పంచె నా గుర్తింపుగా మారిందంటూ గాంధీ చెప్పిన అంశాన్ని బుధవారం (22 సెప్టెంబర్ 2021) అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రచురించాయి. ఖద్దరు, నూలు వస్త్రాల వ్యాపారం చేసే రామరాజ్ సంస్థ జారీ చేసిన వాణిజ్య ప్రకటనలో ఈ విధంగా ఉంది : ‘‘నా జీవన పయనంలో నేను చేసిన అన్ని మార్పులు ముఖ్యమైన సంఘటనల వలన ఏర్పడ్డాయి. ఈ నిర్ణయాలు సుదీర్ఘమైన ఆలోచనల పిదప అమలు పరచబడ్డాయి. కాబట్టి నేను విచారించాల్సిన అవసరం లేదు. నా వల్ల వాళ్లకు (ప్రజలకు, ముఖ్యంగా చేనేతపనివారికి) చేయవలసిన ఒక సాయం నేను తీసుకున్న నిర్ణయమే. మధురైలో నా వస్త్రధారణ విషయంలో నేను అమలుపరిచిన దృఢమైన మార్పు. పంచె నా గుర్తింపుగా మారింది,’’ అని గాంధీ అన్నారు.
గాంధీజీ లండన్ లో చదువుకున్నప్పుడు అక్కడ ఇతరులు అందరి వలెనే సూటూ, బూటూ ధరించారు. లండన్ నుంచి ఇండియా వచ్చి, ఇక్కడి నుంచి దక్షిణాఫ్రికా వెళ్ళిన తర్వాత ఉద్యమ స్పూర్తితో తలపాగా ధరించడం ప్రారంభించారు. 1915లో భారత్ తిరిగి వచ్చిన తర్వాత కొంతకాలం గుజరాతీ వేషధారణలో, ఖరీదైన దుస్తులలోనే కనిపించారు. విదేశీవస్త్ర బహిష్కరణోద్యమంలో భాగంగా ఆయన మిల్లు వస్త్రాలు త్యజించి చేనేత వస్త్రాలనూ, ఖాదీ వస్త్రాలనూ ధరించడం ఆరంభించారు.
దక్షిణాఫ్రికానుంచి వచ్చి దేశసేవ చేయడం ఎట్లా అని గురువు గోపాలకృష్ణ గోఖలేని అడిగితే ‘‘ముందు నీ దేశం గురించి నువ్వు తెలుసుకో. దేశం నలుమూలలా పర్యటించు’’ అని అన్నారు. ఆ సలహా మేరకు గాంధీజీ దేశవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. రైల్లో ప్రయాణించేవారు. ఒక సారి మలబారు వెళ్ళవలసిన గాంధీ అక్కడికి వెళ్ళకుండా బ్రటిష్ పోలీసులు అడ్డుచెప్పడంతో మద్రాసు బయలు దేరారు. దారిలో రాయలసీమ ప్రాంతంలో రైలులో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలో నుంచి అక్కడ పొలాలలో గోచీగుడ్డలు కట్టుకొని పనిచేస్తున్న రైతులను చూశారు. అప్పుడే ఈ దేశంలో వంటినిండా కట్టుకోడానికి బట్ట కూడా లేనివారు చాలామంది ఉన్నారనీ, వారికి ప్రతినిధిగా తాను సైతం అంగవస్త్రం మాత్రమే ధరించాలని ఒక ఆలోచన గాంధీజీ మనసులో మెదిలిందని అక్కిరాజు రమాపతిరావు దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గురించి రాసిన సందర్భంలో వ్యాఖ్యానించారు. అదే ఆలోచనతో ఆయన ప్రయాణం సాగింది. 31 జుల 1921న బొంబాయిలో ప్రారంభమైన విదేశీవస్తు బహిష్కరణ ఉద్యమం అంత పకడ్బందీగా సాగలేదు. తగినంత ఖద్దరు లభించడం లేదనీ, పైగా ఖాదీ వస్త్రాలు చాలా ప్రియమనీ కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీకి చెప్పారు. 21 సెప్టెంబర్ 1921న గాంధీజీ మద్రాసు నుంచి మధురైకి రైలులో బయలుదేరారు. రైల్ కంపార్ట్ మెంటులో అందరూ విదేశీ దుస్తులతో ఉండటం గమనించారు. వారితో మాటలు కలిపారు గాంధీజీ. ఖాదీ ధరించడం గురించి మాట్లాడారు. తాము పేదవారిమనీ, ఖాదీ కొని కట్టుకునేంత సంపన్నులం కాదనీ వారు సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం గాంధీజీని ఆలోచనలో పడవేసింది. మధురైలో వెస్ట్ మాసి వీధిలో స్వాతంత్ర్య ఉద్యమకారుడు రామ్ జీ కళ్యాణ్ జీ గృహంలో గాంధీజీ దిగారు. మరునాడు రామనాథపురంలో చేనేతకార్మికుల సభలో మాట్లాడాల్సి ఉంది. సరిగ్గా వందేళ్ళ కిందట, 22 సెప్టెంబర్ 1921న తన నిర్ణయం ప్రకటించారు. 21వ తేదీ రాత్రి తలవెంట్రుకలు మొత్తం తీయించి గుండు చేయించుకున్నారు. తాను మొలకు అంగవస్త్రం మాత్రమే కట్టుకుంటాననీ, సగటు భారతీయుడిలాగే జీవిస్తాననీ ప్రకటించారు. ఈ నిర్ణయం ఇదివరకే తీసుకున్నప్పటికీ మధురైలో మాత్రమే ఆ నిర్ణయాన్నిఅమలు చేయగలిగానని గాంధీజీ చెప్పారు. ఆ నిర్ణయానికి ఊపిరి వదిలే వరకూ కట్టుబడే ఉన్నారు. లండన్ లో కానీ, దిల్లీలో కానీ చలివేస్తే నూలు శాలువా కప్పుకున్నారంతే. కొల్లాయి కట్టడం ప్రారంభించిన ఆ ప్రాంతాన్ని ‘గాంధీ పొట్టల్’ అని పిలుస్తారు ఇప్పటికీ. మొలకు అంగవస్త్రం, పైన కండువా. అదీ ఆయన వస్త్ర ధారణ. స్వదేశీ ఖాదీని తయారు చేయడానికి ఉద్యమం నిర్వహించారు. స్వయంగా రాట్నం నడపడం, ఖాదీ ఒడకటం ప్రారంభించారు. ఆయనను చూసి దేశవ్యాప్తంగా లక్షల మంది ఖద్దరు తయారు చేశారు. రాట్నం కాగ్రెస్ పతాకంపైన స్థానం సంపాదించుకున్నది. అది స్వాతంత్ర్యోద్యమానికి ప్రతీకై నిలిచింది.
కొల్లాయి కట్టి బహిరంగ సభతో ప్రసంగించడానికి గాంధీజీ బయలుదేరారని వినిన స్థానికులు ఆయన కారుని కామరాజర్ సలామ్ వద్ద ఆపుచేశారు. కొల్లాయి కట్టి అక్కడ మొట్టమొదటిసారి ప్రజలకు గాంధీ కనిపించారు. వలసవాద గుర్తులైన కోటూ, బూటూ, సూటూ, టోపీలను వర్జిస్తున్నట్టు ప్రకటించారు. దేశ వాతావరణానికి ఈ దుస్తులు సరిపోతాయని చెబుతూ తన మిత్రులు ఎవ్వరూ వేషధారణలో తనను అనుసరించనక్కరలేదని చెప్పారు.
ఇంగ్లండ్ లో రౌండ్ టేబుల్ కాన్షరెన్స్ కు వెళ్ళినప్పుడు కొల్లాయి మీదే వెళ్ళారు. లండన్ లో ఐదవ జార్జి చక్రవర్తిని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు గాంధీ కొల్లాయితోనే వెళ్ళారు. చక్రవర్తిని కలుసుకోవడానికి వచ్చినప్పుడు అర్ధనగ్నంగా రావడం సమంజసమేనా అని బ్రిటిష్ విలేఖరులు ప్రశ్నించారు. ‘మా ఇద్దరికీ సరిపడా దుస్తులు చక్రవర్తి ధరించారు కదా,’ అంటూ గాంధీ చమత్కారంగా సమాధానం చెప్పారు. భారత దేశం అన్నా, స్వాతంత్ర్య సమరం అన్నా, సమరయోధులన్నా ఏమాత్రం గౌరవం లేని బ్రిటిష్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ గాంధీనీ ‘హాఫ్ నేకెడ్ ఫకీర్’ అంటూ తూలనాడారు. దానిని గాంధీ ప్రశంసగా స్వీకరించారు.
‘‘కొల్లాయి కట్టితేనేమీ మా గాంధీ మాలడై తిరిగితే నేమీ – వెన్నపూసా మనసు కన్నతల్లీ ప్రేమ, పండంటి మోముపై బ్రహ్మ తేజస్సూ – నాల్గు పలకల పిలక నాట్యమాడే పిలక నాలుగూ వేదాల నాణ్యమెరిగిన పిలక – బోసినోరిప్పుతే ముత్యాల చిరునవ్వు నవ్వితేవరహాల వర్షమే – చకచకనడిస్తేను జగతి కంపించేను పలుకు పలుకుతేను బ్రహ్మవాక్కేనూ’’ అంటూ మాలపిల్ల సినిమాలో సూరిబాబు పాడిన బసవరాజు అప్పారావు రాసిన పాట నాట తెలుగురారందరి నోటా నాట్యం చేసేది.