Tuesday, November 5, 2024

కశ్మీర్ పాకిస్తాన్ లో కలవాలని వాదించిన వేర్పాటువాది గిలానీ

92వ ఏట కన్నుమూత

తుదివరకూ పోరాటం

పదకొండేళ్ళ కిందటి మాట. బుధవారం శ్రీనగర్ లో కన్నుమూసిన సయ్యద్ అలీ షా గిలానీని కలుసుకున్నప్పటి ముచ్చట. 2010లో కశ్మీర్ లో అశాంతి రాజుకొని లోయంతా మంటలు చెలరేగాయి.  పొగలు దట్టంగా వ్యాపించాయి. ముక్కుపచ్చలారని యువకులు చేతులలో రాళ్ళు పట్టుకొని మరఫిరంగులకు ఎదురుగా నిలబడి నినాదాలు చేస్తూ నిరసన వెలిబుచ్చిన రోజులు. సాయుధబలగాల కాల్పులలో వందమందికిపైగా పిల్లలు మరణించిన రోజులు.

అప్పుడు నేను హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ గా ఉన్నాను. కశ్మీర్ లో అకస్మాత్తుగా అశాంతి పెరిగిపోవడానికి కారణాలు ఏమిటో స్వయంగా వెళ్ళి కనుక్కోవాలని ఆరాటపడ్డాను. జమీల్ –ఉర్-రహ్మాన్ అని ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ హోదాలో హెచ్ఎంటీవీలో పని చేస్తున్న సహచరుడు ఉన్నాడు. అంతకు మునుపు ఈటీవీలో ఉండగా అతడు కశ్మీర్ వెళ్ళివచ్చాడు. పరిచయాలు ఉన్నాయి. అతడిని వెంటబెట్టుకొని, ఫొటోగ్రాఫర్ గిరిని తీసుకొని దిల్లీ మీదుగా శ్రీనగర్ వెళ్ళాను. శ్రీనగర్ లో దళ్ లేక్ లో టూరిజం డిపార్ట్ మెంట్ వారి హోటల్ లో రెండువారాల బస. చాలామంది హురియత్ నాయకులను ఇంటర్వ్యూ చేశాం. కశ్మీర్ యూనివర్శిటీకి వెళ్ళి వైస్ చాన్సలర్ నీ, ప్రొఫెసర్లనీ కలుసుకున్నాం. బాలగోపాల్ గురించి మాట్లాడుకున్నాం. అక్కడ బాలగోపాల్, ఈటీవీ ఉర్దూ బులెటిన్ అంటే చాలా గౌరవం. న్యాయంగా మాట్లాడే బాలగోపాల్ అన్నా ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు చూపించే బులెటిన్ ఈటీవీ బులెటిన్ అంటే అక్కడి ప్రజలకు ఎనలేని ఆదరణ.

గిలానీతో ఇంటర్వ్యూ

శ్రీనగర్ లో యూనివర్శిటీ సహకారంతో కశ్మీర్ దశ-దిశ అనే కార్యక్రమాన్ని నిర్వహించాం. అప్పుడు శ్రీనగర్ లో ‘ద హిందూ’ కరెస్పాండెంట్ సుజాత్ బుఖారీ సహాయంతో చాలామంది జర్నలిస్టులనూ, మేధావులనూ, ప్రొఫెసర్లను సమీకరించాం. ఆ తర్వాత బుఖారీ సొంతంగా పత్రిక పెట్టుకున్నాడు. ఉగ్రవాదుల కాల్పుల్లో బలైపోయాడు. చాలా స్నేహంగా ఉండేవాడు. సామరస్యవాది. కశ్మీర్ లో అశాంతిని దూరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏమేమి చేయాలో, కశ్మీర్ లో రాజకీయ నాయకులు ఏమేమి చేయాలో స్పష్టమైన అవగాహన ఉన్న పాత్రికేయుడు.

హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫారూఖ్ ని ఆయన నివాసంలో ఇంటర్వ్యూ చేశాం. చివరికి గిలానీని ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నాం. అప్పుడు ఆయన గృహనిర్బంధంలో ఉన్నాడు. కశ్మీర్ పోలీసు వ్యవస్థలో ఉన్నతాధికారుల అనుమతి కోరాం. రాలేదు. తెగించి ముగ్గురం సయ్యద్ అలీ షా గిలానీ ఇంటికి రహస్యంగా చీకటి మాటున వెళ్ళాం.మమ్మల్ని గిలానీ సాదరంగా ఆహ్వానించాడు. జమీల్-ఉర్-రహ్మన్ సాహెబ్  అంటూ పూర్తిపేరు నోటినిండా ఉచ్ఛరిస్తూ జమీల్ ని ఆలింగనం చేసుకున్నాడు. మాకు సలామ్ తో సరిపెట్టాడు. ఎంతో ప్రేమగా, మృదువుగా, ప్రశాంతంగా మాట్లాడాడు. మీడియా ప్రకటనలలో కనిపించే ఆవేశం కానీ, ఆగ్రహం కానీ ఆయన మొహంలో కనిపించలేదు. వాజపేయి, పివి నరసింహారావు, ఇందిరాగాంధీ, నెహ్రూల గురించి గౌరవంగా మాట్లాడారు. మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి సంతోషంగా అంగీకరించాడు.

కరడుకట్టిన వేర్పాటువాది

కరుడుగట్టిన మితవాదిగా, పాకిస్తాన్ కు అనుకూలమైన వేర్పాటువాదిగా గిలానీకి పేరుంది. కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పరిష్కరించాలని అతని కోరిక. పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ ముషారఫ్ భారత ప్రధాని వాజపేయితో చర్చలు జరిపిన సందర్భంలో కవ్మీర్ సమస్యకు నాలుగు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించినప్పుడు దానిని వ్యతిరేకించిన ఒకే ఒక కశ్మీరీ నాయకుగు గిలానీ. కశ్మీర్ పాకిస్తాన్ లో విలీనమైనా పర్వాలేదు కానీ ఇండియాలో మాత్రం ఉండకూడదని వాదించే కరడుకట్టిన వేర్పాటువాది. ఆయన జమ్మూ-కశ్మీర్ శాసనసభకు సోపోర్ నియోజకవర్గం నుంచి 1972లో ఎన్నికైనారు. తర్వాత మరో సారి ఎన్నికైనారు. 1987లో ఎన్నికల అక్రమాలు పెద్ద ఎత్తున సాగినప్పటికీ ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (ఎంయూఎఫ్ – రాజకీయ, సామాజిక, మత సంస్థల కూటమి) తరఫున గెలిచిన నలుగురు అభ్యర్థులలో గిలానీ ఒకరు.

29 సెప్టెంబర్ 1929లో ఊలర్ కాలువ వడ్డున జుర్మాంజ్ గ్రామంలో జన్మించిన గిలానీ కశ్మీర్ ప్రత్యేకవాదానికి ప్రతీకగా ఎదిగారు. మౌలానా మహమ్మద్ సయీద్ దగ్గర విద్యనభ్యసించి రాజకీయాలలో తనదంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కొనసాగించారు. జీవిత చరమాంకం వరకూ వేర్పాటువాదానికే కట్టుబడి ఉన్నాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ సైనికాధికారులూ, ఇంటెలిజెన్స్ అధికారులూ గిలానీని పక్కన పెట్టారు. పాకిస్తాన్ కీ, గిలానీకీ మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ గిలానీ కుమారుడు నసీం గిలానీ పాకిస్తాన్ లోనే నివసిస్తున్నాడు. గిలానీ అనారోగ్య సమస్యలతో  బాధపడుతున్నారు. అందుకని హురియత్ నుంచీ, రాజకీయాల నుంచీ విరమించుకున్నాడు. 92 వ  సంవత్సరంలో అడుగుపెట్టడానికి ఇరవై రోజుల ముందుగా బుధవారంనాడు (01 సెప్టెబర్ 2021)న మరణించాడు. ఆయనకు స్వర్గలోకం ప్రాప్తించాలని ఆకాంక్షిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంతాప సందేశంలో పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం 370వ అధికరణని రద్దు చేసి, జమ్మూ-కశ్మీర్ కు రాష్ట్రప్రతిపత్తిని కూడా రద్దు చేసి, జమ్మూ-కశ్మీర్ నూ, లాద్దాఖ్ నూ కేంద్ర పాలిత ప్రాతాలుగా ప్రకటించిన విషయం విదితమే. ఆదాయంపన్ను శాఖ అదికారులు దాడులు ప్రారంభించి, హురియత్ కాన్ఫరెన్స్ కు అందుతున్న నిధుల మూలాలపైన దర్యాప్తు ప్రారంభించిన మీదట హురియత్ రాజకీయాలు గందరగోళంలో పడిపోయాయి.

పాకిస్తాన్ పురస్కారం

కశ్మీర్ విమోచనకు సాయుధపోరాటమే శరణ్యమని వాదించే జిలానీ చాలా కాలం టీచర్ గా పని చేశారు. 1993లో హురియత్ కాన్ఫరెన్స్ ని స్థాపించినప్పుడు మొత్తం ఏడుగురు కార్యవర్గ సభ్యులలో గిలానీ ఒకరు. సాయుధపోరాట పంథా కూడదని అనుకున్న జమాయితీ ఇస్లామీ పార్టీకి గిలానీ 2004లో దూరమైనాడు. తహ్రీక్ –ఇ- హురియత్ అనే పేరుతో సొంత పార్టీ పెట్టుకున్నాడు. చాలా కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నాడు. గత రెండేళ్ళుగా మౌనంగానే  ఉంటున్నారు.  30 జూన్ 2020న మాత్రం తాను స్థాపించిన పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించాడు. మొహమ్మద్ అష్రాఫ్ సెహ్రాయ్ చేతిలో పగ్గాలు పెట్టారు. సెహ్రాయ్ ఇటీవల జైలులో మరణించాడు. నిరుడు పాకిస్తాన్ ప్రభుత్వం గిలానీకి అత్యున్నత పౌరపురస్కారం నిషాన్ –ఇ- పాకిస్తాన్ ను ప్రకటించింది.  

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles