Thursday, December 26, 2024

సందేహాలను నివృత్తి చేసిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కొన్ని కీలక ప్రకటనలు,కీలక వ్యాఖ్యలు వినిపించాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని, నవంబర్ కల్లా 80శాతం మందికి వ్యాక్సినేషన్ ను పూర్తి చేస్తామని చెప్పడం కీలకమైన ప్రకటన. పేదలకు దీపావళి పండుగ వరకూ ఉచిత రేషన్ అందిస్తామని చెప్పడం మరో ముఖ్యమైన అంశం. వ్యాక్సినేషన్ ప్రక్రియలో  ఇక నుంచి కేంద్రమే  పూర్తి బాధ్యతను తీసుకుంటుందని  చెప్పారు. ఇందులో రాష్ట్రప్రభుత్వాలు వైఫల్యం చెందినట్లుగా పరోక్షమైన వ్యాఖ్య చేసినట్లుగా భావించాలి. ప్రతిపక్షాలు, కొన్ని వ్యవస్థలు ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నాయని, వారు చేసే విమర్శలు అర్ధరహితమని ప్రధాని కొట్టి పారేశారు. ఆక్సిజన్ ఉత్పత్తిని పది రెట్లు పెంచామని, వ్యాక్సినేషన్ రూపకల్పనలో ప్రపంచ దేశాలతో సమానంగా పోటీపడ్డామని ఆయన తెలిపారు.

Also read: సమాఖ్య స్ఫూర్తికి సమాధి?

కేంద్రానిదే బాధ్యత

రాష్ట్రాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, కేంద్రమే ఆ బాధ్యత తీసుకుంటుందని అన్నారు. ఈ నెల 21నుంచి 18 ఏళ్ళు పైబడిన వారందరికీ కేంద్రమే ఉచితంగా టీకాలు అందజేస్తుందని భరోసా ఇచ్చారు. ప్రధాని చెప్పినట్లుగా చూస్తే 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ రంగానికి అందుబాటులో ఉంటాయి. గరిష్ఠంగా 150 రూపాయిల సర్వీస్ ఛార్జితో ప్రైవేట్ లోనూ టీకాలు వేసుకోవచ్చు. మొత్తంమీద  వ్యాక్సినేషన్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్రీకృతమైన వ్యాక్సినేషన్ వ్యవస్థను రూపొందించారు.  దేశ ప్రజలకు వ్యాక్సిన్లు అందడంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలనే వాదన ఎప్పటి నుంచో వినపడుతోంది. మొదటి నుంచీ ప్రతిపక్ష నేతలు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు డిమాండ్ చేస్తున్నది కూడా అదే. సరిపడా వ్యాక్సిన్లు అందక రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇటు ప్రజల నుంచి ఒత్తిడి కూడా పెరుగుతోంది. వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య పెరగడం, సరిపడా ఆక్సిజన్ కూడా అందుబాటులో లేకపోవడం మొదలైన కష్టాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు సతమతమవుతున్నాయి. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాల పట్ల కేంద్రం చిన్నచూపు చూస్తోందనే విమర్శలు వచ్చాయి.

Also read: లాక్ డౌన్ విధింపు, సడలింపుపై వ్యూహాత్మక నిర్ణయం

టీకాలు కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వాల ఇబ్బందులు

విదేశీ వ్యాక్సిన్లు తెప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న అధికార పరిధి కూడా చాలా తక్కువ. నిధుల ఇబ్బందులు ఎలాగూ ఉన్నాయి. ప్రజలు, ప్రతిపక్షాలు, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సుప్రీం కోర్టు కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర వైఖరిని తప్పు పట్టింది. కేంద్రీకృతమైన వ్యవస్థ ఉండాలని చెప్పింది. వ్యాక్సినేషన్ విధానంపై సంపూర్ణమైన ‘రోడ్ మ్యాప్’ ను సత్వరమే సమర్పించమని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రపంచ మీడియా మొత్తం భారతదేశ విధానాలను దుమ్మెత్తి పోసింది. ముఖ్యంగా నరేంద్రమోదీ లక్ష్యంగా పలు విదేశీ మీడియా సంస్థలు విమర్శలు గుప్పిస్తూ ప్రత్యేక కథనాలు, సంపాదకీయాలను వండి వార్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం పూర్తయిన కొన్ని క్షణాల్లోనే కాంగ్రెస్ నేతలు మోదీపై వ్యంగ్య బాణాలను సంధించారు. వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రీకృతమైన వ్యవస్థ ఉండాలని, 18-44  ఏళ్ళ వయస్సు వారికి కూడా ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలని మేము మొదటి నుంచి చెబుతున్నా ప్రధాని నిర్లక్ష్యం చేశారని, దాని వల్ల దేశ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేష్ ట్విట్టర్ వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల మాటలకు గౌరవం ఇచ్చి, ఈ నిర్ణయం ముందుగానే తీసుకొని వుండి వుంటే  దేశానికి ఇంత నష్టం జరిగిఉండేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎట్టకేలకు ప్రతిపక్షాల డిమాండ్ ను మోదీ ఒప్పుకోవాల్సి వచ్చిందని జై రాం రమేష్ అన్నారు.

Also read: కరోనా చైనా చేతబడేనా?

అత్యున్నత న్యాయస్థానం అక్షింతలు

ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు, వ్యాఖ్యలు అటుంచగా, సుప్రీం కోర్టు కూడా కేంద్ర విధానాలను పదే పదే తప్పుపట్టింది. కోవిడ్ కారణంగా ఎంతోమందిని పోగొట్టుకున్నామని విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటన వెనకాల సుప్రీం కోర్టు ప్రభావం, ఒత్తిడి బలీయంగా ఉన్నాయని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశించినట్లుగా స్పష్టమైన రోడ్ మ్యాప్ ప్రధాని ప్రకటనలో కనిపించలేదని పలువురు అంటున్నారు. ఏ ఏ కంపెనీల వ్యాక్సిన్లు ఎప్పటెప్పటికి అందుబాటులోకి వస్తాయి, ఏఏ వయసుల వారికి వ్యాక్సిన్లు ఎలా అందజేస్తారు, జూన్ నుంచి ఏఏ నెలలో ఎవరెవరికి ఎన్నెన్ని వ్యాక్సిన్లు అందుతాయి, మొత్తంగా వ్యాక్సిన్ల సేకరణ, పంపకం, వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమగ్రంగా, స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉంది. మొన్న ఒక కేంద్రమంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా దేశంలో ఎక్కువమందికి వ్యాక్సిన్లు అందిస్తామని అన్నారు. నవంబర్ కల్లా దేశంలోని 80 శాతం మందికి వ్యాక్సిన్లు అందుతాయని నేడు ప్రధాని అంటున్నారు. గతంలోనూ ఇటువంటి మాటలు ఎన్నో చెప్పారని, ఆచరణలోనే అవి తేటతెల్లమవుతాయాని, అప్పటి వరకూ ఈ మాటలను పూర్తిగా విశ్వసించలేమని కొందరు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Also read: కరోనా కష్టాల మధ్య కర్ణపేయమైన వార్తలు

ఉత్సాహమిచ్చిన ప్రసంగం

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ప్రజలకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇచ్చింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇచ్చిన మాటలను నెరవేర్చుకుంటే అంతకంటే ప్రజలకు కావాల్సిందేముంది?  “మిషన్ ఇంద్ర ధనుస్సు” ద్వారా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ప్రారంభించి, ప్రపంచ దేశాలలో భారత్ ను తలమానికంగా నిలపాలని తలంపు చేసినందుకు ప్రధాని మోదీని అభినందిద్దాం. ఈరోజు ప్రసంగంలో చెప్పిన మాటలన్నీ నెరవేరాలని ఆకాంక్షిద్దాం. వ్యాక్సినేషన్ పై “రోడ్ మ్యాప్ ” ను కేంద్రం త్వరలో ప్రకటిస్తుందని విశ్వసిద్దాం.

Also read: ఏడేళ్ళ మోదీ పాలన మోదమా, ఖేదమా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles