గాంధీయే మార్గం-29
(చివరి భాగం)
1921 డిసెంబరు 9న ‘యంగ్ ఇండియా’ పత్రికలో గాంధీజీ ఇలా రాశారు:
ఆర్థ్ధికశాస్త్రం నాకు అంత బాగా తెలియదు.
అయితే, అర్థశాస్త్రం గ్రంథాలలో నుదహరించిన సూత్రాలు సర్వేసర్వత్రా, అనివార్యంగా, ఆచరణ యోగ్యమైన సూత్రాలని మాత్రం చెప్పను.
జర్మనీ ఆర్థిక వ్యవహారాలు వేరు, ఇంగ్లాండు ఆర్థిక వ్యవహారాలు వేరు. జర్మనీలో బీటుదుంపలు విరివిగా పండుతాయి. వీటి నుండి తయారైన పంచదారతో జర్మనీ బాగుపడింది. ఇక ఇంగ్లాండు విదేశీయ వ్యాపార రంగాలను కొల్లగొట్టి బాగుపడింది. కొద్దిపాటి దేశాలలో సాధ్యపడింది, పందొమ్మిది వందల మైళ్ళ పొడవు, పదిహేను వందల మైళ్ళు వెడల్పు గల విశాలమైన దేశాలలో సాధ్యపడదు.
Also read: గాంధీ ఆర్థిక శాస్త్రం కృత్రిమ మైంది కాదు!
ఒక దేశపు ఆర్థిక విషయాలు ఆ దేశపు వాతావరణ పరిస్థితులను, భౌగోళిక స్థితిగతులను, ప్రజల స్వభావాలను ఆధారం చేసుకుని ఉంటాయి. ఇటువంటి ప్రధాన విషయాలలో భారతదేశ పరిస్థితి ఇంగ్లాండు దేశ పరిస్థితికి భిన్నంగా ఉంటుంది. ఇంగ్లాండుకు పాయసమైనది చాలా విషయాలలో ఇండియాకు విషం కావచ్చు.
(ఈ వ్యాసంలో ఇంతవరకు ఉటంకించిన గాంధీ భావనలు ప్రధానంగా 1959లో ఉప్పులూరి వెంకట సుబ్బారావు సంకలనం, అనువాదం చేసిన గాంధీ దర్శనం – ఆదర్శ గ్రంథమండలి, విజయవాడ ప్రచురణ – రెండవ ముద్రణ 1971 నుంచి స్వీకరించాం.)
Also read: గ్రామాల సుస్థిర అభివృద్ధికి గాంధీజీ సాంఘిక, ఆర్థిక విధానాలు
గాంధీజీ ఆర్థిక అవగాహనలో శ్రేయస్సే ప్రధానం
తనకు అంత బాగా తెలియదు అంటూనే మన దేశానికి తగిన ఆర్థిక శాస్త్ర పరిధి ఏమిటో, దాన్ని దాటితే ఎంత ప్రమాదకరమో గాంధీజీ వివరించారు. అది ఆయన విధానం! గాంధీజీ న్యాచురల్ ఎకానమీలో సార్వత్రికమైన మానవీయ విలువలే చట్రంగా ఉంటాయి. సత్యం – అహింసలే ఆధారభూతంగా ఉంటాయి. శ్రేయస్సు ప్రధానం కానీ ప్రేయస్సు కాదు. అందులో హింసకు, అవినీతికీ, పోటీకీ, విబేధాలకు, తగువులాటలకూ అవకాశం లేదు.
దీనికి విభిన్నమైన, కృతకమైన ఆర్థ్ధిక విధానం పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా పారిశ్రామిక దేశాలలో పాటించబడేది. ముఖ్యంగా పారిశ్రామిక విప్లవం తర్వాత ఉత్పత్తి, వినియోగం, మార్కెట్ ఆధారంగా సాగుతోంది. ఇదే ప్రస్తుతం గ్లోబల్ ఆర్డర్‌గా చలామణి అవుతోంది. కరోనా సమయానికి ముందు కాలంలోనే కాదు, కరోనా కాలంలో కూడా ఈ కృత్రిమ ఆర్థిక విధానాలు గాలి బుడగల్లా పేలిపోయాయి. అమెరికా వంటి దేశం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత, ముఖ్యంగా ప్రపంచీకరణ తర్వాత ఉజ్వలంగా మిరుమిట్లు గొలిపింది. అయితే కోవిడ్-19 కాటులో ఎంత విషాదకరంగా తల్లడిల్లిందో, ఎన్ని మరణాలు చవిచూసిందో మనకు తెలియంది కాదు. అమెరికాతో, ఇంగ్లాండుతో పోలిస్తే మనదేశం కరోనా సమయంలో ఆ రీతిలో తల్లడిల్లకపోవడాన్ని కూడా మనం గమనించాలి.
Also read: గాంధీజీని అనుసరించిన మహనీయులు
అవసరాలు వేరు, అత్యాశలు వేరు
మన అవసరాలను ప్రకృతి తీరుస్తుంది కానీ అత్యాశలను కాదని గాంధీజీ చెప్పిన మాటను నేడు పర్యవరణ దృష్టికి తలమానికంగా పరిగణిస్తున్నాం. అలాగే కన్జమ్షన్ కాదు, కన్జర్వేషన్ (వినిమయం కాదు, పరిరక్షణ) అవసరం అనే భావననూ గొప్పగా గౌరవిస్తున్నాం. కనుక ప్రకృతినీ, దాని నియమాలనూ మనిషి తప్పక గౌరవించాలి. ‘‘ప్రకృతికి శూన్య స్థలమంటే గిట్టదు. అందువలన లయంతోపాటు సృష్టి జరుగుతూనే ఉంటుంది’’ (యంగ్ ఇండియా 8-5-1924) అని కూడా అంటారు. అలాగే ప్రకృతి ఆది నుండి పాటించే మార్పుల తీరును కూడా గుర్తించమంటుంది గాంధేయ వాద ఆర్థికశాస్త్రం. ఆర్థిక ప్రగతికి తూగగల మానవీయ విలువలు కూడా పెరగాలి. దీనిని గాంధీజీ చాలా రకాలుగా పేర్కొన్నారు. 1972లో ఎం.ఐ.టి. నుంచి డెన్నిస్, డొనెల్లా మెడోస్ అనే శాస్త్రవేత్తల బృందం లిమిట్స్ టు గ్రోత్ అనే క్లబ్ ఆఫ్ రోమ్ క్లాసిక్ రిపోర్ట్ లో తొలిసారి సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ (సుస్థిర అభివృద్ధి) అనే భావనను ప్రతిపాదించింది.
Also read: శ్రమజీవిగా బహురూపి
1980లో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ సంస్థ వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రేటజీ వెలువరిస్తూ ప్రపంచానికి తొలి అవసరం ఇది అంటూ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అనే పదం వాడిరది. 1987లో ఐక్యరాజ్య సమితి వరల్డ్ కమీషన్ ఆన్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ (పర్యావరణం, అభివృద్దిపైన ఐక్య రాజ్య సమితిని నియమించిన ప్రపంచ అధ్యయన సంస్థ), 1992లో ఐక్య రాజ్యసమితి పర్యావరణం, అభివృద్ధి సమావేశం ఈ భావనను మరింత లోతుగా చెప్పడం, ప్రణాళికను ప్రతిపాదించడం గమనించవచ్చు. ఈ నేపథ్యంలోనే హోలిస్టిక్ డెవలప్‌మెంట్ (సమగ్రాభివృద్ధి), పీస్ అండ్ ప్రాస్పరిటి (శాంతి, సౌభాగ్యం) మొదలైన భావనలు ముందుకొచ్చాయి. అలాగే లిమిట్స్ టు గ్రోత్ అనే విషయాలు కూడా చర్చింపబడ్డాయి. గాంధీజీ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అనే మాట వాడలేదు కానీ భవిష్యత్తు కోసం ప్రపంచానికి అవసరమైంది చెప్పాడు.
Also read: హింస… అహింస
జాన్ రస్కిన్ భావన
గాంధీజీ ప్రకారం ఆర్థిక ప్రగతి అంటే కేవలం సంపద కాదు. ఇక్కడే గాంధీజీ ఇష్టపడిన జాన్ రస్కిన్ భావన (సంపద అంటూ వేరే ఏమీ లేదు, ఉన్నది కేవలం జీవితం మాత్రమే)ను గమనించాలి. గాంధీజీ ప్రకారం మన వినియోగ ధోరణులకు కుదింప చేసుకుంటే సెల్ఫ్ సఫిసియన్సీ(స్వయంసమృద్ధి) వస్తుంది. దానికి ఆయన ‘గ్రామ స్వరాజ్’ భావనను ప్రతిపాదించారు. ఆయన 1940 ‘హరిజన్’ సంచికలో అన్న ఒక మాట మనలను కలవరపెడుతుంది. గ్రామాల గురించి ఆలోచించడమే అహింస అని ఆయన అంటారు. గ్రామాలకు తగిన స్థానమిచ్చి, గౌరవిస్తే స్వరాజ్యం అదే సిద్ధిస్తుందని స్వాతంత్య్రం రావడానికి ఏడేళ్ళ ముందు గాంధీ ఘంటాపథంగా చెప్పారు. గ్రామం ఒక ‘ఇండిపెండెంట్ యూనిట్’గా నిలవాలి, స్వయం సమృద్ధి సాధించాలి. (Exploring of villages is itself against violence. If we want Swaraj to be built on non violence, we will have to give the villages their proper place.)
గాంధేయ ఆర్థికశాస్త్రం విషయం చర్చకు వచ్చినప్పుడు మనకు స్పష్టంగా గుర్తుకు వచ్చే వ్యకి రామచంద్ర గుహ చేత ‘ది గ్రీన్ గాంధీ’ గా ప్రస్తుతించబడిన జె.సి.కుమారప్ప.
Also read: గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ
గాంధీ ఆర్థిక విధానాల అమలుకు స్థిరచిత్తం అవసరం
ఇటీవల కాలంలో అనిల్ కొకోడ్కర్ వంటి శాస్త్రవేత్తలు భారతీయ గ్రామీణ ప్రగతికి ఏ రకంగా గాంధీజీ విధానాలు ప్రయోజనకరమో వివరిస్తూనే ఉన్నారు. మిగిలిన అన్ని గాంధీ సిద్ధాంతాల లాగే గాంధీ ఆర్థిక సిద్ధాంతాలు కూడా చాలా సరళమైనవి, కపటం లేనివి, అత్యాశలు పెంచనివి. వాటిని పాటించి ప్రతి గ్రామం సారవంతమైన నేలతో, నిండిన చెరువులతో, కళకళలాడే పశువులతో, పంటలతో – కాలుష్యానికి దూరంగా ‘ఒక ఇండిపెండెంట్ యూనిట్’గా – గాంధీజీ ప్రబోధించిన నిర్మాణ కార్యక్రమం తొలి భావనగా – వృద్ధి చెందితే అదే సుస్థిర అభివృద్ధి. మరి దాన్ని సాధించాలంటే స్థిర చిత్తం, ఆత్మ విశ్వాసం, పట్టుదల, త్యాగబుద్ధి, అంచంచలమైన ధైర్యం పుష్కలంగా అవసరం!
Also read: మానవ లోకానికే ధ్రువతార
(జనవరి 30 గాంధీజీ వర్థంతి)
డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్: 9440732392