Thursday, December 26, 2024

అన్నా శ్రీధరన్నా, ఆర్టీఐ సరిగ్గా ఉపయోగిస్తే విప్లవాలు తేవచ్చన్నా: గద్దర్

‘‘అమ్మతో కలిసి కూడా దిగుదాం. దగ్గరికి రా’’ అని నాతో గద్దర్ చెప్పిన మాట నేనిక మరిచిపోలేను. (రచయిత, శ్రీమతి వేదకల్యాణి తో చెప్పిన సందర్భంలో)

అపోలో స్పెక్ట్రా హాస్పటల్ లో గద్దర్ అన్నతో కలిసినాను.  చాలా కాలం తరువాత చూశాను కదా, నాగురించి పరిచయం చేద్దామనుకున్నాను. నేను లోపలికి రాగానే బెడ్ పైన కూచున్న గద్దర్ ‘ఆర్టీఐ లో మంచి పనిచేసినవే’’ అనడం కళ్లు చెమర్చింది.

అల్వాల దగ్గర, ఇంకెన్నోచోట్లనో జాగలు ఎవరెవరికో తీసుకుపోతూ ఉంటే, అదొక్కటే కాదు ఎన్నో చోట్ల నీ ఆర్టీఐ సమాచారం కోసం నిలబెట్టుకున్నాం. అన్నా శ్రీధరన్నా, ఆర్టీఐ సరిగ్గా ఉపయోగిస్తే విప్లవాలు తేవచ్చన్నా’’ అన్నాడు.

నా అదృష్టం. గద్దర్ నాకోసం నాలుగు పాటలు అప్పడిదప్పుడే పాడినాడు. అందులో ఇతివృత్తం చిన్నపిల్లలకు పాలు పట్టడం వివరించాడు. అంత ఇంటిని ఊడ్చే చీపుర గురించి అంతగొప్ప పాట పాడడం అద్భుతం. మనసులో ఏ మాత్రం భయం కాని బాధ కానీ మచ్చుకన్నా కనబడలేదు. ఎప్పటివలెనే ధైర్యంగా, సంతోషంగా రాబోయే పోరాటానికి కూడా సిద్ధపడినట్టు నాకు కనిపించినాడు గద్దర్.

ప్రెస్ నోట్ రాస్తున్నపుడు ఒక్కే క్షణంలో సరైన అక్షరాలను, పదాలను ఒక్క అదనులోనే వాక్యనిర్మాణం పూరించాడు.  

ఇదే గద్దర్ స్వయ దస్తోరితో రాసిన ఆఖరి లెటర్ !

దానికి ముందు డాక్టర్ ప్రసాదరావ్, పాశం యాదగిరి ఒక్కో అక్షరాన్ని దిద్ది, ఒకో పదాన్ని చదివి ఇది ఇప్పుడు బాగున్నది అని జనానికి పంపండి అని ఒప్పుకున్నారు. డాక్టర్ ప్రసాదరావ్ గారు చదివి విని, అవునవును అన్నారు. మొదట రచయిత గద్దర్. చాలా మంచి జర్నలిస్టు యాదగిరి అక్షరాలను సరిదిద్దుకొన్నాడు. కాని డాక్టర్ ప్రసాద్ గారి ముందున్నా హాస్పిటల్ గది బయట యాదగిరి నిలబడిపోయాడు, గద్దర్ కు ఇబ్బంది వస్తుందేమోనని మనసుతో భయపడ్డాడు. నాలుగైదు రోజుల నుంచి డాక్టర్ ప్రసాద్ గారిని, గద్దర్ కోసం నేను, నా శ్రీమతి కలుస్తూ ఉన్నాము. ఆంజియో కోసం నేను గద్దర్ ఉన్న పక్క గదిలో ఉన్నా, నన్ను గద్దర్ను డిస్టర్బ్ చేయవద్దని డాక్టర్ ప్రసాద్ గారు చెప్పారు. సరైన సమయం చూసి ప్రసాద్ గారు నన్ను, శ్రీమతిని పంపించారు. నావెంట డాక్టర్ ప్రసాద్ ఉన్నారు.

అప్పుడు హాస్పిటల్ నుంచి ‘పత్రిక ప్రకటన’ డ్రాఫ్ట్ నుంచి చదివి ఆయనే వినిపించారు. ‘‘నా మాట, జనం, ప్రజలు’’ అనే మాటలు సరిగ్గా అమర్చినవాడు గద్దర్. అప్పుడు ఈ ప్రకటన జరిగింది.

గద్దర్ గాయపడ్డ ప్రజల పాట

డాక్టర్ ప్రసాదరావ్, పాశం యాదగిరి కలిసిన తరువాత కరుణాకర్ ఈ విధంగా గాయపడిన కళ్లతో రాసుకున్న మాటలు ఇవి. ‘‘గద్దరన్న ఇక లేడని తెలిసి నేను జీర్ణించుకోలేక పోతున్నాను! గద్దరన్న గొప్పతనం నాకు బుద్ది తెలిసిన నుండి తెలుసు! నా గురించి గద్దరన్నకు తెలిసింది మాత్రం పాశమన్న ద్వారానే!’’ అని కరుణాకర్ వివరించాడు.

—–

ఆకాశాన్ని శిక్షిస్తున్నావా గద్దర్?

తుపాకులు తూట్లు తొలుచుకుంటూ పోతున్నా

పాటల హృదయాన్ని రంధ్రాల డ్రిల్ చేస్తున్నా

ఇరవై ఒక్కటి  బులెట్లను నిష్కారణంగా నిర్దయతో,

న్యాయం చేత లేని, చేవలేని, నిర్దోషియైన ఆకాశాన్ని

పేల్చుకుంటూ, మరణశిక్ష విధించి నిశ్శబ్దంగా ఉన్నావా?

దేశం కోసం పాడుకుంటూ ఆడుకుంటూ

శరీరంలో జీర్ణించుకున్న

రవిస్తూ రహిస్తూ స్తుతిస్తూ

దశాబ్దాలనుంచి నివసిస్తున్న

తూటాల్ని మరిచి జపిస్తున్నావా గద్దర్? 

(7 ఆగస్టు 2023నాడు

21 తుపాకుల పోలీసులు అధికారలాంఛనాలతో పేల్చుతున్న సమయంలో)

మాడభూషి శ్రీధర్

—————-

పోరాటయోధుడు గద్దర్ చివరి క్షణాలు ఇవి, ‘‘నిన్న ఉదయం 8 గంటలకు “గద్దర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నాడు” అని డాక్టర్ చెప్పినాడు. కాని దానికోసం ఆయన ఏడ్వలేదు.  అయినా ధైర్యం ఆయనది. “5 బుల్లెట్లు శరీరంలోకి దిగినా” తట్టుకొని 25 ఏండ్లు జనంకోసం పోరాడుతూనే ఉన్నాడు. ‘‘ఈ లంగ్ ఇన్ఫెక్షన్ గద్దరన్నకు ఒక లెక్కనా అనుకున్నా. కానీ మధ్యాహ్నం డాక్టర్ గారు పాశం యాదగిరి ఫోన్ చేసిన తరువాత నాలో భయం జొరబడ్డది. హుటావుటిన హాస్పిటల్‌కు ఉరికినం. చాలా క్రిటికల్ గా ఉందని డాక్టర్ చెప్పినప్పుడు గుడ్లు తెలేసాను’’ అని విలపించాడు.  ‘‘31 తారిక్ నాడు నేను మాడభూషి శ్రీధర్ గారు గద్దర్ అన్నతో హాస్పిటల్ లో కల్సినప్పుడు అరే నేను బయటికి వచ్చిన తరువాత గజ్జె కట్టి పాడిన వాడు అని అన్నప్పుడు నా మనస్సు ఉప్పొంగింది. అరే నేను నా ఆరోగ్యం గురించి ప్రజలకు తెలియ జేయాలని “ప్రెస్ నోట్” రాసిన, దీన్ని తెలుగులో టైపు కొట్టి అందరి మీడియాకు పంపు’’ అని కరుణాకర్ వివరించారు.  మనమందరం కల్సి గద్దరన్న చివరి కోరికైన “తెలంగాణ పుననిర్మాణం” జరిగితే అప్పుడే ఆయన ఆత్మ శాంతిస్తుంది. జోహార్ గద్దరన్న, హా.. అంటే నవ నాడుల్లో ప్రకంపనం, గొంతెత్తి పాడితే అణువణువు ఉత్తేజం, ఆ విప్లవ గీతం యువతకు స్ఫూర్తిమంత్రం, ఎలుగెత్తే ప్రతి అక్షరం ఓ ధిక్కార స్వరం. పెత్తందారులను వణికించిన పాటల అస్త్రం! ఆస్పత్రిలోని ఐసీయూలో అంపశయ్యపైనా పాటనే శ్వాసించి తుది శ్వాస విడిచారు, తెలంగానం వినిపించిన చైతన్య స్వరం. ఆ ధిక్కార స్వరం మూగవోయింది. విప్లవ వీరుడు-వాగ్గేయకారుడు గద్దర్‌ అస్తమించారు. ఆ పాటల గర్జన ఆగిపోయింది!’’ అని ’కరుణాకర్ రాసిన తరువాత ఇక నేనేం రాయను.  

అక్షర కన్నీటి బాష్పకణాలతో నేనిచ్చిన నివాళి

మాడభూషి శ్రీధర్

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles