2 దశాబ్దాల కిందటే మొదలైన తిట్ల పురాణం
అధికారుల నిర్వాకం షరా మామూలే
ప్రతీ చర్యకు తప్పనిసరి ప్రతి చర్య ఉంటుంది. కొన్నిసార్లు నేరుగా రియాక్షన్ కనిపించకపోయినా బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటామే, మరో రూపంలోనైనా ఏదైనా పనికి ఫలితం వచ్చి తీరాల్సిందే. ఇప్పుడు రాష్ట్రంలో తిట్ల పురాణం కూడా అలాంటిదే. మాటలతో మనసులను విరిచేలా రాతలు రాయడంలో అందెవేసిన పత్రికలు, రచయితలు ఈ చర్యను రెండు దశాబ్దాల కిందటే మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీని నిరంతర అధికార పక్షంలో ఉంచడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా ఆ సామాజికవర్గానికి చెందిన పెద్దల పత్రికలు ఓ పథకం ప్రకారం కాబోయే రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ మోహన్ రెడ్డిని వీలైనంత బద్నాం చేసే విధంగా అవినీతి బురద మరక వేశారు. ప్రతి రోజూ తక్కువలో తక్కువ రెండు పేజీలకు పైన జగన్ తన తండ్రి అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా, పెట్టుబడులు సేకరించి, కోట్లకు పడగలెత్తిన పారిశ్రామికవేత్త కాగలిగాడని ప్రజల బుర్రల్లోకి ఎక్కించారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సంవత్సరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం చాలా సులువైంది.
Also read: వైకాపా కార్యకర్తల నిరాశ నిజమేనా?
చిదంబర రహస్యం
ఆ విధంగా అదేపనిగా బురద చల్లడం కూడా ఓ విజయవంతమైన ప్రయోగంగానే మనం పరిగణించాలి. ఈ బురద జల్లుడుకు రాజకీయ కారణాలతో పాటు ఈనాడు అధినేత వ్యక్తిగత కారణాలు కూడా ఉండవచ్చని మనం నిరూపించలేం. రామోజీరావు అతి పెద్ద వ్యాపార సామ్రాజ్యం నిర్మించడానికి ఏడు దశాబ్దాలు పడితే, కుర్రకుంక జగన్ నాలుగు దశకాల వయసు దాటకుండానే రామోజీకి దీటైన వ్యాపారవేత్తగా ఎదగడం ఒక సహించరాని విషయంగా మారిందని చెప్పడానికి కూడా తార్కాణాలు లేవు. రామోజీరావు ఎవ్వరితోనూ మాట్లాడకపోవడం వల్ల ఆయన మనసు ఎవరికీ తెలియని చిదంబర రహస్యం. దీనికి మించి అదే పత్రికా వ్యాపారంలో జగన్ రుచి చూపించిన మెరుపులు కూడా సామాన్యమైనవి కావు. పత్రిక పంచే పేపర్ బాయ్స్ నుంచి, ఏజెంట్ల నుంచి, వార్తలు సేకరించే విలేకరుల నుంచి, వార్తలకు మెరుగులద్దే ఉపసంపాదకుల నుంచి, ప్రాణాధారమైన ప్రకటనలు సేకరించే వారి వరకూ అందరి జీవితాలు మెరుగుపడ్డాయనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల వరకూ సాక్షి వచ్చిన తరువాత జర్నలిస్టుల, నాన్ జర్నలిస్టుల బతుకులు బాగుపడ్డాయనే చెప్పాలి. తనపై చల్లుతున్న బురదకు విరుగుడుగా జగన్ సొంత మీడియా ఏర్పాటుచేసుకుని, ప్రత్యర్థి పత్రికలలో రాసినవన్నీ అబద్దాలని చెప్పడం ద్వారా కొంత, నేరుగా పాదయాత్ర రూపంలో ప్రజలను కలిసి మద్దతు కూడగట్టుకుని మరికొంత ప్రతి చర్య చూపించారు. ఫలితంగా తరువాతి ఎన్నికలలో భారీ విజయం సాధించారు.
Also read: దక్షిణాదిలో బహుజన రాజకీయాలు బలపడనున్నాయా?
అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవినీతి పై యుద్ధం ప్రకటించడం ద్వారా జగన్ తన ప్రాథమ్యాన్ని చెప్పకనే చెప్పారు. తన మంత్రివర్గ సహచరులుగాని, శాసనసభ్యులు కాని, ఇతర నాయకులుగాని అవినీతి పనులకు పాల్పడినట్లయితే ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని గట్టిగా చెప్పడమే కాకుండా, సాధ్యమైనంత వరకు కట్టడి చేయగలిగారు. కొన్ని దశాబ్దాలుగా అవినీతికి అలవాటు పడిన అధికారులపైన ఉక్కుపాదం మోపారు. అవినీతి నిఘా వ్యవస్థను బలోపేతం చేశారు. ఇదంతా కౌంటర్ అటాక్ వ్యూహంలో భాగంగానే మనం గుర్తించాలి. కాని, కొందరు మంత్రుల, నాయకుల జిహ్వచాపల్యాన్ని అడ్డుకోలేకపోయారు. పౌరసరఫరాల శాఖామాత్యులు కొడాలి నాని తుప్పు, పప్పు అంటూ హాస్యాన్ని పంచారు. ఆ విధంగా చర్య మొదలైంది. ఈయన మాట్లాడుతుంటే పిల్లలు పొగిలి నవ్వడాన్ని చూసిన వెండితెర ఆరాధ్యనటుడు తనేం తక్కువ తినలేదంటూ ‘గుడ్డలూడదీస్తా’ లాంటి మాటలు వాడినా, జగన్ అభిమానులుగాని, రాష్ట్ర ప్రజలుగాని పెద్దగా పట్టించుకోలేదు. కనీసం హాస్యంగానైనా తీసుకోలేదు. దాంతో కినుక వహించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు పఠాభి ఉత్తరాదిలో బాగా ఫేమస్ బూతు అయినా, తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కాయిన్ కాని ‘బోసిడీకే’ మాటను పలుమార్లు వాడడం ద్వారా జగన్ అభిమానులను కవ్వించారు. రాష్ట్రంలో అలజడి రేగింది. ప్రతిపక్షానికి కావలసిందీ అదే. ప్రజల సమస్యలు తెలుసుకునే ఓపిక లేని నాయకులు, ప్రజల ఇబ్బందులు పట్టించుకోవాలన్న పంతం లేని ప్రతిపక్షానికి తమ ఉనికిని చాటుకోవడానికి ఇక మిగిలింది ఇటువంటి కవ్వింపులే. తద్వారా రేగిన అలజడుల ద్వారానే తామున్నామంటూ ప్రపంచానికి చాటుకోవాలన్న తహతహ.
Also read: పార్లమెంటులో ప్రతిసారీ అదే తంతు
తప్పుడు వ్యూహాలు
చంద్రబాబు కొన్ని వారాల కిందటే తన మకాంను హైదరాబాద్ నుంచి అమరావతికి మార్చుకున్నారు. ప్రజలలోకి నేరుగా వెళ్లాల్సిన ప్రతిపక్ష నేత ఇంకా జనంలోకి రావడం లేదంటూ ఎదురుచూస్తున్న తరుణం. కాని సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు వ్యూహం వేరే రీతిలో జరిగింది. ఈ మాటల యుద్ధానికి సిద్ధం చేసినట్లుంది. ప్రభుత్వం స్పందించకపోతే ఆ మరుసటి రోజు నుంచి ఎవరైనా ముఖ్యమంత్రిని బోసిడికే మాటతోనో, మరో మాటతోనో పిలవచ్చు. ప్రభుత్వం స్పందిస్తే నిరసన తెలపవచ్చు. రెండంచుల వ్యూహం. ప్రభుత్వంతోపాటు జగన్ అభిమానులు దీనికి భిన్నంగా స్పందించారు. ప్రజలనుంచి వచ్చిన స్పందన చూసిన వెంటనే చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకోవలసింది, మార్చుకోలేదు. ముందు అనుకున్న విధంగానే నిరసన దీక్షలు, ధర్నాలు, గవర్నరుకు ఫిర్యాదులు, మోం మంత్రికి వినతుల మార్గంలోనే పోవాలనుకున్నారు. అది పార్టీలో మరింత చర్చ జరిగేట్టు చేసింది. గ్రామ స్థాయిలో ప్రజలలో భావోద్వేగం పెచ్చరిల్లే సంఘటన అక్కడ జరగలేదు. వీధుల్లోకి రావడానికి వారికి ఇష్టం లేదు. రానివారితో తెలుగుదేశం పార్టీ నాయకులు బందులు ఎలా చేయించగలరు! నిరసనలు ఎలా పూనించగలరు! చాలా గ్రామాలలో, పట్టణాలలో హౌస్ అరెస్టులు చేయించుకుని ఇళ్లలోనే నాయకులు విశ్రాంతి తీసుకున్నారు. టీవీ చానెళ్లలో చంద్రబాబు కన్నీరు మున్నీరవడాన్ని చూడలేక పోయారు. ఆ విధంగా పఠాభి ఎపిసోడ్ ఒక ఫార్సుగా మిగిలింది. ప్రజలకు మరికొన్ని విషయాలు తేటతెల్లమయ్యాయి.
Also read: వారు బయటకొస్తారా?
ప్రతిపక్షం భ్రమల నుంచి బయటపడాలి
జగన్ పాలన జనరంజకంగా ఉందన్న భ్రమలనుంచి ముందు తెలుగుదేశం పార్టీ బయటకు రావాలి. జగన్ పాలనలో ప్రజలంతా అత్యంత సంతృప్తులుగా ఉన్నారన్న మాయపొరలను ఆ నాయకులు చీల్చుకోవాలి. జగన్ పాలనలో జనానికి ఇక్కట్లు లేవన్న అపోహలనుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు బయటపడాలి. ప్రజలకు నాయకులు మారారు గాని, అధికారులు మారలేదు. వారి మనస్తత్వమూ మారలేదు. ఇప్పుడు కూడా అప్పటిలానే ఆసరా కార్యక్రమాల్లో ‘థాంక్యూ సీఎం సార్’ ప్లకార్డులు ప్రజల చేత పట్టిస్తున్నారు. ఇప్పుడు కూడా అప్పటిలానే కనీస అవసరాల కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారు. ఇప్పుడు కూడా అప్పటిలానే తమ బాధ్యతగా చేయవలసిన విధి నిర్వహణకు చేతులు సాచుతూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజలు మౌళిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రతిపక్షం చేయవలసిన పని ఇంకా ఎంతో మిగిలేవుంది. వారు నిరాశానిస్పృహలనుంచి బయటపడి ప్రజల అవసరాలను, ఇబ్బందులను గ్రహించి వాటిపై పోరాటం చేయాల్సివుంది. అది చంద్రబాబు నేతృత్వంలో చక్కగా చేయగలరని ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు. చంద్రబాబు నిరంతర పోరాట స్ఫూర్తిని ప్రజలు ఇప్పటికీ నమ్ముతున్నారు. ఆ నమ్మకం ఇప్పుడు కావలసింది నాయకులకే!
Also read: జల జగడం