గాంధీయే మార్గం-28
(గతవారం తరువాయి)
జాన్ రస్కిన్ గారి వాక్యం, గాంధీకి నచ్చిన భావన ఏమిటో తెలుసా?
– సంపద అంటూ వేరేది ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే అని! ఇపుడు ఇలాంటి దృష్టి తప్పనిసరి అయ్యింది. ఆధునిక వసతులు, సౌకర్యాలు, చెల్లుబాటు కాని పరిస్థితి ఏర్పడిరది. మరోవైపు గ్రామీణ జనాభా పెరిగిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలో దారిదీపంగా గాంధీజీ అందుబాటులో ఉన్నారు. ఆయనను స్వీకరించడం లేక పట్టించుకోకపోవడం అనేది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కన్జమ్షన్ కాదు, కన్జర్వేషన్ ముఖ్యం అని గాంధీజీ పలురకాలుగా పలు సందర్భాలలో ప్రకటించారు, వివరించారు. ప్రతి గ్రామం స్వయం సమృద్ధికావాలి, ఇతర వనరుల మీద ఆధారపడకుండా నిలువగలగాలి. ఇదెలా? కాస్త పరిశీలిద్దాం! గాంధీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం!!
Also read: గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ సాంఘిక, ఆర్థిక విధానాలు
– ఒకని ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆర్థికశాస్త్రం వ్యర్థ్ధం. కాబట్టి ఆరోగ్యాన్ని నాశనం చేసే అర్థశాస్త్రం దేనికీ కొరగాదు, ఆరోగ్యాన్ని కాపాడే ఆర్థికశాస్త్రమే నిజమైన శాస్త్రం. గ్రామీణ పునరుద్ధరణ కార్యక్రమంలోని ప్రధాన ఘట్టాలన్నీ నిజమైన ఆర్థిక శాస్త్రాన్ననుసరించి రూపొందింపబడ్డాయి. గ్రామీణుల అభివృద్ధికి ఈ కార్యక్రమం ఉద్దేశించబడిరది. (హరిజన్, 1-3-1935)
– నా దృష్టిలో నీతి శాస్త్రానికీ, అర్థశాస్త్రానికీ మధ్య పెద్ద తేడా లేదు. ఒక వ్యక్తి నీతి నియమాలను మంటగలిపే అర్థశాస్త్రం నీతి బాహ్యపు శాస్త్రం. (యంగ్ ఇండియా, 13-10-1921)
– పరిస్థితిని బట్టి ఆర్థిక శాస్త్ర సూత్రాలు మారాలి. (యంగ్ ఇండియా, 2-7-1931)
– ఆంగ్లేయ ఆర్థిక శాస్త్రాన్ని అనుసరిస్తే మనకు వినాశనం తప్పదు.(యంగ్ ఇండియా, 21.6.1919)- గ్రామ సౌభాగ్యంతో స్వరాజ్యం సిద్ధిస్తుంది. (హరిజన్, 11.11.1936)
– పట్టణాలకు ఉపకరించే పథకాలను మొన్నటి వరకు రూపొందించాము. మనమిక గ్రామసీమను సేవించాలి. వాటికి కావలసిన వాటిని పట్టణాలు అవే చూసుకోగలవు. మనం గ్రామాల స్థితిగతులను చూడాలి. గ్రామీణుల దురభి మానాలను, మూఢనమ్మకాలను, సంకుచిత దృక్పథాలను, మనం పారద్రోలాలి. దీనికి గాను ఒకే ఒక మార్గం కలదు. మనం వారితోపాటు వారి మధ్య జీవించాలి. వారి కష్టసుఖాల్లో పాల్గొనాలి. విద్యాబుద్ధులు నేర్పాలి. (యంగ్ ఇండియా 30.4.1931)
గాంధీ మహాత్ముని భావనలు ఇలాగే సరళంగా, సుబోధకంగా ఉంటాయి. అంతేకాదు సమగ్రంగా, సవ్యంగా కూడా ఉంటాయి. ఈ ఆలోచనల తీరు కూడా ఇంత సరళంగా ఉందే అని కూడా అనిపిస్తూంటుంది. గాంధీజీ జీవితాంతం రచయితగా, పాత్రికేయుడుగా కొనసాగారు. మిగతా పనులు అన్నీ తర్వాతనే! ఆయన ఆలోచనా పరుడు, పరిశోధనా శీలి, దార్శనికుడు, సిద్ధాంతకర్త. అయితే ఇలాంటి అభిప్రాయం ఆయన ఎక్కడా కల్గించలేదు. తన భావనలన్నీ హిమాలయాలు అంతటి పాతవి అని చాలాసార్లు చెప్పుకున్నాడు.
Also read: గాంధీజీని అనుసరించిన మహనీయులు
ఉదాహరణకు 1922 జనవరి 13 సంచిక ‘యంగ్ ఇండియా’లో ఆయన రచనలో ఒక వాక్యం ఇలా ఉంది. ‘‘నేటి శాస్త్రం, నేటి కళ మనలో పశుత్వాన్ని పెంపొదిస్తున్నాయి, మంచిని పెంపొందించడంలేదు.’’ మనం టెక్నాలజీగా, ఆర్ట్‌గా తీసుకుని ఇప్పటి సినిమాలు, ఇంటర్నెట్‌లో, సోషల్ మీడియాలో, టెలివిజన్‌లో తీరును పరిశీలించండి. అది కథ అయినా, కథనం అయినా, వార్త అయినా, కళారూపమైనా ఎంతో కొంత అశ్లీలతా, అసభ్యతా మాత్రమే కాక విచ్చలవిడిగా వాణిజ్య లాభాలు పొందాలనే కోరికా స్ఫుటంగా కనబడుతుంది. ఆ మహానుభావుడు ఎంత చక్కగా మనలోని అల్పత్వాన్ని వెలికి తీసేట్టు శతాబ్దం క్రితమే చెప్పారు అనిపించక మానదు. అయితే ఉపయోగపడే మాటలను ఏదో కారణం చెప్పి అటక ఎక్కించడం మనం నిత్యం చూస్తున్నదే! అలా గాంధీజీ సిద్ధాంతకర్తగా, దార్శనికుడుగా ఖండాంతరాలలో వ్యాపించి పోయారు, మనం అగాంధేయులుగా మిగిలిపోయాం. ఉదాహరణకు సప్తపాపాలు (సెవెన్ సిన్స్) అని ప్రచారం అయిన గాంధీ చెప్పిన విషయాలు చూడండి. పాపం చేసినవారికే అవి అవసరం అని భావించి మనం హేతుబద్ధంగా తప్పుకున్నాం. నిజానికి అవి అత్యంత ప్రమాదకరం, దీర్ఘకాలికంగా కూడా అవాంఛనీయం.
• పనిచేయకుండా లభించే ధనం• అంతరాత్మ అంగీకరించని ఆనందం• వ్యక్తిత్వాన్ని ఇవ్వని జ్ఞానం• నైతికత లోపించిన వ్యాపారం• మానవత్వానికి ప్రాముఖ్యత ఇవ్వని శాస్త్ర విజ్ఞానం• త్యాగ భావన లోపించిన మతం• విలువలకు పొసగని రాజకీయం.
Also read: శ్రమజీవిగా బహురూపి
ఇందులో వేరే లోకం ప్రస్తావన ఏముంది? అన్నీ వాస్తవికమైనవే, వర్తమాన కాలానికి అవసరమైనవే!ఏడు భావనలున్నాయని కవితాత్మకంగా ‘సెవెన్ సిన్స్’ అని పరిగణించి, తిరస్కరించి మనం పుణ్యాత్ములుగా మారిపోయాం. ఇప్పటి ప్రపంచంలో ఈ ఏడూ తు.చ. తప్పకుండా ఉల్లంఘిస్తున్నాం. గృహస్థుగా, కుటుంబ సభ్యులుగా, దేశ పౌరులుగా, ఉపాధిపరంగా, ఉబుసుపోకగా, సమాజ ఉద్ధరణగా ఈ ఏడు నియమాలను విజయవంతంగా దెబ్బ తీస్తున్నాం. ధనం, ఆటవిడుపు, నాలెడ్జి, వాణిజ్యం, సైన్స్, మతం, రాజకీయాలు – ఎలా ఉండకూడదో అలా రూపొందించి అదే నాగరికతగా, ప్రగతిగా, ప్రజాస్వామ్యంగా, ఆధునికతగా ముద్రవేసి ముందుకెడుతున్నాం. ఈ ఏడింటి భావనలలో ప్రతి ఒక్కరూ ఎంతో కొంత పాటిస్తే మన ఉద్యోగం, వ్యాపారం, విద్య, మతం, రాజకీయం – మొత్తంగా మెరుగవుతాయి. అలా కాక ఏదో ఫలితమే పరమోత్కృష్టం, దారి అడ్డదారి అయినా ఫర్వాలేదు అనుకుంటే ప్రమాదం! ఇది ఎలాంటిదంటే జీవితాంతం కష్టపడి, ఆరోగ్యం పాడుచేసుకుని ధనం సంపాదించి, జీవిత చరమాంకంలో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ ఆ సంపాదించిన ధనం వ్యయం చేయడంలాంటిది.
Also read: హింస… అహింస
అయితే గాంధీజీ ఆలోచనలు, భావనలు పాటించాలంటే పట్టుదల, ధైర్యం, తెగువ, చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం ఇవే కాకుండా వీటిని మించి కపటరాహిత్యం చాలా అవసరం. ఈ గుణాలు లేకపోవడంతోనే అన్ని అనర్థాలు వచ్చి పడ్డాయి. ఒక రకమైన ఊబిలో పడిపోయి, పలురకాలుగా దిగజారిపోతోంది సమాజం.
ఏడున్నర దశాబ్దాల కాలంలో స్వార్ధం, నైతిక విలువలు లుప్తమవడం, విశ్వాసరాహిత్యం, క్రౌర్యం, అహంకారం, అవినీతి, పోటీ, వాదులాడటం, ఈర్ష్యపడటం, అసంతృప్తి పడటం, అశాంతిగా సాగడం, పూర్తిగా సొంత లాభం గురించి ఆలోచించడం విపరీతంగా పెరిగిపోయాయి. ఇవన్నీ కూడా మెరుగయిన జీవనవిధానంగా, ఆకర్షణీయమైన ఆధునికతగా, ప్రపంచం మెచ్చిన పోకడలుగా చలామణి అవుతూ మన సమాజంలో కలిసిపోయాయి. మన సమాజంలో కలిసిపోయాయి. గాంధీ ఆశించిన ఎకానమి ‘నేచురల్ ఎకానమి’ అంటే అత్యంత సహజమైన ఆర్థ్ధిక విధానం, డొంక తిరుగుడు, కపటం, ద్రోహం లేని ఆర్థ్ధ్ధిక విధానం. అంతేకాదు ఆయన బోధించిన ఆర్థ్ధ్ధిక శాస్త్రం అసలు కృత్రిమమైనది కాదు.
(తరువాయి వచ్చే వారం)
— నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్ 9440732392 Also read: శ్రమజీవిగా బహురూపి
Also read: మానవ లోకానికే ధ్రువతార
(తరువాయి వచ్చే వారం)
డా నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్: 9440732392