• అప్పుల బాధ భరించలేక ఉరేసుకుని బలవన్మరణం
• అన్నదాతను మింగేసిన రుణపాశం
• మధ్యతరగతి బతుకులు ఇంతేనంటూ సూసైడ్ నోట్
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాసిపేట మండలం మల్కపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా బతుకీడుస్తున్న ఓ రైతు అప్పుల పాలయ్యాడు. అసలే కౌలుకు తీసుకున్న పొలం ఆపై పంట వేసిన ప్రతీసారీ నష్టాల పాలు కావడంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు. ఓ వైపు కొండలా పెరిగిపోతున్న అప్పు, మరోవైపు వాటికి వడ్డీ తోడవడంతో అప్పులను తీర్చే మార్గం లేక ఆ రైతు కుటుంబం సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారిలో రైతు దంపతులు జంజిరాల రమేశ్, పద్మ కుమార్తె సౌమ్య కుమారుడు అక్షయ్ లు ఉన్నారు.
Also Read: డిస్మిస్డ్ కార్మికుల ఘోష
కౌలుకు తీసుకున్న పొలంలో పత్తిపంట వేసి తీవ్రంగా నష్టపోయామని, కౌలు డబ్బులతో పాటు చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని 10 లక్షలు ఉంటే బతికేవాళ్లమంటూ మరణ వాంగ్మూలంలో రమేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఒకేసారి నలుగురు కుటుంబసభ్యులు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.