గాంధీయే మార్గం-40
స్వాతంత్ర్య ఉద్యమ సందర్భంలో తెలుగునాట పరిస్థితి ఎలా ఉంది? బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ స్ఫూర్తితో తేజరిల్లిన ఉద్యమ కెరటం – గాడిచర్ల హరిసర్వోత్తమరావు. వారిది రాయలసీమ స్వస్థలం అయినా, తొలి పోరాటానికి శ్రీకారం చుట్టింది రాజమండ్రి కళాశాలలో. ‘స్వరాజ్య’ పత్రిక నిప్పులు చెరిగే సంపాదకీయంతో బ్రిటీషు వారిని భయపెట్టిన ఈ వీరుడు తన రచనల కారణంగా 1908లో జైలు పాలయిన తొలి దక్షిణాది వ్యక్తి.
Also read: దేశాన్ని ఒక తాటిపై నడిపిన గాంధీజీపథం
కృష్ణాపత్రికకు శ్రీకారం
బందరులో 1902లో ఫిబ్రవరి 2న కొండా వెంకటప్పయ్య, దాసు నారాయణరావు వారపత్రికగా ‘కృష్ణాపత్రిక’ను ప్రారంభించారు. 1905లో ముట్నూరి కృష్ణారావు సంపాదకు డయ్యాడు. 1908లో బొంబాయిలో కాశీనాథుని నాగేశ్వరరావు ‘ఆంధ్రపత్రిక’ను వారపత్రికగా మొదలుపెట్టారు. 1910లో బందరులో ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య ‘ఆంధ్ర జాతీయ కళాశాల’ను ప్రారంభించారు. ‘ఆంధ్రపత్రిక’ 1914లో మదరాసుకు తరలివచ్చి దినపత్రికగా మారి, స్వాతంత్ర్య ఉద్యమానికి బాసటగా తయారైంది.
Also read: భారత రాజకీయరంగంలో గాంధీజీ ప్రవేశం!
మదనపల్లెకు రబీంద్రనాథ్ టాగూర్
కలకత్తాలో 1905లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో ‘స్వదేశీ తీర్మానం’ పెట్టిన పనబాక ఆనందాచార్యులు తిరుపతి ప్రాంతం వారు. 1907లో సూరత్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాల్లో మదనపల్లెకు చెందిన ఆదిశేషాచలం నాయుడు ఆహ్వానితుడుగా పాల్గొన్నారు. పూనాలో గోపాలకృష్ణ గోఖలే ‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియా’ ప్రారంభించగా, తిలక్ చైతన్య శీలమైన ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దక్షిణాదిలో అనిబిసెంట్ సతి ‘హోమ్ రూల్ ఉద్యమం’ చేపట్టారు. ఇందులో తెలుగు ప్రాంతాల్లో చురుకుగా చేసిన వ్యక్తి గాడిచర్ల. 1915 లో రాయలసీమలో తొలి కళాశాల – బి.టి. కళాశాలను మదనపల్లెలో దివ్యజ్ఞాన సమాజం ప్రారంభించగా; దత్తమండలాలకోసం అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల మొదలైంది. బి.టి. కళాశాల విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారని 1917లో మద్రాసు విశ్వవిద్యాలయం ఈ కళాశాలకు అనుబంధాన్ని రద్దు చేసింది. దాంతో రవీంద్రనాథ్ ఠాగోర్ కొత్తగా ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయానికి ఈ కళాశాల అనుబంధమైంది. ఈ సంబంధం కారణంగా ఠాగూర్ మదనపల్లె వచ్చిన సందర్భంలో ‘జనగనమణ’ గీతానికి వరుసలు కట్టడం, బెంగాలీ గీతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడం సాధ్యమైంది.
Also read: గాంధీజీ రాక ముందు దేశరాజకీయరంగం
అల్లూరి, కొమరంభీం
మన్నెం ప్రాంతంలో పోడు వ్యవసాయానికి వ్యతిరేకంగా వచ్చిన మద్రాసు ఫారెస్ట్ చట్టాలను గెరిల్లా రీతిలో పోరాడిన అల్లూరి సీతారామరాజు బ్రిటీషు గుళ్ళకు 1924 మే 7న బలికాగా; నైజం పన్నులు వ్యతిరేకించి జల్, జంగల్, జమీన్ (నీరు, అడవి, భూమి) అనే నినాదంలో పోరాడిన ఆదివాసీ వీరుడు కొమరం భీం 1940 అక్టోబరు 27 కాల్పుల్లో గతించారు.
Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు
స్వరాజ్య నినాదం వ్యాప్తి
మధ్యతరగతి వ్యక్తుల మధ్య చర్చనీయాంశంగా మిగిలిగిపోయిన స్వరాజ్యమనే విషయం గాంధీజీ రంగ ప్రవేశంతో దేశం నాలుగు చెరగులా వ్యాపించింది. కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల వ్యవధిలో దేశం యావత్తూ గాంధీజీ అహింసాత్మక ప్రణాళికలకు స్పందించింది. ప్రతి ప్రాంతం నుంచి బయలుదేరిన నాయకులు దేశస్థాయిలో రాణించడం మొదలయ్యింది.
Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!
(తరువాయి వచ్చే వారం)
డా నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్ – 9440732392