కరోనాతో కాపరం చెయ్యక తప్పదని మన నేతలు అంటూనే ఉన్నారు. కాపరం చేయడానికి అది మనిషి కాదు. ప్రమాదకరమైన వైరస్. వాళ్ళన్నట్లుగానే, ఇప్పుడప్పుడే అది మనల్ని పూర్తిగా వదిలేట్లు లేదు. ఇప్పటికే ఈ వైరస్ దెబ్బకు ఎందరో బలైపోయారు. దాని పరిణామాలను, రూపాంతరాలను అర్ధం చేసుకోడానికి నిపుణులు, శాస్త్రవేత్తలు నిరంతరంగా కృషి చేస్తూనే ఉన్నారు. వైద్యులు తమ అనుభవ సారాన్నంతా రంగరిస్తున్నారు. దానిని అర్ధం చేసుకొని చికిత్స అందించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వ్యాక్సినేషన్ మెల్లగా ఊపందుకుంటోంది.
Also read: మహామహోపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ
మనిషికీ, కరోనాకీ మధ్య యుద్ధం
కొత్త వ్యాక్సిన్లు మార్కెట్ లోకి వచ్చేశాయి. మరికొన్ని సరికొత్త వ్యాక్సిన్లు వచ్చేదారిలో ఉన్నాయి. వీటన్నింటికీ సమాంతరంగా వైరస్ కొత్త రూపులు తీసుకుంటూ వైద్యరంగానికి, మనిషి మనుగడకు సవాళ్లు విసురుతోంది. మొత్తంగా చూస్తే మనిషికి -వైరస్ కు మధ్య పెద్ద యుద్ధం నడుస్తోంది. ఈ సమరంలో ఇప్పటి వరకూ విజయం వైరస్ వైపే ఎక్కువ శాతం ఉంది. పూర్తిగా దానికి లొంగకుండా తనను తాను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నంలో మనిషి కొంతమేరకు కృతకృత్యుడయ్యాడు. మొదటి వేవ్ అయిపొయింది. రెండో వేవ్ కూడా ముగిసింది. మూడో వేవ్ సిద్ధంగా ఉంది. ఈ మూడో వేవ్ గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్కరకంగా చెబుతున్నారు. ఇంతవరకూ స్పష్టత రాలేదు. అసలు కరోనా పరిణామాలే గందరగోళంగా ఉన్నాయి. రెండో వేవ్ సమయంలో డెల్టా వేరియంట్లు అలజడి సృష్టించాయి. డెల్టా ప్లస్ వచ్చిచేరిందన్నారు.
Also read: నానాటికీ బరువెక్కుతున్న గ్యాస్ బండ
ఇప్పుడు సరికొత్తగా ఏ వై-12 కలకలం రేపుతోంది. డెల్టా ప్లస్ ఉత్పరివర్తనంలో (మ్యుటేషన్ ) ఇదొక ఉపరకం అంటున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 178 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త ఉపరకం తెలుగురాష్ట్రాల్లోనూ ప్రవేశించిందని తెలుస్తోంది. ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందడమే దీనిలోని ప్రమాదకరమైన లక్షణం. మొట్టమొదటగా మొన్న ఆగష్టు 30వ తేదీన ఉత్తరాఖండ్ లో అది వెలుగు చూసింది. నాలుగు రోజుల వ్యవధిలోనే తెలుగు రాష్ట్రాలకు కూడా చేరింది. ప్రస్తుత నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ (18 కేసులు) మూడో స్థానంలో ఉంది. కేసులు తెలంగాణలోనూ ఇంచుమించు సమానంగానే (15) ఉన్నాయి. ఊపిరితిత్తుల కణాల్లోకి బలంగా అతుక్కుపోయి యాంటీబాడీల స్పందనపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.
Also read: గుడారం పీకేసిన ప్రపంచ పోలీసు
ఆందోళన కలిగిస్తున్న ఏవై-12
లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో, ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాకపోకలు పెరుగుతున్నాయి. ఏ వై లోని వివిధ రకాలను, వాటి పరిణామాలను మన పరిశోధనా సంస్థలు గుర్తిస్తున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తోంది. ఏ వై -12 సమగ్రరూపం ఇంకా తెలియరాలేదు. కేసుల నమోదు, ప్రభావాలను బట్టి తీవ్రతను సమీప భవిష్యత్తులో అంచనా వేయవచ్చు. వ్యాక్సినేషన్ పైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. రెండు డోసులు అందినవారి సంఖ్య ఇంకా 20శాతనికి లోపలే ఉంది. కనీసం 60శాతం ప్రజలకు అన్ని డోసులు పూర్తయితే కానీ, సామూహిక రోగనిరోధక శక్తిని (హెర్డ్ ఇమ్మ్యూనిటీ ) సాధించడంలో ఆశించిన ఫలితాలను అందుకోలేమని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల పనితీరు వైరస్ కొత్త వేరియంట్లపై ఏ మేరకు ప్రభావాన్ని చూపిస్తుందో సమగ్రమైన సమాచారం లేదు. ఒకపక్క కొత్త వ్యాక్సిన్లు తయారవుతున్నాయి – ఇంకొక పక్క వైరస్ లో కొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. దానికి అనుగుణంగా,సర్వ సమర్ధనీయమైన వ్యాక్సిన్లు ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా తయారవ్వలేదు.
Also read: హరికథకు పర్యాయపదం ఆదిభట్ల
ఆశ్చర్యబోతున్న శాస్త్రవేత్తలు
సైన్స్ కు – ప్రకృతికి, మనిషికి -మరో జీవరాశికి మధ్య జరుగుతున్న పోరు అత్యున్నతమైన, అత్యుత్తమమైన శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అత్యాధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాలు సైతం ఇంకా జీవపరిణామాలను అర్ధంచేసుకోలేక పోతున్నాయని అర్ధమవుతోంది. ఈ అనారోగ్యాలకు, ప్రకృతి ప్రకోపాలకు మనిషి దుష్ప్రవర్తనే ప్రధాన కారణం. ఇవన్నీ స్వయంకృత అపరాధాలే. ఇదంతా ఇలా సాగుతుండగా నకిలీ టీకాలు కూడా మార్కెట్ లోకి ప్రవేశించాయానే వార్తలు వస్తున్నాయి. మనిషిలోని స్వార్ధమే మనిషిని బలిచేస్తోందని మాట్లాడుకుంటున్న వేళ, ఈ నకిలీల బాగోతం మనిషి స్వార్ధ చర్యలకు పరాకాష్ట. అసలుసిసలైన వ్యాక్సిన్లే అనుకున్న ఫలితాలు ఇవ్వడంలేదని భయపడుతూ వుంటే నకిలీ వ్యాక్సిన్ల ప్రవేశం అత్యంత దారుణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) ఈ వార్తలు చూసి విస్తుపోతోంది. నకిలీలను గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు సూచనలు అందుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. వీటన్నిటిని గమనిస్తూనే ఏ వై -12 వేరియంట్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే భారీ మూల్యం తప్పదని తెలుసుకోవాలి.
Also read: పంజాబ్ కాంగ్రెస్ లో ఆగని కుమ్ములాట