Sunday, December 22, 2024

పెద్ద నోట్ల రద్దుకు నాలుగేళ్ళు

భండారు శ్రీనివాసరావు

నోట్ల రద్దు జరిగిన ఇరవై ఒకటో రోజు…

ఇరవై ఒక్క రోజుల అనుభవం నన్ను కాస్తో కూస్తో ‘నెట్’ అక్షరాస్యుడిని చేసింది. పిల్లల సాయంతో మొత్తానికి నా బ్యాంకు ఖాతాను నా మొబైల్ ఫోనుతో అనుసంధానం చేయగలిగాను. ఊబెర్ అనాలో ఒబెర్ అనాలో ఏదైతేనేం ఒక కారు బుక్ చేసి దిగాల్సిన చోట దర్జాగా దిగిపోయాను. జేబులో చేయి పెట్టేపని లేకుండానే ట్రాన్సాక్షన్ చిటికెలో జరిగిపోయింది. దిగుతూ డ్రైవర్ మొహంలోకి చూసాను. దిగాలుగా వున్నాడు. కదిలిస్తే కధ చెప్పాడు.

“పెద్ద నోట్ల రద్దుకు పూర్వం అందరూ టాక్సీ ఫేర్ చెల్లించి దిగి పోయేవాళ్ళు. ఇప్పుడందరూ ఇలా పే చేసేసి అలా వెళ్ళిపోతున్నారు. వెనక డీసెల్ కొట్టించుకోవడానికి పాసింజర్లు ఇచ్చే పైకం డబ్బులు ఉండేవి. ఇప్పుడా డబ్బులు మా బ్యాంకు ఖాతాల్లో వేస్తున్నారు. డ్రా చేసుకోవాలంటే ఓ పూట పని పోతోంది.”

ఏం చెప్పను? నాదీ అదే పరిస్తితి.

పెద్ద నోట్ల రద్దు జరిగిన తొలిరోజుల్లో తెలంగాణా ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావు (కేసీఆర్)  విలేకరుల సమావేశం పెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆర్ధిక గణాంకాలను ఆశువుగా పేర్కొన్న తీరును పరిశీలిస్తే ఆయన ఈ అంశంపై చాలా కసరత్తు చేసినట్టు, సంపూర్ణ అవగాహనతో వున్నట్టు మొదటి అభిప్రాయం కలుగుతుంది.

ఈ విషయంలో మోదీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అధికారికంగా ఓ పక్క ప్రకటిస్తూనే మరో పక్క వినయపూరితమైన హెచ్చరిక చేశారు.

“నూటికి నూరు శాతం అవినీతి రహిత, వందకు వంద శాతం నల్ల ధనం రహిత భారతం లక్ష్యంగా ఈ పధకం అమలు జరగాలి. అప్పుడే ఇది సఫల ప్రయోగం అనిపించుకుంటుంది. లేదా విఫల ప్రయోగం అనే అపప్రధను మోయాల్సి వుంటుంది. అలా జరగడం జాతికి మేలు చేయదు” అని స్పష్టంగా చెప్పారు.

ఈ నిర్ణయం అమలు పర్యవేక్షణకు కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నేతృత్వం అప్పగించడం పై అడిగిన ప్రశ్నకు, ‘మంచిదేగా’ అంటూ ఇచ్చిన కేసీఆర్ సమాధానం హుందాగా వుంది.

ప్రధానమంత్రి మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అల్లాటప్పాది కాదు. మొత్తం జాతిని ప్రభావితం చేసే గొప్ప సాహసోపేత నిర్ణయం.

శస్త్రచికిత్సకు జాతి సిద్ధంగా ఉన్నదా?

ఇన్నేళ్ళ స్వతంత్ర భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్లధనం అనే మాయ రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా?

రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.

అలాంటి ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా జాతి మొత్తానికి సంబంధించిన పెద్ద నోట్ల రద్దు వంటి కీలక విషయంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఇలా అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!

ఈ నిర్ణయం అమల్లో ఏవైనా అవతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవు. అయితే నల్ల ధనం గురించిన వ్యవహారం కాబట్టి, నోరుజారితే అసలుకే మోసం వస్తుందని, జాతి జనుల దృష్టిలో పలచబడి పోతామనే సంకోచంతో మనసులో ఎలా వున్నా కొన్ని ప్రతిపక్షాలు అంతగా విరుచుకు పడడం లేదు. అంచేత  ఆ  పార్టీలు   ఈ నిర్ణయానికి ప్రతికూలతను బాహాటంగా ప్రకటించడం లేదు. ప్రతిపక్షాలంటే రాజకీయం చేస్తున్నాయని సరి పెట్టుకున్నా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాటేమిటి? వాటిని అయినా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుంటుంది కదా!

రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.

ఉపసంహరణకు అవకాశంలేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది. అది గురితప్పకుండా చూసుకుంటూ, సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు పడకుండా చూడడం పాలకుల బాధ్యత.

దేశ ఆర్ధికవ్యవస్థను సమూలంగా మార్చే సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం, అమలుకు సంబంధించిన కొన్ని అవకతవకల కారణంగా నగుబాటు అయ్యే పరిస్తితి దాపురించడం నిజంగా విషాదం. నిర్ణయాన్ని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.

దేశమంతటా క్యూలే

‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.

‘ఇంట్లో కూచుని టీవీ పెడితే క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. ‘యావత్ దేశం క్యూ లైన్లలోనే వుంది’ అన్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.

కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమాఅని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన జాతి మళ్ళీ లక్ష్మీకళ సంతరించుకుంటోంది.

‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం.

‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత? యాభయ్ రోజులేగా! చూస్తుండగానే గడిచిపోతాయి. వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.

ఈ సలహాలు నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి, తమ వద్ద వున్న కరెన్సీ నోట్లు చెల్లుతాయి అని ధీమాగా జేబులో వుంచుకోవడానికి ఇన్నిన్ని ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం. అదొక్కటే ఏలినవారు ఆలోచించుకోవాల్సిన విషయం.

లెక్కలు చూపని డబ్బు

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతున్న లెక్కలు చూపని డబ్బు లక్షల కోట్లల్లో వున్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. నిస్సందేహంగా నిజమే అయివుండవచ్చు. బ్యాంకుల సిబ్బంది పాట్లు ఎలా వున్నా బ్యాంకు క్యాష్ చెస్టులు మాత్రం వరద గోదారిలా పొంగి పొర్లుతున్నాయి. బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి పెరుగుతున్న క్యూలే దీనికి రుజువు.

మొండివాడు రాజుకన్నా బలవంతుడంటారు. రాజే మొండివాడయితే ఇక చెప్పేది ఏముంటుంది?

మాదీకీ మొండివాడనే పేరుంది. నిజానికి ఆ మొండితనమే ఆయన్ని ఇంతవాడ్ని చేసిందంటారు. ఆ మొండి తనమే ఆయనకి ఇంతమంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అయితే మొండితనం ఎల్లవేళలా అక్కరకు రాదు.

నిజానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం చాలా సాహసోపేతమైనది. నవంబరు ఎనిమిదో తేదీన ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మోదీ అభిమానులేకాదు అత్యధికులయిన దేశ ప్రజలు మోదీ చొరవను మనసారా స్వాగతించారు. మాదీ ఒక్కడే మొనగాడని, ఆయన మాత్రమే ఇటువంటి సాహసం చేయగలడని వేనోళ్ళ పొగిడారు. ఈ పొగడ్తలు ఒక దశలో మోతాదు మించి ఎమర్జెన్సీ రోజుల్లో ఇందిరాగాంధీని ఆకాశానికి ఎత్తిన రోజుల్ని గుర్తుకు తెచ్చాయి. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టయిన అభిప్రాయ వ్యక్తీకరణ స్వేచ్చను హరించడం వల్ల ఆ రోజుల్లో ప్రజలు యెంత ఉడ్డుగుడుచుకున్నదీ తొంభయ్యవ దశకం తరువాత జన్మించిన నేటి తరం మోదీ అభిమానులకి తెలిసే అవకాశం లేకపోవచ్చు.

రైళ్ళు ఠంచనుగా నడిచిన రోజులు

ఎమర్జెన్సీ ప్రకటించిన తొలిరోజుల్లో ప్రత్యర్ధి రాజకీయ నాయకులను మినహాయిస్తే సామాన్య ప్రజలు చాలా ఊరట పొందారు. రైళ్ళు ఠ౦చనుగా వేళప్రకారం నడిచాయి. రోజులతరబడి ఆఫీసుల మొహం చూడని ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా వేళకు కార్యాలయాల్లో కనబడేవారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా లంచాలు అడగడానికి, తీసుకోవడానికి భయపడ్డారు. బెజవాడ వంటి పట్టణాల్లో ప్రజలు బహిరంగ మూత్ర విసర్జనకు స్వస్తి చెప్పారంటే తొలినాళ్లలో ఎమర్జెన్సీ అనేది ప్రజల్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఈ బుడగ పగలడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఆ తరువాత ఎమర్జెన్సీ ముసుగులో జరిగిన అనేక అత్యాచారాలు బయట పడ్డాయి. జాతి చెల్లించుకున్న మూల్యం ఏమిటన్నది తదనంతర కాలంలో వెలుగులోకి వచ్చింది. జనం కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ఆ తరువాత జరిగింది చరిత్ర. ప్రజాగ్రహానికి గురయిన ఇందిర ప్రభుత్వం గద్దె దిగాల్సివచ్చింది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో అద్భుతాలు జరిగిపోగలవని ఎవ్వరూ అనుకోలేదు. కాకపొతే సాహసోపేత నిర్ణయం అని చాలామంది భావించారు. వారిలో నేను కూడా ఒకడ్ని.

అనుకున్నదొకటి, అయినదొకటి!

అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సామాన్య జనం ఆలోచనల్లో మార్పు రావడం మొదలయింది. అనుకున్నది ఒకటయితే, జరుగుతున్నది మరొకటన్న అభిప్రాయం బలపడసాగింది. పెద్ద నోట్లు కూడబెట్టి, పెద్ద పెద్ద మేడలు కట్టిన బడా బాబులు ఎవ్వరూ ప్రభుత్వ నిర్ణయంతో కలవరపడకపోవడం వారిని ఆశ్చర్య పరిచింది. ఏమీ జరగనట్టు నల్ల కుబేరులు కాలుమీద కాలువేసుకుని నిబ్బరంగా వుంటుంటే, తాము మాత్రం రాత్రీ పగలూ తేడాలేకుండా బ్యాంకుల ముందూ, ఏటీఎంల ఎదుటా పడిగాపులు పడడం ఏమిటన్న సందేహం పొటమరించింది. తమ డబ్బు తాము తీసుకోవడానికి ఇంతగా హైరానా పడాలా అనే ప్రశ్నలు వారిని వేధించడం మొదలు పెట్టాయి. మూడు వారాలు గడిచిపోతున్నా కష్టాలు, కడగండ్లు పెరుగుతూ పోవడం తప్ప ఉపశమనం కనుచూపు మేరలో కనబడక పోవడంతో వారిలో సహనం తగ్గిపోవడం ఆరంభమైంది. ‘కాస్త ఓపిక పట్టండి, మంచి రోజులు ముందున్నా’యని ప్రభుత్వం ఇస్తున్న భరోసా సామాన్యులను సంతృప్తి పరచడం లేదు. నిజానికి ప్రజలకు వున్న ఓరిమి చాలా గొప్పది. సర్దుకుపోయే తత్వం ఇంకా గొప్పది. అంచేతే యాభయ్ రోజులు ఎదురు చూడడానికే సిద్ధపడ్డారు. ఆ తరువాత కూడా ఓపికపడతారు. ఎందుకంటే జనాలు ఆశాజీవులు. బతుకులు బాగుపడకపోతాయా అనే ఆశతోనే బతుకు బండి లాగడానికి అలవాటు పడ్డారు. అది రాజకీయులకు కూడా తెలుసు. అంచేతే ఆశకంటి కురుపు భయం లేకుండా ప్రజలకు ఆశలు కల్పిస్తూనే వుంటారు. వాళ్ళు కావాలని మరచిపోయే వాస్తవం ఒకటుంది. ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ఆ హద్దు మీరితే ఆ జనమే ఓటుతో బుద్ది చెబుతారని. గతం చెబుతున్న నిలువెత్తు నిజం ఇది.

నల్లధనం లేకుండా చేస్తే మంచిదే

నిజంగా దేశంలో నల్లధనం లేకుండా చేస్తే మొత్తం జాతి మోదీకి రుణపడి వుంటుంది. ఈ విషయం నిశ్చయంగా చెప్పవచ్చు. ఒకవేళ వైఫల్యం చెందితే. ఆ పరిణామాలను ఊహల్లో భరించడం కూడా కష్టం. ఎమర్జెన్సీ గాయాలు మానడానికి ఎన్నేళ్ళు పట్టిందో తెలిసిన వారికి ఈ భయం మరింత ఎక్కువగా వుంటుంది. అప్పట్లో ఎట్లాగో అట్లా ప్రజలు ప్రజాస్వామ్యాన్ని పునరుద్దరించుకోగలిగారు కనుక సరిపోయింది.

ఈనాటి సమస్య ఆర్ధిక వ్యవస్థకు సంబంధించినది. అత్యంత వేగంగా ఎదుగుతున్న దశలో ఎటువంటి అవాంతరం ఎదురయినా అభివృద్ధి కుంటుపడడమే కాదు, స్తంభించిపోయే ప్రమాదం కూడా వుంటుంది. ఆర్ధిక నిపుణులు చేస్తున్న హెచ్చరికలు ఇవే. మంచి కోసం చేసే సాహసోపేత నిర్ణయాలు ఊహాతీత పరిణామాలకు దారి తీయకూడదు. ఆచితూచి చేయాల్సిన పనులను హడావిడిగా చేయడం వల్ల ఒక్కోసారి అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. అదే ఇప్పుడు జరుగుతోంది.

పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇబ్బందులు ఎలా వున్నా జాతి మాత్రం పొదుపు మంత్రం పఠిస్తోంది. విచ్చలవిడిగా చేసే ఖర్చుకు కళ్ళెం పడింది. అనవసర కొనుగోళ్ళు నిలచిపోయాయి. అవసరం అయితేనే జేబులోంచి డబ్బు బయటకు తీసే పాత రోజులు వచ్చేశాయి. నిర్బంధ వ్యయ నియంత్రణ అమలవుతోంది.

అదే సమయంలో వచ్చిన జీతాల రోజు, ఫస్టు తారీఖు, వేతన జీవులకు చుక్కలు చూపించింది. తమ కష్టార్జితంలో కొంత తీసుకోవడానికి క్యూల్లో గంటలు గంటలు నిలబడాల్సి రావడం నిజంగా ఎన్నడూ ఎరుగని అనుభవమే. జీతం కోసం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిలువుకాళ్ళ జీతం, ఏవిటో చిత్రం. నెలసరి జీతాల వాళ్ళ పరిస్తితే ఇలా వుంటే దినసరి ఆదాయాలవారి సంగతి చెప్పనక్కర లేదు. చేతిలో పైసలు ఆడక చిరు వ్యాపారాల వాళ్ళు దిగాలు పడుతుంటే మరోపక్క భారీ ఎత్తున కొత్త కరెన్సీ నోట్లు బయట పడుతున్న సంఘటనలు, పెద్ద ఎత్తున జరుగుతున్నకరెన్సీ నోట్ల అక్రమ మార్పిళ్ళూ ప్రజలను విభ్రమానికి గురిచేస్తున్నాయి. ప్రయోగ విజయం పట్ల సందేహాలను పెంచుతున్నాయి.

నగదు రహిత భారతం

నగదు రహిత భారతం ఆవిష్కరణ గురించి నేతాశ్రీలు చేస్తున్న ప్రసంగాలు సామాన్యులను నివ్వెర పరుస్తున్నాయి. పోస్ట్ కార్డు మొహమే చూసి ఎరుగని వాళ్లకు,  ఏటీఏం కార్డు ప్రయోజనాలు గురించి చెప్పడం వింతల్లోవింత. అన్నప్రాసన నాడే ఆవకాయ కారం తినిపించినట్టుగా వుందని హేళన స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ ఉచిత ఉద్బోధలు చేస్తున్న నాయకమణ్యులు ఒక్కసారంటే ఒక్కసారి ఆన్ లైన్లో ఒక్క రూపాయి ట్రాన్సాక్షన్ చేసి చూపించగలరా అనే మౌన ప్రశ్నకు జవాబు ఏదీ?

ఇప్పుడు పులిమీద పుట్రలా బంగారం మీద అంక్షలు. మనిషికి ఇంత బంగారమే ఉండాలనే నిబంధనలు మళ్ళీ ఏ ప్రకంపనలు సృష్టిస్తాయో తెలియదు. వెనుకటి రోజుల్లో భూసంస్కరణల వల్ల ఒనగూడిన ప్రయోజనాలు ఏ పాటివో తెలిసిన వారికి జరగబోయేది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా ఇది సెంటిమెంటుతో, ప్రత్యేకించి మహిళలతో ముడిపడిన వ్యవహారం. ఏ వైపు తిరుగుతుందో, యెంత దూరం సాగుతుందో చెప్పడం కష్టం.

ఇవన్నీ చూస్తున్నప్పుడు గురి పెట్టిన బాణం సరయిన దిశలోనే వెడుతోందా, మధ్యలో దారితప్పుతోందా అనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది. నేషన్ వాంట్స్ టునో. జాతి తెలుసుకోవాలని అనుకుంటోంది.

పులిపైన స్వారీ

అయితే, నల్లధనంపై మొదలు పెట్టిన పోరాటంలో నరేంద్ర మోదీ గెలవాలి. గెలిచి తీరాలి. ఇది మోదీ అభిమానులు కోరుకుంటున్నదే కాదు ఆయన్ని నరనరాన ద్వేషించే వాళ్ళు సైతం ఇదే కోరుకుంటున్నారు. ఎందుకంటే మోదీ ఈ ప్రయత్నంలో విఫలం అయితే ఆ ప్రభావం ఆయనకూ, ఆయన పార్టీకి మాత్రమే కాదు యావత్ దేశానికీ చుట్టుకుంటుంది. ప్రపంచ దేశాల్లో ఈనాడు ఎన్నదగిన ఆర్ధిక శక్తిగా ఎదుగుతూ వస్తున్న భారత దేశం కొన్ని దశాబ్దాలు వెనక్కు పోతుంది. మళ్ళీ కోలుకోవాలన్నా, కనీసం ఈనాడు వున్న స్తితికి చేరుకోవాలన్నా ఏండ్లూపూ౦డ్లూ పట్టే ప్రమాదం వుంది. కారణం మోడీ స్వారీ చేస్తున్నది భయంకరమైన, జాతిని పీల్చి పిప్పి చేస్తున్న నల్లధనం అనే రక్కసి పులి మీద. మోడీ జయిస్తే పరవాలేదు. కానీ పులిదే పై చేయి అయితే, ‘పరవాలేదు’ అని చెప్పుకోవడానికి కూడా ఏమీ మిగలదు. పొంచివున్న పెద్ద ముప్పు ఇదే. నోబుల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ కానీ, విధి వశాత్తు రాజకీయాల్లోకి వచ్చిన సుప్రసిద్ధ ఆర్ధిక వేత్త మన్మోహన్ సింగ్ అయినా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించేవాళ్ళయినా చేసే హెచ్చరికలు ఇవే!

గుడ్డిగా కళ్ళు మూసుకుని ముందుకు సాగితే కాలు రహదారిలోకి సాగొచ్చు, ముళ్ళ దారిలోకి దారి తీయొచ్చు. రెంటికీ అవకాశం వుంది కాబట్టే జాగ్రత్తల అవసరం ఎక్కువ వుంది. ఇది మోదీకీ, ఆయనను గుడ్డిగా అభిమానించేవారికీ, మోదీ వ్యతిరేకులకూ, వారిని కళ్ళు మూసుకుని సమర్ధించేవారికి మాత్రమే సంబంధించిన సమస్య అనుకోవడం మంచిది కాదు. నూట పాతిక కోట్లమంది భారతీయుల భవిత దీనితో ముడిపడి వుంది.

చిత్రం ఏమిటంటే పెద్ద నోట్ల రద్దు వంటి పెద్ద నిర్ణయం తీసుకున్న తరువాత ఈ నాలుగేళ్ల కాలంలో  ప్రభుత్వమూ ప్రజలూ ఈ సంగతే మరిచిపోయారు. (08-11-2020)

భండారు శ్రీనివాసరావు
భండారు శ్రీనివాసరావు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles