Tuesday, January 21, 2025

“మధ్యప్రాచ్యం”లో అంతూ-దరీ లేకుండా పోతున్న ప్రజల అనంతమైన అవస్థలు…!!!

గాజాలో – పాలస్తీనాలో – ఇజ్రాయేల్ సరిహద్దుల్లో-  అలవాటైన, ఆలవాలమైపోతున్న, అంతులేని అలజడి…!

ప్రపంచం మొత్తాన్నీ, మెజారిటీగా సర్వం-సహా ఏకపక్షంగా ఏలుతూ, సమస్త భూమండలాన్ని ఎదురులేకుండా శాసిస్తున్న మూడు ప్రముఖ మతాలకూ, పుట్టినిల్లయిన పరమపవిత్రమైన ప్రాంతానికి పట్టిన పరమ దరిద్రం…!… పట్టువీడని దురదృష్టం…!

అన్ని మతాలూ సమానమే అని, మనుషులు అందరూ ఒక్కటే అని, సాటి మతాల్ని, మనుషుల్ని ప్రేమించమని, కనీసం సాటి మనిషినీ, వారి అభిమతాన్ని అయినా గౌరవించమని చెప్పాల్సిన “మత” పెద్దల బాధ్యతారాహిత్యం వల్ల, కొందరు స్వార్ధపరుల –  మతోన్మాదుల తప్పుడు ప్రవచనాలతో, దుష్ప్రచారాలతో ఉన్మాదుల్లా మారి, నిరంతర హింసతో, మూడు ప్రాచీన మతాలకూ పరమపవిత్రమైన ఒక ముఖ్యమైన కేంద్ర ప్రాంతాన్ని, ఒక ఆధ్యాత్మిక జన్మస్థానాన్ని, ఒక వికృత రావణకాష్టంలా మార్చేసిన దుస్థితి…!

అంతటా అర్థంలేని, అర్థంకాని, అమాయక ప్రజల ఖర్మల్నీ, జీవితాల్నీ అనునిత్యం కాల్చే ఒక నిరర్ధక – నిరంతర యుధ్ధం…!

నిత్యం కుప్పకూలుతున్న నివాసాలు… కొంపలూ… గూళ్ళు… పాఠశాలలు… భవనాలు… ఆవాసాలు… ఆసుపత్రులు…!

మిగిలినవి కేవలం మొండి గోడలు… అంతటా అంతులేని శిథిలాలు…!… వ్యర్ధాలు… అంతటా మిగిలినవి కేవలం అనర్థాలు…!

ఇరుపక్షాల నిరంతర భీకరమైన బాంబు దాడుల మధ్య మరింతగా భయపెడుతున్న భయంకరమైన నిశ్శబ్ధం…! పొంచి ఉన్న మూడో ప్రపంచ మహా భయానక మారణ యుద్ధం…!

మనుషుల ప్రాణాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా రోగుల్ని, సాటి ప్రజల్ని, చిన్న పిల్లల్ని, మహిళలను,పండు ముదుసలిలను, స్కూళ్లనూ, హాస్పిటళ్ళనూ కూడా కేవలం కవచాలుగా వాడుకొంటూ తమ అస్తిత్వం కోసం, స్వార్థం కోసం అనైతిక యుద్ధం చేస్తున్న నీచ-నికృష్ట మత దురహంకార ఉన్మాదులు…! దుష్ట దుర్మార్గులు…!

ఎక్కడకు వెళ్ళినా, ఎక్కడైనా, ఎటువైపు ఎటుగా ఎలా వెళ్ళినా, ఎందెందు వెతికి చూసినా, అన్నింటా బాంబులూ – సైరన్లు – లాండ్-మైన్లు – తీవ్రవాదులు – సైనికులు – బాంబు పేలుళ్లు… చావులు … పీనుగులు… పిశాచాలే…!

ఈ శవాలమీద కూడా చిల్లర ఏరుకునే కొన్ని ప్రపంచ దేశాలు…! పక్క దేశాలు…! అధిపత్యం కోసం కొట్టుకునిచచ్చే అరబ్బు దేశాల ఆశలు, ఆరాటాలు…! అన్నింటా తమ స్వార్థం, రాజకీయాలు, ఆర్థిక, వ్యాపార, వాణిజ్య అవసరాలు మాత్రమే చూసుకొనే పనికిమాలిన “పెద్దన్న”లు…! కొన్ని అగ్రరాజ్యాలు…! వారందరి అడుగులకూ, అడుగడుగునా మడుగులొత్తుతూ ఎందుకూ పనికిరాకుండా పోయిన ఒక పనికిమాలిన “అనైక్యరాజ్యసమితి”…!

రాబందులకన్నా చాలా ఘోరంగా మనుషులు బతికి వుండగానే, పీనుగుల్లా పీక్కు తినే నీచ-నికృష్ట  రాబందులు వీళ్ళు…!… సర్వ భ్రష్టులు…!

ఎటు చూసినా గత్తర – గత్తర, గందరగోళం..!. గమ్యం – గమనం లేని ఆందోళనలూ… అభధ్రతలూ… అన్యాయాలు…!

అన్నింటా ప్రజల దురవస్థలు…! అన్ని వర్గాలూ పడుతున్న అష్టకష్టాలు…! కుప్పకూలతున్న వ్యవస్తలు…!

ఎందుకో తెలియదు…! ఎలానో తెలియదు…! ఎవరికోసమో తెలియదు…!… ఎవరు, ఎందుకు ఈ మారణహోమాన్ని ఎక్కడ, ఎలా మొదలు పెట్టారో అసలే తెలియదు…!

ఎండమావుల్లా మారిన శాంతి – సుఖ – సంతోషాల కోసం ఈ ఎడారిప్రాంతంలోని ప్రజలు తరతరాలుగా ఎడతెగని ఎదురుచూపులు…?

అనంతమౌతున్న అశాంతి… ప్రజ్వరిల్లుతున్న అన్యాయం… అధర్మం… అవస్థలు… అంతులేని హింస… అల్లకల్లోలం…!

ఈ కాలుతున్న మనుషులతోనూ, కాలే శవాలతోనూ, ఎగదోసిన మత చిచ్చు మంటలతోనూ కూడా “చలి”కాసుకుంటున్న కొందరు స్వార్థపరులు… కొన్ని పాశ్చాత్య దేశాలు – మరికొన్ని పొరుగు దేశాలు…! అరబ్బుదేశాలు… అగ్రరాజ్యాలు…!

గుక్కెడు నీటి చుక్కలకు, గుప్పెడు మెతుకులకు కూడా అంతుచిక్కని ఉరుకులు… పరుగులు… ప్రమాదాలు… మరణాలు…!

తిండి కోసం కూడా తప్పని తొక్కిసలాటలు…! కడుపు నింపుకోవడాని బయటికెళ్తే కాల్పులు…! అనుక్షణం జీవనమే ఒక నరకం…!

అందరికీ అంతులేని గాయాలు…! కనిపించేవి కొన్ని…! కనిపించని కన్నీటి గాథలు… ఎన్నో… మరెన్నో… ఎన్నెన్నో…!

పెరిగిపోతున్న, పేరుకుపోతున్న, లెక్కలేనన్ని శవాలు…! పీనుగుల గుట్టలు…! పెరుగుతున్న సమాధులు…! ఖాళీ జాగా కూడా కరువౌతున్న స్మశానాలు…!

మతం మత్తులో పూర్తిగా మునిగిపోయి, మానవత్వం కూడా మరిచిపోతున్న కొన్ని మానవ మృగాలు…! పైశాచిక ఆచారాలు, చంపించే, హింసను పెంచి – ప్రేరేపించే పనికిమాలిన  సిద్ధాంతాలు…! ఆచరించమని అజ్ఞాపించే వికృతమైన వింత మత పెద్దలు…!

పసిపిల్లలనే జాలి, వృద్ధులనే కరుణ, మహిళలనే కనీస దయ కూడా  లేకుండా ఇరుపక్షాలూ మానవత్వాన్నే మొత్తంగా మరిచిపోతున్న వేళ…!… మానవజాతినే ఈ రోజు భ్రష్టు పట్టిస్తున్న వేళ…!

అంతటా అంతులేని అలజడి…!

అనంతమైన అస్థిరత…!

అవధులు దాటిన అనిస్థితి…!

అంతం లేని అరాచకం…!

అన్ని వర్గాల ప్రజల అంతులేని ఆక్రోశం…!

ఏడ్చీ – ఏడ్చీ – ఎండిపోయి – ఎండబారిపోయి, ఇంకిపోతున్న కన్నీరు…!

సర్వం పోగొట్టుకుని, సున్నితత్వం కోల్పోయి, బండబారుతున్న హృదయాలు…!

అన్ని మతాల ప్రజల అలవికాని ఆక్రందనలు…!

సొంతదేశం నుండి ఎందుకు పక్క దేశాలకు, పరాయి దేశాలకు పారిపోవాలనుకుంటున్నారు…?

జన్మభూమితోనే ఎందుకు ఋణానుబంధం కూడా తెంచుకోవాలనుకుంటున్నారు…?

అతివాదుల నుండి…!

అశాంతి నుండి…!

మతమౌఢ్యం నుండి…!

మతపెద్దల మూర్ఖత్వం నుండి…!

మానవత్వం మరచిపోతున్న మతాల నుండి…!

మతఛాందసవాదం నుండి…!

హింస నుండి…!

తీవ్రవాదం నుండి…!

కరడుగట్టిన క్రూరుల నుండి…!

మానవత్వం మరిచిపోతున్న మతాల నుండి…! కొన్ని క్రూరమృగాల నుండి…!

దూరంగా… చాలా దూరంగా…!

స్వేచ్ఛ కోసం…!

స్వాతంత్రం కోసం…!

శాంతి కోసం…!

కరుణ కోసం…!

కారుణ్యం కోసం…!

తమ పిల్లల సుఖ-సంతోషాల కోసం…!

ఒక రేపటి కోసం…!

ఒక కొత్త ఉదయం కోసం…!

ఒక మంచి జీవితం కోసం…!

ఒక చక్కని భవిత కోసం…!

ప్రాణాల్ని కూడా లెక్కచేయకుండా పారిపోతున్నారు…!

మతం మత్తు వదిలించుకొని, కేవలం కడుపు నింపుకోడానికి ఒక ముద్ద కోసం మాతృభూమిని సైతం వదిలి వెళ్లి పోతున్నారు…!

కన్నబిడ్డల కడుపు నింపడానికి, కాందిశీకుల కోటాలో, కనీసం దొరికే పూటకొక ముద్ద అయినా చాలని సరికొత్త జీవితం కోసం కట్టుబట్టలతో వలస పోతున్నారు…!

ఈ అధర్మ యుధ్ధంలో విజితలెవ్వరు…?

విజేతలు ఎవ్వరు…?

పరాజితులు ఎవ్వరు…?

ఈ రుధిర మారణహోమంలో, చివరికి అందరూ పరాజితులే…!!! ముద్దాయిలే…!!!… దోషులే….!!! నేరస్తులే…!!!

తిలా పాపం తలా పిడికెడు…!!!

“రవి”ప్రకాష్ అశోకవర్మ పెన్మెత్స

Ravi Prakash
Ravi Prakash
"రవి"ప్రకాష్ "అశోకవర్మ" పెన్మెత్స, అసోసియేట్ వైస్-ప్రెసిడెంట్, బ్రాండింగ్, మీడియా & కార్పొరేట్ కమ్యూనికేషన్స్ యశోద హాస్పిటల్స్ గ్రూప్ - హైదరాబాద్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles