- కమలం గూటికి చేరిన తృణమూల్ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది
- కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన నడ్డా
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నకొద్దీ బెంగాల్ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితా విడుదల చేసిన తృణమూల్ కాంగ్రెస్ కు ఆ పార్టీ రాజ్యసభ మాజీ ఎంపీ దినేశ్ త్రివేది షాక్ ఇచ్చారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో త్రివేది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫిబ్రవరిలో రాజ్యసభ సమావేశాల్లో త్రివేది ఎంపీగా రాజీనామా చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతున్న సందర్భంలో ఆయన తన రాజీనామాను ప్రకటించారు.
Also Read: నందిగ్రామ్ నుంచి మమత పోటీ
హింసను ఆపలేకపోతున్నానన్న త్రివేది:
బెంగాల్లో జరుగుతున్న హింస ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హింసను అరికట్టేందుకు ఏమీ చేయలేకపోతున్నానని రాజీనామా సందర్భంలో దినేశ్ త్రివేది ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాలీలు అవినీతిని, హింసను కోరుకోవడం లేదని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నిజమైన మార్పును స్వాగతించేందుకు బెంగాలీలు సిద్ధంగా ఉన్నారని త్రివేది చెప్పారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బంగారు క్షణాలని బీజేపీలో చేరిన సందర్భంగా దినేశ్ త్రివేది వ్యాఖ్యానించారు. త్రివేది చేరికపై ఉన్నతమైన వ్యక్తి సరైన పార్టీలో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా అన్నారు.
మమతకు తలనొప్పిగా మారిన వలసలు:
ఎన్నికల ముంగిట ఉన్న బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను వీడుతున్న నేతలకు మమత అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గత కొంతకాలంగా బెంగాల్ లో పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పలువురు సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నారు. ఎన్నికల ముంగిట పార్టీ సీనియర్ నేత బీజేపీలో చేరడంతో మమతకు తలనొప్పిగా మారింది. ద్వివేది బీజేపీలో చేరికపై మమతా బెనర్జీ మండిపడ్డారు. బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మైండ్ గేమ్ ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీకి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.