గాంధీయే మార్గం-37
“భోగలాలసత్వంతో, అజ్ఞానంతో, కులమత విద్వేషాలతో పెద్ద బానిసలైన కలిమిగల వారలకు తొత్తు క్రింద తొత్తులుగా మసలిన చిన్న బానిసలైన సామాన్య మానవులలో చిత్త దీప్తిని కలిగించారు మహాత్మాగాంధీ! నిర్జీవ మృత్పిండాల పగిది పడియున్న మూఢ విశ్వాసపరులైన సామాన్యమానవులలో తన వైయక్తిక ఆచరణ బోధనలనే మంత్రజలాన్ని చల్లి, చిత్తదీప్తిని వెలిగించి సంకల్పబలాన్ని కలిగించి మానవులుగా రూపొందించాడు మహాత్మాగాంధీ. అహింసా మార్గోపదేష్టగా శాంతి ప్రవక్తగా, సత్యాన్వేషణా పరతంత్రశీలిగా నిలిచి జాతిని నిలబెట్టాడు. తను వెలిగి జాతిని వెలిగించాడు గాంధీ!”
– ఆవంత్స సోమసుందర్, కవి, సాహిత్యపరిశోధకుడు
– (‘కళాకేళి’, 1969 సెప్టెంబరు-అక్టోబరు సంచిక సంపాదకీయంలో)
Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు
“… విరోధిని శిక్షించి భయపెట్టేదానికంటే, తనకుతానే శిక్షించుకుని మానవుల మనసుల్లో ఉన్న మంచితనం పైకొచ్చేటట్లు చేసేవాడు. ఆ మంచితనం విశ్వాన్నంతా వ్యాపించి, భూతలం మీదే స్వర్గాన్ని సృష్టించగలమని ఆయన విశ్వాసం. ఆయన నడిపిన నిరసన వ్రతాల్లోని అంతరార్థం కూడా ఇదేననిపిస్తుంది నాకు…”
– త్రిపురనేని గోపీచంద్, తత్త్వవేత్త, రచయిత
(‘గాంధీతత్వము’ వ్యాసం ‘గాంధీపథం’ 1957)
Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!
“… గాంధీ జీ సాగించిన రాజకీయోద్యమాలే గాక, ఆయన కొల్లాయి గుడ్డా, అల్పాహారమూ, ప్రకృతి వైద్యమూ, పేదరికమూ మొదలైనవి కూడా భారత ప్రజానీకానికి ఆయనను ప్రతినిధిని చేశాయి…”
– కొడవటిగంటి కుటుంబరావు, రచయిత
(ఆంధ్రమహిళ పక్షపత్రిక, ఫిబ్రవరి-మార్చి 1948)
“… గాంధీజీ తాను చెప్పిన దానికన్న చేసిన దాని కన్నా గొప్పవాడు. ఒక మహావ్యక్తి ప్రభావాన్ని అతని మాటలలోనే చూడాలనుకోవడం చెట్ల మీదా, యిళ్ళ మీదా పడిన సూర్యకాంతిని బుట్టలలోకి ఎక్కించి దాచాలనే ప్రయత్నం లాంటిది.”
– దేవరకొండ బాలగంగాధర తిలక్, కవి
– (కళాకేళి పత్రిక, 1969 సెప్టెంబరు-అక్టోబరు)
Also read: గాంధీజీ దృష్టిలో టెక్నాలజి
–
1885 డిసెంబరు 28న బొంబాయి నగరంలోని గోకుల్ తేజోపాల్ సంస్కృత కళాశాలలో దేశవ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సమక్షంలో బ్రిటీషు ఇండియాను ఫ్రీ ఇండియాగా చేసే లక్ష్యంతో ఇండిన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. దాదాభాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, బద్రుద్దీన్ క్యాబ్జీ, డబ్ల్యు.సి.బెనర్జీ. రామస్వామి మొదలియార్, సుబ్రమణ్య అయ్యర్, రమేష్ చందర్ బెనర్జి వంటి 72 మంది ప్రతినిధులు గల ఆ సమావేశంలో ఏకైక తెలుగు వ్యక్తి పట్టుకేశవ పిళ్ళై (1860-1933). అనంతపురం ప్రాంతం గుత్తికి చెందిన ఈ ప్లీడరు 22 సంవత్సరాలకే ‘ది హిందూ’ పత్రిక కరస్పాండెంట్ గా నియమించబడ్డారు. అప్పటి నుంచి ఆయన గుత్తి కేశవ పిళ్ళైగా పిలవబడ్డారు. రిటైరయిన బ్రిటీషు ఐసిఎస్ ఆఫీసర్ ఏ.ఓ.హ్యూమ్ నేతృత్వంలో ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రూపొందింది. అప్పటికి సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే ప్రథమ స్వాతంత్ర్య పోరాటం జరిగింది. దీన్ని పాశ్చాత్య చరిత్రకారులు ‘సిపాయిల తిరుగుబాటు’ గా తక్కువ చేసి అభివర్ణించారు. భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన నుంచి నేరుగా బ్రిటీషు రాణి పాలనలోకి వెళ్ళింది. 1857 యుద్ధం కారణంగా ఇంగ్లీషు చదువుకున్న ఉన్నత వర్గాలు బ్రిటీషు ప్రభుత్వంతో మంచిగా మెలిగేవి, వారి తోడ్పాటుతో బ్రిటీషు పాలన నడిచేది. అయితే కొందరు దీనికి భిన్నంగా ఆలోచించిన వారూ లేకపోలేదు. ఎ.ఓ.హ్యూమ్ 1883లో కలకత్తా విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులకు కొందరికి ఉత్తరం రాశారు. అదీ 1885 డిసెంబరు 28న తొలి కాంగ్రెస్ సమావేశం లేదా నేషనల్ కాంగ్రెస్ పార్టీ జన్మించిన సమావేశం జరగడానికి తొలి బీజం. ఆ సమావేశంలో రమేష్ చందర్ బెనర్జీ అధ్యక్షుడుగా, ఎ ఓ హ్యూమ్ కార్యదర్శిగా పార్టీ వ్యవస్థ ఏర్పడింది. బొంబాయి ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రధానంగా ప్రతినిధులు వచ్చారు.
Also read: గాంధియన్ ఇంజనీరింగ్
పదేళ్ళూ తీర్మానాలతో సరి
తొలి పదేళ్ళు తీర్మానాలు చేయడం, వాటిని బ్రిటీషు ప్రభుత్వానికి పంపండం, వార్షిక సమావేశాలు జరుపుకోవడం – ఇలా చాలా పరిమిత స్థాయిలో నడక సాగింది. దాదాభాయి నౌరోజి మనకు తొలుత వినబడే పెద్ద పేరు. అయితే రంగంలోకి దూసుకు వచ్చిన వ్యక్తి బాలగంగాధర తిలక్. బిపిన్ చంద్రపాల్, లాలాలజపతిరాయ్, అరవింద ఘోష్ మొదలైన వారు తిలక్ బాటలో నడిచారు. గోపాలకృష్ణ గోఖలే, ఫిరోజ్ షా మెహతా, దాదాభాయి నౌరోజి వంటి మితవాదులు తిలక్ బాటతో విబేధించారు. దాంతో తిలక్ పార్టీ నుంచి వైదొలిగారు. మరోవైపు భారతీయ ముస్లిములు 1806లో ‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్’ ఏర్పరచుకున్నారు. అంతకు ముందు 1905లో ‘బెంగాల్ విభజన’, ‘వందేమాతరం ఉద్యమం’ దేశంలో చాలా ప్రాంతాలలో ప్రజలను ప్రభావితం చేశాయి. అయితే బ్రిటీషు ప్రభుత్వం తిలక్ వంటి వారిని రాజబహిష్కరణ, కారాగార శిక్షలతో ప్రజలకు దూరం చేసి స్వాతంత్ర్యోద్యమాన్ని క్రూరంగా అణచి వేసింది. ఈ స్థబ్దత దాదాపు దశాబ్దం గడిచింది.
Also read: శ్రేయస్సు మరువని సైన్స్ దృష్టి
తొలి ప్రపంచయుద్ధ సమయంలో నవచైతన్యం
మళ్ళీ తొలి ప్రపంచ యుద్ధం సమయానికి కొత్త చైతన్యం వచ్చింది. అనిబిసెంట్ హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత స్వాతంత్ర్యోద్యమం వైపు మళ్ళించారు. మరోవైపు 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచీ భారతదేశం తిరిగి వచ్చారు. ఇంకోవైపు మదన్ మోహన్ మాలవ్యా 1916లో కాశీలో హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభించగా; 1920లో అలిఘడ్ లోని మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ అలిఘర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది.
Also read: సైన్స్ ఆఫ్ బ్రహ్మచర్య
(తరువాయి వచ్చే వారం)
–డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, మొబైల్ ఫోన్:9440732392
sir namaskaram. kindly send the book on jateeyam- Antarjateeyam.