Friday, December 27, 2024

రాగద్వేష రహితమైన, వివేకం గల విజ్ఞాన దృష్టి

గాంధీయే మార్గం -2  

(ఇది కొత్త శీర్షిక. మహాత్మాగాంధీ ఈ దేశానికి చేసిన సేవల గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. కొత్త తరాలకు తెలియపరచవలసిన అవసరం ఉంది. గాంధీని తలచుకోవడం కంటే గాంధీ ఏయే సిద్ధాంతాలు చేశారో, ఏయే విలువలకు కట్టుబడి జీవితం సాగించారో, ఏ సూత్రాలకు లోబడి స్వాతంత్ర్య సంగ్రామానికి సారథ్యం వహించారో తెలుసుకోవాలి. గాంధీ కనుక ఈ రోజు మన మధ్య సజీవంగా ఉంటే మనలను చుట్టుముడుతున్న సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు సూచించేవారో, ఏమి ఆచరించేవారో ఆలోచించడం కూడా ఉపయోగకరమన అంశం. ఇది వారంవారం ప్రచురించే ధారావాహిక. పేరు ‘గాంధీయే మార్గం.’ ఈ శీర్షిక నిర్వాహకులు ఆకాశవాణి ఉన్నతాధికారిగా ఇటీవలి వరకూ పనిచేసిన సాహిత్యకారుడూ, శాస్త్రవిజ్ఞాన ప్రచారకుడూ అయిన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు.)

పరిశీలన,  అధ్యయనం, ఇంగితం, స్పృహ, కామన్ సెన్స్, రాగ ద్వేష రాహిత్యం, హేతువు, కార్యకారణ సంబంధం గుర్తించడం – మొదలైన గుణాలను విజ్ఞాన శాస్త్ర దృష్టికి ఆనవాళ్ళుగా పరిగణిస్తాం! ఆధార రహితమైన అభిప్రాయాలను తిరస్కరించి, రాగద్వేషాలు లేకుండా పరిశీలించడం శాస్త్రీయ అభినివేశానికి చాలా కీలకం. గాంధీజీ ఆకారం, దుస్తులు, మాటలు అతి సామాన్యంగా ఉండటంతో మామూలు వ్యక్తిగా మనకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి. నిజానికి ఆయన చదువు కోసం ఇంగ్లండు, ఉపాధికోసం  దక్షిణాఫ్రికా వెళ్ళినవారు. కానీ ఆయన మాటలో, ప్రవర్తనలో ఆ డాబు, దర్పం అసలు కనబడవు. కానీ ఆయనది చాలా విస్తృతమైన పరిశీలన, లోతయిన ఆలోచన!  ఆయన పరిభాషలో, ఆలోచనా విధానంలో శాస్త్రదృష్టి తొణికిసలాడుతుంది.    కానీ గాంధీది నిత్యస్పృహ లేదా అనుక్షణ స్పృహ!   ఏది మంచో, ఏది చెడో ఇట్టే గుర్తించి, తను స్వీకరించగల మంచిని ఎంపిక చేసుకునే సూక్ష్మదృష్టి, బుద్ధి కుశలత ఆయనకే సొంతం. తన ఆత్మకథ రెండో అధ్యాయంలో ఇలా అంటారు: “… సంఘటన వల్ల నాకు మా టీచరుపై గౌరవం ఇసుమంత కూడా తగ్గలేదు. నాకు ఇతర్ల లోపాలు కనిపించేవి కావు. అది నా స్వభావం. తర్వాత్తర్వాత ఆ టీచరులో చాలా లోపాలు నాకు తెలిసొచ్చాయి. కాని వాటివల్ల ఆయనపై నాకున్న గౌరవానికి భంగం కలుగలేదు. ఎందుకంటే నేను పెద్దవాళ్ళ ఆజ్ఞలని మన్నించడం నేర్చుకున్నాను. వాళ్ళ చర్యల్ని పరీక్ష చేయడం నాకు అలవాటు కాలేదు….” ఇది ఉత్తమోత్తమ ప్రవర్తన. అది ఆయన స్వభావం. ఆధారరహితంగా, ఆకారణంగా దురభిప్రాయాలు ఏర్పరచుకోవడం అలవాటుగా మారిన వారికి ఇది అసాధ్యమనిపించవచ్చు. చెడ్డ వ్యక్తి చేసిన పనులను కూడా రాగద్వేషాలు లేకుండా స్వీకరించడం శాస్త్రదృష్టి కాక మరేమి అవుతుంది?     ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్ పెరిమెంట్స్ విత్ ట్రూత్’   అని ఆయన స్వీయచరిత్రకు పేరు. ఈ గ్రంథానికి 1925 నవంబరు 26న రాసిన ఉపోద్ఘాతం మూడవ పేరాలో ఇలా వివరిస్తారు. “ఐ సిమ్ప్లీ వాంట్ టు టెల్ ది స్టోరీ ఆఫ్ మై న్యూమరస్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అండ్ యాజ్ మై లైఫ్ కన్ సిస్ట్స్ ఆఫ్ నథింగ్ బట్ దోజ్ ఎక్స్పెరిమెంట్స్, ఇట్ ఈజ్ ట్రూ దట్ ది స్టోరీ విల్ టేక్ షేప్ ఆఫ్ యాన్ ఆటోబయోగ్రఫీ…” దీన్ని బట్టి చూస్తే యాన్ ఆటోబయోగ్రఫీ అనేది అసలు శీర్షిక కాదని – ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్’ అనేదే అసలు సిసలైన నామకరణమని బోధపడుతుంది. ఇంకా అందులో నాల్గో విభాగం 11వ అధ్యాయంలో  “… ఐ యామ్ నాట్ రైటింగ్ ది ఆటోబయోగ్రఫీ టు ప్లీజ్ క్రిటిక్స్. రైటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్….” అని కూడా వివరిస్తారు. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనే పదప్రయోగం గురించి ప్రత్యేకంగా చూడాలి. ఆయన ఆ పదాన్ని ఆషామాషిగా కాకుండా ఖచ్చితత్వంతో వాడారని గమనించాలి.      గాంధీజీ ఆలోచనలు, ప్రవర్తనలలో శాస్త్రదృష్టి గురించి గత మూడు, నాలుగు సంవత్సరాలుగా పరిశీలించి, పరిశోధించి కొన్ని వ్యాసాలు రాస్తూ వచ్చాను. అదే దిశలో ఈ వ్యాసంలో వారి స్వీయ చరిత్రను ప్రత్యేకించి విశ్లేషించడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తున్నాను. (ఇక్కడ ఉటంకిస్తున్న విషయాలు ఇంకా వెలువరించాల్సిన కాటా చంద్రహాస్ తెలుగు అనువాదం నుంచి స్వీకరించానని గమనించాలి.)  అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమంటే మొత్తం ప్రపంచం గాంధీకి ప్రయోగశాల. తన జీవితమే ప్రయోగాల వరుస. దీనిని పరిగణించడంలో మనం గందరగోళానికి లోను కావచ్చు!  కానీ ఆయనలో చాలా స్పష్టత ఉంది. “… తర్కానికి లోబడే ఏ సబ్జక్టు కూడా కష్టం కాదని నాకు అర్థమైంది. అప్పట్నుంచి క్షేత్రగణితం నాకు సులభమే కాక ఆసక్తికరంగా ఉండేది….”   (ప్రధమ భాగం – ఐదో అధ్యాయం).    ఇంకా ఇంగ్లాడులో చదువు గురించి చెబుతూ – “… ఇండియాలో నేను కెమిస్ట్రీ ఇష్టంగా చదివాను. కెమిస్ట్రీ చాలా ఆసక్తికరమైన సబ్జెక్టు. అందుకే మొదటిసారి కెమిస్ట్రీని ఎన్నుకున్నాను. కాని ఇక్కడ కెమిస్ట్రీలో ప్రయోగాలు చేసే వెసులుబాటు లేదు. అందువల్ల కెమిస్ట్రీ మీద మోజు తగ్గింది. ఫలితంగా రెండోసారి కెమిస్ట్రీ కాదని హిట్, లైట్ సబ్జెక్టు సులువని విని దాన్ని తీసుకున్నాను. త్వరలోనే అది నిజంగా సులువేనని అనుభవమైంది….” అంటారు. కెమిస్ట్రీ ఇష్టమైనా కూడా అదే రీతిలో అభ్యసించే అవకాశం లేనందున ఫిజిక్స్ ను తన రెండవ బెస్ట్ ఛాయిస్ చేసుకున్నారు గాంధీజీ.     పరిశీలన, తార్కికత, వాటిని జీవితంలో అన్వయించుకోవడం  – విషయంలో గాంధీజీ ముందుంటారు “ఒక సంవత్సరంపాటు దేశమంతా పర్యటన చేసి, దేశంలో ప్రజలను, సంస్థలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్థం చేసుకుని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే నన్ను పనిలో దిగమని గోఖలేగారు ఆదేశించారు. కానీ ఒక సంవత్సరం తర్వాత కూడా నా అభిప్రాయాలను వెల్లడించేందుకు తొందర పడను…” అని స్వీయచరిత్ర ఐదో భాగంలో తాను 1915లో భారతదేశం తిరిగిరాగానే చేపట్టిన కార్యక్రమాల గురించి చెప్పినప్పుడు వివరిస్తారు. నాన్న మరణసమయంలో తన ప్రవర్తన గురించి చెబుతూ “మతం, ఆరోగ్యశాస్త్రం, లోకజ్ఞానం కలగలిపి లైంగిక సంపర్క నిషిద్ధ”మంటూ వ్యాఖ్యానిస్తారు గాంధీ.    మరోచోట “… నిమ్న జంతువులపై మనిషి ఆధిక్యతకు అర్థం మనిషి జంతువులను చంపి భక్షించాలని కాదు; మనిషి వాటి రక్షణకు తోడ్పడాలి” అంటూ అప్పటికి జరిగిన అధ్యయనాల చివరి మాటగా మనకు చెబుతారు. మరోచోట “పరిశుభ్రతకు భంగం వాటిల్లకుండా రోగిని ఏమాత్రం అసౌకర్యం కలుగకుండా, పడకకు మరక పడకుండా స్నానంతో సహా అన్ని కాలకృత్యాలూ పడకపైనే చేసుకోవచ్చని పాశ్చాత్య వైద్యశాస్త్రం మనకు నేర్పింది. అలాంటి శుభ్రత వైష్ణవ సంప్రదాయానికి అనుగుణంగా ఉందని నా అభిప్రాయం” అని కూడా అంటారు. విదేశాలకు వెళ్ళడం కులభ్రష్టత్వమని పెద్దలు నిషేధాలు చెబితే “కులం జోక్యం అనవసరమని నా అభిప్రాయం” అంటారు.    పరిశీలనను  జాగ్రత్తగా చేయడం, లోతుగా ఆలోచించడం, మంచి బుద్ధితో దీర్ఘకాలికంగా సమాజానికి ఎక్కువ మేలు కలిగేలా నిర్ణయం తీసుకోవడం గాంధీనైజం, ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్ళిన తొలిరోజుల్లో తను చేయాల్సిన పని గురించి గుమాస్తా చెప్పింది అర్థం కాక ‘బుక్ కీపింగ్’   పుస్తకం కొని చదివి, అర్థం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా వెళ్ళిన వారంలోనే చాలా సుప్రసిద్ధమైన సంఘటన (రైలు పెట్టె నుంచి తోసివేయబడటం) జరిగింది.  అయితే ఫస్ట్ క్లాసులో ప్రయాణం చేసే ముందు రైల్వే నియమావళి తెప్పించి, అధ్యయనం చేసి నిర్ణయించుకున్నాడు.    మూడో విభాగం 17వ అధ్యాయంలో శాస్త్రవేత్త ప్రఫుల్ల చంద్ర రేను గోపాలకృష్ణ గోఖలే ఎలా పరిచయం చేశారో వివరిస్తారు గాంధీజీ. రే తన జీతం 800 రూపాయలలో 40 రూపాయలు వుంచుకుని మిగతాది ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి వినియోగిస్తారని తెలుసుకున్నారు. తర్వాతి కాలంలో పి.సి.రే మహాశయుడు గాంధీజీకి జీవిత కాలపు మిత్రుడుగా మారారు. అలాగే అదే అధ్యాయంలో గోపాలకృష్ణ గోఖలే గురించి ఇలా రాస్తాడు “… అసత్యం, కపటం ఆయన జీవితంలో మచ్చుకు కూడా కానరాదు. ఆయన సాంగత్యం నాకు వరం. అది నా బుద్ధి వికాసానికి తోడ్పడింది”  ఇదీ గాంధీలో పరిశీలనా, నిర్ణయాలు తీసుకోవడంలో పరిణతి !      తన జీవితాన్ని మార్చిన పుస్తకం – జాన్ రస్కిన్ రాసిన   ‘అన్ టు ది లాస్ట్ (సర్వోదయ)’ గురించి వివరిస్తూ, మిత్రుడు పోలక్ ఇచ్చిన పుస్తకాన్ని రైలులో నిద్రపోకుండా 24 గంటల వ్యవధిలో చదివేశారు గాంధీజీ. తనకు అర్థమైనంతలో  సర్వోదయ సిద్ధాంతాలు ఇవి అంటూ రాస్తారు.   1. ఒక వ్యక్తి హితం సర్వజనుల హితంలో ఇమిడి ఉంది. 2. వకీలు పనికి ఎంత విలువ ఉందో క్షురకుడి పనికి కూడా అంతే విలువ ఉంది. ఎందుకంటే జీవనోపాధి హక్కు అందరికీ సమానమే. 3. శ్రమజీవనం, అంటే భూమిని దున్నేవాడి జీవితం, చేతులతో పనిచేసే వారి జీవితం శ్రేష్ఠమైన జీవితం.   ఈ మూడు అంశాలు రాసి – చివరలో రెండవదీ, మూడవదీ మొదటి దానిలో ఉన్నాయని నాకు తేటతెల్లమైంది అంటారు. బుద్ధి నైశిత్యం, తీవ్రమైన పట్టుదల, లోతయిన ఎరుక, మెరుగయిన రీతి బోధపడగానే స్వీకరించే విజ్ఞత, రాగద్వేషాలు ఎరుగని హృదయం – ఆ స్థాయిలో ఉంటాయి.      ‘ఇండియన్ ఒపీనియన్’ పత్రిక గురించి రాసిన సందర్భంలో –    “యాన్ అన్ కంట్రోల్డ్ పెన్ సెర్వ్స్ బట్ టు డెస్ట్రాయ్…” అని చెప్పగలిగే వివేకం ఆయన సొంతం. చివరి మాటగా స్వీయచరిత్ర రచన ప్రయోజనం నుంచి ఉపోద్ఘాతం ఆఖరులో ఇలా అంటారు – “… మై పర్పస్ ఈజ్ టు డిస్క్రైబ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ది సైన్స్ ఆఫ్ సత్యాగ్రహ, నాట్ టు సే హౌ గుడ్ ఐ యామ్.”      కనుక మనం తెలుసుకోవల్సింది ఏమిటంటే – గాంధీజీ అత్యుత్తమ మానవుడు దానికి కారణం ఆయనలోని కరుణ, దయతో కూడిన  రాగద్వేష రహితమైన వివేకంగల విజ్ఞాన దృష్టి!       
Also read: అవును… నేడు గాంధీయే మార్గం!
(ఫిబ్రవరి 28, నేషనల్ సైన్స్ డే సందర్భంగా)
–డా. నాగసూరి వేణుగోపాల్    
మొబైల్: 9440732392  

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles