- ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోట
- కార్యకర్తలకు అవమానం జరిగితే సహించేది లేదు
- రాజకీయాలంటే స్వార్థం కాదు, ప్రజాసేవను కాంక్షించాలి
- టీడీపీ కార్యాలయ శంకుస్థాపనలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు
గన్నవరం, అక్టోబరు 26 : గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు సేవకుడుగా ఉంటానని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి భద్రత కల్పిస్తానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు చెప్పారు. కార్యకర్తలను అవమానించేరీతిలో ఎవరైనా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీకి గన్నవరం కంచుకోట అని, ప్రస్తుత ఎమ్మేల్యే వల్లభనేని వంశీ కూడా పార్టీ టిక్కెట్‌పైనే గెలిచారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గన్నవరం పట్టణంలో అప్సర థియేటర్ స్థలంలో టీడీపీ నియోజకవర్గ కార్యాలయ భవనం శంకుస్థాపన సోమవారం జరిగింది. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు సతీ సమేతంగా శాస్త్రోక్తంగా శంకుస్థాపన పూజా మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం గన్నవరం మాజీ ఎమ్మేల్యే ముల్పూరి బాలకృష్ణారావు తదితర పెద్దల ఆశ్వీర్వాదం తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అర్జునుడు విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గన్నవరం ఇన్‌చార్జిగా వచ్చినట్లు చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలలో గన్నవరం బాధ్యతలను అప్పగించారని, అందరి సహకారంతో నియోజకవర్గంలో మళ్లీ పార్టీని గెలుపుబాట పయనింప చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. గన్నవరంలో నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని నవంబరు 30లోగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పారు. రాజకీయాలంటే స్వార్థం కాదని, ప్రజాసేవను కాంక్షించడమేనని తెలిపారు. తనకు వ్యాపారాలు, ఇతర వ్యవహరాలేవీ లేవని, నిరంతరం ప్రజా సేవలో ఉంటూ, ఆత్మీయంగా పని చేస్తానన్నారు. సంపాదన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని, పార్టీ ఆవిర్భావం నుంచి సామాన్య కార్యకర్తగా పని చేశానని, అందుకు గుర్తింపుగానే ఎమ్మెల్సీ పదవి లబించినట్లు చెప్పారు. ఏ విషయాన్నైనా కరాకండీగా చెప్పటం అలవాటని, ఏదైనా పని కోసం ఒకటికి పదిసార్లు తన చుట్టూ తిప్పించుకునే నైజం మాత్రంకాదని తెలిపారు. ఒక్కసారి ఓటు వేసి చూడమన్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల చెంప చెళ్లుమనేలా పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి ఇష్టానుసారంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. 151 మంది ఎమ్మేల్యేలు ఉన్నారన్న అహంకారంతో ప్రజాస్వామ్యాన్నికూడా ఖాతరు చేయడం లేదన్నారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా నాయకుడు దొంతు చిన్నా, బొడ్డపాటి రాంబాబు, గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బోడపాటి రవి, ఉంగుటూరు మండల అధ్యక్షుడు తియ్యగూర కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపీచంద్, బాపులపాడు మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, విజయవాడ రూరల్ మండల అధ్యక్షుడు గొడ్డళ్ల చిన రామారావు, గొల్లపూడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ దండు సుబ్రహ్యణ్యరాజు, నాలుగు మండలాల్లోని అన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు