Thursday, December 26, 2024

గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!

గాంధీయే మార్గం-35

(రెండో భాగం)

గాంధీజీ కనుమూసినపుడు ‘ఆంధ్రప్రభ’ దినపత్రికలో 1948 ఫిబ్రవరిలో ధారావాహికగా రాసిన పది సంపాదకీయాలలో ఒకటి అయిన ‘గాంధీజీ మహాస్వప్నం’లో ‘ఆయన సిద్ధాంతాల ప్రకారం యంత్రాలు తగవు…’ అని నార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఇటువంటి అభిప్రాయాలు తెలుగుతోపాటు చాలా భాషలలో అలాగే సాగాయి.  

ధనుంజయ కీర్‌ 1973లో రచించిన ‘మహాత్మాగాంధీ : పొలిటికల్‌ సెయింట్‌ అండ్‌ అన్‌ ఆర్మ్డ్‌ ప్రొఫెట్‌’ అనే గ్రంథాన్ని సమీక్షిస్తూ నార్ల వెంకటేశ్వరరావు ఇలా అన్నారు ‘‘… గాంధీజీ ప్రపంచ పురుషులలో ఒకడైనా, ఆయన హేతువాది కాదు. సైన్సును ఆయన నిరసించారు. ఆధునికతనే నిరసించారు. మతానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. అందువల్ల ఇతర హేతువాదుల వలే కీర్‌ కూడా గాంధీజీ ప్రతివాక్కును, ప్రతిచర్యను హర్షించలేదు. సమర్థించలేదు…’’ నార్ల రాసిన ఈ సమీక్షను 1976లో వెలువడిన ‘కదంబం’ గ్రంథంలో ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.

Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి 

సరే, ఇంకో విషయం చూద్దాం. 1969లో గాంధీ శతజయంతి సంవత్సర ప్రచురణగా బి.కె.ఆహ్లువాలియా సంపాదకత్వంలో ‘ఫేసెట్స్‌ ఆఫ్‌ గాంధీ’ అనే సంకలనం వెలువడింది. సర్వేపల్లి రాధాకృష్ణ, జవహర్‌ లాల్‌ నెహ్రూ, వి.వి.గిరి మొదలైన 24 మంది మహామహులు గాంధీజీ జీవితం, ఆలోచనలు గురించి రాసిన విశ్లేషణలు ఇందులో ఉన్నాయి. ఈ సంకలనం అన్ని భారతీయ భాషలలోకి అనువదించబడింది. తెలుగులో పాలగుమ్మి పద్మరాజు, పిలకా గణపతిశాస్త్రి, విద్వాన్‌ విశ్వం, బాలాంత్రపు నళినీకాంతరావు, బి.వి.సింగరాచార్య తెనుగు చేసిన ‘గాంధీదర్శనం’ సెప్టెంబరు 1969లో ఎస్‌ఎల్‌బిటి ద్వారా ఎం.శేషాచలం అండ్‌ కో వారు ప్రచురించారు. ఈ ప్రచురణకు ముందుమాట రాసినవారు కాకా కలేల్కర్‌, అవును ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న బాల్‌ కాలేల్కర్‌ తండ్రి.

సర్వేపల్లి రాధాకృష్ణయ్య వ్యాఖ్య 

మంచి ఉపోద్ఘాతంలా కనబడే 18 పేజీల వ్యాసం రాసిన డా. ఎస్‌. రాధాకృష్ణయ్య గారు అందులో ఇలా రాశారు. 

(అనువాదం : బి.వి. సింగరాచార్య)

‘‘గాంధీజీ యంత్రాలను నిరాకరించలేదు. ఆయన అన్నది ఇది : ‘నా శరీరమే అతి సూక్ష్మాంశాలతో సంకీర్ణమైన యంత్రమని నాకు తెలిసినప్పుడు, నేను యంత్రాలకు వ్యతిరేకిని ఎలా అవుతాను? చరఖా అనేది యంత్రం. పళ్ళు కుట్టుకునే పుల్ల యంత్రం, యంత్రాలను గురించిన వ్యామోహానికి మాత్రం వ్యతిరేకినే, కేవలం యంత్రాలకు కాదు, శరీరపరిశ్రమను తగ్గించే యంత్రాలనబడే వాటిని గురించిన వ్యామోహం నేడు ఎక్కువగా కన్పిస్తూంది. వేలాదిమందికి పనులు లేకుండా పోయేవరకూ ఈ విధంగా మనం పనిని తగ్గించేసాం. వాళ్ళంతా సోమరులుగా వీధులలో తిరుగుతూ ఆకలితో మరణిస్తారు. మానవులలో ఎవరో కొంతమందికి మాత్రం పని, కాలం పొదుపు చేయటం నాకు సమ్మతం కాదు. ఈ పొదుపు మానవజాతి అంతటికి లభించాలి. ఐశ్వర్యమంతా ఎవరో కొందరి చేతులలో పేరుకొని ఉండటం కాదు, అందరికి పంపకం కావాలని నా అభిమతం. నేడు ఎవరో కొద్దిమంది లక్షలాది ప్రజానీకం మూపులపైన ఊరేగటానికి మాత్రమే యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. దీని అంతరంగ ప్రేరణ శ్రమను పొదుపు చేయాలనే ఔదార్యం కానేకాదు, కేవలం పేరాశ. ఈ విధమైన పరిస్థితిని నేను నా సర్వశక్తులలో ప్రతిఘటిస్తాను. యంత్రం మానవుని కర్మేంద్రియాలను స్తబ్దం చేయకూడదు. పెద్ద పెద్ద కర్మాగారాలలో విద్యుచ్ఛక్తితో పనిచేసే యంత్రాలన్నిటినీ జాతీయం చేసి, ప్రభుత్వ యాజమాన్యం కింద నడపాలి. అన్నింటికన్నా ప్రధానమైనది మానవశ్రేయస్సు.’’   

Also read: గాంధియన్‌ ఇంజనీరింగ్‌

ఈ మాటలు గాంధీజీ చెప్పారని డా. సర్వేపల్లి వారు పేర్కొన్నారు. నిజానికి ఇది గాంధీజీ యంత్రాల గురించి చెప్పినది విజ్ఞాన శాస్త్రాంశమే కాదు, ఆర్థిక ప్రణాళిక కూడా! యంత్రాలతో ఏమి జరుగుతుందో, ఏమి జరుగకూడదో గాంధీజీకి విస్పష్టమైన అభిప్రాయం ఉంది. ఇందులో ఏమాత్రం అస్పష్టత లేదు. ఇప్పుడు మనకు స్ఫురించే ప్రశ్న ఏమిటంటే – నార్ల వెంకటేశ్వరరావు వంటి దార్శనిక సంపాదకుడు ఈ శతజయంతి ప్రచురణ చూడలేదా లేక రాధాకృష్ణయ్య  వ్యాసం చదవలేదా అనే ప్రశ్నలు స్ఫురిస్తున్నాయి. ఇదెలా జరిగింది? ఎందుకు జరిగింది? 

గాంధీ దర్శనం

‘గాంధీ దర్శనం’ సంకలనంలోనే శాస్త్రవేత్త యు.ఆర్‌.రావు ఒక వ్యాసం రాశారు. గాంధీజీ యంత్రాల గురించి ఏమన్నారని చాలా సుతారంగా స్పృశించి వదిలివేశారు. మరెవరూ గాంధీజీ సైన్స్‌ దృష్టి, సైన్స్‌ ఆసక్తి గురించి రాయలేదు. అంతేకాదు ఆర్థిక శాస్త్రం, విద్య, మహిళలు వంటి విషయాల గురించి, గాంధీజీ ఆలోచనల గురించి ఈ సంకలనంలో ఎవరూ రాయలేదని గమనించాను. నిజానికి చాలా అధ్యయనాలు, ప్రాచుర్యం నేటికీ అవసరమైన పార్శ్వాలు ఇవి. ఇదెలా జరిగిందో కానీ గాంధీజీ మాత్రం యంత్రాలకు, విజ్ఞానానికి, ఆధునికతకు వ్యతిరేకి అనే ప్రచారం బాగా సాగింది. ఇప్పుడూ సాగుతోంది.

Also read: శ్రేయస్సు మరువని సైన్స్‌ దృష్టి

గాంధీజీ ఖాదీ ఉద్యమాన్ని సైన్స్‌ వ్యతిరేకమని ముద్రవేయడం ఆల్డస్‌ హక్స్లీ (Aldous Huxley)తో మొదలైందని చేబ్రోలు శంభుప్రసాద్‌ ‘టువర్డ్స్‌ యాన్‌ అండర్‌స్టాండింగ్‌ ఆఫ్‌ గాంధీస్‌ వ్యూస్‌ ఆన్‌ సైన్స్‌’ అనే పరిశోధనాత్మక వ్యాసం (ఎకనామిక్‌ అండ్‌  పొలిటికల్‌ వీక్లీ, 29 సెప్టెంబరు 2001)లో వివరిస్తారు. గాంధీజీ ఎంత మాత్రం యాంటీ సైన్స్‌ కాదనీ, పౌరసమాజంలో ప్రత్యామ్నాయ సైన్సుకు అవకాశం వుండాలనీ, అభౌతికమైన వనరులను సైన్స్‌ వ్యవస్థలో ఎలా వినియోగించాలో,  సత్యాగ్రహి శాస్త్రవేత్త భావన గురించీ, ఈ దృష్టిలో మనిషి – ప్రకృతి మధ్య సంబంధం …మొదలైన వాటి గురించి గాంధీజీ ఆలోచనలు ఏమిటో కూడా ఈ సమీక్షాత్మాక వ్యాసంలో చర్చించారు. సైన్స్‌ సంబంధించిన గాంధీజీ ఆలోచనలను ఇంతవరకు ఎవరూ లోతుగా పట్టించుకోలేదు అని కూడా డా.శంభు ప్రసాద్‌ వివరిస్తున్నారు.

శాస్త్రవిజ్ఞానం, సమాజంపైన నెహ్రూ 

1988లో నెహ్రూ మ్యూజియం అండ్‌ మెమోరియల్‌ లైబ్రరీవారు వెలువరించిన ‘నెహ్రూ ఆన్‌ సైన్స్‌ అండ్‌ సొసైటీ’  (సంపాదకులు – బి.సింగ్‌) గ్రంథంలో నెహ్రూ ఇలా అన్నట్లు పేర్కొంటున్నారు.   

“… It (Gandhi’s) may not be a correct attitude: its logic may be faulty… Even this attitude is not necessarily accepted by the political associates and followers of Gandhi. Personally I don’t agree with it and I should make it clear that the Indian Congress and the national movement have not adopted it.  

I have mentioned these considerations to you not to defend the spinning wheel but so that you may realise that Indian Nationalism is not opposed to big scale machinery and  much less to science. I have no doubt that when it is in a position to do so, it will industrialise the country as rapidly as possible.  My whole outlook on life and its problems is a scientific and I have never felt attracted towards religion and its methods.” (పుటలు – 15, 18). 

ఈ మాటలు అనువాదం చేసి, అనువాదకుడు అవాంతరంగా ఉండకూడదని అలాగే ఇచ్చాను. ఈ మాటలు ఉదహరిస్తూ డా.సి.శంభుప్రసాద్‌ ఇలా వ్యాఖ్యానిస్తారు పై వ్యాసంలోనే: 

“… Nehru while seeking to explain Gandhi’s attitude to science actually ends up furthering the divide between the so-called personal view of Gandhi and the public view of the Congress. His view shared by a large section of the Indian intelligentsia even today acknowledges Gandhi’s ability merely to mobilise people and rally them around the call for freedom. The Charkha is consequently important for its immediate economic and instrumental value in achieving freedom, to be discarded later. Nehru makes a clear divide between himself as a science person and Gandhi as a religious man…”

శంభుప్రసాద్‌ గారు చక్కగానే జరిగిందేమిటో చెప్పారు. కాంగ్రెస్‌ వాదులమనుకునే వారు ఎక్కువమంది అధికారంవైపు నిలబడిపోయారు.  గాంధేయవాదులమని అనుకునేవారు కేవలం ఆచారపరాయణులుగా మిగిలిపోయారు.  ఈ గాంధేయవాదులు గాంధీజీ ఆలోచనలను పరిశీలించాలని తలంచలేదు. ఇంకా  ఎక్కడ పరిశోధన? అలా రెండు మూడుతరాలు గడిచిపోయాయి. 

ముప్పయి, నలభయ్యేళ్ళ క్రితం గాంధీని సవ్యంగా చూడాలనే ప్రయత్నాలు మొదలయ్యాయి. రిచార్డ్  అటెన్బరో నిర్మించిన ‘గాంధీ’ సినిమా కూడా ఇక్కడ ఒక మలుపుగా పరిగణించాలి. ఏ.కె. బిస్వాస్‌, ఎం.మెక్లోర్‌ (వీవషశ్రీబతీవ), జె.పి.యస్‌. ఉబరాయ్‌, ఎస్‌.విశ్వనాథ్‌, ఎస్‌.సహస్రబుద్ధే వంటి వారు 1985-2000 మధ్యకాలంలో గట్టి కృషి చేశారు. వీరి ప్రయత్నాలను విహంగ వీక్షణంగా శంభుప్రసాద్‌ తన వ్యాసంలో పేర్కొన్నారు. గాంధీజీతో విబేధించేవారంతా 1909లో గాంధీ రచించిన ‘హింద్‌ స్వరాజ్‌’ ను ఆధారంగా తీసుకుంటారు. అనుభవంతో, పరిజ్ఞానంతో తన అభిప్రాయాలు మెరుగుపరుచుకునే గాంధీజీని పూర్తి అర్థం చేసుకోవాలంటే 1948లో గాంధీజీ గతించేదాకా  చేసిన  మొత్తం రచనలను అధ్యయనం చేయాలి. 

సుధీంద్ర కులకర్ణి ఈ విషయం గురించి ఇలా వ్యాఖ్యానిస్తారు. “… his writings demand attentive study, superficiality breeds stupidity…”  (మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌).

Also read: సైన్స్‌ ఆఫ్‌ బ్రహ్మచర్య

ప్రపంచ అహింసా దినోత్సవం

శాంతి ప్రవక్తగా గాంధీజీ సేవలను గౌరవిస్తూ ఐక్యరాజ్యసమితి 2007 నుంచి అక్టోబరు 2వ తేదీని ‘ప్రపంచ అహింసా దినోత్సవం’గా గుర్తించింది. ఇటువంటి సంఘటనల ద్వారా గాంధీజీని సరికొత్తగా పరిశీలించడం కూడా మొదలైంది. శాస్త్రవేత్త రఘునాథ్‌ ఎ. మాషెల్కర్‌ చేసిన కృషి విభిన్నమైంది, ప్రభావవంతమైంది. ఆయన చమత్కారంగా, అర్థవంతంగా ఉండే క్యాచీ స్లోగన్స్‌ ఇవ్వడంలో సిద్ధహస్తులు. పబ్లిష్‌ అండ్‌ పెరిష్‌, పేటెంట్‌ అండ్‌ ప్రాస్పర్‌ అని మేధోహక్కులు గురించి అర్థవంతంగా  చెప్పారు.

మాషేల్కర్ ప్రతిపాదించిందే మోర్‌ ఫ్రమ్‌ లెస్‌ ఫర్‌ మోర్‌ (ఎంఎల్‌ఎం) భావన. పరిమిత వనరులతో ఎక్కువ ఫలితాలు సాధించి ఎక్కువమందికి దోహదపడటం ఈ భావన. 2008లో ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తల బృందానికి ప్రసంగమిస్తూ ఈ నియమాన్ని ప్రతిపాదించారు. అదే ‘గాంధేయ సాంకేతిక విజ్ఞానం’ లేదా ‘గాంధియన్‌ ఇంజనీరింగ్‌’. సి.కె.ప్రహ్లాద్‌తో కలసి 2010 జూలై-ఆగస్టులో ‘హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ’ జర్నల్‌కు ఈ విషయంపై పరిశోధనా పత్రం రాశారు ఆర్‌.ఏ.మాషేల్కర్‌. తర్వాత వేర్వేరు వేదికల మీద దీని గురించి చర్చించారు. (మీరు కూడా నెట్‌లో కొంత శోధిస్తే చాలా విషయాలు తారసపడతాయి.) 

Also read: సమగ్రాభివృద్ధియే లక్ష్యం

సుధీంద్ర కులకర్ణి కృషి

మాషేల్కర్‌ ప్రతిపాదించిన భావన ఒక గొప్ప పుస్తకం రావడానికి దోహదపడింది. అదే సుధీంద్ర కులకర్ణి రచించిన ‘మ్యూజిక్‌ ఆఫ్‌ ది స్పిన్నింగ్‌ వీల్‌’. బొంబాయిలో 2010 ఏప్రిల్‌లో సుధీంద్ర కులకర్ణి ఒక సమావేశం ఏర్పరచి మాషేల్కర్‌ చేత ప్రసంగం ఇప్పించారు – ఇదే అంశం మీద. 

చాలామందికి లాగే గాంధీజీ ఏమిటి? ఇంజనీరింగ్‌ ఏమిటి? – అనే ప్రశ్నలు సుధీంద్ర కులకర్ణికి కలిగాయి. ఆ రకంగా ప్రపంచస్థాయిలో చర్చకు తెరలేపిన మహాశయుడు మాషేల్కర్‌. ఫలితంగా సుధీంద్ర కులకర్ణి రెండేళ్ళపాటు గాంధీ అధ్యయనంలో మునిగిపోయి 2012లో ఏడువందల పైచిలుకు పుటల గ్రంథం  ఈ ఇంటర్‌ నెట్‌ తరానికి అందించారు. 

ఈ తరం వారికి గాంధీజీ స్ఫూర్తి కల్గించారు. మరి భారతీయ శాస్త్రవేత్తలలో ప్రఫుల్ల చంద్ర రే, జగదీశ్‌ చంద్రబోస్‌, సి.వి.రామన్‌ గురించి ఇదివరకే చర్చించుకున్నాం. గాంధీ ప్రభావాన్ని జీవితంలో విజయవంతంగా రంగరించుకున్న భారతీయ శాస్త్రవేత్తలు ఎవరైనా ఉన్నారా?   గాంధీకి సంబంధించిన చర్చింపబడని, విమర్శలకు లోనైన విజ్ఞాన విషయాలు, బ్రహ్మచర్యం, మహిళలు, ఆర్థికాంశాలు గురించి ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రాశారు. ఈ వ్యాసం ప్రారంభంలో పేర్కొన్న నాలుగు దృష్టాంతాలు కూడా సుధీంద్ర కులకర్ణి పుస్తకం నుంచి స్వీకరించినవే! సుధీంద్ర కులకర్ణి ఉపోద్ఘాతంలో ఇలా అంటారు –  డిజిటల్‌ టెక్నాలజి రంగంలో గొప్ప కృషి చేసినవారిలో Norbert Wiener, Alan Turing, Vanner Bush, J.C.R.Licklider, Jon Postel, Doug Engelbart, Tim Berners-Lee, Richard Stallman, K. Eric Drexler, Lawrence Lessig, Bill Joy, Jaron Lanier, Mochio Kaku కొందరు.

Also read: గాంధీ ఆర్థిక శాస్త్రం కృత్రిమ మైంది కాదు!

(ఇంకా ఉంది) 

 డా నాగసూరి వేణుగోపాల్

 ఆకాశవాణి పూర్వ సంచాలకులు

 మొబైల్ ఫోన్-9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles