Thursday, November 21, 2024

మహా ప్రతిభామూర్తి మహాభినిష్క్రమణ

మాశర్మ

చావుపుట్టుకలకు అతీతమైన కీర్తిశరీరులు కొందరుంటారు. నేటి తరంలో బాలు ఆ కోవకు చెందినవారు. పాట రూపంలో  ఎప్పటికీ చిరంజీవిగా వుంటారు. మనిషి ఉన్నంతకాలం మాట ఉంటుంది. మాట ఉన్నంతకాలం పాట ఉంటుంది. పాట ఉన్నంతకాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఉంటారు. ఆయన కళకు ప్రాంతాల హద్దులు లేవు. ఆయన ప్రతిభను కొలిచే కొలబద్దలు  అంతకంటే లేవు. తెలుగువారెంత ప్రేమిస్తారో, తమిళులు అంతగా పూజిస్తారు, కన్నడిగులు అంతే తీరున ఆరాధిస్తారు. ప్రతి భాషీయుడు బాలు నా ఇంటి మనిషి అనుకుంటారు. అన్ని భాషల కథానాయకులు, నటులు తమ సొంత గొంతుగా భావిస్తారు. ఆ పాట పాడుతోంది …. ఆ నటుడే అన్నట్లుగా, అందరినీ భ్రమలోకి తీసుకెళ్లే అసాధారణ ప్రతిభామూర్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. జీనియస్ అనే పదం నూటికి నూరు శాతం బాలుకు సరిపోతుంది. సహజ సిద్ధమైన ప్రజ్ఞామూర్తిని జీనియస్ అంటారు.పుట్టుకతో వచ్చిన ప్రతిభ, కళ కలగలసిన పూర్ణస్వరూపం బాలసుబ్రహ్మణ్యం.

గ్రహణ, ధారణ, ప్రదర్శన

ఏ విషయాన్నైనా వెనువెంటనే గ్రహించే ప్రతిభ, గ్రహించి హృదయంలో ధరించే ధారణా ప్రతిభ, ధరించినదానిని పరమాద్భుతంగా సృజనాత్మకంగా ఆవిష్కరించే ప్రదర్శనా ప్రతిభ,  ఏ గొంతునైనా, ఏ రూపాన్నైనా  ఏ భావాన్నైనా అలవోకగా అనుకరించి, అనుసరించే ధ్వన్యనుకరణ ప్రతిభ, ఏ భాషలోనైనా అద్భుతంగా పాడడమే కాదు, అంతే సహజంగా మాట్లాడే భాషా ప్రతిభ, ఎటువంటి పాటనైనా ఇట్టే  పాడగలిగే గానప్రతిభ బాలసుబ్రహ్మణ్యంలో ఉన్నట్టుగా భారతీయ నేపథ్య గాయకులలో ఎవ్వరికీ లేదు. నవరసాలు నదీ ప్రయాణమంత సహజంగా ప్రవహిస్తాయి. ముఖ్యంగా శృంగారం, వీరం,కరుణ రసాల ఆవిష్కరణలో బాలు స్థాయి శిఖరం. గాయకుడు,స్వరకర్త,  నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, మిమిక్రీ కళకారుడు,రచయిత, ప్రయోక్త.. ఇలా అన్నింటినీ తనలోనే  నింపుకొని, ప్రదర్శించి, రక్తికట్టించే బహుముఖ ప్రతిభామూర్తి. గొప్ప గాత్ర సంపద బాలుకు  లభించిన గొప్ప వరం. ఫ్లూట్, కంజర వంటి వాయిద్యాలను కూడా అపురూపంగా వాయిస్తారు. ఏ విషయాన్నైనా అవలీలగా గ్రహించే శక్తి, అద్భుతంగా ప్రదర్శించే ప్రతిభ బాలును అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి. వీటన్నింటికి తోడు మానవ సంబంధాలు, ప్రజాసంబంధాలు కూడా చాలా ఎక్కువ.

ప్రేమతత్వం, స్నేహశీలత

పాడుతా తీయగా కార్యక్రమంలో పాడిన చిన్నపాప మొదలు రాష్ట్రపతి వరకూ అందరితో సత్ సంబంధాలు ఉంటాయి. మంచితనం, ప్రేమతత్త్వం, సహాయం చేసే సద్గుణం, భోళాతనం,స్నేహశీలత బాలుని ఎందరికో దగ్గరచేశాయి. ఎందరో బాలుకు  దగ్గరయ్యారు. వినయం, సహనం ఆయన భూషణం. అదే సమయంలో, ఆత్మగౌరవం ఆయన సంపద. ఘంటసాల వంటి దివ్యగాత్ర సంపన్నులు ఉన్న సమయంలోనూ బాలు రాణించారు. ఘంటసాల వెళ్లిపోయిన తర్వాత పాటకు తోడునీడగా నిలిచి, ఐదు దశాబ్దాల పాటు పాటకు  జవజీవాలను, రసపోషకాలను అందించి, ఆత్మగౌరవాన్ని కట్టబెట్టి. సృజన సుఖాన్ని పంచారు. తెలుగువారికి ఒక కన్ను ఘంటసాల, ఇంకొక కన్ను బాలసుబ్రహ్మణ్యం. జ్ఞాననేత్రమైన మూడవ కన్నుకూడా బాలసుబ్రహ్మణ్యమే. బాలువంటి బహుకళా స్వరూపమైన గాయకుడు ఇప్పుడప్పుడే పుట్టకపోవచ్చు. సినిమా ప్రపంచంలో నిలిచి గెలిచాడు. తన కెరీర్ ప్రారంభంలో, ఘంటసాల వెళ్లిపోయిన కొత్తల్లో, పేరున్న పెద్ద నటులెవ్వరూ బాలుతో పాడించుకోడానికి ఒప్పుకోలేదు. ఒక్క కృష్ణ తప్ప, అందరూ తిరస్కరించారు. తర్వాత కొద్ది కాలంలోనే, మాకు నువ్వే పాడాలి.., అంటూ వెంటపడ్డారు. అంతగా వాళ్లను లొంగదీసుకున్న ప్రతిభ బాలు సొత్తు. కమెడియన్లు, విలన్లు, హీరోలు అందరికీ బాలు పాటే కావాలన్నంతగా పరిశ్రమలో బాలు ప్రభవించారు. త్రివిక్రమ స్వరూపుడుగా అవతరించారు.

రోజుకు పదహారు పాటలు

ఒక్కొక్కరోజు పదిహేను పదహారు పాటలు పాడిన  సందర్భాలు కూడా ఉన్నాయి. ఏ సంగీత దర్శకుల దగ్గరికి అవకాశాల కోసం తిరిగారో, పాడించుకోవడం కోసం వాళ్లు బాలు చుట్టూ  క్యూలు కట్టారు. తమిళ, కన్నడ భాషల్లో పాడడం కోసం ఆ భాషల మూలలను  గ్రహించి,  యాసలు తెలుసుకొని   భాషలు నేర్చిన ఘన గాయకుడు ఎస్పీబి. బాలు పాటకు ఆ భాషీయులంతా పాదాక్రాంతులయ్యారు. ఇవన్నీ… ప్రతిభ, సాధన, ఏకాగ్రత, పట్టుదల, ఇష్టంతో సాధించుకున్న కీర్తి కిరీటాలు. తన స్నేహితులెందరికో లెక్కలేనన్ని సహాయాలు చేశారు. వారి బాధలు తనవిగా చేసుకొని  కన్నీళ్లు పెట్టుకున్నారు. వారి బాధ్యతలు తనవిగా భావించి తోడుగా నిలిచారు. తనకు మొట్టమొదటి అవకాశం ఇచ్చిన  కోదండపాణిని గుండెగుడిలో పెట్టుకొని పూజించారు. తను ఆరాధ్యదైవంగా భావించే ఘంటసాల విగ్రహాన్ని సొంత ఖర్చులతో హైదరాబాద్ లో స్థాపించారు. హరికథా ప్రపూర్ణుడైన తండ్రి సాంబమూర్తి నిలువెత్తు కాంశ్య విగ్రహాన్ని నెల్లూరులో ప్రతిష్ఠించారు. ప్రతి ఏటా బిక్షా పూర్వక త్యాగరాజ ఆరాధనోత్సవాలను నిర్వహించి తండ్రి సంకల్పానికి సంపూర్ణ సిద్ధి కలిగించారు.

ఇల్లు కంచిపీఠానికి

వారసత్వంగా వచ్చిన ఇంటిని కంచిపీఠానికి వేదవిద్యకోసం అందించారు. ప్రకాశం జిల్లా మాచవరం బాలు తండ్రిగారి సొంతవూరు. అక్కడి నుండి నెల్లూరు వెళ్లిపోయారు. అదే బాలుకు సొంత ఊరుగా అయిపొయింది. తల్లివారిది ఆంధ్రప్రదేశ్-తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న కోనేటంపేట. ఈ ఊరుతోనూ బాలుకు గొప్ప బంధాలు పెనవేసుకుని వున్నాయి. ఈ ఊరికి కూడా తన సొంత డబ్బుతో సేవా కార్యక్రమాలు చేశారు. బాలుని మరచిపోవడం ఎప్పటికీ ఎవ్వరికీ సాధ్యం కాదు. పద్మభూషణ్ మొదలు ఎన్నో ఘన గౌరవాలు, ఖండాతర ఖ్యాతిని సంపాయించుకున్నారు. సంపూర్ణమైన శాస్త్రీయ సంగీత కచ్చేరి ఇవ్వాలనే ఒక కోరిక తీర్చుకోకుండా వెళ్లిపోయారు. పాటంటే ఎంత ఇష్టమో, తెలుగుభాషంటే అంతకంటే ఇష్టం. జీవితమంటే ఇంకా ఇష్టం. ప్రతి క్షణాన్ని అనందంగా గడపాలని కోరుకునే రసపిపాసి.కొన్నింటికి ప్రత్యామ్నాయమైన సృష్టి ఉండదు. బాలుకు పర్యాయ పదం బాలు మాత్రమే. ఇన్నేళ్లు, ఇంతమందికి,  ఇంత ఆనందాన్ని పంచిపెట్టిన బాలు ఇలా ఇన్ని రోజులపాటు ఆస్పత్రిలో బాధపడి వెళ్లిపోవడం చాలా బాధాకరం. అఖండ ప్రతిభామూర్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం దివ్యజ్యోతి అఖండంగా వెలుగుతూనే ఉంటుంది. మహాప్రతిభామూర్తి మహాభినిష్క్రమణకు గుండెలు గొంతు చేసుకొని హృదయాంజలి సమర్పిద్దాం.

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles