`వందేమాతరమనగనె వచ్చితీరు యెవని పేరు
వయోజన విద్యనగనె వచ్చితీరు యెవని పేరు
గ్రామగ్రామన వెలసెడి గ్రంథాలయమెవనికి గుడి
అరగని తరగని వొడవని అక్షరాదానంబెవరిది
అరువదేండ్లు ప్రజల కొరకు అరిగిని కాయంబెవరిది
హరిసర్వోత్తముడాతడు ఆంధ్రులపాలిట దేవుడు` అని ప్రజాకవి కాళోజీ నారాయణరావు సమర్పించిన అక్షర నివాళిని అందుకున్న గాడిచర్ల నిజంగా తెలుగువారి అక్షర సంపద.నాణానికి బొమ్మాబొరుసులా ఆయన జీవితంలో జాతీయభావం, గ్రంథాలయ ఉద్యమం పడుగుపేకల్లా అల్లుకుపోయాయి.
జాతీయభావం:
బెంగాల్ విభజన,వందేమాతరం ఉద్యమం ప్రారంభంలో బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో చేసిన ప్రసంగానికి అక్కడి ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కళాశాల విద్యార్థులతో పాటు గాడిచర్ల విద్యార్థి నాయకుడి హోదాలో హాజయ్యారు. మరునాడు`వందేమాతరం` బ్యాడ్జీతో రావడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్ హంటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానిని తొలగించాలని ఆదేశించారు. ఆయన మాటలను లక్ష్యపెట్టకపోవడంతో గాడిచర్లను కళాశాల నుంచి తొలగించారు. దాంతో తోటి విద్యార్థులు గోదావరి స్నానమాడి `తిరిగి కళాశాలకు వెళ్లబోము`అని శపథం చేశారట. ఆయన జాతీయభావానికి, నాయకత్వ పటిమకు దీనిని ఉదాహరణగా చెబుతారు. అనిబిసెంట్ ప్రారంభించిన `హోం రూల్` ఉద్యమం ఆంధ్రశాఖకు కార్యదర్శిగా వ్యవహరించారు.
Also Read: అవిశ్రాంత ‘నోబెల్ రామన్’
పాత్రికేయునిగా…
జాతీయ ఉద్యమ ప్రచారం కోసం, తిలక్ పత్రిక `కేసరి` తరహాలో మిత్రుడు బోడి నారాయణతో కలసి `స్వరాజ్య` వార పత్రికను (1908) లో ప్రారంభించి దానికి సంపాదకత్వం వహించారు. ఆంగ్లేయుల అన్యాయాలను, అక్రమాలను తీవ్రంగా విమర్శించారు. మద్రాసులో ప్రారంభమైన `ఆంధ్రపత్రిక`కు వ్యవస్థాపక సంపాదుకుడిగా వ్యవహరించారు. `ఎడిటర్`అనే ఆంగ్ల పదానికి `సంపాదకుడు` అనే పదాన్ని మొదట వాడింది వీరేనట. 1922 నుంచి రెండేళ్లపాటు `మాతృసేవ`అనే పత్రికను నడిపారు.` సౌందర్యవల్లి,కౌమోదకి, ఎడల్ట్ ఎడ్యుకేషన్ రివ్యూ, ది నేషనలిస్టు,ఆంధ్ర గ్రంథాలయం, ఆంధ్రవార్త,గ్రంథాలయ సరస్వం` పత్రికలకు సంపాదకత్వం వహించారు. `గ్రంథాలయ సరస్వం`గాడిచర్ల వారి మానస పుత్రికగా చెబుతారు.`హిందూ` పత్రికకు అనేక సమీక్షలు రాశారు.
దుర్భర జైలు జీవితం
స్వాతంత్ర్య సయరయోధులు ఎందరో జైలు జీవితం గడిపారు కానీ గాడిచర్ల వారు చవిచూసినంత దుర్భర పరిస్థితి ఎవరికీ ఎదురై ఉండదు (నిజాం ఏలుబడిలో దాశరథి, వట్టికోటకు తప్ప).తిరునల్వేలిలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మరణించడంపై `విపరీతబుద్ధి`శీర్షికతో ఆయన రాసిన సంపాదకీయం కారణంగా రాజద్రోమం నేరంమోపి కఠిన జైలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం `వేలూరు సెంట్రల్ జైలులో హంతకులు, బందిపోటు దొంగలున్న గదిలో వేశారు. మానరక్షణకు రెండు గోచిలు, మూరెడు చదరంగల రెండు తువ్వాళ్లు,పడుకునేందుకు చిన్న ఈత చాప, అన్నం తినడానికి మట్టిచట్టి ఇచ్చారు. కాలికి లావాటి కడియం,మెడకు మరో కడియం వేసి ఒక కొయ్యముక్కను వీటిలో దూర్చారు. మొలతాడు,జంధ్యం తీసివేశారు. తలబోడి చేయించారు. రాగి సంకటి ముద్ద, దానిలో రాళ్లు, పుల్లలు,పురుగులు తేలుతుండేవి. గవర్నర్ జైలు సందర్శనకు వచ్చినప్పుడు తనను మానవమాత్రునిగా చూడాలన్న గాడిచర్ల కోరికను పెడచెవిన పెట్టిన ఆ దుర్మార్గుడు రావుగారిని దుర్భాషలాడి వెళ్లిపోయారు`అని దర్శి చెంచయ్య `నేనూ-నా దేశం` గ్రంథంలో ఆనాటి పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చిత్రించారు.అయినా మొక్కవోని ధైర్యంతో భరించారుఅలా స్వీయరచనకు జైలు శిక్ష అనుభవించిన తొలి తెలుగు పాత్రికేయులతో హరిసర్వోత్తమరావు ప్రథములు. జైలు నుంచి విడుదలైనా పూర్తి స్వేచ్భ లభించలేదు. ఆయనపై నిఘా కొనసాగింది.ఆయనతో మాట్లాడేందుకే ప్రజలు భయపడేవారట.
Also Read: అవసరార్థుల ‘దేవర’ అయ్యదేవర
వయోజన విద్యా ప్రదాత:
`మన ప్రజలకు విజ్ఞానం వ్యాపింపకుండుటయే మన అథోగతికి కారణం. ఎల్లభివృద్ధికిని విజ్ఞాన వ్యాపనయే ప్రథమాధారం.అక్షరజ్ఞత దానికి మూల సాధనం.అక్షరజ్ఞతతో విజ్ఞానం వ్యాపింపజేయుటకు పత్రికలు, గ్రంథములు,ఉపన్యాసములు ఉన్నవి. వీటన్నింటినీ యేర్పరచి కృషిచేయునట్టి యుద్యమమే గ్రంథాలయోద్యమం`అంటూ గ్రంథాలయ,వయోజన విద్యావ్యాప్తికి వయోజన విద్య గౌరవ సంచాలకుడిగా చక్కని ప్రణాళిక రూపొందించారు. వయోజనులైన కార్మికులకు రాత్రి పాఠశాలలు నిర్వహిస్తున్న ఆయన సేవలను గుర్తించిన మద్రాసు ప్రభుత్వం ఆంధ్ర ప్రాంతానికి వయోజన విద్య గౌరవ సంచాలకుడిగా నియమించింది.
విద్యార్థి దశలోనే వయోజనులకు రాత్రి పాఠశాల నిర్వహించిన ఆయన అనంతరం కాలంలో వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి సారించారు. అయితే అది గిట్టని ప్రభుత్వం కోస్తా జిల్లాలలో రాత్రి పాఠశాలను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయగా, ఆ ఉత్తర్వులను రద్దు చేసేంత వరకు ఉద్యమించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా ఉన్నత విద్యాభివృద్ధికి, మాతృభాషా వికాసానికి కృషి చేశారు. బందరులో జాతీయ కళాశాల స్థాపనలో కీలకపాత్ర పోషించారు.
గ్రంథాలయోద్యమశీలి:
గాడిచర్ల నెలకొల్పిన `ఆంధ్ర గ్రంథాలయసంస్థ`(1914) దేశంలోనే మొట్టమొదటిది.1934 నుంచి తుదిశ్వాస వరకు గ్రంథాయల సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు.ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్ కు కొంతకాలం ఉపాధ్యక్షులుగా ఉన్నారు.
Also Read: బందీగా కంటే బలిదానమే మిన్న:ఆజాద్
ప్రజాప్రతినిధిగా…
కర్నూలు జిల్లా నుంచి కాంగ్రెస్ తరపున (1927) మద్రాసు కౌన్సిల్ సభ్యుడిగా హరి సర్వోత్తమరావు ఎన్నికయ్యారు.అప్పటి వరకు దత్త మండలంగా పిలిచే జిల్లాలకు `రాయలసీమ` అని నామకరణం చేశారు. మహానందిలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ మహాసభలో `ఆంధ్రరత్న`దుగ్గిరాల గోపాలకృష్ణయ్యతో కలసి జాతీయ విద్యా ప్రణాళికను తయారు చేశారు.
బహుభాషావేత్త:
తెలుగులో భావకవిత్వం అనే మాటను తొలుత ప్రయోగించిన సాహితీవేత్త. మాతృభాష తెలుగుతో పాటు ఆంగ్ల, హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ భాషలలో చక్కటి ప్రవేశం కలిగినవారు. గాంధీజీ రాసిన గ్రంథాన్ని `హైందవ రాజ్యం`గా అనువదించారు.
Also Read: కథామురిపాల`గుమ్మి` పాలగుమ్మి
ముక్కుసూటి తనం:
నమ్మిన సిద్ధాంతాల విషయం రాజీ ఎరుగని నేత. ముక్కుసూటిగా వ్యవహరించే తత్వం.తోచింది అనడమే తప్ప దాని వల్ల కలిగే లాభనష్టాలు గురించి పట్టించుకునేవారు కాదు.`ఖండితవాది.ఎంతటివారినైనా లక్ష్యపెట్టని తలబిరుసు వాదన`అని కొందరు అనేవారు. దానిని ఆయన ఆత్మ విశ్వాసంగా భావించేవారు.ఎదుట వారి వాదన నచ్చకపోతే అక్కడి నుంచి నిష్క్రమించేవారట. గాంధీజీని విమర్శించినప్పుడు `ద బ్రేవో హరిసర్వోత్తమరావు` అని గాంధీజీ అభినందించారట. గ్రంథాలయోద్యం, వయోజన విద్యావ్యాప్తికి జీవిత సర్వస్వాన్ని అంకితం చేసి, ధారపోయడం తప్ప దాచుకోవడం తెలియని త్యాగమూర్తులో మరో ఈ త్యాగశీలి 77వ ఏట 1960 ఫిబ్రవరి 29వ తేదీన మద్రాసులో కన్నుమూశారు.
(లీప్ సంవత్సరంలో (ఫిబ్రవరి 29) గాడిచర్ల వర్ధంతి)