- పల్లె, తల్లి, చెల్లి అంటే వల్లమాలిన ప్రమాభిమానాలు
- వెన్నెముకలో బుల్లెట్ ఉంచుకొని తిరిగాడు
- పేదల పక్షాన నిలిచి పాడాడు, ఆడాడు
ప్రజాగాయక నాయకుడు గద్దర్ వెళ్లిపోయాడు. యుద్ధగీతం నిద్దరోయింది. ప్రజలపాటల ఓడ ఆగిపోయింది. ధిక్కార స్వరం శాశ్వతంగా మూగబోయింది. ఆయన పంథా వేరు కావచ్చు. ఆ పాటకు ఊగని మనిషిలేడు. కొన్ని దశాబ్దాల పాటు కొన్ని తరాలవారిని కదిలించి, పెనునిద్దుర వదిలించింది ఆ గానం. అది అజరామరం. తెలుగునాట ఇంటికొక ఘంటసాల పుట్టినట్టుగా, తెలంగాణలో ఊరికొక గద్దర్ పుట్టాడు. ఆ వేషం, ఆ వైనం ఎందరినో ఆ మార్గంలో నడిపించింది.”అలలు కదిలినా పాటే -కలలు చెదిరినా పాటే – కలత చెందినా పాటే.. ” అని వేటూరి అన్నట్లు పాటే బతుకై సాగినవాడు గద్దర్. అన్నార్తుల కోసం ఆడాడు, పాడాడు, అన్నల వెంట నడిచాడు. ప్రతి ఉద్యమంలో తన గొంతు వినిపించాడు. ఎన్నో ఉద్యమాలను తన పాటతో నడిపించాడు. ముఖ్యంగా పెద్దలను ఎదిరించడానికి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకు పాటనే ఆయుధంగా మలుచుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఉత్తరాదిలోనూ, మధ్య భారతంలోనూ తన గళం వినిపించాడు, గజ్జె కదిలించాడు. ముతక పంచె, చేతిలో కర్ర,పైన గొంగళి వేసుకొని గద్దర్ ఆడుతుంటే, పాడుతుంటే వేదిక మోగిపోయేది, జనసంద్రం ఊగిపోయేది. ఈ అనుభవాలు, అనుభూతులు ఉన్నవారు తెలుగునేల నలు చరగులా వున్నారు. వామపక్ష భావాలు, విప్లవ మార్గాలు, సాయుధ పోరాటాల వెంట ఆయన పాట సాగింది. ఆ స్ఫూర్తి యువతరాలను అటువైపు నడిపించింది. నిమ్న వర్గాల కష్టాలను పాటలుగా పాడి కొత్త చైతన్యాన్ని నింపే పనికట్టుకొని తిరిగారు. ప్రధానంగా పేదవాడి పక్షాన నిలుచున్నాడు. పేదలను దోచే గద్దలను గద్దె దింపాలని చూచాడు.
నరసింగ్ రావు ‘మాభూమి’లొ గద్దర్ పాత్ర
వామపక్ష విప్లవ, పోరాట మార్గంలో ఎక్కువ జీవితం సాగినా, చివర్లో ఎందుకో కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరుడుగా మారాడు. గద్దర్ గీతాప్రస్థానంలో దర్శకుడు బి నరసింగరావు స్థానం విలువైనది. ‘మా భూమి’ సినిమా కోసం ఆడి పాడి నటించి ఎందరి హృదయాలనో కొల్లగొట్టాడు. సినిమా పాటలు చాలా అరుదుగా రాసినా అన్నీ ఆణిముత్యాలే. ఈ ప్రయాణంలో ఆర్ నారాయణమూర్తి పాత్ర మరువలేనిది. తల్లిపై, చెల్లిపై రాసిన పాటలు అమృతకలశాలు. పల్లె పట్ల, తల్లి పట్ల గద్దర్ కు వల్లమాలిన ప్రేమ. అన్నమయ్య, రామదాసు వంటి వాగ్గేయకార కీర్తనలు, భక్తి ఉద్యమంలో దేశమంతా వెల్లువెత్తిన గీతాలు తనను నడిపించాయని అనేకసార్లు చెప్పుకున్నారు. పాత హిందీ సినిమా పాటలంటే చెవి కోసుకొనేవాడు. పల్లెల్లో తనని కరిగించిన బుర్రకథలు, ఒగ్గుకథలు తన మార్గానికి ఊపిరై నిలిచాయి. ” సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో!” తన అమ్మపై రాసుకున్నా, అందరినీ కన్నీళ్లు పెట్టించాడు.” నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మో!” పాట ఎంతటి రసప్లావితమో, భావోద్వేగభరితమో కోట్లాదిమందికి అనుభవం. “బండెనక బండి గట్టి, పదారు బండ్లు గట్టి..” తెలుగునేలపై చేసిన సందడి, సవ్వడి అంతాఇంతాకాదు. జన నాట్యమండలి స్థాపనలో, విజయప్రస్థానంలో గద్దర్ అడుగులు పెద్దవి. తెలంగాణపై రాసిన పాటలు తెలంగాణ జాతి గీతాలై అలరారుతున్నాయి. విప్లవ రచయితల సంఘంలో (విరసం) ఆయన భూమిక ఎన్నదగినది.2002లో నక్సల్స్ – ప్రభుత్వం మధ్య చర్చల సమయంలో వరవరరావుతో పాటు గద్దర్ దూతగా వ్యవహరించారు.
ఎందరు ప్రముఖులకో ఆత్మీయుడు
పరిటాల రవికి కూడా బాగా దగ్గరవాడు. మాడుగుల నాగఫణిశర్మ వంటి సంప్రదాయ పద్యకవులకు కూడా గద్దర్ పాటంటే ఎంతో ఇష్టం. జైళ్లు, పోలీసుల వేదింపులు తన మార్గంలో ఎన్నో ఎదురైనాయి. గద్దర్ పై బుల్లెట్ల వర్షం కురిసిన సందర్భం కూడా వుంది. అతని శరీరంలో ఇంకా ఓ బుల్లెట్ అట్లే వుంది. అది తీస్తే ప్రాణానికి ప్రమాదమని డాక్టర్లు అట్లే వుంచారు. రాజకీయాల్లోకి రావాలని, చట్టసభల్లో తన వాణిని వినిపించాలని చాలా ఆశించాడు. అది జరుగలేదు. ‘తెలంగాణ ప్రజా ఫ్రంట్ ‘ ను స్థాపించాడు. “అమ్మా తెలంగాణమా..” అనే పాటను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ప్రకటించింది. ‘పొడుస్తున్న పొద్దు మీద….’ వంటి పాటలు ప్రజల నాల్కలపై నాట్యం చేస్తున్నాయి. బి నరసింగరావు ప్రోత్సాహంతో మొట్టమొదటగా “ఆపర రిక్షా” పాట రాశాడు. తన పాటల ఆల్బమ్ కు ‘గదర్’ అనే పేరుపెట్టుకున్నాడు. అదే అతని కలంపేరుగా, గళంపేరుగా మారి వాసికెక్కింది. గుమ్మడి విఠల్ రావు అట్లా ‘గద్దర్ ‘ అయ్యాడు. తెలంగాణలో సుద్దాల హనుమంతు తర్వాత ప్రజాగాయకుడిగా, ప్రజా వాగ్గేయకారుడిగా పేరుమోసినవాడు గద్దర్. పెత్తందారీ వ్యవస్థను ఎదిరిస్తూ మొదలైన ఆ పాట, తర్వాత కాలంలో అనేక రూపాలు తీసుకుంది. ప్రజాయుద్ధనౌకగా పేరుకెక్కిన పాటలరాయడు అనంతచైతన్య స్రవంతిలో కలిసిపోయాడు. పాటలమ్మ ఒడిలో శాశ్వతంగా సేదతీరడానికి తీరం దాటాడు. యుద్ధగీతం నిద్దురోయింది. ఇక ఆ సడి, ఆ సవ్వడి, ఆ సందడి వినిపించవు, కనిపించవు.
Also read: నవనవోన్మేష సాహిత్యోత్సవం