Tuesday, November 5, 2024

గంధర్వులను మించిన ఘంటసాల

  • నాదోపాసనే జీవిత సర్వస్వం
  • పంచేంద్రియాల ఉపాసన
  • గానం, రచన  రెండు కళ్ళు

తెలుగువారి ఇలవేలుపు తిరుమల వేంకటేశ్వరుడు. గాయకలోకంలో తెరవేలుపు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఇంటింటా వినిపించే దివ్య గాత్రం. తరాల అంతరాలు దాటి ప్రవహిస్తున్న గాన ప్రవాహం. భారత చిత్రసీమలో ఇంతటి దివ్య మధుర మోహన సుందర గాత్రం ఇంత వరకూ ఎక్కడా వినిపించలేదు. ఆ మహనీయ గాయకుడు భువిని వీడి దివిని చేరి కూడా ఐదు దశాబ్దాలవుతోంది. జననం 99 ఏళ్ళు దాటి వందకు చేరుకుంది.

Also read: విశాఖ ఉక్కుపై పునరాలోచన చేయరా?

శతవత్సర ప్రారంభ వేళ

వచ్చే సంవత్సరం డిసెంబర్ 4 వ తేదీకి వందేళ్లు సంపూర్ణమవుతాయి. ఇది శత వసంతం ప్రారంభమైన వేళ. ఈ శుభసందర్భంలో అడుగడుగునా ఉత్సవాలు ఆరంభమైనాయి. భౌతికంగా, అంతర్జాలంలో, అక్షరాకృతిలో, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద/పదసేవనం, అర్చనం, వందనం, నివేదనం.. అన్నట్లుగా ‘నవ’విధి భక్తి మార్గాల్లో అభిమానులందరూ ఘంటసాల తలపుల్లో జీవిస్తున్నారు. నాదోపాసనే జీవితంగా నడిచిన పుణ్యకీర్తి, ధన్యమూర్తి ఘంటసాల. కేవలం పాడడం, సంగతులతో హడావిడి చెయ్యడం, ప్రతిభా ప్రదర్శన చూపడం కాదు… సర్వ చక్షువులు, పంచేంద్రియాలు ఏకం చేసి ఉపాసించాల్సిన యోగ మార్గమే గాన విధానం  అని తండ్రి సూర్యనారాయణ చిన్ననాడే బోధించాడు. ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా తుది వరకూ పాటించి ‘అమరగాయకుడు’గా రససిద్ధుడైన మహనీయుడు మన ఘంటసాల. తండ్రి నుంచే సంగీత వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. తండ్రి గానమే ఆయనకు ప్రేరణ, పితృదేవుడే తొలి గురుదేవుడు. మేనమామ ర్యాలి పిచ్చయ్య మలిగురువైనాడు. ఘంటసాలను తొలిగా ఆకర్షించినవి శ్రీ నారాయణతీర్ధ తరంగాలు. గాయకుడుగా తొలిగా గుర్తింపు వచ్చింది కూడా తరంగ గానం ద్వారానే కావడం విశేషం. తరంగాలు యక్షగాన, భజన సంప్రదాయంలో గానం చేస్తారు. పూర్తి భక్తి మార్గం, తన్మయ స్వరూపం. తండ్రి బోధించిన ఉపాసనా మార్గం తరంగాల సాధనకు బాగా కలిసి వచ్చింది. మేనమామ తీర్చిదిద్దిన విధానం కూడా అనుపమానం. ఘంటసాల అంటే కేవలం ప్లేబ్యాక్ సింగర్ కాదు. అది జీవిక కోసం జీవితంలోకి ప్రవేశించిన ఒక మార్గం మాత్రమే. నిజానికి ఆయనకు గానం, రచనం రెండూ రెండు కళ్ళు. ఆయన రాసి, పాడిన ప్రైవేట్ గీతాలే దానికి తార్కాణం. నేపథ్య గాయకుడుగా డిమాండ్ పెరగడంతో పెన్ను చేత పట్టడానికి సమయం దొరకలేదు. ఏ మాత్రం వీలుకుదిరినా  రచనపైన దృష్టి పెట్టేవారు.

Also read: భారత్, రష్యాల చారిత్రక సంబంధాలు

జైలు జీవితం గడిపిన దేశభక్తుడు

స్వాతంత్ర్య సమరంలో పాల్గొని జైలు జీవితం గడిపిన దేశభక్తుడు. తన దేశభక్తిని చాటి చెప్పడానికి గీత రచన,స్వర రచన, గానం ఎంచుకున్నారు. జీవిత సంధ్యవేళలో ‘భగవద్గీత’ పాడినట్లుగానే,’ ఇది సంధ్యా సమయం..’ అంటూ పాడిన గీతం హృదయాలను కలచి వేయకమానదు. సంగీతం కేవలం జీవిక కోసం ఎంచుకున్న మార్గం కాదు. జీవుని వేదన నుంచి పుట్టిన భావం. ‘తా చేసిన తండ్రి యాజ్ఞయును, జీవునివేదన రెండు ఏకమై’ అని ‘కవి సమ్రాట్’ విశ్వనాథ సత్యనారాయణ తన గురించి చెప్పుకున్న మాటలు ఘంటసాలకు కూడా అక్షరాలా సరిపోతాయి. కుమారుడు గొప్ప సంగీత విద్వాంసుడు కావాలన్న తండ్రి ఆజ్ఞ, పుట్టుకతో వచ్చిన అభిలాష, కళాప్రాజ్ఞత ఏకమై ఘంటసాలను నడిపించాయి. చిత్రపరిశ్రమలో మకుటంలేని మహారాజుగా వెలిగినా, జీవితంలో ఎంత ఎదిగినా గతాన్ని మరచిపోని విజ్ఞత ఆయన సొత్తు.వారాలు చేసుకొని, మధూకరం ద్వారా విజయనగరంలో సంగీత విద్య నేర్చుకున్న ప్రతి క్షణాన్ని మనసులో నిలుపుకున్నారు. ‘ ఏ తల్లి తొలి ముద్ద వేసిందో.. ఆ ఆశీర్వాద ఫలమే ఈ వైభవం’.. అని జీవితాంతం చెప్పుకున్న కృతజ్ఞతాశీలం ఆయన సొమ్ము. తండ్రి సూర్యనారాయణ, మేనమామ ర్యాలి పిచ్చయ్య, విజయనగరంలో శిక్షణ ఇచ్చి, ప్రియాతి ప్రియ శిష్యుడుగా చూసుకున్న పట్రాయని సీతారామశాస్త్రి ముగ్గురూ ఘంటసాలకు మార్గదర్శనం చేసి నడిపించిన గురువులు. రసమయంగా, భావ బంధురంగా గానం చేయడంలో ఘంటసాలకు మించిన గాయకులే లేరు. ఆ గాత్రం దివ్యం. పాత్రోచిత గాత్ర పోషణం అనన్య సామాన్యం. పద్యగానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన విషయం చరిత్ర విదితం. పద్య నాటకాలలో పాడిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఘంటసాల పాడే విధానమే కాదు, ఆ గొంతును అనుకరించే వాళ్లు తెలుగునాట కోకొల్లలుగా ఉంటారు. ఆ అనుకరణ నుంచి బయటపడడం అసాధ్యం. ఘంటసాల చూపించిన ముఖ్యమైన ప్రభావాలలో ఇదొకటి. సంగీత దర్శకుడుగా ఘంటసాల గురించి చెప్పాలంటే  ఉద్ గ్రంథమే అవుతుంది.

Also read: నిష్క్రమించిన నిలువెత్తు తెలుగుదనం

ఒక్క లవకుశ చాలు

ఒక్క ‘లవకుశ’ సినిమా చాలు ఆ ప్రతిభను దర్శించడానికి. అందులోని పద్యాలు, జానపదాలు, హరికథాగానం… ఒకటేమిటి? ఎన్నింటినో ఉదాహరించవచ్చు. విజయావారి సినిమాలు ఆ ప్రజ్ఞకు నిలువుటద్దాలు. ‘రహస్యం’ సినిమాలో ‘గిరిజా కల్యాణం – యక్షగానం’ ఘంటసాల తరంగ గాన అనుభవానికి ప్రతీకగా నిలుస్తుంది. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి కవిత్వం పండిత పామరలోకానికి చేరడంలో ఘంటసాల పాత్రను విస్మరించజాలం. జీవిత చరమదశలో ‘భగవద్గీత’ పాడడం దైవసంకల్పంగానే ఘంటసాల భావించారు. ఆ భగవంతుని గీత సామాన్యుడికి సైతం దరిచేరడం వెనుక ఘంటసాల మహిమే దాగివుంది. నిన్న మొన్నటి వరకూ తెలుగునాట ఇంటింటా వినిపించే గానం ఘంటసాలదే. ‘పాడుతా తీయగా’ వంటి కార్యక్రమాల వల్ల ఈ తరం చిన్నారులూ ఘంటసాలకు దగ్గరవుతున్నారు. ఘంటసాలను తెలుగువారు ఎన్నటికీ మరువలేరు. వానలో తడవని వారు లేనట్లే ఘంటసాల గానామృతంలో మునుగనివారు తెలుగునాట ఉండరు. తెలుగు సినిమా పాటకు శాస్త్రీయ గౌరవం అందించిన ఘనత ఆయనదే. శత వసంతమే కాదు, ఎన్ని వసంతాలైనా ఆ దివ్యగానం వినిపిస్తూనే ఉంటుంది. గంధర్వులకు,పరమ భాగవతోత్తములకు ప్రతిరూపమే మన ఘంటసాల. ఆ గానం అమరం, అద్భుతం.

Also read: రోశయ్య జీవితం ఫలప్రదం, జయప్రదం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles