వ్యంగ్యరచన
‘‘మర్డర్ ఈజ్ ద ఫైనెస్ట్ ఆర్ట్ ఇన్ ద వరల్డ్’’ అని నమ్ముతారు కొందరు మహానుభావులు. విలియం ఫాక్ నర్ కూడా సమర్థించాడు.
దొంగతనాన్ని కూడా చోరకళ అన్నారు మన పూర్వీకులు. కానైతే ప్రతిగేమ్ కీ కొన్ని రూల్స్ ఉన్నట్టుగానే దొంగతనానిక్కూడా ఒక రూల్ ఉంది. సొత్తు ఒకరిదై ఉండాలి. ఆ సొత్తు ఆ వ్యక్తికి తెలవకుండా కాజెయ్యడం చోరీ అంటారు. దొరికితే దొంగల్లో చేరిపోయి జైలుపాలౌతారు. దొరక్కపోతే, ఆ దోచుకున్న సొమ్ముకి యజమానై, దొరబాబులా చలామణీ అయి తనకు తాను దొరనని రుజువు చేసుకోవడానికి దరిద్రులమీదా, దీనుల మీదా ఒక కన్నేసి ఉంచుతాడు.
గేం ఇలాగే కొనసాగుతుండాలి. లేకపోతే సినిమాలకీ, సాహిత్యానికీ సబ్జక్టు లేకుండా పోతుంది.
దేశంలో లా అండ్ ఆర్డర్ మెయిన్ టైన్ కావడమంటే మనుషులకి క్రియేటివిటీ లేకుండా పోవడమని అర్థం. లా అండ్ ఆర్డర్ మెయిటైనైతే పోలీసులకి పని లేకుండా పోతుంది. పైపెచ్చు, రాత్రింబగళ్ళూ కష్టపడి సంపాదించిన సంపద ఏమైపోతోందని కష్టజీవులకి సందేహం రావచ్చు. అప్పుడు వాళ్ళ కళ్ళు పచ్చచొక్కాలమీద పడొచ్చు. అలాంటప్పుడు పచ్చ చొక్కాలవాళ్ళూ, పసుపుచొక్కాలవాళ్ళూ, ఖద్దరు లాల్చీలవాళ్ళూ, కాషాయం వాళ్ళూ, ఆ మాటకొస్తే పచ్చగా ఉన్నవాళ్ళంతా జేబులు తడుముకొని గిల్టీగా ఫీలవుతారు. అందుచేత దొంగతనాలు జరిగినా, జరగకపోయినా, విప్లవకార్లు ఉన్నా, లేకపోయినా, దొంగతనం కేసులూ, దొపిడీ కేసులూ, కుట్ర కేసులూ పెట్టాల్సిందే. కాకపోతే ప్రభుత్వం ఉనికిలో లేకుండా పోతుంది. యుద్ధాలు లేకపోతే గ్లోబ్ లో అమెరికా అన్న దేశం చిత్రపటం కనిపించదు. అమెరికా ఉండాలంటే టెర్రరిస్టులున్నా లేకపోయినా వార్ ఆన్ టెర్రర్ ఉండాల్సిందే. అందుచేత ప్రభుత్వం మనగడలో ఉందనడానికి దొంగలూ, నేరస్తులూ ఉండాల్సిందే. దొంగతనం ఒక ఫాం ఆఫ్ ప్రొటెస్ట్. నీదీ నాదన్న ఆస్తిలేకపోతే డెవలప్ మెంట్ ఉండదు. అయినా నిరాస్తిపరులు, డబ్బూదస్కం దండిగా ఉన్నవాళ్ళ మీద కన్నెయ్యవచ్చు. తమకాస్తి లేకపోవడానికీ పెద్దవాళ్ళ డెవలప్ మెంటే కారణమనుకోవచ్చు. అలా ఆలోచించడం మరీ డేంజరెస్. అందుచేత పేదవాడు పేదరికంలో మగ్గడానికి కారణం మరో పేదవాడి దొంగతనాలూ, దోపిడీలూ, చైన్ స్నాచింగ్ లే కారణమనుకొని పేదవాడు కూడా పేదవాణ్ణి చూసి భయపడేలా చెయ్యాలి. అంచెలంచెలుగా యీ సొసైటీలో దనవంతుడు తన క్రింద పని చేసేవాళ్ళనీ, మధ్యతరగతివాడు తనకంటే తక్కువ వాళ్ళనీ, తక్కువవాళ్ళు తుక్కేరుకొనేవాళ్ళనీ చూసి అనుమానించి, అనుమానంతో భయపడితే తప్ప పోలీసోడెంత రాక్షసుడైనా ప్రభుత్వం ఎంత న్యూసెన్స్ గా తయారైనా చెయ్యగలిగేదేమీ ఉండదు. పోలీసుల అవసరమూ, ప్రభుత్వ అవసరమూ ఉంటాయి. ఒక రకమైన ఇనెవిటబుల్ ఈవిల్స్. దేవుళ్ళకే కాక దయ్యాలు కడా అవసరమే. దేవుళ్లూ, దెయ్యాలూ లేకపోతే మనం జీవితంలో రాజీపడలేం. మన దౌర్భాగ్యానికి కారణం ఒక చెడ్డవాడు, ఆ వెనక ఉన్న మంచివాడి నిస్సహాయత. అందుచేతే మంచివాడిమీద విశ్వాసంతో సంబంధం లేదు. తనకి మించిన ధర్మం లేదన్నారు పెద్దలు. ఇది రాజులకీ వర్తింస్తుందని సామాన్యజనం ఖర్మఫలం అనుభవించక తప్పదని గీతలో చెప్పాడు కృష్ణుడు. కనుక తమ గీత ఇంతేనని నిట్టూరుస్తూ మామూలు వాళ్ళు కాలం గడిపెయ్యాలి. అయినా కాలచక్రం తిరిగినట్లుగానే ప్రభుత్వం తన పని తను చేసుకొంటూపోకపోతే, మనుషులంతా మున్సిపల్ ఎద్దుల్లా తయారౌతారు. సకాలంలో కరెంటు బిల్లులు కట్టి, సకాలంలోమున్సిపల్ పన్నులు కట్టి, సకాలంలో చెయ్యాల్సిన పనులన్నీ చేస్తూపోతే మనిషికీ, గొడ్డుకీ తేడా లేకుండా పోతుంది. ఏదైనా మనుషులకి ప్రభుత్వం అలవాటుగా మారడం అంత మంచిది కాదు. అందుచేత పోలీసు వ్యవస్థ ప్రభుత్వమూ ఉందని చెప్పడానికైనా, ఎక్కడో ఒక దగ్గర లా అండ్ ఆర్డర్ బ్రేక్ కావాలి. కాపోయినా ప్రభుత్వమే తను పెట్టిన చట్టాల్ని బ్రేక్ చెయ్యాలి. అలా జరిగినప్పుడే లైఫ్ లో ఒక థ్రిల్ ఉంటుంది. ప్రభుత్వం కూడా కళాపోషకురాలౌతుంది.
దొంగతనాలూ, దోపిడీలూ జరిగినా, జరగకపోయినా సామాన్యులు కాళ్ళకింద నేల వాళ్ళది కాకుండా ఎలా పోయిందో వాళ్ళు గ్రహించకుండా ఉండాలంటే వాళ్ళలోనే కొందరు దొంగలుండాలి. వాళ్ళు తింటున్నారంటే, ఆ మాటకొస్తే అసలు బ్రతుకుతున్నారంటే దాని వెనక పెద్దల ఔదార్యమూ, పిన్నల అవినీతే కారణం. అందుచేత ‘‘దే డిజర్వ్ పనిష్ మెంట్.’’
Satires of Nandigram krishna rao are of high standard.They can be continued as regular feature
Satires of Nandigram Krishna Rao. are of high standard.