* నవ్వు తెప్పించే మాటలెన్నో విషాద ఘటనలూ అన్నే… అదే జీవితం!
జీవితం అంటేనే భావోద్రేకాలమయం! ఆ ఎమోషన్స్ వల్లే ఆనందం ఉంటుంది…విషాదం ఉంటుంది…దాన్ని సుఖదుఃఖాలు అంటారు! మనిషికి 27 ప్రాథమిక భావోద్వేగాలు ఉంటాయట. ఎమోషన్ కు అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని సిద్ధాంతాలు ఎనిమిది ప్రాథమిక భావోద్వేగాలు ఉన్నాయని, మరికొన్ని ఎక్కువ ఉన్నాయని మానసిక శాస్త్రవేత్తలు చెబుతారు. ఈ ఏమోషన్స్ ను డిఫరెన్షియల్ ఎమోషన్స్ స్కేల్ ద్వారా కొలుస్తారు.
అయితే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా పరిశోధన ప్రకారం 27 విభిన్న రకాల భావోద్వేగాలు గుర్తించారు. వేలాది మంది వ్యక్తులను అధ్యయనం చేయశారు. ప్రజలు వారి భావోద్వేగాలను బాగా అర్థం చేసుకోనప్పుడు, ఇతరుల భావోద్వేగాలకు సంబంధించి అయోమయం ఉన్నప్పుడు, ఆ అవస్థ తరచుగా అపార్థాలకు దారితీస్తుంది.
Also Read : అమ్మకు ప్రతి రూపం కూతురు! అమావాస్య అదృష్టం ఆమెదే! పౌర్ణమి ఆటు పోట్లు ఆవిడవే!!
27 విభిన్న భావోద్వేగాలు ఇలా ఉంటాయి
ప్రశంస, ఆరాధన, సౌందర్య ప్రశంస, వినోదం, ఆందోళన, విస్మయం, ఇబ్బందికరమైన విషయం, విసుగు, ప్రశాంతత, గందరగోళం, తృష్ణ, అసహ్యము మనసు బాధ, అనుకున్న వ్యక్తి ప్రత్యక్షం అయ్యే ఫీలింగ్, అసూయ, ఉత్సాహం, భయం, భీతి, ఆసక్తి, వ్యామోహం, శృంగారం, విచారం, సంతృప్తి, లైంగిక వాంఛ, సానుభూతి, విజయోత్సవం. ఇవీ ప్రతి రోజు మనిషికి ఎదురయ్యే భావోద్రేకాలు సమూహాలు.
అందరికీ ఒకేరకమైన భావోద్వేగాలు
భావోద్వేగాలను జీవశాస్త్రపరంగా నిర్ణయిస్తారు. ఈ భావోద్వేగ ప్రతిస్పందనలు జాతి లేదా సాంస్కృతిక భేదాలతో సంబంధం లేకుండా అన్ని రకాల వ్యక్తులకూ సమానంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. ఈ భావోద్వేగాలకు వచ్చినప్పుడు మనుషులు విలక్షణమైన ముఖ కవళికలను చూపిస్తారని పరిశోధనలో తేలింది. గత రెండు రోజులుగా ఈ ఏమోషన్స్ మీద ఆర్టికల్ రాయాలని అధ్యయనం చేసినప్పుడు పుస్తకాల కన్నా నిజ జీవిత సంఘటనలే కొత్త ఆలోచనలు తెప్పిస్తాయనిపించింది.
Also Read : మిడ్ లైఫ్ మిసమిసలు
గూగుల్ మ్యాప్ గందరగోళం
ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నా మనం అసహనానికి గురవుతున్నాం. నిర్దిష్ట్య గమ్యానికి చేరడానికి గూగుల్ మ్యాప్ ను ఆశ్రయించడం వల్ల క్యాబ్ లోకి ఎక్కగానే పరిసరాలు, ప్రకృతిని మరిచి ఫోన్ లో తలపెట్టి గమ్యానికి చేరుతున్నాం. అక్కడ నాకు ఒక విచిత్ర సన్నివేశం ఎదురయింది. ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకున్న తరువాత దిగవలసిన ప్రదేశంలో క్యాబ్ డ్రైవర్ ప్రదిక్షణాలు చేస్తున్నాడు. గూగుల్ ఆ ప్రదేశాన్ని ‘ఐడెంటిఫై’ చేయడంలో విఫలమవుతోందా? లేక మ్యాప్ రీడింగ్ సరిగా లేదా? అన్న సంశయంతో పెరుగుతున్న ఛార్జీని భరించలేక నేను ప్రదర్శించిన హావభావాలు… నేను రాసిన దానికన్నా ఎక్కువగా ఉన్నాయి.
మెదడుకు పని చెప్పా
క్యాబ్ దిగి నా “మెదడు” కు పనిచెప్పా. నేను వెళ్లాల్సింది ఒక క్షేత్రానికి. ఆ క్షేత్రం ఉన్నట్టే చాలా మందికి తెలియదు కాబట్టి ‘గూగుల్’ కూడా తప్పు “దారి” చూపించింది. ఒక్క సారి నా మస్తిష్కంలో కంప్యూటర్ బ్రెయిన్ తొలగించి సాదాసీదాగా ఆలోచించాను. ఆ క్షేత్రం తెలియాలంటే…కొబ్బరి కాయలు, పూలు, పూజా సామగ్రి అమ్మే వారిని లేదా ఏదో ఒక గుడి పూజరిని అడగాలని నా బ్రెయిన్ ఆదేశించింది. ఈ రెండు ప్రయత్నాలు చేశాను. నిమిషాల్లో గమ్యం చేరాను. అంటే మెదడుకు పని పెట్టకుంటే దానికి వ్యాయామం లేక మొద్దు బారిపోతుంది. ఇక అదే రోజు రాయదుర్గం నుండి కర్మన్ ఘాట్ క్యాబ్ లో ప్రయాణం చేస్తున్న.
Also Read : ఆత్మ విశ్వాసమే మీ ఆయుధం!
నా చావుకి వచ్చాయా?
క్యాబ్ డ్రైవర్ ఫోన్ లో భార్యతో గొడవ పడుతూ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో ఆటలాడుతూ పోతున్నాడు..వాడి ముఖ కవళికలు ‘నా చావు కు వచ్చాయా?’ అనిపించింది… “బాబు కారు ఆపు నేను దిగిపోతాను…లేక పోతే ఇంట్లో పెళ్ళాం పిల్లల ముఖం కూడా చూసేట్టు లేను” అన్నాను…నా హైద్రాబాద్ హిందీని చూసి వాడు పకపక నవ్వేశాడు! “ఓర్ని…ఇప్పుడే కాదురా.. అంత సీరియస్ గా మాట్లాడావు “ఒక్క సారి ఇలా నవ్వావేమిటీ’ అన్నాను…’జోరూ కా ఫెస్ దేఖ్ నా నై దేఖనా” అన్న పదం మళ్ళీ నాతో అనిపించి…”సార్ …పెళ్ళాం కోసమే కదా ఈ సంపాదన…అదేమో పిల్లలకు ఫీజులు… బట్టలు అని డ్రైవింగ్ లో సతాయిస్తుంటే మండుతుంది కదా” అని హిందీలో అన్నాడు…”దానికి నన్ను చంపుతావురా బాబు” అన్నాను…”మీరు ఆరామ్ గా కూర్చుండి” అన్నాడు… నేను మొదలు పెట్టాను.
అది నరకంరా బాబూ
“మనకు ఆక్సిడెంట్ అయ్యి ఒక వేళ బ్రతికితే కాలో చెయ్యి విరిగి బెడ్ మీద మన కాలును పైకి కట్టి, సిమెంట్ పట్టి బిగించి డాక్టర్లు ఇంజక్షన్లు ఇస్తుంటే…మన ఫీలింగ్స్, ఏమోషన్స్ ఎలా ఉంటాయో తెలుసా? నరకం రా బాబు…ఒక వేళ చావు వస్తే అనాయాసంగా ఎవరినీ కష్ట పెట్టకుండా చావాలి..బాబూ” అన్నాడు వాడు కాసేపు అర్జునిడిలా నేను శ్రీకృష్ణునిలా హిత బోధ చేసాను. అయితే స్టీరింగ్ ఇప్పుడు వాడి చేతుల్లో ఉంది. ఇంతలో గమ్యం వచ్చింది దిగాక వాడు నా దగ్గరికి వచ్చి ” నా కార్లో ఎక్కేఅందరూ పాస్సెంజర్స్ డ్రైవర్ అని చులకనగా చూస్తారు సార్ నాకు మీరు పెద్దన్నలా అనిపించారు” అని షేక్ హాండ్ ఇచ్చినప్పుడు కూడా నేను రాసే ఆర్టికల్ లో వాడి ముఖకవళికలు కనిపెట్టాను.
Also Read : మానవ జీవితమే ఒక సముద్ర ఘోష!
బ్రెయిన్ కి రెస్టా?
ఇక ఈ రోజు సుఖ్ రాజ్ అనే వాడు నాకు ఫోన్ చేశాడు… “నా బ్రెయిన్ కు రెస్ట్ ఇవ్వాలి” అన్నాను. వాడు ఆశ్చర్యంగా మనిషికి రెస్ట్ ఇస్తారు. కానీ బ్రెయిన్ కు రెస్ట్ ఇచ్చే వారు కూడా ఉంటారా అన్నాడు. సంభాషణ పొడిగించకుండా ఫోన్ పెట్టేశాను. రావుగారు అని ఒక జర్నలిస్ట్ మిత్రుడు పుస్తకాలు చదివి… చదివి కళ్ళు మూసుకొనే వాడు. కాళ్ళూ చేతులూ ఉపుతూనే “నిద్ర” పోయే వాడు…ఒక సారి టక్కున లేపి “నిద్రపోయారా రావు గారూ?” అంటే ‘కళ్లకు రెస్ట్ ఇస్తున్న” అన్నాడు. అప్పుడు నేను పెట్టిన ఫీలింగ్ పైన నేను రాసిన దాంట్లో ఒకటుంటుంది!
మహామహోపాధ్యాయ
ఇక నాకు పక్కా తెలంగాణ భాష మాట్లాడే వారు…గొప్ప ఇంగ్లీష్ మాట్లాడే వారు, సంస్కృతం మాట్లాడే వారు స్నేహితులు ఉన్నారు! గొప్ప సంస్కృత పండితుడు…ఉభయ తెలుగు రాష్ట్రాల్లో “మహామహోపధ్యాయ” గా పేరు గడించిన పెద్ద సంస్కృత పండితుడు నాకు స్నేహితులు. వయసులో పెద్దయినా నన్ను ప్రేమగా పిలిచే స్వాతంత్రం, చొరవ ఆయన దగ్గర ఉంది. ఆచారాలు ఎన్ని పాటించినా అవసరమైనప్పుడు ప్రజా జీవితానికి అనుగుణంగా నడిచే ఆయన అంటే నాకు బాగా ఇష్టం. ఎన్నో సార్లు ఆయనకు సన్మానం చేసి పాదాభివందనం చేశాను. ఒక్కొక్క సారి ఆయన పట్ల నేను ‘మండినప్పుడు” (నా ఫీలింగ్స్) సరదాగా తీసుకునే సహృదయలు వారు. ఒక రోజు ఆయన అమెరికాలో సంస్కృతం బోధించడానికి వెళ్లి తిరిగి హైద్రాబాద్ కు విమానంలో వచ్చారు…
Also Read : అమ్మ జోల పాటలో ఉన్న నిద్ర ఇప్పుడేది?
స్వామీ, తమరెక్కడ?
“గురువు గారికి ఇంగ్లీష్ పిచ్చి పట్టుకోని ఉండవచ్చని ..ఆయన ముఖ కవళికలు చూడాలని ఆశ పడ్డా…ఇంతలో ఆయన ఎక్కడ ఉన్నారో అని ఆయనకు ఫోన్ చేశాను…ఆయన నాతో సంస్కృతంలో మాట్లాడారు… అర్ధం అయినా కానట్టు “ముఖం” పెట్టి…’స్వామి మీరెక్కడ ఉన్నారో కాస్త చెప్పండి” అన్నాను… నా అసహనానికి ఆయన నవ్వి ” “నాయనా అప్రాచ్యం పలుకులు నేను పలకలేను…నీ ఇంటి పేరు లోని రెండు మొదటి అక్షరాలు…నీ పేరు లోని మొదటి అక్షరం…ముందు నిలబడి ఉన్నాను… అన్నాడు! నా ఇంటి పేరు “BA” NDARU…నా పేరు మొదటి అక్షరం “R” AM…? శీతల పానీయములు కూడా విక్రయించే ఈ ప్రదేశంలో మనం మొదట ఆరాధించే విజ్ఞ నాయకుని పేరు వినాయకుడిగా పెట్టారు నాయనా” అన్నాడు…ఆయన ఎంత “కూల్” గా అన్నా నాకు మంట పుట్టింది “వినాయక బార్” అనొచ్చు కదా అని కోపం వచ్చినా ఆయన పాశ్చాత్య పిచ్చి పట్టనందుకు వెళ్ళగానే నమస్కారం పెట్టి కార్లో ఎక్కించుకొని హైద్రాబాద్ వైపు వేగంగా వచ్చాను. ఆ ఫేస్ ఫీలింగ్స్ ఇప్పుడు ఇది చదివిన వారు కనిపెడితే సామాజిక విజ్ఞానం పుస్తకాలు చదివిన దాని కన్నా గొప్ప.
Also Read : అహంకారం ఒక అంధకారం… అదే పతనానికి హేతువు