గాంధీయే మార్గం-25
‘మిమ్మల్ని ఒక రోజు పాటు భారత దేశానికి వైస్రాయిని చేస్తే ఏం చేస్తారు?’ అని ఒక విదేశీయుడు అడిగితే ‘వైస్రాయి భవనంలో ఎన్నో ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతూ అపరిశుభ్రంగా ఉన్న పారిశుద్ధ్య పనివారి నివాసాలను శుభ్రం చేస్తాను’ అని జవాబు. ‘మీ పదవీకాలాన్ని మరోరోజు పొడిగిస్తే?’ అని ప్రశ్న కొనసాగితే ‘మర్నాడు కూడా నేను అదే పని చేస్తాను’ అనే మాటలు ఎదురయ్యాయి.
సర్దార్ పటేల్, జవహర్ లాల్ నెహ్రూ ఒకసారి సలహా కోసం సేవాగ్రామ్ వెళ్ళారు. అక్కడ ‘పట్టీలు ఇక్కడ ఉండాలి, కుట్లు ఇక్కడ, ఇది ఇలా చేయాలి, మడమల మధ్య ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి తోలును అడ్డ ముక్కలుగా వేయాలంటూ ఆశ్రమవాసులకు పాదరక్షల తయారీ శిక్షణ ఇస్తూ పొరపాట్లు సవరిస్తున్నారు గాంధీజీ.
Also read: గాంధీ సినిమా అజ్ఞాత తపస్వి మోతీలాల్ కొఠారీ
— ఇలా పలు రూపాల్లో పరిచయం చేస్తారు ‘బహురూపి గాంధీ’ పుస్తకంలో అను బందోపాధ్యాయ. గాంధీజీ గురించి చాలా పుస్తకాలున్నాయి. అయితే ఈ పుస్తక ప్రణాళిక అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆయన ఏం చెప్పారో అని కాకుండా, వ్యక్తిగతంగా ఏమి చేశారో అంటూ శ్రమ ఆధారంగా, శ్రమ స్వభావరీత్యా ఆయన జీవితాన్ని 27 భాగాలుగా విభజించి వివరించారు. శ్రమజీవి, బారిస్టర్, బట్టలు కుట్టేవారు, బట్టలు ఉతికేవారు, క్షవరం చేసేవారు, శుభ్రం చేసేవారు, చెప్పులు కుట్టేవారు, సేవకుడు, వంటవాడు, వైద్యుడు, నర్సు, ఉపాధ్యాయుడు, నేత పనివారు, నూలు వడికేవారు, వ్యాపారి, రైతు, వేలంపాటగాడు, యాచకుడు, బందిపోటు, జైలుపక్షి, సైన్యాధ్యక్షుడు, గ్రంథ రచయిత, పాత్రికేయుడు, ముద్రాపకుడు, ప్రచురణ కర్త, ఫ్యాషన్ స్థాపకుడు, పాముల వాడు, పురోహితుడు అంటూ గాంధీజీ జీవితాన్ని విశదం చేస్తారు రచయిత. సంవత్సరాలు, తేదీలు, చారిత్రక క్రమం అని కాకుండా, శ్రమజీవిగా బహురూపి అయిన గాంధీజీ దర్శింపజేస్తారు.
Also read: మానవ లోకానికే ధ్రువతార
ఈ విషయానికి సంబంధించి జవహర్‌లాల్ నెహ్రూ ఇలా అంటారు తన ముందు మాటలో… “ఆయన అనేక అంశాలపై శ్రద్ధ చూపిన విధం ఎంతో ఆసక్తి గొలిపే విషయం. ఆయనది పైపైన ఆసక్తి కాదు. ఆయన ఒకసారి ఒక అంశంపై ఆసక్తి చూపటం ఆరంభిస్తే, ఆ అంశాన్ని ఎంతో లోతుగా అధ్యయనం చేసేవారు. జీవితంలో చిన్న చిన్న అంశాలు అని మనం భావించే వాటిపై ఆయన చూపిన అపరిమితమైన శ్రద్ధే ఆయన మానవతావాదంలో విశిష్టత కావచ్చు. అది ఆయన వ్యక్తిత్వానికి మూలం.”
Also read: అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!
కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
– ఒకసారి ఒక కేసు వాదిస్తుండగా తన కక్షిదారే అన్యాయంగా ప్రవర్తించాడని ఆయనకు అర్థమైంది. అతన్ని గెలిపించేందుకు వాదించడం మాని, కేసు కొట్టివేయమని మేజిస్ట్రేట్‌ను కోరారు.
– అద్దం, సబ్బు, బ్రష్షు లేకుండానే గడ్డం చేసుకోగలిగేవారు. ఇది గడ్డం చేసుకునే కళలో గొప్ప అభివృద్ధి అని ఆయన ఉద్దేశ్యం.
– ఆయన అనేక పాశ్చాత్య పోకడలను విమర్శించేవారు. కానీ పారిశుద్ధ్యాన్ని పాశ్చాత్యుల నుండి నేర్చుకున్నానని అనేకసార్లు చెప్పేవారు.
– శారీరక శ్రమను తక్కువగా చూడటం ప్రారంభించిన రోజు నుంచే భారతదేశానికి చెడ్డ రోజులు ప్రారంభమయ్యాయనీ, తమ సోదరుల మానవ హక్కులను కాలరాచినవారు, తమ అన్యాయాలకూ, క్రూరత్వానికీ జవాబు చెప్పుకోవలసిన రోజు వస్తుందనీ ఆయన ఠాగూర్‌తో కలిసి జోస్యం చెప్పారు.
– బోయర్ యుద్ధంలో స్ట్రెచర్ మోసేవాడిగా ఆయన రోజుకు 25 మైళ్ళ వరకు నడిచారు. ఆయన గొప్ప పాదచారి. టాల్‌స్టాయ్ ఫార్మ్ నుండి తరచు రోజుకు 42 మైళ్ళు నడిచేవారు.
– నల్ల మహిళలకు తెల్ల నర్సులు పురుడు పోసేందుకు నిరాకరించే అవకాశం చాలా ఉంది. కస్తూర్బా గర్భం ధరించినప్పుడు గాంధీ కాన్పు చేయడానికి సంబంధించి అధ్యయనం చేశారు. కస్తూర్బా తమ ఆఖరు సంతానాన్ని సుఖంగా ప్రసవించేందుకు సహాయపడ్డారు.
– ఆయనకు వారు ఇచ్చిన విరాళాలను తమిళులకే ఉపయోగించాలనే విన్నపాన్ని ఆయన తిరస్కరించారు.
– జైల్లోంచి బయటకు వచ్చిన ప్రతిసారీ ఆయన మెదడు మరింత క్రమశిక్షణ కలిగినదిగా, మరింత పదునుగా తయారయ్యేది.
– ఆత్మ గౌరవానికి భంగం కలగనంతవరకూ గాంధీజీ రాజీకి అంగీకరిస్తూనే ఉండేవారు.
రాజకీయాల్లో బహిరంగంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా గాంధీజీ ఎలా ఉన్నాడు, ఏమి చేశాడనేది ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి.
గాంధీజీ నిజంగా బహురూపి!
Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!
— డాక్టర్ నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్: 9440732392