హైదరాబాద్,10, డిసెంబర్: సీనియర్ పాత్రికేయులు, సాహిత్యవేత్త కల్లూరి భాస్కరం వ్యాస సంకలనం ‘గాంధీత్వ నుంచి హిందుత్వ దాకా’ పుస్తకం శనివారంనాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరణ జరిగింది. సుప్రసిద్ధ సంపాదకులు కె రామచంద్రమూర్తి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ పాత్రికేయులూ, ప్రభుత్వ సలహాదారు టంకశాల అశోక్, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె శ్రీనివాస్ అతిధులుగా పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులూ, సాహిత్యవేత్త శ్రీశైల రెడ్డి అధ్యక్షత వహించారు. వక్తలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో ఈ వ్యాస పరంపరను విశ్లేషిస్తూ సాగించిన ప్రసంగాలు చాలా ఆలోచనాత్మకంగా, ఆసక్తికరంగా సాగాయి.
గాంధీత్వం నుంచి హిందూత్వం వరకూ దేశం ఎట్లా దిగజారిందో రచయిత చూపించారనీ, ఇది వర్తమాన రాజకీయాలకు భాష్యం చెప్పే పుస్తకమనీ రామచంద్రమూర్తి అన్నారు. గాంధీత్వం వర్సెస్ హిందూత్వం అంటే పుస్తకం టైటిల్ బాగుండేదని టంకశాల అశోక్ తన అభిప్రాయం వెలిబుచ్చారు. ఇప్పుడు భావజాలపరంగా యుద్ధం నడుస్తోందనీ, భౌతిక యుద్ధంగా పరిణమించవచ్చుననీ, ఈ యుద్ధంలోఎవరు ఎటువైపున ఉంటారో తేల్చుకోవలసి వస్తుందనీ శ్రీనివాస్ చెప్పారు.
ఈ పుస్తకం గురించి మాట్లాడే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తావన విధిగా చేయవలసి ఉంటుంది. ఇది నిజానికి గాందీజీ నుంచి మోదీజీ దాకా అన్నా పుస్తకానికి టైటిల్ బాగానే సరిపోతుంది.
విద్యావేత్త, బుక్ రీడర్స్ క్లబ్ అధ్యక్షులు టి. పి. పడాల పుస్తకాన్ని పరిచయం చేశారు.
రచయిత తన ఆలోచనా సరళిని, సిద్ధాంతాన్ని, దృష్టిని విశదపరుస్తూ ముగింపు ప్రసంగం చేశారు. తనలోని ఆవేశం, అభిప్రాయం, పరిశీలన, అభ్యంతరాలు, అభివ్యక్తి సభాసదులకు చేరేలా బలమైన, స్పష్టమైన పోకడలో కల్లూరి భాస్కరం స్పందించారు. పెద్ద సంఖ్యలో పాత్రికేయులు, సాహిత్యవేత్తలు, కవులు, మేధావులు హాజరయ్యారు.
పీవీ నరసింహారావు ఆత్మకథ ‘ఇన్ సైడర్’ ను ‘లోపలిమనిషి’గా పరిచయం చేసిన భాస్కరం తెలుగువారందరికీ బహుపరిచయస్తులు. వారి కలం నుంచి అనేక ఆవిష్కరణలు జరగాలని అందరూ ఆశిస్తూ ఆయనను ఈ సందర్భంగా అభినందించారు.