పరాయిపాలన మాకు వద్దు అని నినదించిన ఆయన గీతానికి శత వసంతాలు. అక్షరాస్త్రాలతో తెల్లదొరలను వణికించిన `మాకొద్దీ తెల్లదొరతనము` గీతం అపూర్వ దేశభక్తకి నిలువెత్తు నిదర్శనం. గరిమెళ్ళ సత్యనారాయణకు పర్యాయపదమైన నూట అరవై పాదాలు గల ఈ గీతం ప్రపంచంలోనే అత్యంత నిడివి గలదిగా ప్రత్యేక తను సంతరించుకుంది.`తెలుగు రాని నాకే ఈ గీతం ఇంత గగుర్పాటు కలిగిస్తే స్వదేశీయులు, స్వరాజ్యకాంక్షీయుల్లో ఎంత ఉత్తేజం కలిగిస్తుందో` అనుకున్న నాటి గోదావరి జిల్లా కలెక్టర్ బీకన్ విద్రోహచట్టం కింద ఆయనకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు.
శిక్షపూర్తి చేసుకుని విడుదలయ్యాక కూడా గరిమెళ్ళ ఆయన మళ్ళీ ప్రజల మధ్య గొంతెత్తి పాడుతూ వారిని ఎంతగానో ఆకట్టుకోసాగారు.అప్పట్లో కాంగ్రెసు స్వచ్ఛంద సేవకులు ఖద్దరు దుస్తులు, గాంధీటోపి ధరించి బారులుదీరి మువ్వన్నెల జెండా చేతబట్టి `మాకొద్దీ తెల్లదొరతనం` అంటూ వీధులలో కవాతు చేసేవారట. టంగుటూరి ప్రకాశం పంతులు ఆ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదింపచేసి తమ `స్వరాజ్యం` పత్రికలో ప్రచురించారు. ఆ గీతాన్ని ఇతర భాషల్లోకి అనువదించాలని గాంధీజీ సబర్మతి ఆశ్రమానికి పురమాయించారు. దేశంలో వలస పాలకుల తీరును పరిశీలించుకునేందుకు బ్రిటిష్ యువరాజు వెల్స్ వచ్చినప్పుడు ‘ఏమయ్యా యువరాజా ఎందుకొచ్చావు’, అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని రాశారు గరిమెళ్ళ మరోగీతం `దండాలండోయ్ దండాలు` అనే రెండు వందల చరణాలు గల పాట ఆంగ్లపాలకులపై నిప్పులు చెరిగింది. గరిమెళ్ళను `ప్రజా పాటల త్యాగయ్య` అని ఆచార్య ఎన్జీ రంగా ప్రశంసించారు
రాజీ కంటే జైలే నయం
తెల్లదొరలు తనను నిర్బంధించినప్పడు ధర్మనిర్వహణలో భాగంగా జైలుకు వెళుతున్నాను. నా శరీరాన్ని నిర్బంధించి ఉంచుతారు గానీ సాహిత్యం ద్వారా నా ఆత్మను దేశం మీదకి వదిలేశాను. ఈ దుర్బల శరీరం కంటే నా పాట శక్తిమంత మైనది. దానిని ఆంగ్లేయులు తమ ఉనికికే ప్రమాదమని భావించి నన్ను బంధించినా నా పాట ద్వారా ప్రజల మధ్య ఉంటాను` అని చాటారు. ఆయన జైలులో ఉండగానే తండ్రి వెంకట నరసింహం (1923 జనవరి), తాతగారు మరణించారు. క్షమాపణ చెబితే విడుదల చేస్తామని అధికారులు తెచ్చిన ప్రతిపాదనను గరిమెళ్ళ తిరస్కరించారు.
పాత్రికేయుడుగా…స్వేచ్ఛాజీవి
వావిళ్ల వారి `త్రిలింగ`పత్రికలో,ఆ తర్వాత వాహిని`,`ఆంధ్రప్రభ`, `ఆంధ్రపత్రిక` `ఆనందవాణి`,`గృహలక్ష్మి`తదితర పత్రికల్లో పనిచేసినా ఎక్కడా స్థిరంగా ఉండలేక పోయారు. స్వేచ్ఛా ప్రియత్వమే అందుకు కారణంగా చెబుతారు. వివిధ పత్రికలు, రేడియోకు చేసిన రచనల ద్వారా తగినంత ఆదాయం లేకపోవడంతో సోదరుడితో కలసి మద్రాసు మైలాపూర్ లో భోజనహోటల్ నిర్వహించినా అదీ ఎంతోకాలం సాగలేదు.
గ్రంథాలు
స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని ప్రియాగ్రహారంలో `శారద గ్రంథమాల` స్థాపించి పుస్తక ప్రచురణ చేపట్టి,18 పుస్తకాలు వెలువరించారు. స్వరాజ్యగీతాలు, హరిజనపాటలు, `ఖండకావ్యం` సంపుటి, బాలగీతాలు, భక్తి గీతాలు తదితర గ్రంథాలు ప్రచురించారు. తమిళంలో ప్రసిద్ధమైన `తిరుక్కరళ్` ను తెలుగు లోకి ఛందోబద్ధంగా అనువదించారు. కన్నడ నాటకం `తళ్లికోట`ను తెలుగులోకి తర్జుమా చేశారు.`హార్టాఫ్ ది నేషన్`,`మదర్ ఇండియా` వంటి ఆంగ్ల కావ్యాలు రాశారు.
త్యాగజీవికి యాచన….
దోచుకొని దాచుకునే విధానం తెలియని సత్తెకాలపు మనిషి. దేశాభిమానంతో యావదాస్తిని స్వరాజ్య సమరానికి ధారపోసిన ఆ త్యాగశీలి స్వతంత్రభారతంలో అనేక కష్టాలపాలయ్యారు. అనారోగ్యం, పేదరికం చుట్టుముట్టాయి. ఒక కన్నుకు దృష్టి లోపంతో పాటు పక్షవాతం సోకింది. చరమదశలో ఆత్మాభిమానం చంపుకుని మద్రాసు వీధుల్లో యాచనతో పొట్టపోసుకోవడం దయనీయ సన్నివేశంగా చెబుతారు. తనను పాలకులు పట్టించుకోకపోయినా బాధపడలేదు. `నాకొద్దీ తెల్లదొరతనము‘ అనే నాటి గీతం కోణంలోనే `మాకొద్దీ నల్ల దొరతనం` అని మార్చి రాయాలన్న కొందరి సలహాను గరిమెళ్ళ తోసిపుచ్చారు. `పరాయి పాలనకు వ్యతిరేకంగా రాసిన చేతితో స్వపరిపాలకులకు వ్యతిరేకంగా రాయలేను` అని చెప్పిన దేశభక్తుడు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారు కొంత సహాయపడ్డారు. . వావిళ్ళ వేంకటేశ్వరశాస్త్రులు ప్రతి నెలా ఆయనకు ఆర్థిక సహాయం చేసేవారు
జీవిత విశేషాలు
గరిమెళ్ళ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోని ప్రియాగ్రహారంలో 1893 జూలై 15న వెంకటనరసింహం, సూరమ్మ దంపతులకు జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, విజయనగరంలో డిగ్రీ అభ్యసించారు. రాజమహేంద్రవరంలో ఉపాధ్యాయశిక్షణ పొందారు. గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా చేరి మహాత్మా గాంధీ పిలుపును అందుకొని సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరారు. `సాహిత్యం ద్వారా స్వరాజ్య సమరం సాగించిన గరిమెళ్లకు సమకాలికులతో సమానంగా కాకపోయినా తగినంత గుర్తింపు రాలేదు. జీవిత కాలంలో మాదిరిగానే ఆ తర్వాత కూడా ఆయనను, ఆయన రచనలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు`అని విశ్లేషకులు అంటారు. 1990లో స్వాతంత్ర్య సమర యోధులు వావిలాల గోపాలకృష్ణయ్య, పట్టాభి రామారావు గుర్తు చేస్తే కానీ అప్పటి ప్రభుత్వానికి ఆయన గురించి తట్టలేదట. వారి చొరవతో తెలుగు విశ్వ విద్యాలయం ద్వారా 1992 జూలై 15 నుంచి మరుసటి ఏడాది అదే తేదీ వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. శతజయంతి ఉత్సవాలకు చిహ్నంగా స్థానిక సంస్థల సహకారంతో ఆయన స్వగ్రామంలో గరిమెళ్ళ విగ్రహాన్ని ఆవిష్కరించారు. `పత్రికా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను శాశ్వతంగా హరించే ప్రభుత్వ ధిక్కారణ బిల్లులను, ప్రశ్నించే హక్కులను లేకుండా చేయాలని ప్రయత్నించిన పాలకుల తీరుపై పోరు సాగించిన యోధుడుగా గరిమెళ్ళ చరిత్రలో మిగిలిపో యారు. ఆకలి,అనారోగ్యంతో ఆరుపదుల వయసు కూడా రాకుండానే 1952 డిసెంబర్ 18న దీనస్థితిలో తనువు చాలించారు.
(శుక్రవారం…డిసెంబర్ 18న గరిమెళ్ల వర్ధంతి)