Thursday, December 26, 2024

అటు దారుణకాండ, ఇటు క్షమించరాని ఉపేక్ష

  • యూపీలో మరో ఘాతుకం: దళిత యువతిపై సామూహిక అత్యాచారం
  • లైంగిక దాడి తర్వాత రెండు వారాలకు యువతి మృతి
  • కుటుంబ సభ్యులు లేకుండా పోలీసుల పర్యవేక్షణలో యువతి పార్థివదేహం దహనం
  • కుంటుంబ సభ్యుల గృహనిర్బంధం
  • రాహుల్, ప్రియాంకలను అడ్డుకున్న పోలీసులు
  • దిల్లీ ఇండియా గేట్ దగ్గర నిషేధాజ్ఞలు
  • దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు

కె. రామచంద్రమూర్తి

ఒక దళిత యువతిపైన అత్యాచారం, దాడి జరగడం, ఆమె ఆస్పత్రిలో చికిత్స జరుగుతుండగా మరణించిన తర్వాత ఆమె మృతదేహాన్నీ తల్లిదండ్రులకు అప్పగించకుండా పోలీసులు దగ్గరుండి అర్దరాత్రిపూట దహనం చేయడం ఎక్కడైనా విన్నామా? ఉత్తరప్రదేశ్ లోని హాథ్ రస్ అనే గ్రామంలో జరిగిన ఈ దారుణంపట్ల దిగ్భ్రాంతి చెందిన దేశప్రజలు ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. దిల్లీ నిర్భయ, మన దిశపై అఘాయిత్యాలను మించిపోయిన దుర్ఘటన ఇది. నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం జరిగింది. ఇక్కడ ఆ రెండింటితో పాటు బాధితురాలి కుటుంబసభ్యులను గృహనిర్బంధంలో ఉంచి, ఆమె భౌతికదేహం తమకు అప్పగిస్తే అంతిమ సంస్కారం చేసుకుంటామంటూ కంటతడిపెట్టుకొని విన్నవించుకున్న వినకుండా పోలీసులు అమానవీయంగా అంత్యక్రియలు చేశారు. ఇది దేశంలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లో జరుగుతున్న దారుణాలకు పరాకాష్ట.

సెప్టెంబర్ 14వ తేదీన సామూహిక అత్యాచారం, దాడి జరిగితే  19 ఏళ్ళ యువతి దిల్లీ అస్పత్రిలో సెప్టెంబర్ 29న చనిపోయింది. తన తల్లితో పాటు పశుగ్రాసం సేకరిస్తున్న తరుణంలో ఆ యువతిపైన అత్యాచారం జరిగింది. దుండగులు ఆమె నాలుకను కోసివేశారు. వెన్నెముకను విరిచివేశారు. కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ మహిళలకు ఈ దేశంలోభద్రత లేదనే సత్యాన్ని నిత్యం గుర్తు చేసే ఘటనలు ఉత్తరప్రదేశ్ లో తరచు సంభవిస్తున్నాయి. దళిత, ఆదివాసీ అత్యారాల నిరోధక చట్టం (అట్రాసిటీస్ యాక్ట) అమలులో ఉన్నప్పటికీ దళిత మహిళలపైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ గ్రామాలలో అగ్రకులాలకు చెందినవారూ, వెనుకబడిన కులాలకు చెందినవారూ దళితులపైన తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి అత్యాచారాన్ని ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు.

నిర్భయ ఉదంతానికి మించిన దారుణం

దిల్లీలో 2012లో నిర్భయ ఉదంతం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నాయకత్వంలో ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్పు మేరకు 2013లో క్రిమినల్ లా (అమెండ్ మెంట్ ) చట్టాన్ని తీసుకువచ్చారు. భారత శిక్షాస్మృతిలో మార్పులు చేశారు. నిర్భయ కేసులో నిందితులైన నలుగురినీ ఈ సంవత్సరం మార్చిలో ఉరితీశారు. ఈ దళిత యువతిపైన అత్యాచారం చేసినవారికి కూడా తీవ్రమైన శిక్ష పడుతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ లో తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్-సిట్)ను నియమించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఉత్తర ప్రదేశ్ లోనే మహిళల పట్ల అత్యధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకటించింది. దేశం మొత్తంమీద జరిగిన అత్యాచారాలలో 14.7 శాతం  ఒక్క యూపీలోనే జరుగుతున్నాయి. యూపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి నాలుగు రాష్ట్రాలు కలిపినంత విశాలమైనది కావడం ఒక కారణం కావచ్చు. ప్రజలలో నేరప్రవృత్తి పెరగడం, పోలీసుల నిజాయితీ, శక్తిసామర్థ్యాలు ప్రశ్నార్థకం కావడం, సామాజిక విలువలు క్షీణించడం కూడా కారణం కావచ్చు.

కోవిద్ కారణంగా మరణించినవారికి అంత్యక్రియలు చేసే సమయంలో మృతుని కుటుంబానికి చెందిన నలుగురుని అంత్యక్రియలు చేసే సమయంలో అనుమతిస్తున్నారు. ఇదివరకు ప్లేగు వంటి అంటురోగాలు వచ్చినప్పుడు కూడా కొద్దిమందినైనా శవాన్ని చూడటానికీ, అంత్యక్రయలు నిర్వహించడానికీ అనుమతించేవారు. కానీ యూపీలో పోలీసులు ఈ దళిత యువతి అంత్యక్రియలకు తల్లినీ, సోదరుడినీ సైతం ఎందుకు అనుమతించలేదో తెలియదు. ఇది నైతికంగా, చట్టప్రకారం సహించలేని, సహించరాని నేరం. దళితులపైన అత్యాచారాలు చేసినవారికి శిక్ష పడకపోవడం దళితులపైన దాడులు పెరగడానికి ప్రధాన కారణం.

చట్టం ముందు అందరూ సమానమేనా?

వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈ యువతికి బతికి ఉండగా, చనిపోయిన తర్వాత కూడా రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం లభించలేదు. కుల, మత దురాచారాల నుంచి విముక్తి పొందడం కోసం రాసుకున్న రాజ్యాంగాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించడం వల్ల సమాజం పురోగతి చెందకుండా వెనకడుగులు వేస్తున్నది. హాథ్ రస్ ఘటనలో మరణించిన యువతి తల్లి మాటలలో చెప్పాలంటే, ‘ మా కూతురు నగ్నంగా పడి ఉంది. ఆమె నోట్లో నుంచి నాలుక బయటకు వచ్చి ఉన్నది. ఆమె కనుగుండ్లు బయటికి వచ్చాయి. ఆమె నోటి నుంచీ, మెడ నుంచీ, మర్మాంగం నుంచీ నెత్తురు కారుతోంది. నా వోణీ తీసి ఆమెపైన కప్పాను.’  ఆ తర్వాత తల్లి, సోదరుడు కలిసి యువతిని చాంద్పా పోలీసు స్టేషన్ కు మోటర్ సైకిల్ పైన తీసుకొని వెళ్ళారు.

స్టేషన్ నుంచి ఆమెను తీసుకువెళ్ళమని పోలీసులు పదేపదే చెప్పారు. అనంతరం వైద్యంకోసం అలీగఢ్ లోని జవహర్ లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ అస్పత్రిలో చేర్పించారు. అందుకు కూడా అంబులెన్స్ లో యువతి రెండు గంటలు వేచి ఉండవలసి వచ్చింది. వెన్నెముకకు దెబ్బతగలడం వల్ల యువతి ‘క్వాడ్రీప్లేజియా’ వ్యాధితో బాధపడుతోందని అక్కడి వైద్యుడు డాక్టర్ షాహిద్ అలీ సిద్దికీ చెప్పారు. అంటే చేతులూ, కాళ్ళూ చచ్చుబడిపోయాయని అర్థం. ‘యవతి పరిస్థితి క్లిష్టంగా ఉంది. కానీ ఆమెపైన అత్యాచారం జరిగిందని మాత్రం ఇప్పుడు చెప్పలేము’ అంటూ ఆమె అస్పత్రిలో చేరిన తర్వాత 13 రోజుల తర్వాత వైద్యులు అన్నారు.  సెప్టెంబర్ 23న యువతి స్పృహలోకి వచ్చిన తర్వాత సమాచారం ఇచ్చింది. నలుగురు వ్యక్తులు తనపైన అత్యాచారం చేశారని వారి పేర్లతో సహా చెప్పింది. తర్వాత ఆమెను దిల్లీలోని సఫ్దర్ గంజ్ హాస్పటల్ కు తరలించారు. అక్కడ చికిత్స జరుగుతుండగా సెప్టెంబర్ 29న మరణించింది.

నలుగురు కీచకుల అరెస్టు

యువతి ఫిర్యాదు మేరకు ప్రథమ సమాచార నివేదిక (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ – ఎఫ్ ఐ ఆర్)ను తయారు చేశామనీ, అత్యాచారం చేసిన మనుషుల పేర్లు యువతి చెప్పిన తర్వాత నలుగురినీ అరెస్టు చేశామనీ, అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లను కూడా ఎఫ్ ఐ ఆర్ లో చేర్చామనీ హాథ్ రస్ ప్రాంతానికి చెందిన పోలీసు అధికారి ప్రశాంత్ కుమార్ ఎన్ డీటీవీ ప్రతినిధికి తెలిపారు. సవరించిన క్రిమినల్ లా ప్రకారం బాధితురాలికి మానసికంగా, భౌతికంగా చికిత్స అందించాలి. యువతిపైన లైంగిక దాడి జరినట్టు దాఖలా లేదంటూ ఫ్లొరెన్సిక్ నివేదిక వెల్లడించడం పట్ల పరిశీలకులు విస్మయం వెలిబుచ్చుతున్నారు. వైద్యులూ, పోలీసుల విశ్వనీయత ప్రశ్నార్థకం అవుతున్నదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏ మహిళ అయినా తనపైన అత్యాచారం జరగకుండా జరిగినట్టు చెబుతుందా అని వారు అడుగుతున్నారు.

వాల్మీకి యువతిపైన అత్యాచారం జరిగిన తర్వాత పోలీసు స్టేషన్ కు వెళ్ళిన వెంటనే పోలీసు అధికారులు సవరించిన క్రిమినల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకొని చికిత్స చేయించి ఉన్నట్లయితే ఆమె సజీవంగా ఉండేది. దర్యాప్తు చేయడానికి సిబ్బంది లేరని చెబుతున్న పోలీసులు హాథ్ రస్ లో 144 వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలు చేయడానికి మాత్రం చాలామంది పటాలాలకొద్దీ తయారైనారు.

గురువారం నాడు హాథ్ రస్ వెళ్ళి బాధితులను  పరామర్శించాలనే సంకల్పంతో బయలు దేరిని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రాలను పోలీసులు యూపీ సరిహద్దు దగ్గరే అడ్డుకున్నారు. వారి కారును ఆపు చేయగా వారు కాలినడకన బయలు దేశారు. అప్పుడు కూడా పోలీసులు అడ్డుతగిలి అడుగు ముందుకు వేయనీయలేదు. తోపులాట జరిగి రాహుల్ గాంధీ కిందపడగా మోచేతి దగ్గర గాయమైనట్టు వార్తలు వచ్చాయి. సమాజ్ వాదీ పార్టీకి చెందిన కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తర్వాత వదిలిపెట్టారు.

యోగి రాజీనామా కోరుతున్న ప్రతిపక్షాలు

శుక్రవారంనాడు దిల్లీ జంతర్ మంతర్ లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భీం ఆర్మీ నేత చంద్రశేఖర్ ఆజాద్, ఇతర కార్యకర్తలు ప్రదర్శన చేశారు. సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా ప్రదర్శనలో పాల్గొన్నారు. దిల్లీ వాల్మీకి దేవాలయంలో జరిగిన ప్రార్థనలలో ప్రియాంకగాంధీ వద్రా పాల్గొన్నారు. ప్రదర్శన చేసినవారంతా యూపీ ముఖ్యమంత్ర యోగి ఆదిత్యనాథ్ పదవి నుంచి వైదొలగాలని కోరారు. దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ప్రదర్శనలు జరుగుతున్నాయి.   మన ప్రాథమిక హక్కులను కాపాడే బాధ్యతను రాజ్యాంగం న్యాయవ్యవస్థకు అప్పగించింది. పౌరుల హక్కులను ప్రభుత్వాలు హరించకుండా కాపాడవలసిన బాధ్యత కూడా న్యాయవ్యవస్థదే. సమాజంలో అత్యంత బలహీనమైన వర్గాలపైన అత్యారాలు రాక్షసంగా జరిగిపోతుంటే దేశ పౌరులు చేష్టలుడిగి చూస్తున్నారు. రాజ్యాంగం ఆదేశించినట్టు న్యాయవ్యవస్థ ఇప్పటికే రంగంలో దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకోవలసింది. రాజకీయ నాయకత్వాన్నీ, పోలీసు వ్యవస్థనూ శాసించవలసింది.  రాజ్యాంగాన్నీ, రాజ్యాంగస్ఫూర్తినీ, రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వాన్నీ రక్షించుకోకపోతే మన ప్రజాస్వామ్యానికి రక్షణ ఉండదు. ఇది యూపీకి చెందిన ఒక వాల్మీకి యువతికి సంబంధించిన సమస్య కాదు. దళిత సమాజానికి మాత్రమే సంబంధించిన ప్రశ్న కాదు. యావత్ దేశానికీ, సమాజానికీ, ప్రజానీకానికీ ప్రమాదం సూచిస్తున్న పరిస్థితి. పౌరసమాజం స్తబ్దుగా ఉంటే, నిర్వికల్పంగా, నిర్వికారంగా ఉంటే మొత్తం సమాజానికే ప్రమాదం ముంచుకొస్తుందని గ్రహించి పిడికిలి బిగించి ఉద్యమించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles