Sunday, January 26, 2025

అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా!

అంతరంగం నుంచి అంతర్జాతీయం దాకా! 

గాంధీయే మార్గం-15

సత్యాగ్రహం అంటే సత్యంకోసం ఆగ్రహిచడం కాదు, సత్యాన్ని గ్రహించడం

మానవత్వమే దేశభక్తి

అంతర్జాతీయ అహంసాదినోత్సవంగా గాంధీ జయంతి

గాంధీజీ ఆకారం చూస్తే ఆద్యంతం ఆధ్యాత్మిక వాది అనుకుంటాం. కానీ ఆయన ఆలోచనాశీలి, సిద్ధాంతకర్త! అంతేకాదు, కడు బలహీనంగా కనిపించే ఆ 62 ఏళ్ళ వృద్ధుడు అలవోకగా 240 కిలోమీటర్లు నడిచి దండి సత్యాగ్రహాన్ని విజయవంతం చేసి బ్రిటీష్ వర్గాలను ఆశ్చర్యానికి లోను చేసిన ఆరోగ్యవంతుడు కూడా! 

మనిషి కేవలం మేధస్సుతోనే కాకుండా ప్రతి నిత్యం శారీరక కష్టం చేయాలని తన జీవిత కాలంలో 27 రకాల పనులను (వృత్తులను) మంచి నైపుణ్యంతో సాధించిన ఆధునిక వాది ఆయన. కొత్తమతాన్ని ప్రతిపాదించలేదు కానీ , భారతదేశంలో ప్రజలు పాటించే అన్ని మతాలనూ, విశ్వాసాలను గమనించి వాటిలోని మానవీయ విలువలను ప్రోది చేసి అందించిన దార్శనికుడు ఆయన.

Also read: గాంధీజీ ప్రత్యేకత ఏమిటి ?

సత్యాగ్రహ ప్రతిపాదన

తరతరాలుగా హింస, ప్రతిహింసతో మానవజాతి రోసిపోయిందని 1906 సెప్టెంబర్ 11న ఈ ప్రపంచానికి సత్యాగ్రహం అనే అత్యాధునిక పోరాట మార్గాన్ని సూచించినవాడాయన!  సత్యాగ్రహమంటే సత్యమూ, ఆగ్రహము కానేకాదు; సత్యాన్ని గ్రహించడమే సత్యాగ్రహము!  దాన్ని పాటించిన వ్యక్తి సత్యాగ్రహి!  గాంధీజీ ప్రకారం సత్యంలో అహింస, శాంతి, దయ, ఆశ, క్షమ,  ఓరిమి… అంతర్భాగాలే. అవసరానికి మించి దేనిని ఖర్చు చేసినా అది హింసే అని ప్రతిపాదించిన సిద్ధాంతకర్త గాంధీజీ. అయితే,  దీనిని తను కొత్తగా ఆవిష్కరించినట్లు చెప్పుకోలేదు. సత్యం, అహింస హిమాలయాలంతటి పాత విషయాలని ఆయన చాలాసార్లు పేర్కొన్నారు. ఏ విషయం చూసినా గాంధీజీ నిత్యనూతనంగా బహుళ ప్రయోజనకరంగా దర్శనమిస్తారు. 

Also read: మహాత్ముడు ఎందుకుకొల్లాయి గట్టారు?

“నాకు దేశభక్తి అంటే మానవత్వమే. నేను దేశభక్తుణ్ణి, ఎందుకంటే నేను మనిషినీ, నాలో మానవత్వం ఉంది… నా జీవిత ప్రణాళికలో సామ్రాజ్యవాదానికి చోటే లేదు… వ్యక్తిగతమైన, బహిరంగమైన నియమాల మధ్య సంఘర్షణ ఉండదు” అని  ‘యంగ్ ఇండియా’ పత్రిక 1921మార్చి 6 తేది సంచికలో ,  81వ పుటలో ప్రకటించారు. ఇంకా  ఈ విషయానికి సంబంధించి ‘యంగ్ ఇండియా’ పత్రిక లోనే 1925జూన్ 28 సంచిక , పుట 211లో ఇలా వివరిస్తారు –  “…జాతీయవాది కాకుండా అంతర్జాతీయ వాది కావడం సాధ్యం కాదు. జాతీయవాదం వాస్తవమైతేనే అంతర్జాతీయవాదం సాధ్యమవుతుంది. అంటే, వివిధ దేశాలకు చెందిన ప్రజలు సమైక్యమై ఒక మనిషిలా మారిపోవడం. అంటే ఇరుకు ఆలోచనలు, స్వార్థం, ప్రత్యేకంగా ఉండాలనుకోవడం అనే లక్షణాలు దేశాలను పీడిస్తున్నాయి. మరొకరికి నష్టం కల్గించి  లాభం పొందాలనీ, ఇంకొకరిని నాశనం చేసి తామూ ఎదగాలని ప్రయత్నిస్తున్నారు. భారతదేశపు జాతీయవాదం విభిన్న పథాన నడిచింది. తనను అమర్చుకుని, మొత్తం మానవాళి సేవకోసం పూర్తిగా గొంతు సవరించుకోవాలని ఆశిస్తోంది… నా దేశానికి సేవ చేయాలని ఇతర దేశాలకు హాని తలపెట్టనంతకాలమూ – ఏ పొరపాటు చేయలేదని భావిస్తాను…”.  

స్వాతంత్ర్యం పొందిన దేశం ఎలా వుండాలని గాంధీజీ భావించాడో మహదేవ్ దేశాయ్ రాసిన ‘గాంధీ ఇన్ ఇండియన్ విలేజెస్’ (1927 ప్రచురణ, పుట 171) లో మనకు ఇలా కనబడుతుంది :

“… నా దేశానికి స్వాతంత్ర్యం కావాలి, ఎందుకంటే నా స్వతంత్ర్య దేశం నుంచి మిగతా దేశాలు కొంత నేర్చుకోవాలి. కుటుంబం కోసం వ్యక్తీ, గ్రామం కోసం కుటుంబం, మండలం కోసం గ్రామం, ప్రాంతం కోసం మండలం, దేశం కోసం ప్రాంతం – అవసరమైతే త్యాగం చేయాలి. ఇంకా చెప్పాలంటే ప్రపంచ ప్రయోజనం కోసం దేశం ఆత్మ త్యాగం చేయగలగాలి. జాతీయవాదం పట్ల నా ప్రేమ లేదా నా భావన ఏమిటంటే నా దేశం విముక్తం కావాలి. అవసరమైతే మానవజాతి మనుగడకోసం స్వయం త్యాగం చేసుకోగలగాలి. అంతేగానీ ఒక జాతి పట్ల విద్వేషం తగదు. మనదైన జాతీయవాదం ఇలాగే ఉండాలి…”.

Also read: వందశాతం రైతు పక్షపాతి

అహింసకు ప్రతీక

గాంధీజీ మన దేశానికీ, మన జాతికీ మహాత్ముడూ, జాతిపితా! అయితే, మొత్తం ప్రపంచానికి ఆయన అహింసకు, సహిష్ణుతకూ, ప్రేమకు ప్రతీక!  మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆరు దశాబ్దాలకు అంటే 2007లో ఐక్యరాజ్య సమితి గాంధీ జయంతిని ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోవాలని నిర్ణయించింది. గాంధీజీ జీవితానికీ, ఆలోచనలకు విలువ తరగనిదని పదే పదే ధ్రువపడింది! 

ఈ అరశతాబ్దానికి మించిన కాలవ్యవధిలో నెల్సన్ మండేేలా, లేఖ్ వలేసా, అంగ్ సాకి సూకీ, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి వారు గాంధీజీ భావనలను, సిద్ధాంతాలను దివిటీలుగా మార్చుకుని ప్రపంచానికి వెలుగు జాడలు అయ్యారు. మహాత్మాగాంధీ 1948 జనవరి 30న హత్య అయినపుడు విలపిస్తూ నార్ల వేంకటేశ్వరరావు లోతుగా విశ్లేషించారు:  “గౌతమబుద్ధుడు, ఏసుక్రీస్తు వ్యక్తుల ద్వారా అహింసా సిద్ధాంతాన్ని ప్రయోగిస్తే,  గాంధీజీ సంఘం ద్వారా వీటిని ప్రయోగించారు. వ్యక్తుల సముదాయమే సంఘం కావచ్చు. కాని, వ్యక్తి కంటే సంఘం విశాలమని అంగీకరించక తప్పదు కదా! విశాలమైన, వినూత్నమైన ఈ ప్రయోగాన్ని చూసినందువల్లనే మహాత్ముడు అహింసా మూర్తి అయినాడు. ఏసుక్రీస్తు, గౌతమ బుద్ధుల సరసన స్థానాన్ని సంపాదించుకున్నాడు” అని 1948 ఫిబ్రవరి 9వ తేదీ ఆంధ్రప్రభ  దినపత్రిక సంపాదకీయం ముగిస్తారు!

Also read: తొలి భారతీయ పర్యావరణవేత్త జె.సి.కుమారప్ప 

అంతటి సార్వత్రికమైన భావనలకు గాంధీజీ ప్రతీక! ప్రాంతం, కాలం అధిగమించి ఛలామణి కాగల చెల్లుబాటు గాంధీ మార్గానికే సొంతం!!

 గాంధీజీ చదువు ఘనంగా  సాగలేదు. సాధారణ జీవితం. 1885లో తండ్రి కనుమూయటం పెద్ద మలుపు. ఒక జ్యోతిష్యుడి సూచనలవల్ల విదేశీ చదువుకై ప్రయత్నం. తనకు వైద్య విద్య చదువుకోవాలన్న కోరిక ఉన్నా, మనుషులను, శవాలను ఆ వృత్తిలో ముట్టుకోవాలనే కారణంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో న్యాయవాదిగిరి వైపు మక్కువ పెంచుకున్నారు. కుల పెద్దలు సముద్ర ప్రయాణాన్ని అనుమతించకపోయినా గాంధీ పట్టుదలతో ఇంగ్లాండుకు పై చదువుల కోసం వెళ్ళడం, తరవాత వేరే గత్యంతరం లేక దక్షిణాఫ్రికాలో స్థిరపడిన భారతీయులయిన దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ న్యాయసలహాదారుగా బయలుదేరి పోవడం! ఇదీ గాంధీ నేపథ్యం. చాలా సీదా సాదాగా కనబడుతుంది. అంతేకాదు లండన్ వెళ్ళేదాకా గాంధీ వార్తాపత్రికలు చూడకపోవడం ఆశ్చర్యం. అత్యంత మామూలు మనిషి పిమ్మట ప్రపంచపు వెలుగుగా విస్తరించడం మహావిశేషం!

Also read: సిసలైన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

సత్యాగ్రహానికి పునాది దక్షిణాప్రికాలో…

ఆసక్తి కలిగితే సమగ్రంగా అధ్యయనం చేసి ఆకళింపు చేసుకోవడం గాంధీజీ విధానం. బాధిత భారతీయులు దక్షిణాఫ్రికాలో పడుతున్న కడగండ్లకు కన్నీరైపోయారు గాంధీజీ. అప్పటి దాకా ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని చెప్పలేము. మినీ భారతదేశం లాంటి దక్షిణాఫ్రికాలోని భారతీయులను గమనించారు. వారందరిదీ ఒకే భాష కాదు, ఒకే సంస్కృతి కాదు. ఓటుతో సహా ఎటువంటి హక్కులు లేవు. అక్కడి యజమానులు వీరిని కొట్టడం చాలా మామూలు. న్యాయస్థానాలలో కూడా వివక్షత వుంది. అదే సమయంలో అక్కడి వలస భారతీయులలో అనైక్యత కూడా బాగా ఉండేది.  వారి వివాహాలను అక్కడి ప్రభుత్వం ఆమోదించకపోవడంతో సమస్యలు చాలా ఎదురయ్యాయి. అటువంటి నేపథ్యంలో 1906 సెప్టెంబరు 11న జొహన్నెస్ బెర్గ్ పట్టణంలో యూదుల ఎంపైర్ థియేటర్ లో భారతీయ సంతతి సుమారు మూడువేలమంది సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గాంధీ  ‘సత్యాగ్రహం’ అనే భావనను ప్రతిపాదించి, వివరించారు. 

Also read: ఏడున్నర దశాబ్దాలలో గాంధీజీ విధానాలు ఏమయ్యాయి ?

ఎవరు ఎదురు వచ్చినా, శారీరక హింస, మరణం తప్పదు అని తెలిసినా ఓర్పు విడవకుండా సహనంతో, చిరునవ్వుతో చేసే క్షమతో కూడిన పోరాటమే — సత్యాగ్రహం. దీని వెనుక  గాంధీజీ ఆలోచన ఏమిటో తెలుసా? “వేలాది సంవత్సరాల నుండి పశుబలమే ప్రపంచాన్ని పాలిస్తోంది. దీని దుష్ఫలితాన్ని అనుభవించి, అనుభవించి మానవకోటికి రోత పుట్టింది. హింస వలన ప్రపంచానికి మేలు జరుగదు. చీకటి నుండి వెలుతురు కాగలదా? ‘హింసించి’ హక్కులు కాపాడు కోవడం తేలిక మార్గంగా కనిపించవచ్చు. కానీ పోనుపోనూ ఇది కంటకావృత్త మార్గమవుతుంది. ఈతగానికి నీటి గండం, సైనికునికి కత్తిగండం తప్పదు” అని  ‘యంగ్ ఇండియా’ పత్రిక 1928 ఆగస్టు 6 సంచికలో గాంధీజీ రాశారు. 

నిజానికి అహింస అనేది ప్రేమకు పరాకాష్ట!  అహింస అనేది ఆశావహ దృక్పథానికి రహదారి!!  ఇంకా 1922 జనవరి 26వ తేదీ సంచిక ‘యంగ్ ఇండియా’ లో ఇలా అంటారు – 

“భారత దేశానికి అహింసా విధానం తూచినట్లు సరిపోతుంది. సామాన్య ప్రజలు తరతరాల నుండి అహింసా పద్ధతులు అవలంబిస్తున్నారు…. 

…కోపం అహింసకు శత్రువు. ఇక గర్వం అహింస పాలిటి రాక్షసి. గర్వం అహింసను మింగి ఊరుకుంటుంది. అహింస క్షత్రియుల మతం. మహావీరుడు క్షత్రియుడు. బుద్ధుడు క్షత్రియుడు. రామకృష్ణులు క్షత్రియులు. వారందరూ అహింసా ప్రచారం చేశారు… ” 

అహింస గురించి తెలుసుకోవాలంటే హింస పరిమితిని కూడా గుర్తించాలి. సృష్టించడం చేతగాని వాడు చంపడంలో భాగస్వామి కాకూడదు. గాంధీజీ ప్రకారం ఈ భావన చాలా విస్తృతమైంది. అందుకే వైద్యంలో కూడా శస్త్ర చికిత్స పేరున శరీర అంగాలు తొలగించడాన్ని గాంధీజీ వ్యతిరేకిస్తారు. సృజనాత్మక ప్రతిభతో వైద్యం చేసి రోగాన్ని నయం చేయాలని గాంధీజీ ప్రతిపాదిస్తారు. నయం కాని రోగంతో ఒక ఆవు నానా యాతన పడుతోంటే చివరికి ఆ ఆవును చంపడమే మెరుగైన పరిష్కారమని, దానితో ఆవుకు బాధ నుంచి విముక్తి కలుగుతుందని గాంధీజీ ఒక సమయంలో ప్రతిపాదించారు. ధర్మసూక్ష్మాన్ని అందుకోలేని వారు పత్రికలలో ఈ విషయమై గాంధీజీన విమర్శించారు కూడా! 1920 ఆగస్టు 11వ తేదీ సంచిక ‘యంగ్ ఇండియా’ లో ఆయన చెప్పిన విషయం చూడండి:

హత్యచేస్తుంటే అహింస అంటూ చూస్తూ కూర్చోవాలా?  

“నేను 1908వ సం.లో దారుణమైన దౌర్జన్యానికి గురయ్యాను. ఆ దౌర్జన్యానికి నేను మరణించి ఉండవలసిందే. ఆ దౌర్జన్యం గురించినా పెద్ద కుమారుడు ఇలా ప్రశ్నించాడు – ఆ సమయంలో నేను అక్కడ ఉండటం తటస్థించిందనుకోండి. మిమ్ములను హత్య చేయడం చూస్తూ నిలబడాలా?”. దీనికి గాంధీజీ ఇచ్చిన జవాబు ఏమిటంటే – “బలాన్ని ఉపయోగించి నన్ను రక్షించడమే ధర్మమని అతనికి చెప్పాను”. సరిగ్గా అటువంటి కారణం చేతనే గాంధీజీ బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు. మహిళల రక్షణ విషయంలో కూడా తప్పనిసరి అయినపుడు హింస సమ్మతమని  గాంధీజీ అంగీకరిస్తారు.  అయితే,  హింసను స్వీకరించినపుడు చాలా అప్రమత్తతో ఉండాలి.  అందువలనే గాంధీజీ ప్రతిపాదించిన  అహింసా సిద్ధాంతం ఏ రకంగా ప్రపంచ రాజకీయాలకు తగిందో వివరిస్తూ… పాల్ ఎఫ్ పవర్  (Paul F. Power) ఇలా అంటారు : 

  “… I understand ahimsa as the optimum , functional good on the way to ultimate truth, and not as an unconditionally binding law of nonviolence on social and political affairs…”   

(అధికమైన, ప్రయోజనకరమైన మంచిని సాధిస్తూ పరమసత్యం వైపు తరలిపోవడమే ‘అహింస’ అని నాకు బోధపడుతోంది. అంతేకానీ గుడ్డిగా సామాజికంగా, రాజకీయాలలో అహింసా సూత్రాలకు కట్టుబడటం కాదు.) 

అంతటి సూక్ష్మభావన గాంధీజీది. దాన్ని అవగతం చేసుకోవాలంటే ఆ భావనలో మనం స్పృహతో మమైకం అయిపోవాలి. దానికి చిత్తశుద్ధి ఆమూలాగ్రంగా ఉండాలి. సాధించడానికి అనంతమైన పట్టుదల  వుండాలి.  గాంధీజీ అంతరంగం సంబంధించి సిగ్మండ్ ఫ్రాయిడ్ అభినందించే రీతిలో కృషి చేశారు. అదే సమయంలో అంతర్జాతీయ సంబంధాలలో కూడా మానవ అంతరంగం కీలకపాత్రలో నిర్ణాయక స్థానంలో ఉండాలంటారు గాంధీజీ! 

Also read: గాంధీజీ ఆలోచనలకు విలక్షణ వ్యాఖ్యాత డా.రామమనోహర్ లోహియా

డా. నాగసూరి వేణుగోపాల్

మొబైల్: 9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles