గాంధీయే మార్గం-42
(గతవారం తరువాయి)
దేశంలో రాజ్యాంగ వ్యవస్థ పనితీరు సమీక్షకోసం 1928లో ఏర్పాటు చేసిన ‘సైమన్ కమిషన్’లో ఒక్క భారతీయుడు కూడా లేకపోవడంతో దేశంలో అలజడి మొదలైంది. అప్పుడు ‘సైమన్ గోబ్యాక్’ అనే నినాదం నలుదిశలా పిక్కటిల్లింది. దీనికి సంబంధించే మద్రాసులో ప్రకాశం పంతులు చొక్కా తీసి కాల్చమని ఎదురు పోయారు. అందువల్లనే ఆయనకు ‘ఆంధ్రకేసరి’ అనే పేరు వచ్చింది.
Also read: పల్నాడు, చీరాల, పెదనందిపాడు ఉద్యమాలు
పూర్ణ స్వరాజ్ కోసం తీర్మానం
1929లో లాహోర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ‘పూర్ణస్వరాజ్’ కోసం తీర్మానం చేశారు. దీనికి లక్ష్యంగా 1930 జనవరి 26ను ఎంచుకున్నారు. అప్పుడు గాంధీజీ రంగంలోకి దిగి 11 డిమాండ్లతో ఒక్క లేఖను వైస్రాయ్ ఇర్విన్ కు రాశారు. ఉప్పు పన్ను తీసివేయడం, సైన్యం ఖర్చు 30 శాతం తగ్గించడం, మద్యపాన నిషేధం, భూమి శిస్తు 50 శాతం తగ్గించడం వంటివి వాటిల్లో కొన్ని. ఈ డిమాండ్ల తీరు చూస్తే దేశంలోని ప్రజలందరి ఉద్యమంలో కలపాలనే గాంధీజీ ప్రణాళిక కనబడుతుంది.
Also read: తెలుగు నాట స్వాతంత్ర్య సమర పోరాటం
కార్యసాధనకు ఉప్పు సత్యాగ్రహం
ఇక కార్యసాధనకు ‘ఉప్పు సత్యాగ్రహం’ ప్రణాళిక వేశారు గాంధీజీ. బండ్లు, కార్లు కాకుండా కాలినడకన 200 మైళ్ళ దూరం నడిచి – గ్రామాల గుండా వెళ్ళేలా 1930 మార్చి 12న 78 మందితో బయలుదేరారు. ఈ బృందంలో 40 ఏళ్ళ లోపు ఉన్నవారే డెబ్బయిమందికి పైగా ఉన్నారు. వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి ఎర్నేని సుబ్రహ్మణ్యం. 1930 ఏప్రిల్ 6న ఈ బృందం దండి చేరింది, ఉప్పును తయారు చేసింది, ఉప్పు తయారీ శాసనాన్ని ఉల్లంఘించింది. బ్రిటీషు వారు ఊహించని విధంగా దండి సత్యాగ్రహం విజయవంతం అయ్యి అంతర్జాతీయంగా ప్రపంచ ప్రజలను ఆకర్షించింది. మొదటి ప్రపంచ యుద్ధం పరిణామాలు చవిచూసిన ప్రపంచానికి గాంధీ శాంతిమార్గం ఎంతో ఆసక్తి కల్గించింది. 1930 సంవత్సరంలో గాంధీజీని పత్రిక టైమ్స్ ‘మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అయ్యారు.
Also read: దేశాన్ని ఒక తాటిపై నడిపిన గాంధీజీపథం
లోతైన గాంధీ వ్యూహాలు
గాంధీజీ వ్యూహం, ప్రణాళిక చాలా ఆసక్తికరంగా, లోతుగా ఉంటాయి. ఎన్నో విషయాలు ఏకకాలంలో పర్యవేక్షిస్తూ, దేనికి మొగ్గకుండా దీర్ఘకాలిక దృష్టితో ప్రజాప్రయోజనాలకోసం స్థితప్రజ్ఞతతో సాగడం ఆయన విధానం… దండి సత్యాగ్రహం తర్వాత మళ్ళీ మనకు గాంధీజీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమ సమయంలోనే కనబడతారు. విద్య, మద్యపాన నిషేధం, గ్రామీణాభివృద్ధి, ఖద్దరు, పారిశుధ్యం, గ్రామీణ ఆర్థికరంగం – ఇలా చాలా రంగాలకు సంబంధించి గాంధీ స్వాతంత్ర్య ఉద్యమం సాగుతున్న రోజుల్లో అధ్యయనం చేయడం గమనించవచ్చు. వీటికి సంబంధించి ఎవరికి తగిన విషయాలలో వారికి బాధ్యతలు అప్పచెప్పడం కూడా గమనించాలి. జె.సి.కుమారప్ప, కమలాదేవి ఛటోపాధ్యాయ, జకీర్ హుస్సేన్, జె.బి.కృపలానీ, వినోబా ఇలా వివిధ వ్యక్తులు వివిధ రంగాలలో సమాంతరంగా కృషిచేశారు. వీరందరికీ గాంధీజీ, గాంధీజీ ఆలోచనలు కేంద్రంగా ఉండేవి.
Also read: భారత రాజకీయరంగంలో గాంధీజీ ప్రవేశం!
బ్రిటీష్ సర్కార్ దొంగదెబ్బలు
గాంధీజీ ముందస్తు సమాచారం ఇచ్చి, ఉత్తరంలో డిమాండ్లు రాసి, ఎప్పటిలోగా వాటిని తీర్చాలో చెప్పి కార్యాచరణకు దిగేవారు. అయితే బ్రిటీషు ప్రభుత్వం అప్పుడప్పుడు దొంగదెబ్బ తీసేది. ఏమాత్రం వీలున్నా గాంధీజీ వివిధ ప్రాంతాలు పర్యటించేవారు. జీవితాంతం రచయితగా, పాత్రికేయుడుగా కొనసాగారు. 1942 ఆగస్టు 9న గాంధీజీతోపాటు ఎంతోమంది అరెస్టయ్యారు. ఇక్కడ జైలులో ఉన్నప్పుడే భార్య కస్తూరిబాను, సహచరుడు మహదేవ్ దేశాయ్ ను గాంధీజీ పోగొట్టుకున్నారు. ఇవి ఆయనకు పెద్ద విఘాతాలు.
Also read: గాంధీజీ రాక ముందు దేశరాజకీయరంగం
గాంధీతో విభేదించిన కొడుకు హరిలాల్
పెద్ద కుమారుడు హరిలాల్ భారత స్వాతంత్ర్య పోరాటం జరిగినంత కాలం తండ్రితో విబేధిస్తూ వచ్చాడు. ఇంకోవైపు భారత రాజకీయ రంగంలో హిందూ-ముస్లిం చీలిక 1905-06 నుంచి స్పష్టంగా కొనసాగుతోంది. దీన్ని గమనించి జీవితపర్యంతం దానినే తన తొలి ప్రాధాన్యతగా స్వీకరించారు. చివరకు దాని కారణంగానే హత్యకు గురయ్యారు. గాంధీజీ మీద జరిగిన హత్య మొత్తం ప్రపంచాన్ని నివ్వెరపరచింది, ఆ సమయంలో 1947 నుంచి మొదలైన నరమేథం తగ్గింది కూడా దీని కారణంగానే అనేది చరిత్ర చెప్పే వాస్తవం.
Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు
చెప్పింది ఆచరించే స్వభావం
సైద్ధాంతిక బలం; కఠోరమైన ఆచరణ; మంచిని మాత్రమే చూసే, కోరే లక్షణం; ఓడిపోని సహిష్ణుత; వీటన్నిటికి మించి ‘చెప్పింది చేసి చూపించే పారదర్శకత’ గల గాంధీజీ మన సమాజం సర్వతోముఖాభివృద్ధి కావాలని ఆశించారు. రాజకీయ స్వాతంత్ర్యం తోపాటు ఆ స్థాయిలోనే గ్రామాలు, మహిళలు, పరిశ్రమలు, వైద్యం, విద్య, పరిసరాలు మెరుగవ్వాలని వాంఛించారు. జవహర్లాల్ నెహ్రూ, మహమ్మదాలీ జిన్నా, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, నేతాజీ, రాజాజీ, పట్టాభి, మౌలానా ఆజాద్, ప్రకాశం పంతులు– ఇలా ఎంతోమంది విలక్షణమైన, వైరుధ్యమైన స్వభావాలు గల నాయకులందరినీ ఒక తాటి మీద నడిపారు గాంధీజీ.
Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!
ప్రజలు సొంతం చేసుకున్న ఉద్యమం
దక్షిణాఫ్రికాలో పోరాటం సాగించినపుడే భారతీయులలో ఉండే సహజమైన లోపాలు గమనించి అధ్యయనం చేసిన గాంధీజీ భారతదేశంలో రాజకీయ రంగంలో ప్రవేశించే ముందు ఒక సంవత్సరం పాటు దేశమంతా పర్యటించారని గుర్తు పెట్టుకోవాలి. మీటింగ్ పెట్టి, మహజర్లు సమర్పించే స్థాయి నుంచి ఉద్యమాన్ని గాంధీజీ దేశంలో ప్రతి ఒక్కరు తమదే ఉద్యమం అనేలా మలిచారు. కనుకనే ఎన్నో అవలక్షణాలు, పరిమితులున్న ఈ సమాజం – 40 కోట్ల జనాభా ఉన్న దేశం — అహింసాత్మకంగా పోరాడింది.
Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి
గాంధీజీ దార్శనికతను గుర్తించాలి
ఈ పోరాటంలో సుమారు నాలుగు కోట్ల మంది – స్త్రీలు యువత, పిల్లలు పాల్గోవడం కేవలం గాంధీజీ శాంతి బాట కారణంగానే వీలయ్యింది. 1916 నుంచి 1948 దాకా గాంధీజీ ప్రదర్శించిన విజ్ఞతను, ఎరుకను, సహనాన్ని, దార్శనికతను అమృత మహా ఉత్సవాల సందర్భంగా సమగ్రంగా, సవ్యంగా తెలుసుకోవడం ఎంతో అవసరం! ప్రపంచస్థాయిలో గాంధీజీ విధానాలకూ, సిద్ధాంతాలకూ, చలామణి గణనీయంగా పెరుగుతున్నదని ఒక వాస్తవం!!
(అయిపోయింది)
Also read: గాంధియన్ ఇంజనీరింగ్
డా. నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్ -9440732392