Tuesday, January 21, 2025

సృష్టి రహస్యం తెలిసిన వాగ్గేయకారుడు గద్దర్

సృష్టి రహస్యం తెలిసినవాడు గద్దర్. పుట్టుక, చావు గురించి స్పష్టమైన అవగాహన ఉన్నవాడు. తన మరణగీతాన్ని తానే ఆలపించిన వేదాంతి. పేద జనం గొంతుకగా నిలవాలని నిర్ణయించుకున్న తర్వాత వెనుదిరిగి చూడలేదు. పాట, నృత్యం, విప్లవం ప్రవాహసదృశ్యంగా జీవితం గడిపిన చైతన్య స్రవంతి ఆయన.

రామచంద్రమూర్తన్నా అంటూ నోరారా ఆప్యాయంగా పిలిచే గద్దర్ మరి లేడంటే నమ్మశక్యం కావడం లేదు. ‘ఉదయం’ నుంచి ‘సాక్షి’ వరకూ ఏ పత్రికలో పని చేస్తున్నా క్రమం తప్పకుండా మా కార్యాలయానికి వచ్చేవాడు. పీపుల్స్ వార్ గ్రూప్ నాయకత్వం అప్పటి రాజకీయ సమస్యల గురించి ఏమి ఆలోచిస్తున్నదో చెప్పేవాడు. ఎట్లా స్పందిస్తే బాగుంటుందో చర్చించేవాడు. విప్లవ వీరులనీ, దేశభక్తులనీ నక్సలైట్లను అభివర్ణించిన ఎన్ టి రామారావు ఎట్లా పోలీసులకు పూర్తి అధికారాలు ఇచ్చి ఎన్ కౌంటర్లకు తెరదీసిందీ, దాని గురించి పార్టీ పొలిట్ బ్యూరో ఏమనుకుంటున్నదీ వివరించేవాడు. అదే విధానాన్ని చంద్రబాబునాయుడు కొనసాగించడం గురించీ మాట్లాడేవాడు. మధ్య డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం, నిషేధం ఎత్తివేత గురించి, ఆ అవకాశాన్ని పీపుల్స్ వార్ గ్రూప్ ఎట్లా వినియోగించుకున్నదీ మాట్లాడుకునేవాళ్ళం. వైఎస్ రాజశేఖరరెడ్డి విధానాలు కూడా చర్చకు వచ్చాయి. పదేళ్ళ అజ్ఞాతవాసంలో పరిటాల రవి దగ్గర గడిపిన రోజులూ చర్చకు వచ్చేవి. నక్సలైట్ నాయకులతో వైఎస్ ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందు ‘వార్త’లో, తర్వాత ‘ఆంధ్రజ్యోతి’లో లేఖల పరంపర ప్రచురించడంలో, సకారాత్మక వార్తలు రావడంలో గద్దర్ ప్రోత్సాహం ఉంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు విప్లవ రాజకీయాల నుంచి విరమించుకున్నప్పటి నుంచీ మొన్న ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని వేదికమీద ముద్దుపెట్టుకున్నప్పటి వరకూ గద్దర్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ వచ్చాడు. సమస్యలపైన తనదైన తీరులో స్పందించేవాడు. ప్రజాఉద్యమాలతో మమేకమయ్యేవాడు. పాటనూ, ప్రత్యేకమైన తన ఆహార్యాన్నీ వదిలిపెట్టలేదు.

 గద్దర్ భావజాలంతో సంపూర్ణంగా ఏకీభవించకపోయినప్పటికీ ఆయనను ప్రేమించినవారు లెక్కకు అందనంతమంది ఉన్నారు. వారిలో నా దివంగత మిత్రుడు దేవిప్రియ ఒకడు. దేవిప్రియకి నా కంటే ముందే గద్దర్ తో పరిచయం, స్నేహం ఉన్నాయి. వారిద్దరు ప్రఖ్యాత దర్శకుడు నరసింగ్ రావు నేతృత్వంలో కలిసి పని చేశారు. ‘మాభూమి’ బృందంలో సభ్యులు. ‘ఉదయం’ హైదరాబాద్ కార్యాలయానికి గద్దర్ వస్తే ఆ పూట వేరే పనులు చేసేవాళ్ళం కాదు. నా కేబిన్ కి దేవిప్రియ, మోహన్, యాదగిరి, తదితర మిత్రులు వచ్చి గద్దర్ వెళ్ళే వరకూ కబుర్లు చెబుతూ కూర్చునేవాళ్ళు. టేబుల్ మీద దరువేస్తూ పాటలు పాడేవాడు. కూనిరాగాలు తీసేవాడు. ప్రేమగా మాట్లాడేవాడు. నక్సలైట్లను పోలీసులు పట్టుకున్న వైనం మార్నాడు ‘ఉదయం’ పత్రికలో వస్తే సదరు నక్సలైట్ల ప్రాణాలకి ముప్పుతప్పినట్టే. లేకపోతే పోలీసులు కాల్చి చంపేసేవారు. శవం పక్కన పుస్తకాలు పెట్టి విప్లవ సాహిత్యం దొరికిందనేవారు. ఒక తుపాకీ కూడా శవం పక్కన విధిగా ఉండేది.  ఎదురుబొదురు కాల్పుల్లో మరణించాడని నిరూపించడానికి పోలీసులు ప్రయత్నించేవారు. మర్నాడు బాలగోపాల్ బృందం నిజనిర్థారణకోసం వెళ్ళేది. తిరిగి వచ్చిన తర్వాత విలేఖరుల గోష్ఠి ఉండేది. బాలగోపాల్ చెప్పిన అన్ని అంశాలనీ తు.చ. తప్పకుండా ‘ఉదయం’లో ప్రచురించేవాళ్ళం. అసలు ఎన్ కౌంటర్ వార్త కంటే బాలగోపాల్ విలేఖరుల గోష్ఠికి అధిక ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళం. దేవిప్రియ రన్నింగ్ కామెంటరీ రాసేవాడు. మోహన్ బొమ్మలు వేసేవాడు. యాదగిరి వార్తలు రాయించేవాడు. పత్రిక కార్యాలయం నుంచి విప్లవం నడుపుతున్నామనే భ్రమలో బతికేవాళ్ళం. ఆ రకంగా పేద ప్రజల పక్షాన జర్నలిస్టులుగా మేమూ నిలిచామనే సంతృప్తి ఉండేది.

1978లో ‘మాభూమి’ నిర్మాణం సందర్భంగా ప్రజ్ఞాపూర్ లో భూపాల్, నర్సింగ్, గద్దర్

దేవిప్రియ గద్దర్ మీద ఒక డాక్యుమెంటరీ నిర్మించాడు. దాని పేరు యుద్ధనౌక. గద్దర్  కు ప్రజాయుద్ధనౌక అనే పేరు అప్పటికే ఉంది. గద్దర్ జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలూ, పాటలూ, నృత్యాలూ, మహాసభలూ, ప్రసంగాలూ, ఇంటర్వ్యూలూ అన్నీ కలిపి మహాద్భుతమైన దృశ్యకావ్యం రూపొందింది.

ప్రఖ్యాత దర్శకుడు నరసింగ్ రావు పంపిన చిత్రం

గద్దర్ మాట కంటే పాటకు ప్రాధాన్యం ఇచ్చిన వాగ్గేయకారుడు. పాటతో పాటే నృత్యం. అందులోనే ఓహ్, హట్, హూట్, ఆ, అహ్, అరరే… అంటూ పోరాట ధ్వనులతో పాటు అద్భుతమైన హావభావాల ప్రదర్శన. వేలమంది జనాలను కట్టిపడవేసే సమ్మోహనశక్తి ఆయన సొంతం. తెలంగాణ ఉద్యమంలో పూర్తి అంకితభావంతో పాల్గొన్నాడు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, నా తెలంగాణమా’ అంటూ తెలంగాణ జాతీయ గీతాన్ని రాసి చరితార్థుడైనాడు. విప్లవపోరాటంలో అమరులైన సోదరీసోదరులకు పాటల్లో నివాళులర్పించారు. ‘వందనమో వందనమమ్మా నా చెల్లే స్వర్ణమ్మ’ అంటూ, ‘మాయమైపోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమై పోతివో అన్నో యాదన్న’ అంటూ శ్రద్ధాంజలి ఘటించాడు.నడుముకు ముతక ధోవతి, భుజం మీద గొంగడి. కాళ్ళకి గజ్జెలు, చేతిలో కర్ర, మరోచేతిలో ఎర్రటి గుడ్డతో రగుల్ జెండాతో జననాట్యమండలి వేదికపైన అడుగులేస్తుంటే ఆవేశంతో ఊగిపోనివారు ఉండేవారు కాదు. మా సారథి దాసరి నారాయణరావుకు గద్దర్ అంటే ప్రత్యేకమైన అభిమానం. సినీ నటుడూ, జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ కి గద్దర్ అంటే చాలా ఇష్టం. నటుడూ, నిర్మాత ఆర్ నారాయణమూర్తి గద్దర్ ను ప్రేమించిన ప్రముఖులలో అగ్రగణ్యుడు. పల్లె అన్నా, తల్లి అన్నా, చెల్లె అన్నా గద్దర్ కు వల్లమాలిన ప్రేమ. ‘సిరిమల్లె సెట్టుకింద లచ్చుమమ్మో’ అంటూ గొంతెత్తి పాడితే స్పందించని తల్లి ఉండదు.

ముప్పయ్ ఏళ్ళ కిందట గద్దర్ ఒక సారి మృత్యువుతో పోరాడి గెలిచాడు. 6 ఏప్రిల్ 1997న తనపైన ముష్కరులు దాడి జరిపినప్పుడు గండం నుంచి బయటపడ్డాడు. అప్పుడు నేను పద్మాలయా టీవీలో పని చేస్తున్నాను. విషయం తెలిసి పరుగుపరుగున వెళ్ళాం. వెన్నెముకలో చిక్కుకున్న ఒక బుల్లెట్ ను వైద్యులు తొలగించలేక అట్లాగే వదిలేశారు. శరీరంలో బుల్లెట్ పెట్టుకొని ఆటపాటలతో ప్రజలను జాగృతం చేస్తూ, ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కొనసాగించిన ధీరుడు గద్దర్.

గద్దర్ పట్టువిడుపులు తెలిసినవాడు. లౌక్యం తెలిసినవాడు. అన్ని పార్టీలలోనూ ఆయనకు అభిమానులు ఉండేవారు. అన్నమయ్య, రామదాసు కీర్తనలంటే ఇష్టపడేవాడు. భద్రాచలం రామాలయం వెళ్ళి దేవుడి దర్శనం చేసుకున్నాడు. ‘మూగవోయిన గొంతులో రాగమెవరు తీసెదరూ…జీరబొయిన గొంతులో జీవమెవరు పోసెదరు…’అంటూ తన మరణంపైన తానే పాట కట్టుకొని పాడారు గద్దర్. అందుకే ఆయన సృష్టి రహస్యం తెలిసినవాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles