- జలమండలి అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష
- విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
కొత్త సంవత్సరం నుంచి హైదరాబాద్ లో ఉచితంగా తాగునీటి సరఫరా చేస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు అందిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి కార్యచరణ రూపొందించేందుకు మంత్రి కేటీఆర్ సీఎస్ సోమేష్ కుమార్, జలమండలి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నగరంలో ఉన్న మొత్తం నల్లా కనెక్షన్లు, నీటి సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు, కార్యక్రమ విధివిధానాల రూపకల్పనపై అధికారులతో చర్చించారు. సుధీర్ఘంగా సాగిన సమావేశంలో ఉచిత నీటి పంపిణీకి విధివిధానాలను సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నగరంలోని ప్రతి ఇంటికీ ఉచిత తాగునీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు కేటీఆర్ తెలిపారు.
20 వేల లీటర్ల వరకు ఉచితం
జలమండలి ద్వారా నగరంలో జరుగుతున్న మంచినీటి సరఫరా తీరు తెన్నులను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. గత కొన్నేళ్లుగా నగరంలో తాగునీటి వినియోగం అంతకంతకూ పెరుగుతోందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. రానున్న వేసవిలో డిమాండ్ కు సరిపడా నీటిని సరఫరా చేసేందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన మేరకు 20 వేల లీటర్ల వినియోగం వరకు ఎలాంటి రుసుము వసూలు చేసేది లేదని కేటీఆర్ తెలిపారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించిన సమాచారం ప్రజలకు చేరేలా జలమండలి బాధ్యత తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు. ఉచిత తాగునీటి సరఫరాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లను రాబోయే రెండు వారాల్లో పూర్తి చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: జీహెచ్ఎంసీ ఫలితాలు – పరిణామాలు