———— ————
(‘ THE FROGS’ FROM ‘ THE WANDERER ‘ BY KAHLIL GIBRAN )
తెలుగు అనువాదం : డా. సి. బి. చంద్ర మోహన్
21. సంచారి తత్త్వాలు
—————– ———-
ఒక వేసవి రోజున ఒక కప్ప తన సహచరునితో
ఇట్లా అంది ” ఆ ఒడ్డున ఉన్న ఇంట్లో నివసిస్తున్న మనుషులు, మనం రాత్రి పాడే పాటలతో కలవర పడుతున్నారని నాకనిపిస్తోంది. “
ఆ సహచరుడు ఇట్లా జవాబిచ్చాడు. ” సరే ! కానీ వారు కూడా వారి మాటలతో పగలు పూట , మన నిశ్శబ్దానికి భంగం కలిగిస్తున్నారు కదా!”
అపుడు మొదటి కప్ప ” మనం రాత్రి పూట చాలా ఎక్కువగా పాడుతున్న విషయం మరిచిపోవద్దు.” అంది.
సహచరుడు దానికి జవాబుగా ఇట్లా అన్నాడు.
“వాళ్ళు పగలు అస్తమానమూ అరుస్తూ , బిగ్గరగా మాట్లాలాడుకుంటూ ఉంటారని మరిచి పోకు!”
మొదటి కప్ప ,” దేవుడు నిషేధించిన అరుపులతో మన బావురు కప్ప చుట్టూరా ఉన్న ఇరుగు పొరుగును వేధించటం లేదూ!” అంది.
సహచరుడు ” అయ్యో! రాజకీయ వేత్త, పూజారి, శాస్త్ర వేత్త — వీరంతా వచ్చి ఈ ఒడ్డున ఒక ప్రాస లేని శబ్దాలతో ఇక్కడి గాలిని కలుషితం చేయడం గురించి నువ్వేమంటావు?” అని అడిగాడు.
అప్పుడా కప్ప ఇట్లా అంది ” సరే! మనం ఈ మనుషుల కన్నా బాగా ప్రవర్తించుదాం. చందమామ మన లయ కోసం, తారలు మన ప్రాస కోసం ఎదురు చూచినా గానీ, మనం మన పాటలు గుండెల్లో దాచుకుని, రాత్రి నిశ్శబ్దంగా ఉందాం.”
సహచరుడు ” సరే. నాకంగీకారమే. నీ దయార్ద్ర హృదయం ఏమి తెస్తుందో చూద్దాం !”అన్నాడు.
కప్పలు ఆ రాత్రి ,మరుసటి రాత్రి ఇంకా మూడో రాత్రి కూడా నిశ్శబ్దంగా ఉన్నాయి.
వింతగా, (దీనికి సంబంధం లేని వ్యక్తి ) ఆ చెరువు పక్క ఇంట్లో నివసించే ఆవిడ — మూడో రోజు పొద్దున అల్పాహారం తింటానికి క్రిందికి వచ్చి , ఆమె భర్త మీద ఇట్లా అరిచింది. ” ఈ మూడు రాత్రులు నేను నిద్ర పోలేదు. నా చెవుల్లో కప్పల బెక బెక ఉంటేనే నాకు నిద్ర పడుతుంది. ఏదో జరిగి ఉంటుంది. మూడు రాత్రుల నుండి అవి (కప్పలు) అరవటం లేదు. నిద్ర రాక నాకు పిచ్చెక్కి పోతోంది !”
మొదటి కప్ప ఇది విని ,తన సహచరునితో , కన్ను గీటుతూ ” మన శబ్ద రాహిత్యంతో మనకు పిచ్చెక్కి పోయింది కదా!” అంది.
సహచరుడు ఇట్లా జవాబిచ్చాడు.” అవును. రాత్రి నిశ్శబ్దం మనకు చాలా భారంగా ఉంది. వారి మనసుల్లో శూన్యాన్ని , మన శబ్దాలతో పూరించుకుందాం అనుకునే వారి కోసం మన సంగీతం ఆపనవసరం లేదు.”
ఆ రోజు రాత్రి చందమామ లయ కోసం, తారలు ప్రాస కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేక పోయింది!
Also read:చట్టాలు మరియు చట్ట నిర్మాణం
Also read: మతి లేని మనిషి
Also read: చట్టాలు
Also read: సప్తతి పూర్వార్ధం……లో
Also read: విగ్రహం