- పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ
- మోదీ ఆర్థిక విధానాలను తప్పుబట్టిన సిన్హా
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతూ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాలను రసవత్తరంగా మార్చివేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా ఈ రోజు (మార్చి 13) తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని టీఎంసీ భవన్‌లో ఆ పార్టీ నేతల సమక్షంలో తృణమూల్ కండువా కప్పుకున్నారు. మమతపై జరిగిన దాడి కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు యశ్వంత్ సిన్హా తెలిపారు
సొంత పార్టీపై విమర్శలు:
83 ఏళ్ల యశ్వంత్ సిన్హా గతంలో సుదీర్ఘకాలం జనతాదళ్, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో ఆర్ధిక, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే సొంతపార్టీపైనే బహిరంగ విమర్శలు చేయడంతో బహిష్కరణ వేటు పడింది. బీజేపీలో ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై బాహటంగా విమర్శలు గుప్పించిన యశ్వంత్ సిన్హా 2018లో బీజేపీని వీడిన తర్వాత కూడా ఎన్డీఏ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. అయితే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొన్నాళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో పలువురు తృణమూల్ నేతు బీజేపీలో చేరుతున్న సమయంలో యశ్వంత్ సిన్హా రాక ఆ పార్టీకి కలిసొచ్చే పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Also Read: బీజేపీ ఓటమే లక్ష్యం
కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో తృణమూల్ నేతలు డేరక్ ఓ బ్రెయిన్, సుదీప్ బందోపాధ్యాయ, సుబ్రతా ముఖర్జీ తదతరుల సమక్షంలో యశ్వంత్ సిన్హా టీఎంసీలోకి చేరారు. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ నిర్వీర్యమవుతున్నాయని మండిపడ్డారు.
రైతుల ఆందోళనలు, సరిహద్దుల్లో చైనాతో ఏర్పడిన ఉద్రిక్తతలను కూడా యశ్వంత్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. అంతేకాదు, నరేంద్ర మోదీ పాలనకు, మాజీ ప్రధాని వాజ్‌పేయ్ పాలనకు ఎంతో తేడా ఉందని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ఆపడానికి ఎవరూ లేరు. వాజ్‌పేయి కాలంలో బీజేపీ ఏకాభిప్రాయాన్ని నమ్మింది. కాని నేటి ప్రభుత్వం అణిచివేత, బలప్రయోగంతో విజయం సాధించాలని అనుకుంటోంది. అకాలీదళ్, బీజేడీలు బీజేపీకి దూరమయ్యాయని సిన్హా అన్నారు.
Also Read: తృణమూల్ కాంగ్రెస్ లో ఆగని వలసలు
1960 బ్యాచ్‌కు చెందిన ఈ మాజీ ఐఏఎస్ అధికారి 1984లో జనతా పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం బీజేపీలో చేరారు. యశ్వంత్ తనయుడు జయంత్ సిన్హా 2014 నుంచి 19 వరకు కేంద్ర పౌర విమానయాన సహాయ మంత్రిగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో హజరీబాగ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ లో చేరడంపై బీజేపీ స్పందించింది. ఆయన చేరికతో బీజేపీకి కలిగే నష్టం ఏమీలేదని ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.