Tuesday, January 21, 2025

మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం

కనక మహీధర ప్రతిమకాయు, మహాజవ నిర్జిత ప్రభం

జను, నవిచింత్య భూరి బలసత్త్వ సమన్వితు, దీప్త హవ్యవా

హనసము, వైనతేయుని, తదాస్యగత దృమశాఖ నున్న య

త్యనఘుల వాలఖిల్యులను, నమ్ముని నాథుడు చూచి నెమ్మితోన్”

నన్నయ భట్టారకుడు

 అమృతాన్ని స్వర్గం నుండి తీసుకొని రావడానికి, అది కద్రూతనయులకిచ్చి, “తానూ, తన తల్లి వినత, కద్రువ యొక్క దాస్యం నుండి విముక్తి పొందడానికి”  గరుత్మంతుడు కద్రూతనయులతో ఒడంబడిక చేసుకుంటాడు. దీనికై తల్లి అనుమతిని, దీవెనలను పొంది, తన సంకల్పయాత్రను గరుడుడు ప్రారంభిస్తాడు.

Also read: మహాభారతం ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతునికి తల్లి వినత ఆశీస్సులు

“అమృతం తెచ్చే సమయంలో తగిన బలం కావలెను కదా, ఆహారం అనుగ్రహింపుమ”ని తల్లిని వేడుకుంటాడు. తల్లి ఇట్లా జవాబు చెబుతుంది: “సముద్రగర్భాన వేలకొలది మంది నిషాదులున్నారు. భూమిజనులకు వారు క్లేశం కలిగిస్తున్నారు. ఆ బోయవారిని భక్షించి వెళ్ళు. బ్రాహ్మణులను మాత్రం విడిచిపెట్టు”

తల్లి చెప్పినట్లుగా, అసంఖ్యాకంగా గల నిషాదులను గరుత్మంతుడు భుజిస్తాడు. ఐనా అతని ఆకలి తీరదు. గగనపథాన పయనించి, తన తండ్రి కశ్యపుని వద్దకు వెళ్ళి, “జననీ దాస్యవిమోచనం కోసం వెళుతున్నాను, బోయలను తినడంచే ఆకలి తీరలేదు, మరేదైనా ఆహారాన్ని అనుగ్రహించమ”ని వేడుకుంటాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – గరుత్మంతుని జననం

గజకచ్ఛపముల వృత్తాంతం

గరుత్మంతుని పూనికకు మెచ్చి కశ్యపబ్రహ్మ ఇట్లా అంటాడు. “అగ్నితో సమానమైన వాడు, నియమనిష్టా గరిష్ఠుడైన విభావసుడనే బ్రాహ్మణుడొకడు వున్నాడు. అపారమైన ధనసంపత్తి కలవాడు.అతని తమ్ముడు సుప్రతీకుడు వచ్చి, “పిత్రార్జితమైన ధనసంపదను న్యాయబద్ధంగా పంచి యిమ్మని” అడిగినాడు., విభావసుడు గర్వంతో “నీవు ఏనుగవు కమ్మ”ని తమ్ముణ్ణి శపించినాడు. సహించలేక సుప్రతీకుడు “నీవు తాబేలు కమ్మ”ని అన్నకు తిరుగు శాపాన్ని ఇచ్చినాడు. ఇట్లా ఒకరినొకరు శపించుకున్న కారణంగా, మూడామడల పొడవు, పది ఆమడల వెడల్పు గల తాబేలుగా అన్న, ఆరామడల పొడవు, పండ్రెండామడల వెడల్పు గల ఏనుగగా తమ్ముడు  రూపాంతరం చెంది, ఒకరు చెరువులో, మరొకరు అడవిలో వుండి పరస్పరం కలహించుకొంటూ కాలం గడుపుతున్నారు. వారే నీకు తగిన ఆహారం.”

గరుత్మంతుడు గాలిలోకి ఎగిరి వెళ్ళి, ఆ గజ కచ్ఛపాలను రెంటినీ దొరికించుకుంటాడు.  తన రెక్కల సందున వాటిని ఇరికించుకొని, ఆలంబం అనే మనోహరమైన తీర్థానికి వెళతాడు. ఆ తీర్థంలో రోహణము అనే పెద్ద వృక్షరాజం గరుత్మంతుణ్ణి గౌరవించి “నా కొమ్మలపై వ్రాలి గజ కచ్ఛపములను రెంటినీ భక్షించి వెళ్ళమ”ని ఆహ్వానిస్తుంది. గరుత్మంతుడు చెట్టుపై పాదాన్ని మోపగనే, అతని బరువుకు, ఒక పెద్ద కొమ్మ విరిగి పోతుంది. భీతిల్లి చెట్టుపై పక్షులన్నీ పారిపోతాయి. ఆ కొమ్మను పట్టుకొని,  అంగుష్టమాత్రులై, చెట్టుకొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతూ, సూర్యకిరణాలే  భోజనంగా తపస్సు చేస్తున్న “వాలఖిల్యుల”నే మహామునిగణ సమూహాన్ని చూసిన గరుత్మంతుడు, ఆ కొమ్మ నేలపై పడితే ఆ మునులకు బాధ కలుగుతుందని ఆలోచించి, గజకచ్ఛపాలను రెక్కలతో గట్టిగా అదిమి పట్టుకొని, చెట్టకొమ్మను కూడా నోటితో బిగువుగా పట్టుకొని, ఆకాశంలోకి ఎగిరి, నిలవడానికి ఎక్కడా చోటులేక, దూరంలో గల గంధమాదన పర్వతానికి వెళ్ళి, అక్కడ తపస్సు చేసుకుంటున్న తన తండ్రి కశ్యపమహర్షిని చూసి నమస్కరిస్తాడు.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – కద్రూవినతల వృత్తాంతం

కశ్యపుడు గరుత్మంతుణ్ణి, అతని రెక్కలనడుమ గల గజకచ్ఛపములను, అతని నోటిలోని పెద్దకొమ్మను, దానికి వ్రేలాడే మహామునులనూ దయతో పరికించి, మునిగణంతో ఇట్లా అంటాడు:

“ఈ గరుడుడు భువనహిత మహారంభుడు. బల సమన్వితుడు. మీకు బాధ కలుగుతుందనే ఆదుర్దాతో కొమ్మను విడవకుండా నోటితో పట్టుకున్నాడు. వీనిని కరుణించి మీరింకొక చోటికి వెళ్ళండి”.

కశ్యపుని మాటను మన్నించి, వాలఖిల్యమునులు, తాము వ్రేలాడుతున్న చెట్టుకొమ్మను వీడి, తపస్సు కొనసాగించడానికై హిమవత్పర్వతానికి వెళ్ళిపోతారు.

చెట్టుకొమ్మను నోటితో, గజకచ్ఛపాలను రెక్కలతో అదిమి పట్టుకొని వున్న గరుత్మంతుడు కశ్యపునితో “ధరణీసురులు లేని అటవీస్థలాన్ని తెలపండి. అక్కడ ఈ కొమ్మను విడిచి పెడతాను. ఈ కొమ్మ కడు కంటకప్రాయం” అంటాడు. అందుకు కశ్యపమహర్షి “ఇక్కడకు లక్ష యోజనాల్లో హిమాలయ గుహాప్రాంతంలో నిష్పురుషం అనే పర్వతం వున్నది. అక్కడ ఈ కొమ్మను విడిచి పెట్టు. ఆ చోటు మానవాతీతం. ఈశ్వరునికైనా చొరరానిది” అని చెబుతాడు.

గరుత్మంతుడు మనోవేగంతో నిష్పురుష పర్వతానికి వెళ్ళి అక్కడ చెట్టుకొమ్మను పరిత్యజించి, గజ కచ్ఛపాలను భక్షించి, మహాసత్త్వ సంపన్నుడై, అమృతహరణార్థమై నాకలోకానికి పోవటానికి సమాయుత్తం చెందుతాడు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – కద్రూవనితల సముద్ర తీర విహారం

నేటి పద్యం:

 కశ్యపమహర్షి సన్నిధానంలో, ఒకవైపు రెక్కలమధ్య గజకచ్ఛపాలను, మరొకవైపు నోటితో, మహావృక్షశాఖను ఒడిసి పట్టుకున్న గరత్మంతుని అఖండ స్వరూపాన్ని నేటి పద్యం వర్ణిస్తుంది.

పద్య తాత్పర్యం:

“కనకప్రభామయమైన మేరు మహీధరంతో తులతూగగల శరీరం కలిగిన వాణ్ణి, తన అసమానమైన వేగంచే పర్జన్యుణ్ణి సైతం నిర్జింప గల్గిన వాణ్ణి, దీప్త హవ్యవాహనునితో సముడైన వాణ్ణి, ఊహాతీతమైన దేహశక్తిని కలిగిన వాణ్ణి, వినత కుమారుణ్ణి, అతనితో బాటు అతడు తన నోట అదిమి పట్టుకొన్న చెట్టుకొమ్మను, దానికి వ్రేలాడుతున్న వాలఖిల్య మహామునులనే పాప రహితులను, కశ్యపమహర్షి దయతో వీక్షించినాడు.”

గరుడోపాఖ్యానంలోని నేటి పద్యానికొక ప్రత్యేకత ఉన్నది.  కొన్ని విశేషార్థాలు కలిగి వుండడమే ఈ ప్రత్యేకతకు ప్రధానహేతువు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ద్వితీయాశ్వాసం – దేవదానవ యుద్ధం

వినత గర్బంలోని గ్రుడ్డు పగిలి గరుత్మంతుడు ఉద్బవింపగానే అతణ్ణి పరిచయం చేసే ప్రసిద్ధపద్యం వున్నది:

ఆతత

పక్షమారుత

రయః ప్రవికంపిత

ఘూర్ణితాచలవ్రాత

మహార్ణవుండు

బలవన్నిజదేహ

సముజ్జ్వలప్రభా

ధూతపతంగతేజుడు”

ఈ పద్యంలో అప్పుడే పుట్టిన గరుత్మంతుడు ఆకాశంలోకి  దూసుకొని పోతున్నప్పుడు, పోయే వేగము, అధిరోహించే ఎత్తూ, క్రమక్రమంగా  పెరిగి పోతూవుంటాయి. బలమైన అతని రెక్కల తాకిడికి ప్రచండ వాయువులు చెలరేగి, కుల పర్వతాలు, మహా సముద్రము కూడా కంపించి పోతాయి.

Also read: మహాభారతం – ద్వితీయాశ్వాసం – గరుడోపాఖ్యానం – దేవదానవులు క్షీరసముద్రాన్ని మధించడం

ఇందులో మరొక అర్థం కూడా వున్నది. తన రెక్కల నుండి జనించే వాయువుచే పర్వత సమూహాలు కూడా కంపింపగల “మహార్ణవుడు” అప్పుడే జన్మించిన గరుత్మంతుడు. ఈ గరుత్మంతుడే తన తేజస్సుతో పతంగతేజుని సైతం అధిగమింపగలవాడు.

పై పద్యంలోని గరుత్మంతుడొక శిశువు. నేటి పద్యంలోని గరుత్మంతుడు అఖండ కౌమార దశకు చేరుకున్న వాడు. తల్లి దాస్యవిముక్తికై స్వర్గలోకాన్నే ఎదిరించి అమృతం తీసుకొని రావడానికి సిద్ధపడిన వాడు.

నేటి పద్యంలో గరుత్మంతుణ్ణి వాగనుశాసనుడు “కనక మహీధరమైన” మేరు పర్వతంతో ఉపమిస్తున్నాడు. పర్వతాలకంతా శ్రేష్ఠమైనది మేరుగిరి. మేరుగిరి రెక్కలు ఇంద్రునిచే ఖండింపబడినాయి. గరుత్మంతుడనబడే రెక్కలు గల ఒకేవొక మేరుశిఖరం ఇంద్రునికే సవాలు విసురుతున్నాడు. “ఇంద్రుని కన్న పరమ శక్తిమంతుడు గరుడుడు” అని కశ్యపమహర్షి వాలఖిల్యులతో  చెబుతాడు.

ఊర్థ్వమూలం అధఃశాఖః

నేటి పద్యంలో  గరుత్మంతుడు తలక్రిందులుగా వ్రేలాడే పెద్దకొమ్మను నోటికి కరచుకొని కశ్యపమహర్షి వద్దకు వస్తాడు. ఆ కొమ్మకు వాలఖిల్య మునులు తలక్రిందులుగా వ్రేలాడు తుంటారు. తలక్రిందులుగా వ్రేలాడే వృక్షశాఖ, వృక్షశాఖకు తలక్రిందులుగా వ్రేలాడే మునులు, భగవద్గీత లోని పురుషోత్తమప్రాప్తి యోగపు మొదటి శ్లోకాన్ని గుర్తు చేస్తాయి.

ఊర్థ్వ మూల మధశ్శాఖ అశ్వత్థం ప్రాహురవ్యహమ్

ఛన్దాంసి యస్య పర్ణాని యస్యం వేద స వేద విత్”

తాత్పర్యం: “ఏ చెట్టుకు వేదములు ఆకులుగా వున్నవో, అట్టి సంసారమనే అశ్వత్థ వృక్షమును పైన వ్రేళ్ళు కలదిగాను,  క్రింద కొమ్మలు కలదిగాను, నాశము  లేనిదిగాను విజ్ఞులు వచిస్తారు. దీని నెవడు తెలుసుకొనునో, అతడే వేదార్థము నెరిగిన వాడగు చున్నాడు.”

పై శ్లోకంలో సంసారమొక అశ్వత్థ వృక్షంతో పోల్చబడింది. కానీ, అన్ని వృక్షాలవలె ఇది వేళ్ళు క్రింద, శాఖలు పైన వున్నది కాదు. తద్వ్యతిరేకంగా, శాఖలు క్రింద, వేళ్ళు పైన కలిగినది. ఈ శ్లోకానికి మూడు కనీసార్థాలు చెప్పవచ్చును.

Also read: మహాభారతం – ఆదిపర్వము – ప్రథమాశ్వాసము – 6

మొదటి అర్థం: సమస్త జీవసృష్టి, దానితో బాటు జీవుల అహంకారాదులు ఊర్థ్వమున గల పరమాత్మ నుండి ఆవిర్బవించి వుండడంచే, “ఊర్థ్వమూలము”  “అధశ్శాఖలు” గా పేర్కొన బడుతున్నాయి.

రెండవ అర్థం: “ప్రపంచంలోని మాయ సంసారవృక్షాన్ని తలక్రిందులుగా నడిపిస్తున్నది. మంచిని చెడ్డగా, చెడును మంచిగా లేనిది వున్నట్లుగా, వున్నది లేనట్లుగా తలపింప చేస్తున్నది. ఈ సంసారవృక్షం చెరువులో కనబడే ప్రతిబింబం వంటిది. ప్రతిబింబంలో చెట్టు యొక్క శాఖలు క్రిందికి, మూలం పైకి వుంటాయి. ఎడమ కుడిగా, కుడి, ఎడమగా వుంటుంది.”

మూడవ అర్థం: “ఒక మహావృక్షం రహదారికి ప్రక్కన వున్నప్పుడు బాటసారులకు చల్లని నీడను, విశ్రాంతిని ప్రసాదిస్తుంది. అదే వృక్షం గాలికి విరిగి, రహదారికి అడ్డంగా పడినప్పుడు, వేళ్ళు పైకి, కొమ్మలు, ఆకులు, క్రిందికి వుంటాయి. ఇట్టి చెట్టుచే బాటసారులకు అవరోధం కలుగుతుంది. తాత్వికపరంగా ఆలోచించినప్పుడు, దారికి అడ్డంగా పడిన ఈ మాయావృక్షం మానవుల ఆధ్యాత్మిక పయనానికి ప్రాపంచిక వాసనలు కల్పించే అవరోధంగా భావింపవచ్చు.

నేటి పద్యంలో పఠితలకు తారసపడే ఈ సంసారవృక్షంపై పేర్కొన్న వర్గాల్లో మూడవది. ఇట్టి వృక్షం గరుత్మంతునికి ఎదురు కావడం అతని జీవితంలో ఒక మలుపు, మేల్కొలుపు.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం- ఉదంకోపాఖ్యానం-5

అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలో గల లేపాక్షి ప్రముఖ పర్యాటక స్థలం.  ప్రతి దేవాలయపు ప్రధాన మంటపానికి, నాలుగు వైపులా గల స్తంభాలు నేలమట్టం నుండి పైకి లేచి, పైనగల కప్పుకు ఆధారంగా వుండడం మనమెరుగుదుము.  కానీ లేపాక్షి లోని ఆలయ మంటపపు స్తంభాలు మటుకు, కప్పు నుండి క్రిందికి వ్రేలాడుతుంటాయి. దూరం నుండి చూసినప్పుడు, ఇవి నేలపై నిర్మించినట్లుగా వుంటాయి. కానీ ఈ స్తంభాల కొసలకు, నేలపరుపుకు, మధ్యగల సూక్ష్మమైన సందు గుండా ఏదైనా కాగితమో, జేబురుమాలో సులభంగా దూరిపోగలదు. కేవలం వ్యక్తిగతంగా అనుభవించడం చేతనే ఈ విషయాన్ని గ్రహిస్తాము. సనాతన వేదాంతం సైతం అనుభవైకవేద్యమైనది.  గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నిర్మించిన ఈ స్తంభాల వాస్తుకళ మధ్యయుగాల నాటి దక్షిణభారతపు  ప్రతిభా వంతమైన ఇంజనీరింగ్ ఫీట్స్ లో ఒకటి.

భవగద్గీత లోని “ఊర్థ్వమూల మధశ్శాఖః” అనే సూత్రాన్ని సందర్శకులకు దృశ్యమానంగా చెప్పడానికి గాను బహుశా ఈ వింత స్తంభాలు ఏర్పరచినట్లు భావన కలుగుతుంది. లేపాక్షి స్తంభాల క్రింద కాగితాన్ని దూర్చి, సూక్ష్మ పరిశీలన చేసినప్పుడు తప్ప  స్తంభాలు పైనుండి క్రిందికి వ్రేలాడుతున్నట్లు గ్రహింపలేము.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ఉదంకోపాఖ్యానం-4

అట్లే జీవితంలోని “మాయ” కూడా. విషయచాపల్యంతో జీవితం గడిపే వారు ఎంతో సుఖంగా ఉన్నట్లు భావిస్తారు. కానీ ఆ సుఖం అట్టే కాలం నిలవదు. చిరు సుఖాన్ని వెన్నంటి  పెను దుఃఖం వెంటపడడం పలువురికీ స్వానుభవం.

 “Meditation is not an escape from the world. It is rather the comprehension of the world and its ways  The world has little to offer apart from food, shelter and pleasures with their great sorrows” అంటారు జిడ్డు కృష్ణమూర్తి.

నేటి ఘట్టంలో గరుత్మంతుడు చెట్టుకొమ్మను దూరంగా విసిరి వేయడం ఈ సంసారబంధం నుండి బయటపడాలనే  జ్ఞానోదయం  కలగడం చేతనే.

“అశ్వత్థమ్” అనగా రేపు (శ్వ) వుండదగనిది (నస్థ). ఈ సంసారవృక్షం నశ్వరమైనదని దీని భావం. అనగా ఆత్మజ్ఞానం సిద్ధించే వరకు, జనన మరణాలు జీవులను అంటి పెట్టుకొని వుంటాయనే అర్థం.

“అమృతస్య పుత్రః” అన్నది ఉపనిషత్పాఠం. ఎదిగి వచ్చిన పంటను కోసి క్రొత్త పంటను నాటడం వంటిదే సృష్టి అని  ఉపనిషత్తులు చాటుతున్నాయి.

సృష్టి యావత్తునూ ఒక మూసగా పరిగణనలోకి తీసుకొన్నప్పుడు అది శాశ్వతమైనదని చెప్పడంలో ఎట్టి సందేహమూ కలగదు. సృష్టికి అమృతసిద్ధి వున్నది.

 కాకపోతే ప్రతిజీవికీ ఎక్స్పైరీ డేట్ వున్నట్లే గ్రహతారకలకు కూడా ఎక్స్పైరీ డేట్ వున్నదనడంలో ఎట్టి సందేహమూ అవసరం లేదు.  భూతలానికి లక్షలాది కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నక్షత్రాలు నేడు మనకు వెలుగుతున్నట్దే కనపడినా, అట్టి వాటిలో కొన్ని నక్షత్రాలు చచ్చిపోయి వుంటాయి గానీ ఆ నక్షత్రాల కాంతి మనకింకా కనబడుతూనే వుంటుంది. అందుచే ఆ తారకలు ఇంకా బ్రతికే వున్నాయని మనం భావిస్తాము. ఒక నక్షత్రం మరణిస్తే మరొక నక్షత్రం జన్మించడం సృష్టిక్రమంలో భాగం.

 నక్షత్రాలకు ఏ జననమరణ సూత్రం వర్తిస్తుందో, భూగోళానికి కూడా అదే జననమరణ సూత్రం వర్తిస్తుంది.

Also read: మహాభారతం – ఆదిపర్వం – ప్రథమాశ్వాసం

ఈ సందర్బంలో ఒక విషయం చెప్పవలసి వుంది.  లేపాక్షిలో  గల బసవయ్య విగ్రహం దేవాలయ ప్రాంగణంలో గాక ఆకాశమే కప్పుగా గల ఆరుబయలున ఒక గుట్టపై వున్నది. 

ప్రతి శివాలయంలోనూ గర్భగుడికి ఎదురుగా నందీశ్వరుడు ధ్యానమగ్నుడై మోకాళ్ళపై కూర్చుని శంభులింగం పైనే దృష్టి నిలిపి తపస్సమాధిలో వున్నట్లుగా వుంటాడు.  జీవితాత్మ ఎడతెగని సహనంతో పరమాత్మతో  ఐక్యం కావడానికి ఎదురుతెన్నులు చూడడం ఈ నందీశ్వరునిలో కనబడుతుంది.

లేపాక్షిలో ఉన్న బసవయ్య మాత్రం,  ధ్యానం నుండి మేల్కొని కార్యాచరణకు ఉద్యమిస్తున్న నందీశ్వరుని వలె గోచరిస్తాడు:

లేపాక్షి బసవయ్య లేచి రావయ్య!

కైలాస శిఖరిలా కదలి రావయ్య!”

అన్న అడివి బాపిరాజు గారి గేయం విన్నప్పుడల్లా హృదయం పరవశిస్తుంది.

“కేవలం మానవ సంసారమే మాయావృక్షం కాదు. ఈ విశాల భూతలం కూడా ఒక మహావృక్షం వంటిది. ప్రళయ ఝంఝా ప్రభంజనం సృష్టిక్రమంలో భాగం. అట్టి ప్రభంజనంలో ఈ వటవృక్షం ఏదోవొక రోజు కూలిపోయే ప్రమాదం వున్నది. మీ ప్రాపంచిక స్వార్ధం కోసం భూమాతను బలిచేయకండి.  ఈ వటవృక్షానికి నీరు,  బలము, అమృతము అందించి, ఎట్టి సమయం లోనూ అది  కూలిపోకుండా కాపాడండి. అమృతస్య పుత్రః అనే వేదోక్తికి అర్హులు కండి” అంటూ లేపాక్షి బసవయ్య మానవాళికి సందేశం ఇస్తున్నట్లుగా ఆత్మకు స్ఫురిస్తుంది.

Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3

గరుడోపాఖ్యానానికి భారతంలో ఒక ప్రత్యేక స్థానమున్నది. గరుడుడు అపూర్వ శక్తిసంపన్నుడు. అహంకారాన్ని, అవివేకాన్ని జయించినవాడు. దృశ్య పదార్థాలయందు ఆసక్తి గానీ కోరిక గానీ లేనివాడు. అమృతం సాధించడమనే సంకల్పసిద్ధికై తన సమస్త శక్తులను పణంగా పెట్టినవాడు. మాతృదేవి దాస్యవిముక్తి కోసమే అమృతాన్ని సాధించాలనే సంకల్పం ఏర్పరచుకున్న వాడు. ఆ అమృతాన్ని సేవించాలనే ఇచ్ఛ  ఏ కోశానా లేనివాడు.

గరుత్మంతుని వంటి నిర్మోహులను గీత ఏమని నిర్వచిస్తున్నదో చూడగలరు:

నిర్మానమోహా జితసజ్ఞ దోషా

ఆధ్యాత్మనిత్యా వినివృత్త కామాః

ద్వన్ద్వైరి ముక్తాః సుఖదుఃఖ సంజ్ఞై

ర్గచ్ఛన్త్య మూఢాః పదమవ్యయం తత్!”

తాత్పర్యం: “అహంకారం, అవివేకం లేనివారు, దృశ్య పదార్థాలయందు ఆసక్తి లేని వారు, నిరంతము ఆత్మ జ్ఞానము కలవారు, వాంఛలన్నీ తొలగిన వారు, సుఖదుఃఖాదిక ద్వంద్వముల నుండి విముక్తి గాంచిన వీరే జ్ఞానులై బ్రహ్మ పదాన్ని పొందుతున్నారు.”

నేటి పద్యంలో ఊర్థ్వ (గగన) గతుడైన గరుత్మంతుని నోట కొమ్మ యొక్క మూలమున్నది. శాఖ తలక్రిందులుగా సంసారవృక్షం వ్రేలాడుతున్నది. ఆ శాఖను పట్టుకొని తల క్రిందులుగా మునులు కూడా వ్రేలాడుతున్నారు. మూలం నోటిలో గల గరుత్మంతుడు ఊర్థ్వమూలానికి సంకేతం.

Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి

గరుడుడు సాక్షాత్తు విష్ణు సాక్షాత్కారాన్ని, కటాక్షాన్ని పొందిన వాడు. ఖగకులాని కంతా గరుడుడే ఇంద్రుడని బ్రహ్మజ్ఞాని యైన కశ్యప బ్రహ్మయే ప్రకటించి వున్నాడు. కనుక, గరుడుడు ఊర్థ్వమూలానికి ప్రతీక కావడంలో ఆశ్చర్యం లేదు.

గరుత్మంతుని నోటి నుండి తలక్రిందులుగా వ్రేలాడు తున్నది సంసారమనే మాయావృక్షమనే జ్ఞానోదయం అతనికి సిద్ధిస్తుంది. అందుకే గరుత్మంతుడు ఆ వృక్షం కంటక ప్రాయమని, సత్త్వగుణ ప్రధానులైన మునిగణానికి దూరంగా తీసుకొని పోయి ఏ హిమాలయ సానువుల్లోనో ఆ కొమ్మను పారవేస్తాడు. అట్లా పారవేయడం గరుత్మంతుడు ప్రాపంచిక బంధాలను భౌతికంగా, మానసికంగా, త్యజించడానికి సంకేతం.

ప్రస్థానత్రయం లోని బ్రహ్మ సూత్రాలకు, ఉపనిషత్తులకు, గీత సంక్షిప్తరూపం. గీతాశ్లోకాలలో సూత్ర ప్రాయంగా తెలిపబడినవే, ఇతిహాసాలలో కథారూపంగా తెలుపబడినవి.

నేటి నన్నయ పద్యానికి, లేపాక్షిలో పైనుండి క్రిందకు వ్రేలాడే స్తంభాలకు, ఉపనిషత్తులలోనూ, గీతలోనూ గల “ఊర్థ్వమూలం అధశ్శాఖః” అనే శ్లోకం ప్రేరణ అని భావింపవలసి వున్నది.

Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము

నివర్తి మోహన్ కుమార్

Mohan Kumar Nivarti
Mohan Kumar Nivarti
నివర్తి మోహన్ కుమార్. జననం 26 ఆగస్టు 1950, నంద్యాల. వృత్తి రీత్యా ఛార్టర్డ్ అకౌంటెంట్. హైదరాబాదులో ప్రాక్టీసు. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్య విమర్శ, జ్యోతిష్యం, చరిత్ర, సామాజిక రాజకీయ శాస్త్రాల్లో ఆసక్తి. మొబైల్ : 96038 27827

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles