Wednesday, January 22, 2025

ఎన్నికల భారంలో బండ ధర మరెంతో భారం

ఎన్నికల పండుగనడుస్తున్నది. బండ గ్యాస్ అనే నిత్యావసరం ఇప్పుడు మరింత భారం అవుతున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు తరువాత వస్తాయి. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం కనీసం పోటీ చేయడానికి కూడా సాహసం చేయలేదు. భారతీయ రాష్ట్ర సమితి(బీ ఆర్ ఎస్) తో కాంగ్రెస్ పోటా పోటీ చేస్తున్నది. తెరాసను తెలంగాణ సాధించిన పార్టీ అయిన తరువాత వ్యూహాత్మకంగా ఇప్పుడు బిఎస్ ఆర్ అని పేరు మార్చారు. తానే గెలుస్తానే ఆత్మనిర్భరతతో ఉంది. మరో వైపు కాంగ్రెస్ మళ్లీ పాగా వేసిందా అన్నట్టు విపరీతమైన ప్రచారంతో విజృంభించారు. ఒకే రెండు పార్టీలు మాత్రమే ఉన్నట్టు పోటీ జరుగుతున్నది, బి ఎస్ ఆర్ ను ఢీ కడుతున్నది కాంగ్రెస్. మరీ బండ గ్యాస్ సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారో ఎన్నికల్లో పోటీ చేసిన అనంతరం నిర్ణయిస్తారా? ఒక పార్టీ బండ ధర రేటు తగ్గిస్తామనేది ఒక హామీ ఇస్తున్నప్పడికీ అమలు చేయగలరా చెప్పలేము. ప్రస్తుతం తెలంగాణలో ఎవరు ఎవరిపై పోరాడుతున్నారో ఎవరికీ తెలియదు.  ఒక పార్టీ మరికొందరు ఇతర పార్టీలు స్నేహితులుగా తయారయ్యారు. చీల్చుకోవడం స్వయంగా ఓడించడానికి సిధ్దం చేయడం ఈ నాటి రాజకీయాలుగా మారిపోతున్నారు. చీల్చడమే రాజకీయం అని తెలుసనుకుంటాం. వాటితో పాటు మరో రాజకీయం ఏమంటే ఫిరాయింపు వ్యూహాలుగా మారాయి. కొందరు కొన్ని పార్టీలై మేము ‘‘తన ఓట్లను ధారాదత్తం చేయలే’’దని, ప్రచారం చేయలేదని నేతలు ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. మన చీల్చడం, ఫిరాయించడం అవకాశవాదాలు ఆకాశానికి ఎదగడం, మన సిద్ధాంతాలు (ఉంటే గింటే) పాతాళానికి పడిపోవడం మామూలే కదా బ్రదర్.

Also read: నోటాకు ఓటు వెయ్యడం మన నోరు మనం నోక్కుకోవడమే!

ఓటర్లలో జీహుజార్

రాజకీయాల్లో విలువలు వలువలు అని కొందరు చేసే గోలగోల పక్కకు బెట్టి అందరూ ఓటుకు నోటు విలువ పెంచారని మనమంతా గర్వించాలి.అసలు పార్టీలు, ఫిరాయింపుల నాయకులకు ఓటర్లను జీహుజూర్ అని  చేస్తారా? జీహుజూర్ అంటూ డబ్బుకు అమ్ముకుంటున్నారు. అంతేకాదు ఈసారి ఓటర్లు చైతన్యవంతులై సమానత్వం కోసం పోరాడారు. మన భారత రాజ్యాంగం ఆర్టికిల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే. అందరికీ సమానావకాశాలు ఉండాలనే సూత్రం బాగా వంటబట్టింది. కొందరికి ఆరువేలరూపాయల కవర్లు ఇచ్చి మమ్మల్ని కవర్ చేయకుండా వెళ్లిపోతారా అని రోడ్లెక్కి ధర్నా చేసారు మరి. ఆ ఓటర్లను నిందించడం సరికాదు. ఎందుకంటే పక్క ఇంట్లో ఓటుకు ఆరువేల చొప్పున నలుగురికి 24 వేలిచ్చి, తమ ఇంట్లో ఓటర్లను నోట్లతో గుర్తించకపోవడం ఎంత ఘోరమైన అన్యాయం? దాన్ని నిలదీసి అడగడమే కరెక్టు. అడక్కపోవడం రాజ్యాంగ వ్యతిరేకం.

ఆ పార్టీ ఎందుకాపని చేసినట్టు? మనం డబ్బు ఒక్కటే చూడకూడదు. మన డిఎన్ ఎలో జితించుకు పోయిన కులాన్ని కూడా పరిగణించాలి. ఫలానా కులంవాడికి ఎంతడబ్బిచ్చినా సరే ఓటు వేయడు అని నమ్మకంగా తెలిసిన తరువాత ఏ వ్యాపారి కూడా డబ్బు ఇవ్వడు. నగలమ్ముకునే వ్యాపారి చెప్పినట్టు డబ్బు ఏమైనా చెట్లకు కాస్తుందా. ఎంత అక్రమంగా సంపాదించినా డబ్బు డబ్బే కదా. అయితే పంచిన డబ్బుకన్న, ఏరులై పారిన సారా కన్న, కులం మత్తు గొప్ప. సారాగంజాయిలను మించిన మత్తు మతం కలిగిస్తుంది కదా! కనుక ఓటుకు నోటు గురించి ప్రజాస్వామ్యవాదులు అంతగా గాభరాపడడం దండగ. ‘డబ్బు తీసుకుని కూడా ఓట్లేయలేదు’ అనడం, ‘వాళ్లిచ్చే డబ్బు తీసుకోండి కాని మాకే ఓటేయండి’ అనడం చాలా దారుణం. మన ప్రజలు లంచాలు ఇవ్వలేరు కనుక ఇవ్వడం లేదు. కాని తీసుకునే అవకాశం రాక రాక వస్తే ఎందుకు తీసుకోగూడదనే తర్కం వారిది. డబ్బు తీసుకుని ద్రోహం చేస్తారని కూడా అనలేము.

ఈ ఎన్నికల క్రీడలో 119 ఓవర్లలో పరుగుచేయడం ఆ బిఆర్ఎస్, కాంగ్రెస్ జట్లకు సాధ్యమా. ఎన్నిక అభ్యర్థుల కాట్లాట కాదు. ప్రభుత్వాల కొట్లాట. అటు కేంద్ర ప్రభుత్వం, మంత్రులు, ఎన్నికల కమిషన్, ఆల్ పవర్ ఫుల్ వారు, బండ ధర పెంచినా పట్టించుకోని ప్రజలు, తనచేతిలో అంతకు ముందు చావుదెబ్బ తిన్న పార్టీలో చేరి ఆ పార్టీకి మనుగడ ఇచ్చేంత మంచితనం కలిగి, చాలా పలుకుబడిఉన్న ఫిరాయింపు నేతలు అభ్యర్థులై పోరాడుతున్నారు. కొందరికి అగ్రకులాలు, కుటుంబ సభ్యులు రెడ్లు కనుక వారి మద్దతు, బిసి కులం వెన్నుదన్ను, అభ్యర్థి వాటికన్న గొప్పగా డబ్బు, దాన్ని మించిన మతం మత్తు, నిజంగా ఓటర్లకు అభ్యర్థులు ప్రత్యర్థులు కాదు. ఈ ప్రజలు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు, డబ్బు, మహోన్నతమైన వ్యూహకర్తలు, మంత్రులు, ఎంఎల్యేలు, డబ్బు ఇవ్వకున్నా పనిచేసిన కార్యకర్తలు, డబ్బు తీసుకుని నీతియుతంగా ఓటేయబోయే ఓటర్లు పోరాడుతున్నారు. పాపం ఈ మత్త మత్తు గజాల తొక్కిసలాటలో అభ్యర్థులు, ఓటర్లు నలిగిపోతుంటారు.

Also read: ఎన్నికల సమయంలో మీడియా చేయవలసిందేమిటి?

ఈ మహాసంకుల కులసమరంలో సామాన్యుడి మీద పడిన గ్యాస్ బండధర గురించి ఎవడికి పట్టింది. హమ్మయ్య పెట్రోల్ ధర తగ్గించారని అనుకుంటే డొమెస్టిక్ వర్కర్ లక్ష్మి ‘ఏం లాభమయ్యా బండ ధర బెంచెగద’ అన్నది. పెట్రోల్ ధర వందదాటించినంత మాత్రాన 5 రూపాయలు తగ్గిస్తే మోసమంటారా? పత్రికలు టీవీలు, దీపావళి కానుక అని టపాసులు కాల్చడం మంచిదేకదా.  వాణిజ్య గ్యాస్ బండ ఎంత పెంచినా వంట గ్యాస్ పెంచలేదని భజనపరుల తర్కం. పరోక్షంగా దీని దెబ్బ పడేది సామాన్యులమీదే కదా. అంతముందు 26 కన్నాఅనేక సార్లు ఈ బండధర పెంచారు కదా. దేశ వ్యాప్తంగా ధర పెంచుతూనే ఉన్నారు. ఒక్కో నగరంలో ఒక్కో బండ ధరగా ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని కేంద్రం నిందిస్తున్నారు. డిల్లీలో 19 కిలోల ఎల్పీజి సిలండర్ ధర 2000 రూపాయల యాభై పైసలు. అంతకు ముందు 1734 రూపాయలు. ముంబైలో 1950, కోలకత్తాలో 2073.5‌0, చెన్నైలో 2133 రూపాయలు, ఉప ఎన్నికల్లో ఒక రేటు ఉంటుంది, తెలంగాణ ఎన్నికల్లో బండ రేటు కూడా ఇంకా పెరిగి ఉండవచ్చు.

మన దగ్గర సామాన్యుల 19 కిలోల బండ 1905 రూపాయలు. అక్టోబర్, నవంబర్లో 14.2 కిలోల బండ ధర 952. అదీ 15 రూపాయలు పెంచిన తరువాత. సామాన్యుల మీద ప్రభుత్వం బండలు విసిరిన విధంబెట్టిదననిన: జనవరి 2021లో 746, ఫిబ్రవరిలో 821, మార్చిలో 871, ఏప్రిల్, మే, జూన్ నెల్లలో 861, జులైలో 887, ఆగస్టులో 912, సెప్టెంబర్ లో 937, అక్టోబర్ లో  952. 

నాలుగు మహానగరాలలో ఇవి రేట్లు.19 కిలోల బండఎల్ పి జి నవంబర్ 2023 లో
హైదరాబాద్1,155.00
విశాఖపట్నం1,112.00
బెంగళూరు1,105.50
చెన్నై1,118.50

ఇదివరకు ఎన్నికలుంటే ధరలు పెంచడానికి కాస్త సిగ్గుపడే వారు. ఈ నాయకులను చూసి సిగ్గు గారు సిగ్గుపడి పారిపోతారు. సంతోషించి పోలింగ్ బూతుల్లో బూతుభాషా పండితులైన రాజకీయ నాయకుల భజన చేస్తూ, మరికొందరు తిట్టుకుంటూ కూడా ఓట్లు వేయవలసిందే. గ్యాస్ ధర పెంచడానికి రాజకీయ పార్టీలు ఎందుకు సిగ్గుపడతాయి.  సారా మత్తు, డబ్బు మత్తు, కులం మత్తు, వీటన్నింటికి రకరకాల మత్తులో ఓటర్లు మునిగిపోతే నాయకులు ధరలు పెంచకుండా తగ్గిస్తారా?

Also read: తెలుసుకునే హక్కును బలహీనం చేసే చట్టాలు

మాడభూషి శ్రీధర్

25.11.2023

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles