భగవద్గీత – 40
మన ఇంట్లోని ఏ వస్తువును చూపించి అయినా ఇది ఎవరిది అని అడిగారు అనుకోండి. వెంటనే ఇది ‘‘నాది’’ లేదా ఫలానా వారికి సంబంధించినది అని సమాధానం వస్తుంది. అనగా ప్రశ్నిస్తే దాని స్వంతదారు ఎవరో తెలుస్తారు అన్నమాట.
ఒకరికి గుండె జబ్బు ఉన్నదనుకోండి. ఆపరేషను చెయ్యాలి…
అతను ఎదుటివారికి ఏమని చెపుతాడు ‘నా’గుండెకి ఆపరేషను చెయ్యాలట’ అని కదా చెపుతాడు?
Also read: నేటి రమణమహర్షి ఎవరు?
ఒకడు చేయి విరగ్గొట్టుకున్నాడు. ఆపరేషను చేశారు. అప్పుడు అతను ఏంచెపుతాడు? ‘నా’ చేతికి ఆపరేషనుచేసి రాడుబిగించారు’ అని చెపుతాడు.
ఇలా శరీరభాగాల్లో ఏది చూపించినా అది ‘‘నాది’’ అని చెపుతాడు. స్వంతదారు ఎవరు? ‘‘నేను’’!
ఈ ‘‘నేను’’ ఎవరని ప్రశ్నించుకొమ్మంటారు రమణులు!
అమ్మో, మాకు అంత శక్తిలేదు అంటారా? అయితే ఆయనతో అర్జునుడిలాగ స్నేహం చేయండి. మీకూ గీతోపదేశం జరుగుతుంది!
ఉహూ! వీలుకాదా?
ఆంజనేయుడిలాగ దాస్యం చేయండి.
Also read: అణుబాంబు రూపంలో మృత్యువు
వామ్మో అంత మావల్ల ఎక్కడ అవుతుంది అంటారా?
పోనీ రాధలాగ, మీరాబాయిలాగ ప్రేమించండి! మీ ఆత్మ గోపిక! పరమాత్మ పరమపురుషుడు! ఆయనతో రాసలీలలు సల్పండి.
ఆ మేము మగవాళ్ళమండీ అదెట్లా కుదురుతుంది అంటారా?
అలానా? అయితే మీరాబాయి ఒకటే మాట అన్నది: ‘‘ఆయన’’ తప్ప మగవాడెవడో చూపించమన్నది!
సరే ఇదీ వీలుకాదా? ఆయనతో వైరం పూనండి.
హిరణ్యాక్ష, హిరణ్యకశ్యప, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్త్రులలాగ వాడెక్కడున్నాడో వెతికి వాడి భరతం పట్టాలని ఆలోచించండి…
(అసలు మనగురించి మనకంటే మన శత్రువులే ఎక్కువ ఆలోచిస్తారు)
వామ్మో అన్ని గుండెలే అనుకుంటున్నారా?
Also read: రాముడు ఎందుకు దేముడు?
అణువు నుండి బ్రహ్మాండం దాకా అంతటా నిండి వున్నాడే, అన్నిరూపాలు ఆయనే కదా?
ఏదో ఒక రూపం మనసులో నిలుపుకోండి. ఉహూ, మనసు నిలవటంలేదండి.
సరే ఆయన రూపం కాకపోతే వేల పేర్లున్నవాడు కదా ఆయన! ఏదోఒక పేరు మననం చేసుకోండి. అదే మంత్రమవుతుంది.
సార్! చేతిలో జపమాల తిరుగుతుంటే మనసులో మధుబాల కనపడుతున్నదండీ అంటారా?
అయితే నీవు చేసే పని నీవు నూటికి నూరు పాళ్ళు శ్రద్ధగా చేయి. ఎందుకంటే నీ పనే నీకు ఆహారం సంపాదిస్తున్నది, అది లోపలి పరమాత్మకు ప్రతిరోజు నీవు అందించే నైవేద్యం!
శ్రద్ధలేదండీ.
ఎప్పడూ ఏదో ఒక ఆలోచన పనిచేస్తున్నంతసేపూ అని అంటారా? సరే. సరే. నీవెలాగ ఉన్నావో అలాగే ఉండు.
॥అధచిత్తం సమాధాతుం నశక్నోషి మయి స్థిరమ్…
అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ॥
॥అభ్యాసేప్యసమర్ధోసి మత్కర్మపరమో భవ
మదర్ధమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి॥
మనస్సును నాయందే నిలుపుటకు సమర్ధుడవు కానిచో అర్జునా, అభ్యాసయోగము ద్వారా నన్నుపొందుటకు ప్రయత్నింపుము. అదీ వీలుకానట్లయితే, అశక్తుడవయితే మత్పరాయణుడవై కర్మలను ఆచరింపుము. ఇలా కర్మలు చేయడానికి అశక్తుడవయితే సకల కర్మఫలాన్ని త్యజించి వేయుము. అనగా వదిలివేయుము.
Also read: భగవంతుడి సంకల్పం నుంచి సృష్టి