- గాడిచర్ల కాలూనని రంగం లేదు, సృజించని కోణం లేదు
- జయంతిని తెలుగు సంపాదక దినోత్సవంగా జరుపుకోవాలి
–డా నాగసూరి వేణుగోపాల్
గాడిచర్ల పేరు పేర్కొనగానే గ్రంథాలయ ఉద్యమం కోసం పనిచేసిన యోధునిగా చెప్పుకుంటాం. కేవలం ఆ రంగం వారు మాత్రమే గాడిచర్లవారి సేవలు గుర్తు పెట్టుకున్నారు కనుక, కనీసం ఈ మాత్రమైనా మిగుల్చుకున్నామని మనం ఆనందపడాలి. నిజానికి గాడిచర్ల వారు కాలు పెట్టని రంగం లేదని ఎన్.జీ. రంగా ఊరకనే అనలేదు. కనుకనే కాళోజీ నారాయణరావు కవితాత్మకంగా “… తరతరాలు యెవని మేలు తరలుచు పొరలుచునుండును?” అంటూ, ఇంకా “హరిసర్వోత్తముడాతడు ఆంధ్రుల పాలిటి దేవుడు” అని వ్యాఖ్యానిస్తారు!
‘ఎడిటర్’ అనే ఆంగ్ల పదానికి ‘సంపాదకుడు’ అనే పదాన్ని సూచించడంతోపాటు, భావ కవిత్వానికి నామకరణం చేసింది కూడా ఆయనే. ‘ఆంగ్ల పదాలకు ఆంధ్ర పదాలు’ అనే శీర్షిక తన పత్రికలో నడిపారట వారు! పూర్తి స్థాయి తొలి తెలుగు దినపత్రిక ‘ఆంధ్రపత్రిక’ కు గాడిచర్ల హరిసర్వోత్తమరావు సంపాదకుడుగా మొదటి మూడేళ్లూ పనిచేశారు. ‘స్వరాజ్య’ పత్రికలో 1908 మార్చి 28వ తేదీ సంచికలో ‘విపరీత బుద్ధి’ శీర్షికతో ఆంగ్లేయాధికారులను విమర్శిస్తూ సంపాదకీయం రాశారు. అది ఇలా మొదలవుతుంది:
“అరెరే! ఫిరంగీ! క్రూర వ్యాఘ్రమా, నిష్కారణముగ నీవు ముగ్గురు…” దీనిని రాజద్రోహ నేరంగా పరిగణించి బ్రిటిష్ ప్రభుత్వం గాడిచర్లను అరెస్టు చేసింది. రచన కారణంగా కారాగారం పాలయిన తొలి దక్షిణాది వ్యక్తి హరిసర్వోత్తమ రావు. ఒక విదేశీ నాయకుడి గురించి తెలుగులో పూర్తి స్థాయి జీవిత చరిత్ర రాసిన తొలి వ్యక్తి కూడా వీరే.
కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వంటి మిత్రులతో కలసి మద్రాసులో ‘విజ్ఞాన చంద్రికా మండలి’ 1906లో స్థాపించారు. తెలుగులో పలు అంశాలకు సంబంధించిన ఎన్నోపుస్తకాలు ప్రచురించిన సంస్థ ఇది. విజ్ఞాన సంబంధమైన రచనలు కూడా ఎన్నో చేశారు సర్వోత్తమరావు. ఆంగ్ల దినపత్రిక ‘ది హిందూ’ లో తెలుగు గ్రంథాల గురించి ఇంగ్లీష్ లో ఒక దశాబ్దంపైగా పరిచయం చేశారు. ఈ రచనలకు వారు వాడిన పేరు జీహెచ్ఎస్. ఈ పత్రిక ద్వారా పొందిన పారితోషికం తన జీవితంలో అత్యధిక పారితోషికమని అతని మిత్రులు పేర్కొంటారు. ఇక వారు పని చేసిన, స్థాపించిన పత్రికల గురించి చెప్పాలంటే స్వరాజ్య, ఆంధ్రపత్రిక, నేషనలిస్టు, మాతృ సేవ, సౌందర్య వల్లి, పంచాయతి, ఆంధ్ర వార్త…. ఆ జాబితా ఇలా సాగుతుంది. ‘స్వరాజ్య’ తెలుగు కాగా, ‘నేషనలిస్టు’ ఆంగ్లం, ‘పంచాయితీ’ అయితే తెలుగు, తమిళం, ఇంగ్లీష్; ‘సౌందర్యవల్లి’ స్త్రీల పత్రిక కాగా.’ఆంధ్ర వార్త’ బెజవాడ నుంచి వెలువడిన దినపత్రిక!
అందుకే గాడిచర్ల హరిసర్వోత్తమరావు గురించి – “వారు స్పృశించని సమస్య లేదు, కాలూనని రంగం లేదు” అని అంటారు. ఇప్పటికీ వారి హిందూ దేశ చరిత్ర (వెయ్యికి మించిన పుటలు), పబ్లిక్ హెల్త్ (400 పేజీ), ప్రపంచ భూగోళం వాతావరణ శాస్త్రం వంటి గ్రంథాలు అముద్రితాలే!
గాడిచర్ల హరిసర్వోత్తమరావు 1883 సెప్టెంబర్ 14న కర్నూలులో జన్మించారు. తండ్రి వెంకటరావు, తల్లి భగీరథాబాయి. వీరి పూర్వీకులు కడప జిల్లా సింహాద్రిపురం వారు. తండ్రి ఉద్యోగరీత్యా కంభం, మార్కాపురం తాలూకాలలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా చేసి కర్నూలు చేరారు. తాను ఆరుమాసాల పసికందుగా ఉన్నప్పుడే తల్లి కన్నుమూసింది. పెదతల్లి దగ్గర పెరిగారు. గుంతకల్లు మిషన్ హైస్కూలులో చేరి, పిమ్మట మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో 1901 నుంచి 1906 వరకు చదివి ఎం.ఎ పొందారు. మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన పానుగంటి రామరాయణింగారు ఎం.ఏ. పట్టా పొందిన తొలి తెలుగువారు కాగా, హరిసర్వోత్తమరావు రెండవవారు. వేదం వెంకటరాయశాస్త్రి గాడిచర్లకు మద్రాసులో అధ్యాపకులు కాగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, కట్టమంచి రామలింగారెడ్డి, గిడుగు సీతాపతి – గాడిచర్ల హరిసర్వోత్తమరావుకు సహాధ్యాయులు, సమకాలికులు.
ఎంఏలో థీసిస్ గా రాసిన ’ది నెగ్లెక్టెడ్ ఎంపరర్ పొయెట్’ సాధికార గ్రంథం. కృష్ణదేవరాయల కవిత్వాన్ని అంచనా వేసిన ఆంగ్ల గ్రంథమది. గాడిచర్లకు తిలక్ రాజకీయ విధానం, గాంధీజీ నిర్మాణ కార్యక్రమం నచ్చాయి. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కు సంయుక్త కార్యదర్శి, కార్యదర్శిగా పనిచేశారు. 1927లో మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ కి ఎన్నికై, విమర్శనాశక్తితో రాణించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ సభ్యునిగా ఉన్నారు. నిష్కర్షగా, నిర్మొహమాటంగా మాట్లాడటంలో వారికి వారే సాటి. 1922 సంవత్సరంలో ఏఐసీసీ సమావేశంలో గాంధీజీ కోర్టుల బహిష్కరణ నుంచి దాడులను మినహాయించాలని ప్రతిపాదించారు .దీనిని విభేదించినవారు గాడిచర్ల. తన పొరపాటును గుర్తించిన గాంధీజీ పొరపాటును ఉపసంహరించుకున్నారు. ఈ విషయం గురించి గాంధీజీ ‘యంగ్ ఇండియా’ పత్రికలో రాస్తూ బ్రేవ్ హరిసర్వోత్తమరావు అని పేర్కొనడం విశేషం.
వారు 1960 ఫిబ్రవరి 29న మరణించేదాకా బాహ్య జీవితం మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం కూడా సంక్షుభితం. వీరిని అరెస్టు చేసిన బ్రిటిష్ ప్రభుత్వం పిల్లనిచ్చిన మామకు ఫించను ఆపివేసింది. ఆయన జీవితం ఇలాగే సాగింది. వారి జీవితం సమాజానికి హారతి కర్పూరం. సంప్రదాయ విలువలపై సాధికారకమైన గౌరవంగల గాడిచర్ల విజ్ఞానంతో సకల అభ్యుదయ భావాలను ఆహ్వానించారు. పాండిత్యం, నైపుణ్యం తోపాటు లెక్కలేనన్ని సామాజిక కార్యక్రమాలుచేపట్టారు. అధ్యయనం, ఉద్యమశీలం, కార్యశీలత, త్యాగనిరతి, బహుభాషాపాండిత్యం, సున్నితత్వం మిక్కుటంగా గల హరిసర్వోత్తమరావు తలమానికమైన పాత్రికేయ వృత్తికి ధ్రువనక్షత్రం, వారి జన్మదినమైన సెప్టెంబర్ 14 ను ‘తెలుగు సంపాదక దినోత్సవంగా జరుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వారి ద్వారా తెలుగు మీడియా స్ఫూర్తి పొంది సకల రంగాలను ప్రకాళన చేసే దారి దీపం కావాలి.
(సెప్టెంబర్ 14న గాడిచర్ల హరిసర్వోత్తమరావు జయంతి)
(డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, మీడియా విశ్లేషకులు & ఆకాశవాణి పూర్వ సంచాలకులు
మొబైల్ : 9440732392)