ప్రజాప్రతినిధుల కేసుల విచారణను వేగిరం చేయాలని కోరుతూ హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ దాఖలు చేసింది. పిల్ పై సీజే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషన్ పై విచారణకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సిబ్బందిని నియమించాలని ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపింది. దీనిపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు కోర్టు తెలిపింది.
ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణకు పోలీసులు సహకరించడం లేదని న్యాయవాది సత్యం రెడ్డి కోర్టుకు విన్నవించారు. పోలీసులు సహకరించడం లేదని న్యాయాధికారులు ఎప్పుడూ కోర్టుకు నివేదించలేదని ధర్మాసనం తెలిపింది. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణపై ఎవరికీ ఆందోళన అవసరం లేదు హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయన్న ధర్మాసనం తెలిపింది. కేసుల విచారణకు సంబంధించిన పురోగతిని సుప్రీంకోర్టుకు నెలవారీ నివేదిక పంపిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశంపై మళ్లీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న హైకోర్టు అభిప్రాయపడింది.