ఓ కళ్ళజోడు, చేతికర్ర, చెప్పుల జత, మొల గడియారం, ఒక గిన్నె, పుస్తకం – ఇవీ ఆయన నిష్క్రమించినపుడు మిగిలినట్టు కనిపించినవి!
అయితే, మరేమీ లేవా? అని ప్రశ్నిస్తే సృష్టించిన గొప్ప చరిత్ర కూడా మిగిల్చారని బోధపడుతుంది. సహజంగా జీవించడం, సమన్వయంతో సాగిపోవడం, తలవంచకుండా నిలబడటం, సాటి మనిషి సమస్యను తన సమస్యగా స్వీకరించడం, ఎంత కఠినమైన భావాన్ని అయినా మృదువైన భాషలో వ్యక్తీకరించడం, వివాదం తలెత్తినపుడు ఎదుటి వ్యక్తి వాదాన్ని సహనంతో విని, ప్రవర్తించి మనసు గెలవడం, పీడితులవైపు నిలబడటమే కాదు, వారికి సహనంతో, చిరునవ్వుతో గెలిచే సత్యాగ్రహమనే ఆయుధాన్ని ఇవ్వడం – ఇలా ఎన్నని చెప్పడం? తన జీవితాన్నే కాదు, మొత్తం సమాజాన్ని ప్రయోగశాల చేసి జీవించిన మహామనీషి మానవ చరిత్రలోనే అద్భుత మూర్తిగా గాంధీజీ నిలిచిపోయాడు. తరచి చూసేకొద్దీ తరగని గనిగా మిగిలిపోయాడు మహాత్ముడు. ఆయన వేల వేల పేజీలు రాస్తే, ఆయన గురించి లక్షల పేజీలు రాశారు, రాస్తున్నారు.
Also read: అసలైన విప్లవవాది.. సిసలైన సిద్ధాంతకర్త!
మామూలు మనిషి
1869 అక్టోబరు 2న గుజరాత్‌లో జన్మించిన మామూలు మనిషి. ఇంటిలో చెప్పిన అభ్యంతరాల కారణంగా వైద్య విద్యను వదలి న్యాయవాద పట్టాను పొందిన వాడూ, ఇంగ్లండులో చదివి వచ్చిన తర్వాత కూడా బిడియం పోనివాడూ, ఉద్యోగం దొరకనివాడూ, ఉపాధికోసం మిత్రుల సలహామీద ఓడనెక్కి దక్షిణాఫ్రికా వెళ్ళిన వాడూ – ఇవన్నీ చూస్తే ఆయన మామూలు మనిషే! ఇంగ్లండుకు వెళ్ళాలని ప్రయత్నించినపుడు ఆయన కులం వారు వెలివేస్తామని బెదిరిస్తే కులానికీ, చదువుకు సంబంధం ఏమిటని ప్రశ్నించినవాడూ ఆయనే! పాఠశాలలో కాపీకొట్టమని ఉపాధ్యాయుడే ప్రేరేపిస్తే ఆ పని చేయనివాడూ ఆయనే! దక్షిణాఫ్రికాలో తోటి భారతీయులు వివక్షతో బానిస బతుకీడుస్తుంటే స్పందించిన వాడూ, న్యాయస్థానంలో పాగా తీయమంటే తీయని వాడూ, టికెట్ ఉన్నా తెల్లవారితో సమానంగా రైలు బోగీలో కూర్చుంటే బయటికి తోసివేయబడిన వాడూ – ఆయనే!! అంతేకాదు, దక్షిణాఫ్రికాలోని భారతీయ సంతతిలో ఉన్న భాషాపరమైన వైవిధ్యం, అపరిశుభ్రత, చైతన్యరాహిత్యం గురించి హేతుబద్ధంగా అధ్యయనం చేయడం ఆయనలో ఒక పార్శ్వమైతే, మానవ చరిత్రలో రాజ్యహింసను ఎదుర్కోవడానికి తొలిసారి అహింసాత్మకమైన ఆయుధాన్ని తయారు చేసి ఇవ్వడం మరో పార్శ్వం! పదేళ్ళలోపే దక్షిణాఫ్రికాలో తన సత్యాగ్రహంతో ఫలితాలు సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది కూడా ఆయనే!
Also read: సంభాషించడం… సంబాళించడం!
ఇంత తేడా గల దృశ్యాలు ఒకరివే కావడం ఎలా సాధ్యం?
దక్షిణాఫ్రికా వెళ్ళిన కొన్ని రోజులకు అక్కడి పరిస్థితి చూసి ఎంతో ఖేదం కలిగింది. మథనం జరిగింది. ఆయన ఆ సమయంలో తన కర్తవ్యానికి సంబంధించి 24 ప్రశ్నలతో ఒక సుదీర్ఘమైన ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం అందుకున్న వ్యక్తి అంతే వివరంగా జవాబులు రాస్తూ, మరింత స్పష్టత కావాలంటే పుస్తకాలు భగవద్గీత, వశిష్ఠగీత చదవమని, వాటిని కూడా పంపాడు. రెండవ పుస్తకం గాంధీజీకి కొత్త. పట్టాభిషేకం ముందు రాముడు అడిగే ప్రశ్నలకు వశిష్ఠుడు చెప్పే సమాధానాలే వశిష్ఠ గీత. దాన్ని అధ్యయనం చేసిన గాంధీజీకి ముక్తి అంటే ఎదుట మనిషిని సమస్యల నుంచి విముక్తి కల్గించడం అని అర్థమయ్యింది. అదీ ఆయన బుద్ధి విశేషం.
సకల మతాల ధర్మశాస్త్రాలు చదివి మనిషి మేధతోనే కాదు నిరంతరం శారీరకంగా కూడా శ్రమ చేయమని చెప్పి, జీవితాంతం దాన్ని పాటించినవాడు ఆయన. ఆయన చిత్తమెంత స్థిరమో, శారీరక బలమూ అంతే మెండు. 61 ఏళ్ళ వయసులో 200 మైళ్ళ దండి సత్యాగ్రహంలో ఏమి నడుస్తాడని బ్రిటీషు ప్రభుత్వం భావించి వెల్లకిలా పడింది. చివరిదాకా రోజుకు 18 గంటలు కష్టపడటమే కాదు, ఏకకాలంలో పలు కార్యాలు సఫలంగా నిర్వహించిన మల్టీటాస్కింగ్ మనీషి ఆయన.
Also read: గాంధీని మించిన పోరాటశీలి – కస్తూరిబా!
24 ఏళ్ళ యువకుడిగా దక్షిణాఫ్రికాకు…
తొలిసారి 1893లో దక్షిణాఫ్రికాకు 24 సంవత్సరాల యువకుడిగా వెళ్ళినపుడు ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పలేము. గాంధీ ఇంగ్లీషు తెలిసిన బారిష్టరు కనుక చట్టపరంగా తగువులు తీర్చడానికి ఒక ముస్లిం వ్యాపారి తీసుకువెళ్ళాడు. అయితే అక్కడి పరిస్థితులు ఆయనను ప్రజా రంగంలోకి లాగాయి. మానవ చరిత్రలో హింసను ఎదుర్కోవడానికి తొలిసారిగా సత్యాగ్రహం ప్రయోగించారు. 1906 సెప్టెంబరు 11న ప్రతిపాదించిన ఈ భావనకు మూలమైన సత్యం, అహింస గాంధీజీ చెప్పినట్టు హిమాలయాలంత పాతవి. తనకు తెలిసిన మతాలన్నిటి నుంచి మానవీయ విలువలు తీసుకుని అర్నాల్డ్, జాన్ రస్కిన్, లియోటాల్ స్టాయ్, అనీబిసెంట్ వంటి వారి ఆలోచనలను ఆకళింపు చేసుకున్నాడు. సత్యాన్ని గ్రహించమన్నాడు. ఉత్తమ విలువలన్ని సత్యంలో అంతర్భాగాలే అని స్పష్టంగా వివరించాడు.
సత్యాగ్రహమంటే నిర్భీతి. ఎవరు ఎదురు వచ్చినా, శారీరక హింస, మరణం తప్పదు అని తెలిసినా ఓర్పు కోల్పోకుండా సహనంతో, చిరునవ్వుతో చేసే క్షమతో కూడిన పోరాటమే సత్యాగ్రహం. హింస, మాటలు తూలడం, నాశనం చేయడం ఉండదు కనుక శత్రువు కూడా మెరుగు కాక తప్పదు. అంతేకాదు బాధితులు కూడా సత్యాగ్రహ ప్రక్రియలో క్రమంగా మరింత మానవీయంగా రూపొందుతారు.
Also read: కరోనా వేళ గాంధీజీ ఉండి ఉంటే…
గోఖలే శిష్యరికం
పరిశీలించడం, అందుబాటులో ఉన్న అవకాశాలలో తనకు నచ్చినది ఎంపిక చేసుకోవడం గాంధీజీ నైజం. ఫిరోజ్ షా మెహతా, బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలేలలో గోఖలేని ఎంపిక చేసుకుని గాంధీ ఆయన శిష్యుడయ్యారు. దక్షిణాఫ్రికాలో విజయం సాధించాక ఆయన భారత్ వచ్చే ముందు లండన్‌లో చికిత్స చేయించుకుంటున్న గోపాలకృష్ణ గోఖలేని కలిశారు. ఆయన సలహా మీదనే ఒక సంవత్సరంపాటు దేశ పర్యటన చేశారు. ఏమీ మాట్లాడలేదు. మౌనంగానే భారతీయ సమాజాన్ని గాంధీజీ పరిశీలించారు, అధ్యయనం చేశారు.
1916 ఫిబ్రవరి 4న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎంతోమంది పెద్దల ముందు గొప్ప ప్రసంగం చేశారు. బ్రిటీషు పాలన పోవడం కన్నా ముందు మన సమాజ నిర్మాణం సాగాలని ప్రబోధించారు. ఒక రైతు విన్నపం ఆధారంగా బీహారులో నీలిమందు రైతుల ఇక్కట్ల కోసం చంపారణ్యం ఉద్యమం చేపట్టారు. అక్కడే బాబూ రాజేంద్రప్రసాద్ ఆయనకు శిష్యుడయ్యాడు. పిమ్మట అహ్మదాబాదు, ఖేడాలలో జరిగిన ఉద్యమాలలో విజయం సాధించి భారతదేశపు మొత్తం దృష్టిని ఆకర్షించారు. రౌలత్ చట్ట వ్యతిరేక ఉద్యమం, జలియన్ వాలాబాగ్ సంఘటన, బార్డోలీ, చౌరీచౌరా సంఘటనలు ఇలా ఒక దాని తర్వాత ఒకటి వచ్చి గాంధీ భారతదేశపు ఏకైక నాయకుడు అయ్యారు.
Also read: భారతీయ తొలి ఎకో-ఫెమినిస్ట్– మీరాబెన్
దక్షిణాఫ్రికాలో మినీఇండియా
దక్షిణాఫ్రికాలో భారతీయ సంతతి ఒక రకంగా మినీ ఇండియా లాంటిది. అప్పటి అక్కడి పాలకులు కూడా బ్రిటీషువారే. కనుక గాంధీజీ భారతీయుల సైకీనే (మనస్తత్వాన్ని) కాదు బ్రిటీషు పాలనా ధోరణి కూడా పసిగట్టారు. ఉద్యమం హింసాత్మకం అవుతోందని స్ఫురించగానే ఆపడం గానీ, ఉద్యమం ఒక ఉచ్ఛదశకు రాగా రాట్నం, ఖాదీ మీద కూడా దృష్టి పెట్టడం గానీ, ఎందరో మహానాయకులను సంబాళించడం గానీ ఆయనకే చెల్లింది.
పటేల్, నేతాజీ, అంబేద్కర్, భగత్‌సింగ్‌లకు సంబంధించి కొన్ని విమర్శలు తరచు వినబడుతూ ఉంటాయి. ఆక్షణంలో ఎక్కువ మేలు చేసేది ఏమిటో దానినే ఆయన స్వీకరించారు. 1947 ఆగస్టు 15న ఆయన ఉపవాస దీక్ష చేశారు, కానీ సంబరాలలో పాల్గొనలేదు. 1948 జనవరి 30 సాయంత్రం హత్యకు గురైన రోజు ఉదయం ఆయన ప్రతిపాదించింది ఏమిటంటే రాజకీయాల నుంచి కాంగ్రెస్ వైదొలగడం. ఇప్పుడు జరుగుతున్న వాటికి ఆయన పూచీ కాదు.
Also read: త్యాగానికీ, పట్టుదలకూ ప్రతిరూపం – మీరాబెన్
పిల్లల్ని పట్టించుకోలేదనే విమర్శ
కస్తూర్బాను, పిల్లలను గాంధీజీ పట్టించుకోలేదు అనేది మరో విమర్శ. హీరాలాల్ గాంధీ జీవిత కథ మనలను బాగా కదిలించివేస్తుంది. అలాగే ఆయన సైన్స్‌కూ, యంత్రాలకూ, ఆధునిక వైద్యానికీ వ్యతిరేకం అనే ప్రచారం ఉంది. అది ఎంతమాత్రం నిజం కాదు. ఆ విషయాలు అధ్యయనం చేయకుండా చేసిన ప్రచారం అది. బ్రహ్మచర్య పరీక్షల గురించి తన అనువాదకుడు ఎన్.కె.బోస్ చేసిన విమర్శలు బాగా ప్రచారంలో ఉన్నాయి. అయితే వినయ్ లాల్, అశిష్ నంది, ఆంథోనీ జె పార్సెల్, సుధీంద్ర కులకర్ణి సమగ్రమైన విచారణలు ఇవ్వడమే కాదు గాంధీ ప్రయోగాలు ఫ్రాయిడ్ స్థాయివని ఆయన శిష్యుడు ఎరిక్‌సన్ ‘గాంధీస్ ట్రూత్’ అనే పుస్తకమే రాశారు. ఎన్.కె.బోస్ పొరపాటు పడ్డానని తర్వాత ప్రకటించారు కూడా!
Also read: అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!
నార్ల విశ్లేషణ
“వ్యక్తుల ద్వారా గౌతమ బుద్ధుడు, ఏసుక్రీస్తు అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే, సంఘం ద్వారా గాంధీ ప్రయోగించారు”, అని ఏడు దశాబ్దాల క్రితమే నార్ల వెంకటేశ్వరరావు విశ్లేషించారు. గాంధీజీ యాంత్రికయుగం దాటి చూసిన విజనరీ. కనుకనే ప్రపంచవ్యాప్తంగా గాంధీ విధానాలకు చెల్లుబాటు పెరుగుతోంది. నెల్సన్ మండేలా, లెచ్ వలేసా, ఆంగ్ సాన్ సూ చి, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, బరాక్ ఒబామా – ఇటువంటి వారు నక్షత్రాల్లా కాలపు ఆకాశంపై ప్రకాశిస్తున్నారు.
Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?
— డాక్టర్ నాగసూరి వేణుగోపాల్
మొబైల్: 9440732392