పేదరికం
కష్టపడడాన్ని ఇష్టపడనివాళ్ళ చుట్టం
ఏ పనిలోనూ నేర్పు సంపాదించలేని వారి ప్రాణమిత్రుడు
ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వేసినా
గరీబీ హటావో అంటూ కేకలు వేసినా
ఉలకదు, పలకదు, ఎక్కడి గొంగళి అక్కడే.
పరిశ్రమలే ఉపాధి మార్గాలంటారు
ఆటోమేషన్, కంప్యూటరైజేషన్లతో
పెట్రోలు పట్టడం, ఇడ్లీలు అమ్మడం,
దోసెలు వేసి కూర్చున్న చోటికి తెచ్చిపెట్టే
ఉద్యోగాలు కూడా రోబో మిషన్లే చేసేస్తున్నాయి
సృజనాత్మక ఉద్యోగాలే మనుషులకు మిగిలాయి.
ఆర్థిక సంస్కరణలతో ఉత్పత్తి పెరుగుతున్నది
తలసరి ఆదాయం పెరుగుతున్నది
నిత్యావసర వస్తువుల ధరలు, పన్నులు
అంతకు మించి పెరుగుతున్నాయి.
శాస్త్ర సాంకేతిక ప్రగతి ఫలితాలు
రాజకీయ నాయకుల కమిషన్లలో
వ్యాపారుల లాభాల్లో ఉండిపోతున్నాయి.
పన్నులు కట్టని నల్ల దొరలు
పన్నులు కట్టిన ప్రజల డబ్బుతో
ఉచిత పధకాల పేరున
ఓట్లు సంపాదించే నాయకులు
వీలైననంత దోచే వ్యాపారులు, కూలీలు
జనం మీద జీవించే ప్యారసైట్లు.
బడాబాబుల నేరాలు విచారించే కోర్టులు
ఇంకా ఒళ్ళు విరుచుకుంటున్నాయి
నేరస్థుడి జీవిత కాలం పూర్తయ్యేలోగా
శిక్ష వేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.
సగటు జీవి ఆదాయం పెరిగే మార్గం లేక
అప్పులు మాత్రం పెరిగి
ఆత్మహత్యలకు పరుగెడుతున్నాడు.
అయినా ఆశ చావని మద్యతరగతి వాళ్ళం
ఈసురో మనీ బతుకులు ఈడుస్తున్నాం
మంచికాలం ముందుందని మురుస్తున్నాం
పేదరికాన్ని వదలి పేదరాశి పెద్దమ్మ
పక్కింట్లో మకాం పెట్టే కలగంటున్నాం.
Also read: “హంతకులు”
Also read: నా మాట
Also read: ‘‘అంతా మన మంచికేనా?’’
Also read: మహర్షి
Also read: “మహిళ”