీని ఆ శ్రావ్యతనూ ఆ మాధుర్యాన్నీ ఇవాళ ఈ సాంకేతికంగా ముందుకుపోయిన స్పీడ్ యుగంలో ఇవ్వలేకపోతున్నాం … గనుక కచ్చితంగా పాత పాటలే హాయిగా ఉంటాయి.

పాత సినిమా రికార్డులను సరికొత్తగా తీసుకువచ్చి నేటి ప్రేక్షకులకు మెలోడీ అందచేసే ఉద్యమాన్ని చేపట్టినందుకు ధన్యవాదములు.

 (షావుకారు సినిమా సంగీతం గురించి రమేష్ నాయుడు 1984 సెప్టెంబ‌ర్ విజ‌య‌చిత్ర‌లో రాసిన వ్యాసం. షావుకారు ఎల్ పీ విడుదల సందర్భంగా రచించారు.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles